Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    దుర్యోధనార్జునులు రెండు ఏనుగులవలె పోరినారు.
    అర్జునుడు అనేక బాణములు వేసినాడు. దుర్యోధనుడు వాటినన్నింటిని నడుమనే త్రుంచినాడు. అర్జునుడు మరల ఎన్నో బాణములు ప్రయోగించినాడు. దుర్యోధనుడు తాళజాలక పోయినాడు. వికర్ణుడు మదపుటేనుగును ఎక్కి సైన్యమునువెంట తీసుకొని అర్జునుని తాకినాడు. అర్జునుడు తన బానములతో సైన్యమును నుగ్గు చేసినాడు. ఒక వాడి అయిన బాణమువేసి భద్రగజమును కూల్చినాడు. అది చూచి వికర్ణుడు భయపడినాడు. రంగము నుండి తొలగినాడు. అర్జునుడు మహోగ్రమయిన బాణముతో దుర్యోధణుని రొమ్మున కొట్టినాడు. ఆ బాణమునకు దుర్యోధనుడు నొచ్చినాడు. చుట్టును చూచినాడు. సైనికులు లేరు. రథికులు లేరు. రణరంగము బట్టబయలుగా కనిపించినది. దుర్యోధనుడు రథమును మరలించినాడు. పారిపోయినాడు. పారిపోవుచున్న దుర్యోధనుని చూచి, భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్ధామ, కృపాచార్యాది అతిరథ మహారథులు దుర్యోధణుని వెంట సాగిపోయినారు. అప్పుడు అర్జునుడు ఏనుగుల, సింహముల, లేళ్ళ గుంపును తరిమినట్లు వారిని తరిమినాడు. అతడు ఒక బాణమున కర్ణుని మరొక బాణమున దుశ్శాసనుని కొట్టినాడు.
    అర్జునుని బాణము తగిలిన కర్ణుడు "భీష్మ ద్రోణాది అతిరథ శ్రేష్టులారా! అర్జునుడు మనను తరుముకొని వచ్చుచున్నాడు. దుర్యోధనుని రక్షించుట మన కర్తవ్యమయి ఉన్నది" అన్నాడు.
    కర్ణుని మాటలణు భీష్మ, ద్రోణ, కృపులు పట్టించుకొనలేదు. వారు సాగిపోవుచున్నారు. అప్పుడు దుర్యోధనుడు దీనవదనుడయి భీష్మ, ద్రోణాదులతో అన్నాడు:-
    "మహాత్ములారా! మీరు మహావీరులు. అతి రథులు. నాకు ఆప్తులు. నాకు కలిగిన ఆపదను నివారించక మీరు సామాన్య మానవులవలె ఉపేక్షింపరాదు. అట్లు వెళ్ళిన మీ ప్రతాపము ప్రకాశింపదు".
    ఆ సమయమున అర్జునుడు వెనుక నుండి కేకపెట్టినాడు. "దుర్యోధనా! నీవు వీరుడవు. పిరికివానివలె పారిపోవుచున్నావు. నామాట వినుము. నిలిచి నాతో యుద్దము చేయుము. పౌరుషము చూపుము. పారిపోవుట కంటే రంరంగమున చచ్చి వీర స్వర్గము పొందుట మేలు".
    అర్జునుని మాటలు విన్నాడు దుర్యోధనుడు. కోపమున అగ్గి అయినాడు. మహా పౌరుశామున వెనుదిరిగినాడు. అర్జునుని మీదకు ఉరికినాడు. భీష్మ, ద్రోణాదులు దుర్యోధణుని వెంటవచ్చి అర్జునుని చుట్టిముట్టినారు. కౌరవ సైన్యము సాంతము అర్జునుని చుట్టుముట్టినది. అనేక శస్త్రాస్త్రములను అర్జునుని మీద ప్రయోగించినారు.
    "అర్జునుడు అది చూచినాడు. భీమాదుల ప్రతిజ్ఞలు తలచుకున్నాడు. దుర్యోధనాదులను హతమార్చాదలచలేదు. వారిని భంగపెట్టుటకు నిశ్చయించినాడు. దేవేంద్రుడు తనకు ఇచ్చిన సమ్మోహనాస్త్రమును ప్రయోగించినాడు. ప్రయోగించిన మరుక్షణముననే కౌరవులు, సైనికులు, రథికులు సర్వులు ఆయుధములను విడిచి, తలలు మెడలు వంచి, గాఢ నిద్రను పొందినట్లు పడిపోయినారు. రణరంగము సాంతము నిశ్శబ్దమయినది. చలన రహితముగా ఉన్నది".
    "ఉత్తర కుమారా" అర్జునుడు విజయగర్వమున అన్నాడు. "మీ చెల్లెలు కౌరవ వీరుల తలగుడ్డలు కోరినది. వెళ్ళి తీసుకొని రమ్ము. భీష్ముని వద్దకు మాత్రము వెళ్ళకుము: అతనికి మారు అస్త్రము తెలిసి ఉండవచ్చును. అదికాక అతడు మూర్చిల్లక మేలుకొని ఉండవచ్చును".
    ఉత్తరుడు రథము దిగి, ద్రోణ, కృప, అశ్వత్ధామ, దుర్యోధనుల తలగుడ్డలను తెచ్చి రథమును ఎక్కినాడు. అర్జునుని అనతి ప్రకారము రథము బయటికి నడిపించినాడు. అప్పుడు భీష్ముడు అర్జునుని ఎదిరించి బాణములు ప్రయోగించినాడు. అర్జునుడు భీష్ముని సారథిని కొట్టి, గుర్రములను నొప్పించి, భీష్ముని దేహమున క్రూర బాణములను గుచ్చి, రథమును తప్పించుకొని బయట పడినాడు.
    అర్జునుడు రాహువుచేత విడువబడిన సూర్యునివలె ప్రకాశించినాడు.
    అర్జునుడు సాగిపోయినాడు. అప్పుడు కౌరవసేనకు తెలివివచ్చినది. దుర్యోధనుడు మూర్చ తేరుకున్నాడు. తేరిపార చూచినాడు. అర్జునుడు కనిపించలేదు.దిగ్గున లేచినాడు. పళ్ళు పటపట కొరికినాడు. అర్జుణుని మీదకు ఉరుకుటకు ఉద్యుక్తుడు అయినాడు. భీష్ముడు దుర్యోధణుని చూచి నవ్వినాడు. అతనిని వారించినాడు. అన్నాడు:-
    "దుర్యోధనా! పరిస్థితులను తెలుసుకొనక ప్రవర్తించుచున్నావు. అర్జునుడు సమ్మోహనాస్త్రమున సకల జనులను మూర్చిల్ల చేసినాడు. నీవు ఆయుధము విడిచి తలవాల్చి తెలివిలేక పడిపోయినావు. అర్జునుడు అనుకున్న నీ ప్రాణములు తీసియుండును. అతడు ఎవరికిని హాని కలిగించక వెళ్ళిపోయినాడు. అందుకు అర్జునుని ఎంత పొగడినను తక్కువే. అటువంటి అర్జునుని ఎదిరించుట కొరివితో తల గోక్కున్నట్లగును. కావున వివేకవంతుడవు కమ్ము. హస్తినకు మరలుము".
    భీష్ముని మాటలు విన్నాడు. దుర్యోధనుడు తలవంచి నిలిచినాడు. అర్జునుని ప్రతాపమును చవిచూచినా ఇతరులు భీష్ముని మాటలను సమ్మతించినారు. దుర్యోధనుడు సైన్య సమేతుడయి వెనుకకు మరలినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.