Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "కర్ణా! నీవు ఒక్కడనే అర్జునుని ఎదిరించుట సముద్రమును ఈదుట వంటిది. వాసుకి సర్పపుకోరలు పీకుట వంటిది. కార్చిచ్చును ఊది ఆర్పుట వంటిది. కావున నీ గర్వము విడువుము. సాహసము వలన మేలు కలుగదు. మనము అందరము కలిసి దుర్యోధనునకు అపాయము కలుగకుండు ఉపాయము ఆలోచించవలసి ఉన్నది" అని ఉపన్యసించినాడు కృపాచార్యుడు.
    జరిగిన వాగ్వివాదములను విన్నాడు భీష్ముడు. పరస్పర దూషణములను విన్నాడు భీష్ముడు. "కృపాచార్య, అశ్వత్ధామలారా! ఇది కలహములకు కాలము కాదు. అర్జునుడు వచ్చుచున్నాడు. మనమందరము కూడి ఇప్పుడు అర్జునుని ఎదిరించవలసి ఉన్నది. కార్యభారము పూనిఉన్నపుడు విరోధములు కూడవని పెద్దలు చెప్పుదురు. మీరు వేద వేదాంత వేత్తలు. ధనుర్వేదమంతయు మీయందు ఉన్నది. మీ వంటి మహాత్ములు మరెచ్చటను కానరారు. మీరు కురువంశమునకు ఆచార్యులు. మిమ్ము దుర్యోధనుడు ఆదరించుచున్నాడు. కౌరవ బలమునకు కీడు కలుగకుండ చూడవలసిన బాధ్యత మీపైన ఉన్నది. అందువలన ఒకడు అవివేకముగా మాటలాడినను మీరు క్షమించవలయును. అట్టి మాటకుగాను మీరు దుర్యోధనుని కార్యము చెరుపరాదు" అన్నాడు.
    "మహాత్మా! భీష్మా" కృపాచార్య, అశ్వత్ధామలు అన్నారు. "దుర్యోధనుని కార్యము చెరచుటకు మేమెవ్వరము? ద్రోణాచార్యుల చిత్తము శాంతింప చేయుటయే మమ్ములను ఆదరించుట అగును".
    దుర్యోధనుడు వారి మాటలు విన్నాడు. భీష్మ, కర్ణులను చేర్చుకొని ద్రోణాచార్యులను ప్రార్ధించినాడు. అశ్వత్దామను వేడుకున్నాడు. ఆ విధముగా వారి చిత్తములకు శాంతి కలిగించినాడు.
    శాంతించిన ద్రోణుడు "నా కోపము నశించినది. అర్జునుడు దుర్యోధణునియందు మిక్కిలి కోపము కలిగి వచ్చుచున్నాడు. దుర్యోధనుని రక్షించుట మనందరి ధర్మము. ఇంతకుముందు దుర్యోధనుడు పాండవుల అజ్ఞాతవాస కాలము ఇంకను మిగిలి ఉన్నదని చెప్పినాడు. ఆ విషయమును కూర్చి ముందు భీష్ముడు నిశ్చయించవలసి ఉన్నది" అని చెప్పినాడు.
    ద్రోణుని మాటలు విన్నాడు భీష్ముడు. దుర్యోధనునితో అన్నాడు:-
    "పాండవులు వనవాసమునకు వెళ్ళిన రెండవ సంవత్సరమున అధిక మాసము వచ్చినది. ఆవిధముగా పదమూడు సంవత్సరములలో వచ్చిన అధికమాసములను లెక్కించిన నిన్నటితో పదమూడు సంవత్సరములు పూర్తి అయినవి. పాండవులు ధర్మాత్ములు. ఎన్ని కష్టములు వచ్చినను ధర్మము తప్పజాలరు. అజ్ఞాతము పూర్తి అయినదని తెలిసియే అర్జునుడు బయటపడినాడు".
    "దుర్యోధనా! ఇప్పుడు మన మీదికి వచ్చుచున్నవాడు వివ్వచ్చుడు. కార్చిచ్చువలె కదలి వచ్చుచున్నాడు. యుద్దమున ఒక పక్షమునకే జయము కలుగుత సత్యము. కావున సంధిచేసికొనుట మేలుగా తోచుచున్నది".
    "భీష్మ పితామహా!" దుర్యోధనుడు నుడివినాడు. "పాండవులకు మనకు స్నేహము కలుగదు. సంధి మాటలు చెల్లవు. పాండవులకు రాజ్యము పంచిపెట్టను. యుద్దము చేయుటకే నిశ్చయించినాను. ఇది నా మతము. నా నిశ్చయము".
    వారి మాటలు ద్రోణుడు విన్నాడు. "యుద్ద పద్దతులు మన దుర్యోధనుని కన్న తెలిసినవారు లేరు. అయినను నాకు తెలిసినంతవరకు ఒక పద్దతి చెప్పెదను. మన సైన్యమును నాలుగు భాగములు చేయవలెను. నాల్గవ భాగము సైన్యము తీసుకొని దుర్యోధనుడు గోవులముందు నడచును. మరొక నాల్గవ భాగము గోవులను తోలుకొని దుర్యోధనుని వెనుక నడువవలెను. మిగిలిన సగము సైన్యముతో నిలిచి మనము అర్జునుని ఎదిరించవలెను" అని వ్యూహ రచనము సూచించినాడు ద్రోణుడు.
    ద్రోణాచార్యుడు చెప్పిన వ్యూహమునకు భీష్ముడు అంగీకరించినాడు. నాల్గవ పాలు సైన్యము దుర్యోధనునకు ఇచ్చి పంపినాడు. మరొక నాల్గవపాలు సేన గోవులతో పంపినాడు. మిగిలిన సైన్యములతో వ్యూహము తీర్చి భీష్మ పితామహుడు నిలిచినాడు. అతని రథమున తాళధ్వజము రెపరెపలాడినది, వ్యూహము తీర్చిన భీష్ముడు యుద్దసన్నాహ సౌందర్యమున ప్రకాశించినాడు. అర్జునుని ఎదుర్కొనుటకు సిద్దమయి నిలిచినాడు.
    అటునుండి అర్జునుని రథము సాగినది. కౌరవ సైన్యముల వైపు ఉరికినది. అర్జునుని శంఖ ధ్వానమునకు శత్రు సైన్యముల గుండెలు తల్లడిల్లినవి. అర్జునుని రథ వేగమునకు ఎగసిన దుమ్ము శత్రు సైనికుల కనులలో పడి కలకలు కలిగించినది. అర్జునుని కపిధ్వజకాంతులు వ్యాపించగా శత్రుసేనల కనులు మిరుమిట్లు గొలిపినవి. వారి మనములు తల్లడిల్లినవి. ఆ విధముగా అర్జునుడు శత్రు సైనికులకు భయభ్రాంతి కలిగించుచు తన వింటినారిని ధ్వనింప చేసినాడు. ఆ ధ్వని ప్రళయకాల భైరవ ధ్వనివలె భయంకరముగా వ్యాపించినది.
    అర్జునుడు కౌరవ సైన్యమును కలయ చూసినాడు. అతనికి దుర్యోధనుడు కనిపించలేదు. "ఉత్తర కుమారా! కౌరవ సైన్యమును మూడు విధములుగా నడిపించుచున్నారు. దుర్యోధణుని వెదకు నిమిత్తము మన రథమును పెద్ద సైన్యమునకు ఎడమ పక్కగా పోనిమ్ము. ముందు గోగణములను మరలింతము. తదుపరి దుర్యోధనునిపై దాడి చేతము" అన్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.