Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఉత్తరునకు కావలసిన సారథిని గురించి చెప్పినది. అందుకు అర్జునుడు "ద్రౌపదీ! మనకు నిన్నటితో అజ్ఞాతవాసము ముగిసినది. నేను ఉత్తరునకు సారథిగా వెళ్ళుదును. అందుకు ఉత్తరుని అంగీకరింపచేయుము" అన్నాడు.
ద్రౌపది ఉత్తరుని వద్దకు వచ్చి "రాజ కుమారా! నీవు బృహన్నలను సారథిగా చేసికొని యుద్దమునకు బయలుదేరుము. అతడు పూర్వము అర్జునునకు సారథ్యముచేసి ఖాండవ దహనాదులందు అర్జునునకు విజయము సాధించి పెట్టినాడు. కావున నీకు విజయము కలుగును. బృహన్నలను రథ సారథిగా తీసుకొని బయలుదేరుము" అన్నది.
"సైరంధ్రీ!" ఉత్తరుడు ఛీత్కరించి అన్నాడు "ఛీ! ఏమి మాట్లాడినావు? ఉత్తర కుమారుని వంటి వీర కిశోరము నపుంసకుని సారథిగా అంగీకరించుటయా! ఛా! ఇది కాని పని. నపుంసకుడే సారథియా! నగరమున మరొకడు లేడా! సమయము మించిపోవుచున్నదే! కౌరవులు పారిపోవుదురేమో" అని లేచి నిలిచినాడు. అటు ఇటు తిరిగినాడు.
బృహన్నల నపుంసకుడు కాడనియు, ఒకానొక కారణమున తాత్కాలికముగా అతనికి నపుంసకత్వము ప్రాప్తించినదనియు చెప్పి ద్రౌపది ఉత్తరుని ఒప్పించినది.
ఉత్తరుని అంగీకారము పొంది ఉత్తర తన ఆచార్యుడయిన బృహన్నల వద్దకు వెళ్ళినది. తమకు వచ్చిన ఆపదను, ఉత్తరునకు సారథిలేమిని వివరించినది. ఉత్తరునకు సారథిగా ఉండుటకు అంగీకరించవలెనని ఆచార్యుని ప్రార్దించినది.
"కుమారీ! ఉత్తరా!" అర్జునుడు ఉత్తరను దగ్గరికి తీసుకొని అన్నాడు. "సారథ్యము చేయుటకు నేను సమర్దుడను అనుకొనను. అయినను నీవు చెప్పినట్లు చేసెదను. ఉత్తరునకు సారథినయి అసాధ్యములయిన కష్టములను పోగొట్టెదను. నీకు సంతోషము కలిగింతును" అని అర్జునుడు నాట్యశాలనుండి బయలుదేరి ఉత్తరుని వద్దకు వచ్చినాడు.
ఉత్తరుడు బృహన్నలను చూచినాడు "బృహన్నలా! నేడు నేను కౌరవవీరులతో యుద్దమునకు వెళ్ళవలసి వచ్చినది. గత్యంతరము లేదు. నీవే నాకు సారథివి కావలసి ఉన్నది. రమ్ము, రథము సిద్దము చేయుము" అన్నాడు.
"ఉత్తర కుమారా!" బృహన్నల చమత్కారముగా అన్నాడు. "అయ్యో! నన్ను ఆటపాటలకు పిలువవలెగాని సారథ్యమునాకు అందునను యుద్దమునకు పిలుతురా? ఇదెక్కడి అన్యాయము! నీవంటి వీర కుమారునాకు నేను సారథ్యము చేయగలనా?".
"బృహన్నలా! నీవు అటుల అనరాదు. పూర్వము నీవు అర్జునునకు సారథ్యము వహించి ఖాండవ దహనమున సాయపడినావని సైరంధ్రి వివరించినది. అందువలన నీ సారథ్యమునకు మేము అంగీకరించినాము. నీవు సారథ్యము మాత్రము వహింపుము. చూచు చుండుము. కౌరవులను మేము చీల్చి చెండాడుదుము" అని ప్రగల్భములు పలికినాడు ఉత్తర కుమారుడు.
"అయ్యో! రాజకుమారుడు ఆజ్ఞాపించినపుడు తప్పునా! తప్పక సారథ్యము వహింతును" అని అర్జునుడు రాజకుమారుడు తెప్పించి ఇచ్చిన కవచమును ధరించుట తెలియనట్లు నటించి, దానిని ఒక రకముగా కప్పుకున్నాడు.
అది చూచి అక్కడి స్త్రీలందరు నవ్వినారు.
అర్జునుడు గుర్రములను రథములను పూన్చినాడు. సిద్దము చేసినాడు. తాను ఎక్కినాడు. ఉత్తరుని ఎక్కమన్నాడు. కవచము, ధనుర్భాణములు ధరించిన ఉత్తరుడు రథము ఎక్కినాడు.
ఉత్తరుని సాగనంపుటకు ఉత్తర సహితముగా కన్యలందరు వచ్చినారు.
ఉత్తర బృహన్నలను చూచి అన్నది:-
"ఆచార్యా! మీరు భీష్మ ద్రోణ కర్ణాదులను గెలిచి, వారి తల గుడ్డలలో మేలురకమైన వాటిని చూచి మా బొమ్మల పొత్తికలకు తేవలయును".
"ఉత్తర కుమారీ! నీవు పొత్తికలు తెమ్మని బాల్యచాపల్యమున అడిగినావో, మీ సోదరుని పరీక్షించుటకు అడిగినావో తెలియదు. కాని నీకు ఆ కౌరవ వీరుల తలగుడ్డలు తెచ్చి ఇత్తును ఇది నిశ్చయము" అని అర్జునుడు వాగ్ధానము చేసినాడు. రథము తోలినాడు. రథము కనిపించినంతసేపు చూచి కన్యలందరు అంతఃపురమునకు వెళ్ళినారు.
గోపాలురు చెప్పిన రీతిని శ్మశానమునకు ఆవల కౌరవులు ఆవులు పట్టిన చోటునకు రథమును చేర్చినాడు అర్జునుడు. దూరముగా కౌరవసేన కనిపించినది. అది కొంత భాగము నల్లగా ఉండి మేఘచ్చాయ గలిగి ఉన్నది. కొంత భాగము సంధ్యారాగమువలె ఎర్రగా ఉన్నది. కొంత భాగము రాజహంసలవలె తెల్లగా ఉన్నది. మరికొంత భాగము పుప్పొడి రాలినట్లు పసుపు రంగు కలిగి ఉన్నది. కౌరవ సైన్యము విరాటుని గోగణములను ముందు ఉంచుకొని సాగిపోవుచున్నది. కౌరవ సైన్యపు కదలికకు భూమి కదిలినట్లయినది.
ఉత్తర కుమారుడు కౌరవసేనా వాహినిని చూచినాడు. గజగజ వడకినాడు. నోరు ఆరుకొని పోయినది. సారథిని రథము నిలుపమన్నాడు. "బృహన్నలా! నా సారథీ! కౌరవ సైన్యమునకు ప్రభువగు దుర్యోధనుడు మధ్యందిన మార్తాండునివలె ప్రకాశించుచున్నాడు. భీష్మ, ద్రోణ, కృప, కర్ణాదులు తేజోవంతులయి ప్రకాశించుచున్నారు. కౌరవుల చతురంగ సైన్యమును చూడగా గ్రీష్మకాలమందలి దావానలమువలె కనిపించుచున్నది".
"నేను బాలుడను. ధనుర్విద్య చక్కగా అభ్యసించినవాడను కాను. వారి ఎదుట నిలుచుటకు కూడ నాకు ధైర్యము చాలకున్నది. నాకు గుబులు పుట్టుచున్నది. బ్రతికియుండిన బలుసాకు తిన వచ్చును. రథము మరలింపుము. రాజధానికి పోవుదము" అని ధనుర్భాణములు వదిలి రథము మీద కూలబడినాడు.





