Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
అర్జునుడు అతని మాటలు విని, ప్రసన్నుడయి, రథముదిగి, ఉత్తరుని కౌగిలించుకొని, తల ముద్దాడినాడు. అప్పుడు అర్జునుని కనుల నుండి ఆనంద బాష్పములు రాలినవి. అపుడు ఉత్తరుడు అన్నాడు:-
"మహాత్మా! పాండవులకు నేను మేనల్లుడను అగుదును. అందువలన నిన్ను మామా! అని పిలుతును".
"మామా! నీవు దర్శనము ఇచ్చినావు. నా మనసునందుగల సంశయము మాయమైనది. నీ బలమును ఆశ్రయించి శౌర్యవంతుడను అగుదును. అర్జునునకు సారథ్యము చేయవలెనని నేను సర్వదాకోరుచుందును. నా కోరిక ఫలించినది. నేను నీకు సారథ్యము చేతును. నాచేత పనులు చేయించుకొనుము. దుర్యోధనునకు భయము కలిగింపుము. మన గోవులను మరలింపుము".
"కుమారా! నీకు కష్టము కలుగకుండునట్లు యుద్దము చేసి శత్రువులను జయింతును. పూర్వము ఒక స్త్రీ వలన నాకు నపుంసక రూపము వచ్చినది. అది అజ్ఞాతవాస సంవత్సరముతో అంతమయినది. ఇక నాకు నా స్వంతరూపము వచ్చును" అని ఆయుధముల అధిదేవతలకు నమస్కరించి గాండీవము, అమ్ముల పొదులు ధరించినాడు అర్జునుడు. పూర్వము ఇంద్రుడు తనకు ఇచ్చిన కుండలములను, తలపాగను మనమున తలచినాడు. అట్లుతలచగనే అవి వచ్చి అతనిని చేరినవి. అర్జునుడు వానిని ధరించినాడు. అంతకుముందు నపుంసక రూపమున ఉండిన చేతులయందుగల మురుగులను అర్జునుడు చూచుకున్నాడు. నవ్వుకున్నాడు. ఇంద్రుని ప్రభావము వలన అర్జునుని తలమీద తేజోవంతమయిన కిరీటము వెలసినది. దాని కాంతికి దిక్కులు వెలిగినవి. అర్జునుడు కవచము ధరించి రథమును ఎక్కినాడు. గాండీవమును అందుకొని పిడికిటిచేత నారిని ధ్వనింప చేసినాడు. ఆ ధ్వనికి వృక్షములు అదిరినవి. పక్షులు జంతువులు బెదిరినవి. అప్పుడు అగ్నిదేవుడు కపిధ్వజమును, దానిని ఆశ్రయించి ఉండు భయంకర రూపములను పంపించినాడు. ఆ రథమునకు ఉండిన సింహధ్వజమును తొలగించి ఉత్తరుడు కపిధ్వజమును అలంకరించినాడు. అర్జునుడు దేవదత్త శంఖమును తలచినాడు. అది వచ్చినది. అర్జునుడు దేవదత్తమును ధరించినాడు. అప్పుడు అతడు పరిపూర్ణుడయిన అర్జునుడు అయినాడు. ఉత్తరుడు రథమును ఎక్కినాడు. గుఱ్ఱముల పగ్గములు అందుకున్నాడు. రథమును నడిపించసాగినాడు.
అర్జునుడు దేవదత్తమును పూరించినాడు. ఆ ధ్వనికి కౌరవసేనలో కలకలము బయలుదేరినది. తమ మీదకి వచ్చు వానిని గురించిన చర్చ కొనసాగినది.
"దుర్యోధనా! ఆ శంఖ ధ్వని అర్జునునిదే. అతడు ఆకలిగొన్న బెబ్బులివలె ఉరికి వచ్చుచున్నాడు. మన సైన్యమునందు దుశ్శకునములు గోచరము అగుచున్నవి. మనకు విజయము కలుగుత అనుమానము. అయినను అందరిని యుద్దమునకు ఆయుత్తము చేయుము. యుద్దము చేయుట మన విధి" అన్నాడు ద్రోణుడు.
"ఆచార్యా!" దుర్యోధనుడు అధిక్షేపించినాడు. "పాండవుల అజ్ఞాతవాస సంవత్సరమునకు మరికొంత వ్యవధి ఉన్నది. అందును గురించి నిర్ణయించుటకు యోగ్యులు భీష్మాదులు. అర్జునుడే కనిపించిన పరమ సంతోషము. పాండవులు మరల వనవాసమునకు వెళ్ళెదరు. కాని వచ్చువాడు అర్జునుడని, అపశకునములని మన సైన్యమునకు అధైర్యము కలిగించి పాండవ పక్షపాతులగుట సమంజసము కాదు. ఆచార్యులగు వారు గొప్ప బుద్ధిమంతులగుదురు. వారు నీతి శాస్త్రములు వల్లించగలరు. వారిని యుద్దమున ముందుంచక వెనుకఉంచుట మేలు".
అశ్వత్ధామ దుర్యోధనుని మాటలు విని మండిపడినాడు. "మహారాజా! మీ మామ శకుని నీకు జూదమాడుట నేర్పినాడు. యుద్దము నేర్పలేదు. అర్జునుడు కార్చిచ్చువలె ఉరికి వచ్చుచున్నాడు. అర్జునుని ప్రతాపమును ఎరిగిన ద్రోణుడు నిజము వచించినాడు. నీవు నీ కూతలతో ద్రోణుని తిట్టినావు. ఇక ద్రోణుడు సిగ్గులేక యుద్దము చేసిన చేయునుగాక. నేను మాత్రము యుద్దము చేయుటకు సమ్మతింపను" అని ఆయుధము పడేసినాడు.
అశ్వత్ధామ మాటలు విని కర్ణుడు అగ్గి బుగ్గి అయి అన్నాడు. "రథిక శ్రేష్ఠులారా! అర్జునుడు వచ్చుచున్నాడని మీరు భయపడి, సిగ్గులేక దుర్యోధనుని భయపెట్టుచున్నారు. అర్జునుని ఎదిరించుటకు నేను ఒక్కడను చాలును. అతనితో భయంకరముగా యుద్దముచేసి అర్జునుని ఓడింతును. నాకు ఆప్తమిత్రుడయిన దుర్యోధనునకు సంతోషము కలిగింతును. మీరందరు మా ఇద్దరి యుద్దమును చూచుచుండుడు లేదా గోవుల వెంట వెళ్ళుడు".
"కర్ణా! నీకు యుద్దమునకు కాలుదువ్వుత తప్ప కార్యాలోచనము తెలియదు. పెద్దలు యుద్దమును హీనసాధనమని చెప్పుదురు.అనుకూలమయిన దేశ కాల బలములు కలిగి ఉన్నపుడే యుద్దమున జయము కలుగును. మన బలమును, ఎదుటివాని బలమును నిశ్చయము చేయక యుద్దమునకు దిగిన విజయము కలుగుత అనుమానాస్పదము. వచ్చువాడు అర్జునుడు ఒక్కడే అనుకొనుట తప్పు. అతడు అసమాన బల పరాక్రమములు కలవాడు".
"అర్జునుడు ఒక్కడే దేవేంద్రుని దేవగణములతో పోరి ఖాండవమును దహించినాడు. అర్జునుడు ఒక్కడే యాదవ బలమును ఓడించి సుభద్రను తెచ్చుకున్నాడు. అర్జునుడు ఒక్కడే దిగ్విజయము చేసి కురువంశమునకు కీర్తి తెచ్చినాడు. అర్జునుడు ఒక్కడే గంధర్వ రాజును ఓడించి దుర్యోధనుని విడిపించినాడు. అర్జునుడు ఒక్కడే నివాత కవచులను మూడు కోట్ల రాక్షసులను మసి చేసినాడు. అర్జునుడు ఒక్కడే కాలకేయులను మట్టి కరిపినాడు. అర్జునుడు ఒక్కడే ద్రౌపదీ స్వయంవరమున రాజులందరను ఓడించినాడు".





