Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"మహాత్మా! ధర్మరాజా! ఈ సకల రాజ్యము నీది. ఈ సైన్యము నీది. ఈ రథ, గజ, తురగములు, నీవి. వీనిని నీవే పాలింపుము. నేను నాపుత్రులు, బంధు జనులు నిన్ను సేవించుచుందుము. నీవు హస్తినమీదికి దండెత్తవలెనన్న నేను సర్వ సహాయము చేతును".
ఉత్తరుడు విరాటుని మాటలు విన్నాడు. అన్నాడు:-
"తండ్రీ! మనకేదో రాజ్యము ఉన్నట్లు మాట్లాడుచున్నావు. మన రాజ్యమును నిన్న, మొన్న శత్రువుల నుండి రక్షించినది ఈ పాండవులే కదా! అంతేకాదు మనము ఈనాడు ఇంకను ప్రాణములతో ఉన్నామన్న వీరి వలననే కదా! కావున మన దేహ, రాజ్యములను వీరికి అప్పగించినాము. అది ఆ ప్రకారమే జరుగును.
వీరు నివురు కప్పిన నిప్పుల వలె ఇంత కాలము అణగి ఉన్నారు. తెలిసి తెలియక మనము వారికీ చేసిన అపరాధములకు క్షమాపణ కోరవలసి ఉన్నది.
అదికాక ఈ ధన ప్రాణములు వారు మనకు ఇచ్చినవి. కాన వారికి మనము ఇచ్చుట అనుమాట తలెత్తదు. వీరికి ఒక కొత్తకానుక ఇవ్వవలసి ఉన్నది. కావున ఉత్తరను వీరికి అర్పించుట సమంజసమగును".
విరాటునకు ఉత్తరుని మాటలు సమంజసముగా తోచినవి. అతడు ఉత్తరను తీసుకొని రావలసినదని ఆదేశించినాడు.
ఉత్తర చక్కగా అలంకరించుకొని మన్మధుని బాణమువలె ప్రకాశించుచు సభామంటపమున ప్రవేశించినది. ఉత్తర మబ్బులందలి మెరుపువలె ఉన్నది. విరాటుడు ఆమెను తోడ్కొని ధర్మరాజు వద్దకు వెళ్ళినాడు. చేతులు జోడించి వినయమున విన్నవించినాడు:-
"ధర్మరాజా! నేను మిమ్ములను ఎరుగక చేఇస్న తప్పులను మన్నింపవలెను. ఈమె నా పుత్రిక ఉత్తర. ఈమెను అర్జుననకు ఇచ్చుటకు నిశ్చయించినాము. పరిగ్రహించుము. ఆవిధముగా బంధుత్వము కలుపుకొని నిన్ను ఆశ్రయించ దలచినాము".
ధర్మరాజు అర్జునుని అర్ధవంతముగా చూచినాడు. అన్న చూపులను గ్రహించినాడు అర్జునుడు. విరాటునితో అన్నాడు:-
"విరాట రాజా! ఉత్తర నావద్ద విద్య నేర్చుకున్నది. ఆమెకు నేను గురువుణు అగుదును. కావున ఆమెను నేను పెండ్లాడజాలను. ఉత్తరను కోడలిగా చేసుకొందును. నా పుత్రుడు అభిమన్యునకు ఇచ్చి వివాహము చేయుము".
అర్జునుని మాటలు విని విరాటుడు ఉప్పొంగినాడు. అర్జునునకు తాను వియ్యంకుడను అయినానని సభలో ప్రకటించి ధర్మరాజు అభిప్రాయమునకు వేచినాడు.
"విరాటా! సభాసదులారా! అర్జునుడు ధర్మమును తెలిసి చెప్పినాడు. మిక్కిలి సమంజసమయిన మార్గము చూపినాడు. ఉత్తరను అభిమన్యునకు ఇచ్చి వివాహము చేతము. ఈ శుభ సమాచారమును బంధువులందరకు తెలియుజేయుడు" అని ఆదేశించినాడు ధర్మజుడు.
విరాటుడు ఉత్తరచేత భీమార్జున, నకుల, సహదేవులకు నమస్కారము చేయించినాడు. వారందరును ఉత్తరను ఆశీర్వదించినారు. ఆమెను అంతఃపురమునకు వెళ్ళుటకు అనుమతించినారు. తదుపరి జ్యోతిష్కులను రప్పించినారు. వివాహ ముహూర్తము నిర్ణయించినారు. ఉభయ పక్షముల వారును తమ బంధువులగు యాదవ పాంచాలాదులకు శుభవర్తమానములు పంపినారు.
అటు దుర్యోధనుడు పరాజితుడయి హస్తినకు వెళ్ళుచు మార్గమధ్యమున నిలిచినాడు. కర్ణ, శకుని, దుశ్శాసనులతో దురాలోచనము చేసినాడు. అజ్ఞాతవాసము ముగియకముందే అర్జునుడు కనిపించినాడని వారి అనుమానము. భీష్ముడు చెప్పిన దానిమీద దుర్యోధనునకు నమ్మకము లేదు. అసత్యమునకు సమ్మతింపని ధర్మరాజును తెలుసుకొనవలెను అనుకున్నారు. భీష్మునకు తెలియకుండ వారి దూతను ఉపప్లావ్యమునకు ధర్మరాజు వద్దకు పంపినారు. దూత ధర్మరాజు వద్దకు వచ్చినాడు. "ధర్మజా! అజ్ఞాతవాసము ముగియకముందే అర్జునుడు కనిపించినాడు. నీవు సత్యవ్రతుడవు. అజ్ఞాతవాస భంగమును ఎరిగి అందుకు తగినట్లుగా ప్రవర్తించుట ధర్మమగును. ఇది దుర్యోధనుడు చెప్పిన మాట" అని వివరించినాడు.
"దూతా! అరణ్య అజ్ఞాతవాస విషయములయిన పదమూడు సంవత్సరములు ముగిసినవి. ఈ విషయమందు ఎవరికిని ఆక్షేపణ ఉండుటకు వీలులేదు. భీష్మ, ద్రోణాదుల సమక్షమున దుర్యోధనునకు వివరింపుము" అని చెప్పి ధర్మరాజు దూతను పంపించినాడు. దూత దుర్యోధనునకు ధర్మరాజు మాటలు వివరించినాడు. అయినను దుర్యోధనునకు నమ్మకము కలుగలేదు. ఆ రాత్రి సభ జరిపినాడు. భీష్మ ద్రోణాదులను "అర్జునుడు అజ్ఞాతవాసము ముగియకముందే కనిపించినట్లు తోచుచున్నది. ఆ విషయమై ధర్మమును తెలిసి నిశ్చయించవలసినది" అని అడిగినాడు. కాని ధర్మరాజువద్దకు దూతను పంపించిన విషయము వెల్లడించలేదు.
భీష్ముడు దుర్యోధనుని మాటలు విన్నాడు. సభా సదులందరు వినుచుండగా వివరించినాడు:-





