Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"మహారాజా!" ద్రౌపది కనులు చెమ్మగిలగా అన్నది. "ఈ కంకుభట్టు గొప్పవంశమున పుట్టినవాడు. మహాత్ముడు. పుణ్య పురుషుడు. ఇతని రక్త బిందువులు ఎన్ని భూమిమీద పడిన అన్ని సంవత్సరములు ఆ రాజ్యమున కరువు కాటకములు వచ్చును. నీ రాజ్యమున కరువు రాకుండవలెనని కంకుభట్టు నొసటి రక్తమును నాపయ్యదతో తుడిచినాను. అంతేకాదు మహాత్ములు, మహాపురుషులు శరీరము నుండి స్రవించిన రక్తము నీకు తప్పక కీడు చేయును. కావున నిన్ను కాపాడుటకు కంకుభట్టు నొసటి రక్తమును నా పయ్యదతో తుడిచినాను".
ఇంతలో ద్వారపాలకుడు వచ్చి ఉత్తరుడు, బృహన్నల వచ్చిన వార్తను ఎరుకపరచినాడు. విరాటుడు ఆనందాతిరేకమున వారిద్దరను ప్రవేశపెట్టవలసినదని ఆదేశించినాడు. వెళ్ళిపోవుచున్న ద్వారాపాలకునివద్దకు ధర్మరాజు వెళ్ళినాడు. తన నొసట ఉన్న రక్తము చూచిన బృహన్నలకు కోపము రావచ్చును. రాజునకు కీడు తలపెట్టవచ్చును. కావన బృహన్నలను అచటనే ఉంచి ఉత్తరుని మాత్రము పంపవలసినదని ప్రార్దించినాడు. ధర్మరాజు మాటవిన్న ద్వారాపాలకుడు ఉత్తరుని మాత్రము లోనికి పంపినాడు.
విరాటుడు వచ్చుచున్న ఉత్తరుని చూచినాడు. లేచినాడు. ఉరికినాడు. ఉత్తరుని కౌగిలించుకున్నాడు. తలముద్దాడినాడు. ఆనంద బాష్పములు రాల్చినాడు. ఉత్తరుడు విరాటునకు పాదాభివందనము చేసినాడు. అక్కడనే ఉన్న కంకుభట్టుకు పాదములంటి మ్రొక్కినాడు. అప్పుడు అతని నొసట ఉన్న గాయమును చూచినాడు. చకితుడు అయి తండ్రినిఅడిగినాడు. "కుమారా! నేను నీ విజయమును పొగడినాను. కుంకుభట్టు బృహన్నలణు పొగడసాగినాడు. నాకు కోపము వచ్చి ఇతని నొసలు గుచ్చినాను" అన్నాడు.
"మహారాజా! మీరు మంచి పని చేయలేదు. మహాత్ముల మాటలు కాదనరాదు. వారు చెప్పినట్లు నడచుకొనుట మన ధర్మము. కావున కంకుభట్టు కోపము శమించునట్లు ప్రార్దించుట మన కర్తవ్యము" అన్నాడు.
విరాటునికి ఉత్తరుని మాటలు ధర్మయుక్తములుగా తోచినవి. అతడు కంకుని, తనను మన్నించమని ప్రార్దించినాడు.
"ఉత్తర కుమారా!" ధర్మరాజు చిరునవ్వు నవ్వి అన్నాడు. "నాకు కోపము లేదు, రాదు. విరాటుడు చెడుమార్గమున ప్రవర్తించడు. ఈనాటి కాల దోషమున ఈ కీడు కలిగినది" ధర్మరాజు మాటకు విరాటుడు సంతసించినాడు.
ధర్మరాజు గాయము కనపడకుండునట్లు ఉత్తరీయము కప్పుకున్నాడు.
ద్రౌపది అచటి నుండి నిర్గమించినది.
అప్పుడు బృహన్నల ప్రవేశించినాడు. విరాటునకు నమస్కరించినాడు. నిలిచినాడు. విరాటుడు బృహన్నలణు మాటలతో కాక చూపులతో పలకరించినట్లు చేసినాడు. ఉత్తరుని అడిగినాడు:-
"కుమారా! నీవు బాలుడవు. ఒంటరివి. సైన్యమయినను నీ వెంట రాలేదు. అంతటి కౌరవసేనను, భీష్మ, ద్రోణాది అతిరథ మహారథులను ఎట్లు ఎదుర్కొన్నావు? ఏవిధముగా ఓడించినావు? వివరింపుము. నాకు ఆసక్తిగా ఉన్నది. ఉత్సాహముగా ఉన్నది".
"తండ్రీ! నేనెంత? నా బలమెంత? నేను కౌరవసేనను గెలుచుటెట్లు? మనకు గల దైవబలము వలన ఒక దివ్యపురుషుడు నన్ను రక్షించినాడు. కౌరవులను పారదోలినాడు. మన గోవులను మరలించినాడు" అని ఉత్తరుడు యుద్ద పద్దతిని అంతటినీ వివరించినాడు. "మహారాజా! మనకు మహోపకారము చేసిన దివ్య పురుషుడు కార్యము ముగిసినంతనే అంతర్ధానము అయినాడు. నేడుగాని రేపుగాని ఆ దివ్య పురుషుడు మనకు దర్శనము ఇవ్వగలడు" అని చెప్పినాడు.
విరాటుడు పరమానందముగా అంతయు విన్నాడు. ఆ దివ్యపురుషుడు అర్జునుడని, అర్జునుడే బృహన్నలయని, అతడు తనముందే నిలిచి ఉన్నాడని ఎరుగడు. విరాటుడు బృహన్నలను నపుంసకునిగానే తలచి, తగినట్లు సన్మానముచేసి పంపించినాడు.
అర్జునుడు, ధర్మరాజు ముఖముపై ఉత్తరీయము ఉన్నందున గాయమును గమనించ లేదు.
విరాటుని వదలి బయటకి వచ్చినారు ఉత్తరుడు, అర్జునుడును. ఉత్తరుడు ప్రసంగించిన తీరును తనను వెల్లడించిన పద్దతిని అర్జునుడు మెచ్చుకున్నాడు. ఉత్తరుని అభినందించినాడు.
తదుపరి విరాటుడు ఉత్తరుని తోడ్కొని అంతఃపురమునకు వెళ్ళినాడు. సుధేష్ణ ఉత్తరుని చూచినా వాత్సల్యమున కౌగిలించుకున్నది. వీరమాత అయినందులకు గర్వించినది. విరాటుడు ఉత్తరునకు తాను సుశర్మణు గెలిచినా వృత్తాంతమునంతణు వివరించినాడు.
అర్జునుడు నాట్యశాలకు వెళ్ళినాడు. ఉత్తర తన చెలికత్తెలతో అర్జునుని చూచినది. అతని గౌరవించినది. అప్పుడు అర్జునుడు "ఉత్తరా! నీవు మీ అన్నతో కౌరవ వీరుల తలగుడ్డలు తెమ్మని చెప్పినావు. ఇదిగో కౌరవవీరుల తలగుడ్డలు" అని ఆమెకు అందించినాడు. ఉత్తర రంగురంగులుగా ఉన్న కౌరవ వీరుల తలగుడ్డలను అందుకొని మురిసి పోయినది. తన చెలికత్తెలతో వెళ్ళిపోయినది.





