Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఉత్తరుడు అర్జునుడు చెప్పిన ప్రకారము రథము తోలినాడు. ఆ మహాసైన్యమునకు మధ్యన, కుడివైపున, ఎడమవైపున, ముందరి పక్కన, వెనుక పక్కన ఉండిన ద్రోణ, అశ్వత్ధామ, కృపాచార్య, కర్ణ, భీష్మాదులను అర్జునుడు ఉత్తరునకు చూపినాడు. ద్రోణాచార్య, కృపాచార్య, భీష్ముల పాదాలవద్ద పడునట్లు అర్జునుడు రెండేసి బాణములు వేసినాడు. ఆ ముగ్గురి చెవుల సమీపమందు పడునట్లుగా మరి రెండేసి బాణములను వేసినాడు. అందుకు ఆ ముగ్గురు ఎంతో సంతోషించినారు. పాదముల వద్ద బాణములు వేసి నమస్కరించి, చెవుల వద్దకు బాణములను పంపి కుశల ప్రశ్నవేసినందుకు ద్రోణుడు అర్జునుని మెచ్చుకున్నాడు. పక్కనున్న వారితో చెప్పి అర్జునుని కీర్తించినాడు. అజ్ఞాతకాలము గడిపివచ్చిన అర్జునుడు రాత్రికాలము గడిపివచ్చిన సూర్యుని వలె ప్రకాశించుచున్నాడు అన్నాడు.
భీష్మ పితామహుడు అర్జునుని వినయమును ప్రతాపమును శ్లాఘించినాడు. "అర్జునుడు దుర్యోధణుని యందు కోపము గలవాడయి అగ్నిశిఖవలె ఉరుకుచున్నాడు. దుర్యోధనుడు అర్జునుని ధాటికి నిలువజాలడు. అని కురు వీరులను పురిగొల్పి సైనిక సమూహములను ముందునకు ఉరికించి తన రథమును అతివేగముగా తోలించినాడు.
అర్జునుని రథము గోగణముల వద్దకు చేరినది. ఇటు చూడగా కౌరవ సైన్యములు ఉప్పెనవలె ఉరికి వచ్చుచున్నవి. అర్జునుని రథము ఉభయ సైన్యముల మధ్యన నిలిచినది. అర్జునుడు తన పేరు చెప్పి, చేయెత్తి కౌరవ సైన్యములను నిలువ వలసినదని గర్జించినాడు. అర్జునుని గర్జనకు కౌరవ సైన్యముల గమనము ఆగిపోయినది. అవి నిలిచిపోయినవి.
అర్జునుడు అది చూచినాడు. బాణములను పుంఖాను పుంఖములుగా వదిలినాడు. ఆ బాణములు ఆకసమును కప్పివేసి పట్టపగలు దట్టమయిన చీకటి వ్యాపింపచేసినవి. కౌరవ సైన్యము కాటుకవంటి చీకటిలో కదలలేక చేష్టలు ఉడిగి నిలిచినవి.
అంతట అర్జునుడు గోవుల వెనుక నడుచు అల్ప సైన్యమువైపు తన రథమును వేగముగా తోలించినాడు. అర్జునుని చూచిన కౌరవ సైన్యము చెల్లా చెదరయి తూర్పు దిక్కునకు పారిపోయినది.
అప్పుడు అర్జునుడు నలుదిక్కులకు చూచినాడు. ఒక ప్రక్క సైన్యము చిత్తరువువలె నిలిచి ఉన్నది. మరొక పక్క సైన్యము పారిపోవుచున్నది. అప్పుడు అర్జునునకు తెరపి దొరికినది. అతడు కండువా సవరించుకున్నాడు. దేవదత్తమును పూరించినాడు. దానితో దిక్కులు పిక్కటిల్లినవి. అర్జునుని టెక్కెమునందలి హనుమంతుడు గర్జించినాడు. భూతములు కేకలు పెట్టినవి. ఈ ధ్వనులకు శత్రు సైన్యములు అదిరిపడినవి. భూమి వడకినది. ఆకాశము అదిరినది.
ఆధ్వనులు విని గోగణములు బెదిరినవి. అవి దక్షిణదిశగా ఉపప్లావ్యము వైపునకు ఉరికినవి. విరాటుని గొల్లలు నిర్భయముగా వాటిని తమ పట్టణము వైపునకు మరలించినారు. "గోపాలకులారా! నేను అర్జునుడను. మీకు భయములేదు. మీరు నగరమునకు గోవులను తోలుకొని పొండు" అని గర్జించి చెప్పినాడు అర్జునుడు.
అది చూచిన కౌరవ సైన్యములు గజ, తురగములతో గోవులకు అడ్డుపడినవి. అది చూచినాడు అర్జునుడు. పెనుగాలివలె అటు ఉరికి క్రూర బాణ పరంపరచేత కౌరవ సైన్యములను చెదరగొట్టినాడు. తదుపరి ఉపప్లావ్యము వైపు సాగిపోవు గోవుల వెంట కొంత దూరము నడిచినాడు. గోవులు ఆకలిగలవయి తమ మేత భూములలోనికి ప్రవేశించి ఎప్పటివలె మేత మేయసాగినవి. గోపాలురును గోవుల వెంట వెళ్ళి స్వస్థలములకు చేరినారు.
ఆవిధముగా కౌరవుల ప్రయత్నములను అర్జునుడు వమ్ముచేసి మధ్యందిన మార్తాండునివలె ప్రకాశించినాడు. గోగణములను విరాటుని పట్టణమయిన ఉపప్లావ్యమునకు చేర్చినాడు.
దుర్యోధనుడు నిస్తేజుడయి చూచుచు నిలిచినాడు.
ఆలోచనామృతము
1. సుశర్మ దక్షిణము నుండి దాడి చేసినాడు. అప్పుడు విరాటుడు తన సేనతో దక్షిణమునకు వెళ్ళినాడు. అతనికి సుశిక్షితమయిన సేన ఉన్నట్లు కనిపించదు. ఉపప్లావ్యమునందలి పురుషులందరు యుద్దమునకు ఉరికినట్లు కనిపించును. ఉపప్లావ్యము సాంతము విరాటునివెంట వెళ్ళినది. నగరమున స్త్రీలు, బాలురు తప్ప ఎవరును మిగులలేదు. యుద్దము వచ్చినపుడు నిర్భంధముగా పురుషులందరు సైనికులగుట ఒక నియమముగా ఉండిన దానిని పౌరులందరు పాటించినట్లును కనిపించుచున్నది.
ఉత్తరమున దుర్యోధనుడు దాడిచేసినపుడు నగరమున మగవారు లేరు. పౌర ధర్మముగానే పాండవులలో నలుగురు విరాటుని వెంట యుద్దమునకు వెళ్ళినారు. అర్జునుడు బృహన్నలగా నపుంసకుడుగా ఉన్నాడు. అందువలన నగరమున నిలిచి పోయినాడు. ఉత్తరుడు బాలుడయినందున ఉన్నాడు. పరిస్థితి ఎట్టిదనిన రథము తోలుటకు నరమానవుడు లేడు.
2. దుర్యోధనుడు యుద్దవిద్యా విశారదుడు. అతడు చాల చక్కని వ్యూహము రచించినాడు. మగ పురుగు లేకుండ విరాటుని పట్టణమంతయు సుశర్మమీదికి పోయిన సమయమున ఉత్తరము నుండి దాడి చేసినాడు.
విరాటునకు యుద్దవిద్య తెలిసినట్లు కనిపించదు. యుద్దవిద్య తెలిసిన ధర్మరాజాదులు కూడ దుర్యోధనుని వ్యూహమును గ్రహించినట్లు కనిపించదు. గ్రహించినచో నగరము సాంతము తరలిపోరాదని విరాటునకు సలహా ఇచ్చి ఉందురు. నగరమునకు ఏమాత్రము రక్షణ లేకుండునట్లు వదిలి సుశర్మ మీదికి సమస్తజనులు యుద్దమునకు వెళ్ళుట యుద్ద చాతుర్య లోపముగా కనిపించుచున్నది.





