Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"దుర్యోధనా! ఈ మాటల వలన ప్రయోజనములేదు. నీ మాటలు విని నలుగురు నవ్వుదురు. అరణ్య అజ్ఞాతవాసముల పదమూడు సంవత్సరములు పూర్తికాని యెడల అర్జునుడు మన మీదికి వచ్చిననాడే ఆవిషయము వెల్లడించియుందును. కావున పాండవులు అరణ్య, అజ్ఞాతవాస సంవత్సరములు పూర్తి చేసినారను విషయమున అనుమానము లేదు. ఇది సత్యము. ఇది నిశ్చయము".
భీష్ముని మాటలను సభాసదులందరు సమ్మతించినారు. దుర్యోధనుని ఆశలు ఉడిగినవి. అతడు మరునాడు సైన్య సమేతముగా బయలుదేరినాడు. హస్తినకు చేరినాడు.
ఆవిధముగా పాండవుల అజ్ఞాతవాసము పూర్తి అయి, వారు ప్రకాశించినారు. జమ్మిచెట్టు మీద దాచిన వారి సకల ఆయుధములను పూజా పూర్వకముగా తెచ్చుకున్నారు. ఉపప్లావ్యమున సుఖముగా ఉన్నారు.
కొన్ని దినములు గడచినవి. ఒకనాడు శ్రీకృష్ణుడు బలరాముని, సాత్యకిని, సుభద్రాభిమన్యులను వెంట పెట్టుకొని ఉపప్లావ్యమునకు వచ్చినాడు. పాండవులు శ్రీకృష్ణునకు ఎదురేగి అతనికి స్వాగతము పలికినారు. శ్రీకృష్ణుడు పాండవులను కలుపుకొని పరమానందము అనుభవించినాడు. బలరామాదులను పాండవులకు చూపినాడు. సుభద్రాభిమన్యులను ద్రౌపది వద్దకు పంపినాడు. రత్నమయములయిన భూషణములను, దివ్య వస్త్రములను మొదట పాండవులకు ఇచ్చి తదుపరి ద్రౌపదికి అందించినాడు. శ్రీకృష్ణుడు పాండవులకు రథములను, గజములను, గుర్రములను దాస దాసీ జనమును విశేషముగా ఇచ్చినాడు. శ్రీకృష్ణుడు పాండవులును కలిసి మెలిసి గడుప సాగినారు.
శ్రీకృష్ణుని వెంట కృతవర్మ, ప్రద్యుమ్న, సాంబ, యుయుధాన, రుక్మి, అక్రూరాది యాదవులందరు ఉపప్లావ్యమునకు వచ్చినారు.
అట్లుండగా ఒకనాడు ద్రుపదరాజు ధృష్టద్యుమ్నాది పుత్రులను వెంట పెట్టుకొని పాండవుల వద్దకు వచ్చినాడు. పాండవులు ప్రీతి పూర్వకముగా ద్రుపదని గౌరవించినారు. ఆ తరువాత కాశీరాజును, శైబ్యుడును సైన్య సమేతముగా పాండవుల వద్దకు వచ్చినారు. పాండవులు వారిని తగురీతిన గౌరవించినారు. విరాటుడు వారికి తగురీతిని మర్యాదలు జరిపినాడు. వచ్చిన వారందరు మర్యాదలు అందుకొని సంతోషించినారు. అంతట అనేక దేశముల నుండి రాజులు, బంధువులు, స్నేహితులు అభిమన్యుని వివాహము చూచుటకు వచ్చినారు. ఉపప్లావ్యము సకల రాజన్యులతో విరాజిల్లినది.
విరాటుడు ఉపప్లావ్యమున ఉత్తరాభిన్యుల వివాహ మహోత్సవమును చాటింప చేసినాడు. పట్టణమును అలంకరించినారు. మణుల తోరణములు కట్టినారు. పోక, అరటి స్తంభములు నాటినారు. ఉపప్లావ్యము వసంతముతో కూడిన ఉద్యానమువలె శోభించినది.
పెండ్లిరోజు రానేవచ్చినది. ఉత్తరను అపురూపముగ అలంకరించినారు. ముహూర్తము సమీపించినదని ధర్మరాజుకు కబురు పంపినారు. ధర్మరాజు అభిమాన్యుని అలంకరింప చేసినాడు. అభిమన్యుడు భద్ర గజమున ఎక్కినాడు. ధర్మజుడు పుత్రమిత్ర సహితముగా సాగినాడు. కొందరు మణులు, పుష్పములు, ఫలములు పట్టుకొని ముందు నడచినారు. ఏనుగులు, గుర్రములు ముందు నడచినవి. బ్రాహ్మణుల ఆశీర్వాదములు, మాగధుల సంగీత ధ్వనులు, వందిమాగధుల వాక్యస్తుతులు, మంగళవాద్య ధ్వనులు విశేషముగ వినిపించినవి. విరాటుడు శంఖ, జయగంట, పణవాది వాద్యములతో ధర్మరాజు బృందమునకు ఎదురుగా వచ్చి అక్షతలు చల్లినాడు. ధర్మరాజు మంగళాక్షతలు గ్రహించినాడు. విరాటుని గృహమున ప్రవేశించినాడు.
విరాటుని గృహము సకల జనులతో నిండిపోయినది. పూజాకార్యములు నిర్వహింపబడినవి. బ్రాహ్మణులు వృద్ధ జనులు వివాహ కార్యములను పరంపరగా నడిపినారు.శ్రీకృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు, విరాటుడు వధూవరులయిన ఉత్తరాభిమన్యుల మధ్య తెరపట్టినారు.
ఉత్తర తెర పైనుండి అభిమన్యుని చూచినది.
అభిమన్యుడు తెర పైనుండి ఉత్తరను చూచినాడు.
వారి చూపులు తాకినవి.
ఉత్తర తలవంచుకున్నది.
వారు దోసిళ్ళతో తలంబ్రాలు పోసుకున్నారు-ముందు సిగ్గుగా-తరువాత వడివడిగా.
అభిమన్యుడు ఉత్తర పాణిగ్రహణము చేసినాడు.
ఉభయులు పక్కపక్కన పీటల మీద కూర్చున్నారు. హోమకార్యము నిర్వహించినారు.
ఆవిధముగా ఉత్తరాభిమన్యుల వివాహము శోభాయమానముగా జరిగినది. విరాటుడు బంగారు పళ్ళెములందు తాంబూలములు ఉంచి, రత్న భూషణ, వస్త్ర, కర్పూర ద్రవ్యాదులను శ్రీకృష్ణ, పాండవులకును, పురోహితులకును సమర్పించినాడు. అంతఃపురమునకు సుభద్రా, ద్రౌపదులకును తగిన వస్త్ర భూషణములు పంపించినాడు.
విరాటుడు తన అల్లుడు అయిన అభిమన్యునకు ఏడువందల భద్ర గజములను, పదివేల జవనాశ్వములను, ఒక లక్షా రెండు వేల రథములను, ఒక లక్ష దాస దాసీ జనములను అనేక ధనములను అరణముగా ఇచ్చినాడు.
ఈవిధముగా ఉత్తరాభిమన్యుల వివాహమహోత్సవము ఉపప్లావ్యమున శోభాయమానముగా జరిగినది.





