Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    అర్జునుడు ఉత్తరుని చూచి నవ్వినాడు "రాకుమారా! కన్యలందరి ముందు కౌరవుల గెలుతునని పలికినావు. ఇప్పుడు పారిపోయిన వారు నవ్వరా?" అని అడిగినాడు.
    "కన్యలు నవ్వుదురుగాక! గోవులను కౌరవులు తీసుకొనిపోవుదురు గాక! నేను యుద్దము చేయను. రథము మరలింపుము. రాజధానికి పోవుదము" అని ఉత్తరుడు అర్జునుని బ్రతిమిలాడినాడు.
    "కుమారా! ఇది భయపడి పారిపోవుటకు సమయము కాదు. గోవులను కౌరవులకు వదిలి పారిపోయిన పురజనులు దూషింతురు. మనకు అపజయము కలుగును. అపజయమునకన్న చావుమేలు".
    నీకు నన్ను గురించి సైరంధ్రి చెప్పినదికదా! ఇక నీవు భయపడకుము. నీ చిత్తవృత్తుని నిర్భయముగా ఉంచుకొనుము. ఇప్పుడే కౌరవ సేనకు భయము కలిగించి వారు మన గోవులను వదిలి పారిపోవునట్లు మన పరాక్రమమును ప్రదర్శింతము" అని అర్జునుడు రథమును ముందునకు నడిపినాడు.
    అది చూచినాడు ఉత్తరుడు. ధనుర్భాణములు వదిలినాడు. రథము నుండి దూకినాడు. రాజధానివైపు పరుగు సాగించినాడు. అర్జునుడు పారిపోవుచున్న ఉత్తరుని చూచినాడు. గుర్రముల పగ్గములను నొగలకు కట్టినాడు. రథము నుండి దూకినాడు. ఉత్తరుని పట్టుటకు ఉరికినాడు. నూరు అడుగుల దూరము ఉరికి ఉత్తరుని పట్టినాడు. అప్పుడు ఉత్తరుని ముఖము వెలవెల బారుచున్నది. పెదవులు ఎండినవి. మనసు తల్లడిల్లినది. శరీరమందంతటను చెమటకారినది. కాలు సేతులు వడకినవి. గుండె దడదడలాడినది. అతడు గద్గద ధ్వనితో ఏడ్చుచు తనను విడువమని అర్జునుని ప్రార్దించినాడు:-
    "బృహన్నలా! నన్ను విడువుము. నన్ను విడిచిన నీకు నూరు నిష్కములు ఇత్తును. ఎనిమిది వైఢూర్యములు ఇత్తును. రథములను ఇత్తును. పది ఏనుగులను ఇత్తును. ఒక గ్రామమునే నీ కిత్తును. మా అమ్మ నాకొరకు ఎదురు చూచుచుండును. ఆమెకు సంతోషము కలిగింపుము. దయచేసి నన్ను విడువుము. నీకు దండము పెట్టుచున్నాను".
    ఉత్తరుని పిరికి పలుపులు విన్నాడు అర్జునుడు నవ్వినాడు. ఉత్తరుని అమాంతముగా ఎత్తుకొని వచ్చి రథముపై కూల వేసినాడు. "కుమారా! నీవు యుద్దము చేయజాలకున్న నాకు సారథిని అగుము. నేను శత్రువులను ఎదిరింతును. భీష్మ, ద్రోణ, కర్ణాది కౌరవ శూరులందరిని గెలుతును. దుర్యోధనుని సకల సైన్య సమేతముగా పారిపోవునట్లు చేసి, మన గోవులను మరలింతును" అని ఉత్తరుని బలాత్కారముగా నొగల నడును కూర్చుండబెట్టి, అర్జునుడు రథికుడయి రథమును శ్మశానమునందలి జమ్మిచెట్టువద్దకు చేర్చినాడు.
    అర్జునుడు రథమును నిలిపినాడు. "కుమారా! జమ్మిచెట్టు మీద ఆ పీనుగువలె కనిపించు దానిలో పాండవులు ఆయుధములు దాచినారు. నీవు ఆ చెట్టు ఎక్కుము. ఆ కట్టను విప్పుము. అందు గాండీవము అను మహా ధనుస్సు ఉండును. అదియును బాణములును నాకు అందిమ్ము. మిగత వానిని మరల కట్టకట్టి అచటనే పెట్టుము" అని ఆదేశించినాడు.
    ఉత్తరుడు బెరుకు చూపదలచినాడు. వీడెవడు? నన్ను చెట్లెక్కమనుచున్నాడు. పీనుగును ముట్టమనుచున్నాడు. అనుకున్నాడు. అర్జునుని చూచినాడు. అతని తేజస్సునాకు భయపడినాడు. కిమ్మనకుండ చెట్టు ఎక్కినాడు. భయపడుచు, భయపడుచు కట్టను విప్పినాడు. అందులోని ఆయుధములు జిగేలు మన్నవి. అతని కనులు చీకట్లు కమ్మినవి. అతడు కనులు నలుచుకొని చూచినాడు. అని పాములవలె కనిపించినవి. పడగలెత్తి ఆడుచున్నట్లు అనిపించినది. కేక పెట్టుటకు నోరురాలేదు. కిందికి దూకుటకు శక్తిచాలలేదు. కొయ్యవలె కూర్చున్నాడు. అర్జునుడు అది గ్రహించినాడు. ఉత్తరునకు ధైర్యము చెప్పినాడు. గాండీవమును తీయవలసినదని ఆదేశించినాడు.
    "బృహన్నలా!" ఉత్తరుడు బెదరుచు అడిగినాడు "ఇవన్నియు పాండవులు ధరించు ఆయుధములు అన్నావు. అన్నియు తేజోవంతములు అయి ఉన్నవి. అందులో గాండీవమును గుర్తించుట ఎట్లు?".
    "కొండచిలువ వలె పెద్దగా ఉండి, చూచువారలకు భయము కలిగించునది గాండీవము" అని ఉత్తరుడు అందించిన గాండీవమును, అమ్ముల పొదులను అందుకున్నాడు అర్జునుడు. ఉత్తరుడు మిగిలిన ఆయుధములను మరల కట్టకట్టి పెట్టినాడు. చెట్టు దిగినాడు.
    చెట్టుదిగిన ఉత్తరుడు అర్జునుని వింతగా విచిత్రముగా చూచినాడు. "బృహన్నలా! నీవు గాండీవము అందుకున్నావు. యుద్దమున కౌరవ వీరులను పారద్రోలుదును అనుచున్నావు. నీవెవరు? నీ శక్తి ఎంత? పాండవులు. ఇక్కడ ఆయుధములను దాచి ఎక్కడికి వెళ్ళినారు?".
    "ఉత్తర కుమారా! నేనే అర్జునుడను. మరొకడు ఈ గాండీవమును ధరించలేరు. మేము అజ్ఞాతవాసమును గడుపుటకు గాను మీ రాజభవనమున మారు వేషములతో ఉన్నాము. ధర్మరాజు కంకుడు, భీముడు వలలుడు, నకులుడు దామగ్రంథి, సహదేవుడు తంత్రీపాలుడు, ద్రౌపది మాలిని. కుమారా! నేను అర్జునుడను. నీవు నిర్భయముగా నాకు సారథ్యము వహింపుము. నేను శత్రు మూకలను చీల్చిచెండాడెదను" అన్నాడు అర్జునుడు.
    ఉత్తరుడు అర్జునుని మాటలు విని దిగ్భ్రాంతి చెందినాడు. "మహాత్మా! అర్జునా! నీవు అపరిమిత భుజబల, శౌర్యపరాక్రమవంతుడవు. మనోహర స్వరూపుడవు. నీవు నాకు దర్శనము ఇచ్చినావు. నేను కృతార్ధుడను అయినాను. నా జన్మ సఫలము అయినది. ఇంతకుముందు నిన్ను ఎరుగక ఏవేవో మాటలు అన్నాను. నన్ను మన్నింపుము. నన్ను రక్షింపుము".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.