Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ఆనాటి రాత్రి పాండవులు అయిదుగురు ద్రౌపదియు ధర్మరాజు నివాసమున సమావేశము అయినారు. సుశర్మతో జరిగిన యుద్దమును గురించియు, కౌరవులతో జరిగిన యుద్దమును గురించియు చర్చించుకున్నారు. చర్చ జరిగినంతసేపు ధర్మరాజు తన ముఖమును కనిపించనీయలేదు. అర్జునుడు అది చూచినాడు. కారణము అడిగినాడు. ధర్మరాజు జరిగిన వృత్తాంతము ఎరిగించినాడు. కండువా జరిపి గాయము చూపించినాడు. ఆ గాయమును చూచి భీమార్జునులు ఇద్దరును మండిపడినారు. "అన్నా! విరాటుడు తన శక్తి తెలుసుకొనక నిన్ను అవమానించినాడు. వానిని ఇప్పుడే పట్టి వధింతుము. విరాటుని రాజ్యలక్ష్మి నీయందు చేరియుండును గాక" అని గర్జించినారు.
    "భీమార్జునులారా!" ధర్మరాజు సాంత్వన వచనములు పలికినాడు. "విరాటుడు మనలను వాస్తవముగా ఎరుగడు. అదికాక అతనిని ఆశ్రయించి మనము అజ్ఞాతవాసము గడిపినాము. అట్టివానికి కీడు కలిగించుట ధర్మము కాదు. మనను గురించి విరాటునకు తెలియపరచవలసిన పద్దతిని గురించి ఆలోచించవలసి ఉన్నది.
    ధర్మరాజు మాటలు విన్నారు భీమార్జునులు. శాంతించినారు. తమను విరాటునకు వెల్లడించవలసిన విధానమును గురించి చర్చించినారు. నిర్ణయించినారు. తమ తమ స్థానములకు వెళ్ళిపోయినారు.
    తెల్లవారినది. పాండవులు అయిదుగురు స్నాన సంధ్యలు ముగించుకున్నారు. తెల్లని వస్త్రములు ధరించినారు. తెల్లని పుష్పములు ధరించినారు. రాజులవలె ప్రకాశించినారు. వారు నగు మోములతో రాజ నగరున ప్రవేశించినారు. ధర్మరాజు విరాటుని సింహాసనమున ఆ సీనుడు అయినాడు. భీమార్జున, నకుల, సహదేవులు తమకు తగిన ఆసనముల మీద కూర్చున్నారు".
    పాండవులు అయిదుగురు పంచాగ్నులవలె ప్రకాశించినారు.
    విరాటుడు ఎప్పటివలె అలంకరించుకొని, ఉత్తరుని వెంటపెట్టుకొని సభాస్థలమునకు వచ్చినాడు. ధర్మరాజుణు తన సింహాసనమున చూచి చకితుడు అయినాడు. "కంకూ! ఏమీ అహంకారము! నా సింహాసనము నందు కూర్చుందువా? నన్ను చూచి అయిన లేచి నిలువవా? నీకెందుకు ఇంత గర్వము?" అని అడిగినాడు.
    "మహారాజా!" అర్జునుడు చిరునవ్వు నవ్వి అన్నాడు. "ఈ కంకు భట్టును ధర్మరాజని తెలిసికొనుము. ఈ ధర్మరాజు రాజసూయయాగము చేసి సకల రాజన్యులను లొంగదీసినాడు. ఇతడు సత్యవంతుడు. కీర్తివంతుడు. ధర్మవంతుడు. ఇతడు దేవేంద్రుని సింహాసనము అధిష్ఠించుటకయినను అర్హుడు. అట్టివాడు ఈ చిన్న సింహాసనము ఎక్కుటకు అర్హుడు అగునో కాదో నిర్ణయించవలసినది".
    విరాటుడు అర్జునుని మాటలు విని ఆశ్చర్యపడినాడు. "బృహన్నలా! ఈతడు ధర్మరాజు అయిన మిగిలిన పాండవులు ద్రౌపది ఎచట ఉన్నారు?" అని అడిగినాడు.
    అర్జునుడు తెలియపరచినాడు.
    వంటల వలలుడు భీముడు. ఇతడు పూర్వము హిడింబ, బక, కిమ్మీర రాక్షసులను హతమార్చినాడు. నీ గుర్రములను రక్షించి, శిక్షించు దామగ్రంథి నకులుడు. నీ గోవులను రక్షించు తంత్రీపాలుడు సహదేవుడు. సైరంధ్రి వేషము ధరించిన మాలిని ద్రౌపది అగును.
    విరాటుడు అర్జునుని మాటలు విన్నాడు. నిశ్చేష్టితుడు అయినాడు. ఇంకను అతనికి సంశయముగానే ఉన్నది. అతడు ధర్మజునకు వినయము కనబరచలేదు.
    అప్పుడు ఉత్తరుడు వివరించినాడు:-
    "తండ్రీ! నీవు బృహన్నల అనుకున్న ఈ వీరాధివీరుడు అర్జునుడు. ఫల్గుణుడు. పార్ధుడు, ఇతనిముందు నిలుచుటకు దేవతలు సహితము గడగడలాడుదురు. అజ్ఞానమున ఒంటరిగా కౌరవుల మీదికి దండెత్తిన నన్ను ప్రోత్సహించి నన్ను సారథిగా చేసుకున్నాడు. తాణు ఒంటరిగా గాండీవము ధరించి అరిభయంకరుడై కౌరవసేనను తరిమికొట్టినాడు. మన గోవులను మరలించినాడు. తనను నీకు వెల్లడించవలదన్నందున నిన్న నీకు ఒక దివ్యపురుషుని గురించి చెప్పినాను. ఆ దివ్యపురుషుడు ఇతడే కిరీటి. మనము ఇతనికి జన్మజన్మలకు ఋణపడి ఉందుము".
    విరాటుడు ఉత్తరుని వివరణ విన్నాడు. సంశయము బాసినాడు. తన ఎదుట నిలిచిఉన్న అర్జునుని కన్నార్పక చూచినాడు. అతనిలో ఆవేశము పొంగినది. కృతజ్ఞత పొరలినది. అర్జునుని ఆలింగనము చేసుకున్నాడు. సింహాసనమున ఉన్న ధర్మరాజు పాదములంటి మ్రొక్కినాడు. భీమ, నకుల, సహదేవులను కౌగిలించుకున్నాడు. అతని దేహము పులకాంకితము అయినది. గుండె చెమర్చినది. నేత్రములు ఆర్ధ్రములు అయినవి. ఈవార్త వినిపించుటకు మంత్రి జన పురోహితాదులను పిలిపించినాడు. ద్రౌపదిని గురించి సుధేష్ణకు వర్తమానము పంపినాడు. చేతులు దోయిలించుకొని ధర్మరాజు వద్ద నిలిచినాడు.
    "విరాట రాజా! మిక్కిలి దుస్తరమగు అజ్ఞాతవాసమును నీ గర్భము నందు ఉన్నట్లు నిశ్చింతగా గడిపినాము. నీవును, నీ పురజనులును మాకు ఎంతో ఉపకారము చేసినారు. అందుకు మీకు మేము కృతజ్ఞులము" అన్నాడు అర్జునుడు.
    "అర్జునా! నేను మీకు అన్యుడనుకాను. మీవాడను. నా నగరమున మీరు అజ్ఞాతవాసము తీర్చుకున్నారు. నన్ను ధన్యుని చేసినారు. మీరు నాకు చేసిన ఉపకారములు మరువరానివి" అని అర్జునునితో చెప్పిన విరాటుడు ధర్మరాజును చూచి వినయముగా అన్నాడు:-




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.