Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    మరొక విషయము కానవచ్చును. నగరము సాంతము యుద్దమునకు పోయినపుడు మరొక రాజు నగరముపై దాడిచేయుట నిషిద్దమయినట్లు కనిపించుచున్నది. ఆ నియమమును దుర్యోధనుడు పాటించినాడు. అతడు నగరముపై దండెత్తిన అతనిని అడ్డువారు లేరు. కాని అతడు అట్లు చేయలేదు.
    దుర్యోధనుని దాడి రాజ్యము కొఱకు కాదు. అతని దాడి గోసంపద కొఱకు. రాజ్యముపై దాడిచేసి, దానిని ఆక్రమించుకొని, విజేతలు పాలించినట్లు కనిపించదు. సుశర్మ మీద కీచకుడు దాడిచేసి చాలాసార్లు ఓడించినాడు. అతని రాజ్యమును ఆక్రమించలేదు. ఓడించుట మాత్రమే జరిగినది.
    రామాయణ కాలమునందు కూడ ఆవిధముగనే జరిగినది. శ్రీరాముడు వాలిని చంపినాడు. కిష్కంధను ఆక్రమించలేదు. శ్రీరాముడు రావణుని వధించినాడు. అందుకు సుగ్రీవుడు సాయపడినాడు. శ్రీరాముడుకాని, సుగ్రీవుడు కాని లంకను ఆక్రమించలేదు.
    పాండవులు రాజసూయ సమయమున అనేక రాజ్యములు గెలిచినారు. వాటిని ఆక్రమించలేదు.
    దక్షిణ, ఉత్తర గోగ్రహణములు దోపిడివంటివి. సంపదను కొల్లగొట్టుటకు జరిగినవి.
    3. ఉత్తరుని ప్రజ్ఞావాక్యములు యువతలోని ఆవేశమునకు సంకేతములు. యువతకు ఆవేశము ఎక్కువ. తమ శక్తిని సరిగా అంచనా వేయగల ఆలోచన వారికి ఉండదు. ఎదుటివాని శక్తిని లెక్క కట్టలేరు. ఉడుకుతున్న రక్తముతో తానొక్కడనే సమస్తము సాధింతును అనుకొనుట వయసు లక్షణము. ప్రపంచమునే మార్చగల శక్తి తనలో ఉన్నది అని భ్రమపడుట ఆ వయసు లక్షణము. తన శక్తిని ఎక్కువగా అంచనావేయుట, ఎదుటివాడు నిర్వీర్యుడు అనుకొనుట బాల్య చాపల్యము. ఉత్తరుడు అదే చేసినాడు.
    యువకులకు వాస్తవశక్తి ఎదురయినపుడు సత్యము అర్ధమగును. అపుడు వారు కౌరవ సైన్యమును చూచిన ఉత్తరుని వలెనే ప్రవర్తింతురు. అప్పుడు యువతను నడుపుటకు ఒక యుక్తి మంతుడయిన నాయకుడు అవసరము. అర్జునుడు నాయక కార్యమును నిర్వహించినాడు. ఉత్తరునికి ధైర్యము చెప్పినాడు. కార్యమునకు ప్రోత్సహించినాడు. కార్యము సాధించినాడు.
    ఒక ఉద్యమము నిర్వహించుటకు యువశక్తి అవసరము. దానిని నిర్వహించుటకు అనుభవజ్ఞులయిన, ఆలోచించగలిగిన నాయకత్వము సహితము అవసరము అను సత్యమును ఈ ఉదంతము వెల్లడించుచున్నది. ఇది నిత్య సత్యము. దీనికి యుగములతో నిమిత్తము లేదు. వ్యాస మహర్షి ఈ నిత్య సత్య సందేశమును మానవాళికి అందించినాడు.
    4. ఇచట ఒక విచిత్రమయిన విషయమును గురించి ఆలోచించవలసి ఉన్నది. ఉత్తర గోగ్రహణము రానున్న కురుక్షేత్రమునకు రిహార్సలుగా కనిపించుచున్నది. యుద్దమునకు బాహాటముగా వచ్చిన అర్జునుడు కురుక్షేత్రమున ఉత్తరునివలెనే నీరసించినాడు. అతడు నీరసించుటకు కారణము వేరు కావచ్చును. గాండీవము అతని చేతినుండి జారినది, శరీరము సాంతము వడకినది, నాలుక ఆరుకొని పోయినది. ఇప్పుడు ఉత్తరునకు అర్జునుడు ధైర్యము చెప్పినట్లు, ఉద్యుక్తుని చేసినట్లు కురుక్షేత్రమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని  ఉద్యుక్తునిచేసి మానవాళికి మహత్తర సందేశమయిన గీతను ప్రవచించినాడు.
    సృష్టిలో మానవుని కన్న విశిష్టుడు లేడు. ఎందువలన అనగా అతడు ఆలోచించగలడు. తనను తాను నాశనము చేసుకొనగలడు. సృష్టిలో మరి దేనికీ ఇంత శక్తిలేదు. ఈలోకమున జీవితము కన్న విచిత్రమయినది మరొకటి లేదు. మానవుడు జన్మించిన దాదిగా ఈ మానవ జీవితమును విశ్లేషించుటకు ప్రయత్నము సాగుచున్నది. ఇది మానవుడు ఉన్నంతకాలము కొనసాగును. కాని జీవితము ఇదమిత్దముగా నిర్వర్తించుట దుర్లభము.
    మానవునకు ఉన్న గర్వము తాను సర్వజ్ఞుడనని. అర్జునుడు అదే అనుకున్నాడు. ఉత్తరుని ఉద్యుక్తుని చేసినాడు. కురుక్షేత్ర సంగ్రామమున ఆ అర్జునుడే తాను అజ్ఞుడనని గ్రహించినాడు. అదియే జ్ఞానము. అప్పుడు అర్జునునకు ప్రబోధించినాడు పరమాత్మ.
    ఒక కార్యమును నిర్వహించుటకు యువత, దానికి అనుభవజ్ఞమయిన సారథ్యము ఎంత అవసరమో, మానవ ప్రయత్నమునకు పరమాత్మ ప్రేరణ అంత అవసరమను గొప్ప సందేశమును అందించినది మహాభారతము. అందువలననే అది మానవ ఇతిహాసము అయినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.