Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    అర్జునుడు అది చూచినాడు. శంఖము ఊదినాడు. వింటినారిని మ్రోగించినాడు. కౌరవులను కొంత దూరము తరిమినాడు. కౌరవ రథికులకు గల బిరుదుల తోడ గొడుగులను పడగొట్టినాడు. టెక్కెములను పడగొట్టినాడు. "కౌరవులారా! పోయి వచ్చెదను" అని గట్టిగా అరిచి చెప్పినాడు. భీష్మ, ద్రోణ, కృపుల పాదములకు బాణమువేసినమస్కరించినాడు. దుర్యోధనుని కిరీటమునందలి మణులను రాల్చినాడు.
    అప్పుడు అర్జునుడు పగటికాలపు సూర్యుని వలె ప్రకాశించినాడు. కౌరవులు వెనుతిరిగి అర్జునుని చూడలేక పోయినారు. కురు దేశపు దారిపట్టి సాగిపోయినారు.
    అర్జునుని ఆదేశము మేరకు ఉత్తరుడు రథమును జమ్మిచెట్టు దగ్గరికి చేర్చినాడు. గాండీవమును ఎప్పటివలె కట్టలో కట్టి జమ్మిచెట్టుపై ఉంచినాడు. అర్జునుడు దేవదత్త కిరీటాదులను వినయ పూర్వకముగ ప్రార్ధించినాడు. అవి అంతర్దానములు అయినవి. సింహధ్వజమును రథమునకు ఎక్కించినాడు. అర్జునుడు పూర్వమువలె నపుంసక రూపమును ధరించినాడు సారథి అయి రథమున కూర్చున్నాడు. ఉత్తరునితో అన్నాడు:-
    "కుమారా! నీ తండ్రి వద్ద నా పరాక్రమమును వెల్లడించవలదు. నీవే కౌరవ సైన్యమును గెలిచి గోవులను మరలించినట్లుగా చెప్పుము. నీ విజయమును తెలియపరచుటకు నగరమునకు మనుష్యులను పంపుము".
    "మహావీరా! అర్జునా!" ఉత్తరుడు చేతులుజోడించి అన్నాడు. "కౌరవులను ఓడించుట నాకు సాధ్యము కాదని మా తండ్రికి తెలియును. అయినను నీ ఆజ్ఞ ప్రకారము నా తండ్రిముందు నిన్ను వెల్లడించను. మన విజయ వార్త తెలుపుటకు ఇదే గోపాలురను పంపుచున్నాను".
    ఉత్తరుడు గోవులను రక్షించుటకు బయలుదేరిన తదుపరి సుశర్మణు ఓడించిన విరాటుడు నగరమున ప్రవేశించినాడు. ధర్మరాజు, భీమ, నకుల, సహదేవులతో ఆనందమున రాజగృహమున ప్రవేశించినాడు. బ్రాహ్మణులు, పుణ్యస్త్రీలు వారిమీద అక్షతలు చల్లినారు. జయము పలికినారు. విరాటుడు సింహాసనమున కూర్చుండి ఉత్తరుని గురించి అడిగినాడు. అక్కడ చేరినవారు, ఉత్తరుడును కౌరవుల మీదకు దండెత్తిన వృత్తాంతము వివరించినారు.
    విరాటుడు వారి మాటలు విని విచారించినాడు. దుఃఖమున అతని గొంతు పూడినది "మంత్రులారా! ఎక్కడి కౌరవసేన! ఎక్కడి ఉత్తరుడు!! బాల్యచాపల్యమున శలభము మంటలోనికి ఉరికినట్లు ఉరికినాడు. వెంటనే సైన్యములను పంపి ఉత్తరుని జాడ తెలుసుకొనవలెను" అన్నాడు.
    "మహారాజా!" ధర్మరాజు సాంత్వన వచనములు పలికినాడు. "ఉత్తరుడు ఒంటరివాడు కాడు. అతనికి బృహన్నల సారథిగా వెళ్ళినాడు. సకల దేవతలు దిగివచ్చినను గెలిచి రాగలరు. నీవు దుఃఖించకుము. మనకు విజయము తథ్యము.
    ధర్మరాజు ఆమాటలు చెప్పుచుండగనే ఉత్తరుడు పంపిన గోపాలురు వచ్చి విజయము పలికినారు. "మహారాజా!" ఉత్తరుడు కౌరవులను ఓడించినాడు. మన గోవులను మరలించినాడు. విజయుడయిన ఉత్తరుడు నగరమునకు వచ్చుచున్నాడు" అని విన్నవించినారు.
    ఆ మాటలు విన్న విరాటుడు ఆనందమున ఉప్పొంగినాడు. బాష్పములు రాల్చినాడు. వార్త తెచ్చిన వారికి వస్త్రభూషణములు బహూకరించినాడు. ఉత్తరునకు ఘనముగా స్వాగతము పలుకుటకు ఏర్పాట్లు చేయవలసినదని నియమించినాడు. సింహాసనము దిగి లోనికి వెళ్ళినాడు. "కంకుభట్టా! నాకు పట్టరానంత ఆనందముగా ఉన్నది. ఒక పలక జూదము ఆడుదమా!" అని సైరంధ్రితో జూద పరికరములను తెప్పించినాడు. ధర్మరాజు జూదము వలదు అనుచునే జూదము ప్రారంభించినాడు. జూదమాడుచు వారు మాట్లాడుకున్నారు.
    విరాటుడు:- చూచితివా! నా కొడుకు ఎంతటి పరాక్రమవంతుడో! కౌరవసేనను మన్నుకరిపించినాడు!! గోగణములను మరలించినాడు!!!
    ధర్మరాజు:- మహారాజా! భీష్మ, ద్రోణాది మహా వీరులెక్కడ! ఉత్తరుడు బాలుడెక్కడ? ఉత్తరుడు ఈనాడు వారిని గెలువగలిగిన ఇదివరకే మహావీరుడయి ప్రసిద్ధి చెందియుండును. కౌరవ వీరులను గెలిచినది ఉత్తరుడు కాదని తెలుసుకొనుము.
    విరాటుడు:- కంకు భట్టా! ఉత్తరుని పరాక్రమము చూచి ఓర్వలేకున్నావు. ఈమాటలు మరొకరు అనియున్న...
    ధర్మరాజు విరాటుని కోపమును లెక్క చేయలేదు "మహారాజా! ఉత్తరునకు సారథిగా వెళ్ళిన బృహన్నల అసమాన బాహు పరాక్రమము కలవాడు. దేవతలు దిగివచ్చినను అతనిని ఎదిరించలేరు. కావున విజయము బృహన్నల వలన కలిగినదని తెలుసుకొనుము" అన్నాడు.
    ధర్మరాజు మాటలు విని విరాటుడు మండిపడినాడు. అతని కనులు ఎర్రబడినవి. పెదవి అదిరినది. "కంకూ! సారథులను చాలమందిని చూచినాము. కాని ఉత్తరునివంటి వీరుని చూడలేదు. నీవు ఓర్వలేక ఇట్టి మాటలు మాట్లాడుచున్నావు. ఇక నీవు మాట్లాడకుండుట మేలు" అన్నాడు.
    "మహారాజా! నామాట తప్పదు. గెలిచినవాడు బృహన్నల. ఉత్తరుడు కాడు. బృహన్నల విజయమును నగరమున చాటింపుము".
    విరాటుడు ధర్మరాజు మాటలు విన్నాడు. అతడు సహించలేకపోయినాడు. కోపమున మండిపోయినాడు. చేతనున్న సొగటాలకాయతో ధర్మరాజు నొసట గుచ్చినాడు. ధర్మరాజు నొసట గాయమయి రక్తము వచ్చినది. అక్కడనే ఉండిన ద్రౌపది పరుగునవచ్చి తలపైటతో ధర్మరాజు నొసట అద్ది రక్తము నేలమీద పడకుండ చేసినది. విరాటుడు అది చూచినాడు. ద్రౌపదిని అందుకు కారణము అడిగినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.