Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఆలోచనామృతము
1. అర్జునుడు ఒక్కడు అనేకమంది అతిరథ, మహారథులను గొప్ప సైన్యములను ఓడించినాడు. ఇది కాల్పనికముగా కనిపించవచ్చును. కాని ఇందులో వాస్తవము లేకపోలేదు.
i) యుద్దములందు ఆయుధములు ప్రాధాన్యత వహించును. జనసంఖ్య కాదు. రెండవ ప్రపంచ యుద్దమున రాజ్యములన్నింటిని గడగడలాడించిన జర్మనీ, జపాను దేశములు అతి చిన్నవి. అయినను వాటికి గల ఆయుధ పాతవమును బట్టి ప్రపంచమనే మింగి వేయుటకు తలపెట్టినవి. చివరకు అమెరికా కనిపెట్టి ప్రయోగించిన అణుబాంబు వలననే ఆ రెండు దేశములు లొంగినవి.
నేటి అగ్ర రాజ్యములు సహితము ప్రపంచ జనసంఖ్యలో బహు కొద్ది మాత్రమే. అయినను వాటికిగల ఆయుధ ఆధిక్యతచే అవి అగ్ర రాజ్యములు అయినవి. ప్రపంచమును శాసించుటకు అహమహమికతో దూకుచున్నవి.
అర్జునునియందు ఆయుధ ఆధిక్యత కనిపించుచున్నది. అతనివద్ద ఉండినవి శరములు మాత్రమేనా? జనమును మూర్చిల్ల చేయగల వాయు పదార్ధములవంటివి ఉన్నవా? అను విషయమును శాస్త్రజ్ఞులు పరిశీలించవలసి ఉన్నది.
ii) సైన్యమునకు ఐక్యత ప్రాణమువంటిది. ఐక్యతలేని సైన్యము ప్రాణములేని జీవము వంటిది.
కౌరవ సైన్యమందు ఐక్యత లేదు. ఒకరిమీద ఒకరు కాలు దువ్వినారు. భీష్మ, ద్రోణాదులకు పాండవులన్న ఇష్టము. మిగిలిన వారు శక్తిహీనులు.
దుర్యోధనుడు నియంత. అతడు పెద్దల మాట వినడు. అందువలన భీష్మ, ద్రోణాదులు దుర్యోధనునకు లొంగి యుద్దము చేసినారు. ఇష్ట పూర్తిగా యుద్దము చేయలేదు.
భారతదేశమునకు వచ్చిన ఆంగ్లేయులు కొద్దిమందే. మన దేశమున గల రాజుల పరస్పర ద్వేషము, వారిలోని అనైక్యత ఆధారముగా ఆంగ్లేయులు భారతదేశమును గెలిచినారు.
కౌరవుల అనైక్యత, అర్జునుని ఆయుధ ఆధిక్యత అర్జునుని గెలుపునాకు తోడ్పడినవి.
2. అజ్ఞాతవాస కాల నిర్ణయము విషయము వివాదాస్పదముగా కనిపించుచున్నది.
నియమము ప్రకారము పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము, ఒక సంవత్సరము అజ్ఞాతవాసము చేయవలసి ఉన్నది. అరణ్య వాసము పూర్తి అయిన విషయమున దుర్యోధనునకు వివాదములేదు. అజ్ఞాతవాస సంవత్సరము పూర్తికాలేదని అతని వాదన.
భీష్ముడు ధర్మరాజు అరణ్యవాసమును కలిపి పదమూడు సంవత్సరములు ముగిసినవి అనుచున్నారు.
ఇందులో ఏదో ముడి విడదీయవలసిన చిక్కు ఉన్నట్లు కనిపించుచున్నది.
3. అజ్ఞాతవాసము ముగిసినది. కౌరవులు ఓడినారు. ఫలితముగా ఏర్పడినది ఉత్తరాభిమన్యుల వివాహము.
పాండవులతో అష్ట కష్టములు పడినది ద్రౌపది. అందువలన ఆమెకు జరిగినది ఏమి? తల్లిగారింట సుఖముగా ఉన్న సుభద్ర కొడుకు పెళ్ళి నిశ్చయమైనది. జరిగినది. ద్రౌపది కొడుకుల ప్రస్తావనరాదు. ఇక్కట్లకు ద్రౌపది, సుఖములకు మరొకరు అన్నట్లున్నది.
ఈ పెండ్లిలో రాజకీయము ఉన్నది.
రాజకీయములందు మనిషికి, మనసుకు తావులేదు.
ద్రౌపది బాధను గమనించన వారు లేరు.
4. లక్క ఇంటి అజ్ఞాతవాసము నుండి బయటపడినపుడు ద్రౌపది వివాహము జరిగినది. ఈ అజ్ఞాతవాసపు ముగింపున ఉత్తర వివాహము జరిగినది.
రెండును శుఖాంతములు.
.......
లక్షణాచార్య బుచ్చమాంబా పౌత్రుండును, వేంకటాచార్య వేంకటాంబా పుత్రుండును మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల అనుజుండును ఉమ్రావ్ జాన్, జిలానీతానూ కథలు, దేవుని పేరిట ఇత్యాద్యనేత అనువాద గ్రంథకర్తయునయిన దాశరథి రంగాచార్య విరచితంబయిన శ్రీ మహాభారతము విరాట పర్వము సమాప్తము.





