Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
5. దుర్యోధనుడు విరాటునిపై దండెత్తినది పాండవుల అజ్ఞాతవాసమును భంగము చేయుటకు. ఆ విషయము అతడు నిండు సభలో ప్రకటించినాడు. అజ్ఞాతవాసము ముగియనున్నదని భీష్మాదులకు తెలియును. అయినను వారు ఆ విషయమును దుర్యోధనునకు చెప్పలేదు. అందుకు కారణము దుర్యోధనుని నిరంకుశత్వము కావచ్చును. యుద్దమునాకు వచ్చి దుర్యోధనునికి అర్జునుడు కనిపించిన తరువాత భీష్ముడు ఆవిషయము వెల్లడించినాడు.
కాలమును నిర్ణయించుటకు వేరు వేరు పద్దతులు అవలంబించబడుట ఇందుకు కారణముగా కనిపించుచున్నది. ఆది పర్వమున పాండవుల జనన సందర్భమున సంవత్సరమునకు తొమ్మిది నెలలు మాత్రమే. ఆ తరువాత కాల నిర్ణయమును గురించి గొప్ప పరిశోధన జరిగినట్లు కనిపించుచున్నది. పాండవుల వనవాసమునకు వెళ్ళు సమయమునకు చాంద్ర మానము అమలులోనికి వచ్చునట్లున్నది.
చాంద్ర మానమున సంవత్సరమునకు 354 రోజులుండును. సౌర మానముతో దీనిని సమానము చేయుటకు ప్రతి అయిదు సంవత్సరములకు రెండు అధిక మాసములు వచ్చును. (పంచమే పంచమే వర్షే ద్వౌమాసా వుపజాయత) దాని ప్రకారము పాండవుల వనవాస అజ్ఞాత వాసములు ముగిసి ఆనాటికి అయిదునెలల పన్నెండు రోజులు ఎక్కువ అయినవి అని భీష్ముడు చెప్పినాడు.
చాంద్ర మానము ఆచారమునందు ఉన్నచో పాండవులు అయిదునెలలను మించి అరణ్య, అజ్ఞాత వాసములు చేయుటకు గల కారణములు ఏమైయుండును?
పాండవులు అరణ్య వాసమునకు వెళ్ళిన తరువాత కాల నిర్ణయమున జరిగిన పరిశోధనలలో ఎన్నో మార్పులు వచ్చినట్లు కనిపించుచున్నది. అప్పుడు కాలమును సౌర మానము ప్రకారము లెక్కించినట్లున్నారు.
సౌర మానమున సంవత్సరమునకు 365 రోజుల 15 ఘడియలు. సౌర మానము ప్రకారము పాండవులు అయిదు నెలలకు పైగా, అరణ్య అజ్ఞాత వాసములు చేయవలసి ఉండును. అందువలన దుర్యోధనుడు సౌర మానమును గుర్తించినాడు. దానినే ప్రవర్తింప చేసినాడు. ప్రభుత్వము గుర్తించినందున సౌర మానము ప్రకారమే అధికార వత్సరము అగును. రాజానుమతో ధర్మః. రాజు గుర్తించినదే ధర్మమగును. ఇది నేటికి అంతే. ఇప్పటి ప్రభుత్వము ఆంగ్ల సంవత్సరముణు గుర్తించినది. దాని ప్రకారమే వ్యవహారములు జరుగుచున్నవి.
దుర్యోధనుడు పాండవులకు కాల నిర్ణయమున ధర్మ సంకటము కలిగించదలచినాడు. పాండవులు చాంద్ర మానమును లెక్కించి బయటపడుదురు. అప్పుడు సౌర మానము ప్రకారము లెక్కించి వారిని మరల అడవులకు పంపదలచినాడు.
ధర్మరాజు దుర్యోధనుని ఈ కుట్రను గ్రహించినట్లున్నాడు. సౌర మానము ప్రకారమే అతడును లెక్కవేసినాడు. చాంద్రమానము ప్రకారము గడువు ముగిసినను వారు బయటపడలేదు. అయిదునెలల పన్నెండు రోజులు ఎక్కువ అయినను అజ్ఞాతముగనే ఉన్నారు. అంతేకాదు సౌర మనము ప్రకారము కూడ అర్జునుడు బయటబడిన నాటికి 6 రోజులు ఎక్కువ అయినవి.
దుర్యోధనుడు కాల నిర్ణయము విషయమున కూడ కుట్ర పన్నినాడు. ధర్మరాజు అది గ్రహించకుండిన దుర్యోధనుడు గొప్ప ధర్మ సందేహము లేవదీసి ఉండును. పాండవులు అడవులకు వెళ్ళునపుడు అమలులో ఉండినది చాంద్ర మానమా? వారు వెళ్ళిన తరువాత ప్రవర్తిల్లినది సౌర మానమా? అను విషయమున శాస్త్ర చర్చలు జరిగి ఉండెడివి. దుర్యోధనునకు రాజ్యము ఉన్నది. శాస్త్రజ్ఞులు రాజ్యమునే అనుసరింతురు. అప్పుడు ధర్మరాజు ఓడి ఉండును. దుర్యోధనుడు నిరంకుశుడు. అతని సభలందు న్యాయమునకు తావుండదను విషయము మనము గుర్తించినాము. అందువలననే పాండవులు జాగ్రత్త పడినారు. దుర్యోధణుని అంచనాలను తలక్రిందులు చేసినారు.
భాగవతమున కాల పరిణామమును గురించి వివరించబడినది. అందలి ప్రధాన మానము ఇట్లున్నది:-
2 పరమాణువులు ఒక అనువు. మూడు అణువులు ఒక త్రస రేణువు. మూడు త్రస రేణువులు ఒక త్రుటి. వంద త్రుటులు ఒక వేధ. మూడు వేధలు ఒక లవము. మూడు లవములు ఒక నిమేషము. మూడు నిమేషములు ఒక క్షణము. అయిదు క్షణములు ఒక కాష్ఠ. పదిహేను కాష్ఠములు ఒక లఘువు. పదిహేను లఘువులు ఒక గడియ. రెండు గడియలు ఒక ముహూర్తము. ఏడు ముహూర్తములు ఒక యామము. ఎనిమిది యామములు ఒకరోజు. పదిహేను రోజులు ఒక పక్షము. రెండు పక్షములు ఒక మాసము. రెండు మాసములు ఒక ఋతువు. మూడు ఋతువులు ఒక అయనము. రెండు అయనములు ఒక సంవత్సరము.
ఈవిధముగా మరింత వివరముగా యుగములు, మన్వంతరములు మున్నగు వానిని గురించి కూడ చెప్పబడినది.
కాల పరిణామమును గురించి అనంతమయిన పరిశోధన జరగనట్లు కనిపించుచున్నది. ఈ పరిశోధనలోని ఆంతర్యమును గురించి శాస్త్రజ్ఞులు చర్చించి నిర్ణయించవలసి ఉన్నది.





