Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఓం
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీ మహాభారతము
ఉద్యోగ పర్వము
నారాయణం నమస్కృత్య నరంచైవనరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్
ఎలమినభిమన్యు పెండిలి యివ్విధమున
జేసి యుల్లాస లక్ష్మి కైసేసి మత్స్య
మనుజపతి యవ్వనంబు పావనము సేసి
దిన చతుష్టయానంతరమున బ్రియమున
ధర్మతనయుండు దమ్ములుం గొడుకులుం బరివేష్టించి యుండ విశాల రమణీయంబగు విరాట కొలువు కూటంబున కరిగి యందు
ఆ సభలో విరాటుడు, ద్రుపదుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి ఉన్నారు. పెండ్లికి వచ్చిన ఇతర రాజులు ఉన్నారు. బంధువులున్నారు. సోదరులున్నారు. సభలోని వారు ఒక్కొక్కరు, ఒక్కొక్కరితో మాట్లాడుచున్నారు. సభలో గుసగుసలు మాటలు ఎక్కువయినవి. అందరి ధ్వనులు కలిసి గజిబిజిగా ఉన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు లేచినాడు. సంభాషణములను నివారింప చేసినాడు. సభలో సందడి తగ్గినది. సభ నిశ్శబ్దమయినది. అప్పుడు శ్రీక్రుష్ణుడు సభను కలియచూసినాడు. ప్రసంగించినాడు.
"సభా సదులారా! పాండవులు మాయాజూదమున ఓడినారు. వారు వీరులు. శక్తిమంతులు. అయినను అరణ్యవాసము చేసినారు. అజ్ఞాతవాసము అతిదుస్తర కార్యము. అయినను ముగించినారు. ఇప్పుడు కౌరవులకును, పాండవులకును మేలుకలుగు ధర్మ మార్గమును గురించి ఆలోచించవలసి ఉన్నది".
"ధర్మరాజు ధర్మము తప్పడు. ధర్మ విరుద్ధముగా ఇంద్రపదవి వచ్చినను సమ్మతింపడు. ధర్మ సంమతముగా ఎంత లభించినను తృప్తి చెందును. పాండవుల పితృధనమగు రాజ్యమును మాయాజూధముచేత దుర్యోధనుడు అపహరించినాడు. పాండవులకు అనేక కష్టములు కలిగించినాడు. ధర్మజుని అవమానించినాడు. అయినను ధర్మరాజు కౌరవులకు కీడు కలిగించుటకు సమ్మతించడు".
"కౌరవులు ఈనాడు పాలించుచున్న రాజ్యమును పాండవులు స్థిరపరచినారు. దానికి అభివృద్ధి కలిగించినారు. కావున ఉభయపక్షముల వారు రాజ్యమును పంచుకొని అనుభవించుటకు యోగ్యులు. ఇందును గురించి మీరు ఆలోచించవలెను. ఇందుకు అనుకూలమయిన ధర్మమాగ్రమును కనుగొనవలెను".
"మనము మరొక విషయమును గురించి ఆలోచించవలె. పాండవులు వీరులు. శూరులు. పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము చేసినారు. దుస్తరమగు అజ్ఞాతవాసము గడిపినారు. ఇప్పుడు వారి గుండెలు మండుచున్నవి. కుపితులయి ఉన్నారు. తమ బల దర్పములను ప్రదర్శించుటకు ఆరాట పడుచున్నారు. ఈ విషయము దుర్యోధనునకు తెలియకపోదు. పాండవులకు సైన్యములు కొద్దిగా ఉన్నవని అతడు గ్రహించును. అతడు తన మిత్రుల సైన్యములను కూర్చుకొని దండెత్తివచ్చును. ఎంతటి బలవంతులయినను సాయములేక శత్రువును ఓడించుట సాధ్యపడదు. కావున పాండవ పక్షమున ఉన్న రాజులందరు పాండవుల కొఱకు సైన్యములు సమకూర్చవలసి యున్నది".
"ఉభయ పక్షములకు మహాయుద్దము జరుగును. అది దేవాసుర యుద్దమువలె ఉండును. ఆ యుద్దమున అనేకమంది చత్తురు. ఆ వి- ధముగా రాజ్యము సాధించవలెను. ఇదియేపాండవులు చేయదగిన కార్యమని నాకు తోచుచున్నది".
"అయినను పరుల తలపులను తెలియక ఒక నిర్ణయము చేయుట తగదు. దుర్యోధనాదుల చిత్తవృత్తులు మనకు తెలియును. అయినను యోగ్యత గల వ్యక్తిని దుర్యోధనుని వద్దకు పంపుట మంచిది. అతడు రాజ్యము పంచి ఇచ్చిన ఉభయులకు మేలు అగును. అట్లు కాకున్న అటు తరువాత కార్యమును అప్పుడు నిర్ణయింతము".
సభ సాంతము నిశ్శబ్ధముగా శ్రీకృష్ణుని ప్రవచనము విన్నది. బలరాముడు లేచినాడు. అన్నాడు:-
"భూపతులారా! శ్రీకృష్ణుడు ఉభయ పక్షముల వారికి మేలు కలుగుమాట చెప్పినాడు. అది పరమ ధర్మయుక్తముగా ఉన్నది. అయినను పాండవుల యుద్ద ప్రయత్నములు మాన్పుట మనకు సాధ్యము కాదు. పాండవులు జూదమున రాజ్యము పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న రాజ్యము మరల కోరుచున్నారు. దుర్యోధనుడు వీరి సగము వీరికి ఇచ్చి తన సగము అనుభవించుట యుక్తము. అందువలన ఉభయ పక్షములకును, బంధుజనులకును, సకల జనులకు క్షేమము కలుగును. ఈ కార్యము సాధించుటకు తగిన వ్యక్తిని హస్తినకు పంపవలెను. అతడు దుర్యోధనుని చిత్తవృత్తికి తగినట్లు మాట్లాడవలెను. వినయ పూర్వకముగా దుర్యోధనుని ప్రార్ధించి, పాండవుల రాజ్య భాగము అడుగవలెను. అట్లుకానిచో కార్యము అనుకూలించదు. ఏలనన దుర్యోధనునియందు దోషము కనిపించదు. అతనిని అధర్మపరుడని నిందించి ప్రయోజనము లేదు.





