Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    3. అరణ్య పర్వమున "ఘోషయాత్ర" నుంచి అజ్ఞాతవాసము చివరి ఘట్టము వరకు హస్తిన రాజకీయములందు ఏవో గొప్పమార్పులు వచ్చినట్లు కనిపించుచున్నవి.
    అప్పుడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుని అనుమతి సంపాదించిగాని యాత్రకు బయలుదేరలేదు. ఇప్పుడు ధృతరాష్ట్రుని ప్రసక్తియే లేదు. సభచేసినవాడు దుర్యోధనుడు. నిర్ణయములు తీసుకున్నవాడు దుర్యోధనుడు.
    ఈ మధ్యకాలమున ధృతరాష్ట్రుని నిర్వీర్యుని చేయుట జరిగినట్లున్నది. దుర్యోధనుడు మరింత బలమును ఆర్జించినట్లున్నాడు.
    4.సింహబలుడు చచ్చినాడు. అది తెలిసి సుశర్మ ఎగిరిగంతు వేసినాడు. పూర్వపు పగ తీర్చుకొనుటకు పూనుకున్నాడు. రిక్తమయిన స్థలమునకు వాయువు అన్ని వైపులా నుండి ఉరికి తుఫాను కలిగించును. ఇది ప్రకృతి ధర్మము. సింహబలుని చావు వలన విరాటుని రాజ్యమున రిక్తత ఏర్పడినది. దానిని ఆక్రమించుటకు పలువురు ప్రయత్నించినారు.
    ఈ పరిస్థితి నేటికిని అట్లే ఉన్నది. బలహీనమయిన రాజ్యము ఉన్నచో అగ్రరాజ్యములు పెత్తనము చేయుటకు ప్రయత్నించుచున్నవి.
    5. సుశర్మకు విరాటుని గెలుచుట పరమావధి. ఆ విషయము దుర్యోధనునకు తెలియును. అందుకే విరాటుని బలములను మళ్లించుటకు మాత్రమే అతనిని వాడుకున్నాడు.
    6. విరాటుడు కౌరవులకు శత్రువు అని ధర్మరాజు చెప్పలేదు. ఇప్పుడు విరాటుడు శత్రువని చారులన్నారు. దుర్యోధనుడు అన్నాడు. ఈ శత్రుత్వము ఎక్కడిది? ఎందువలన వచ్చినది?
    ఒకటి కావచ్చును. సుశర్మ కౌరవులను ఆశ్రయించినాడు. సుశర్మకు విరాటుడు శత్రువు. కావున కౌరవులకు విరాటుడు శత్రువు.
    ఇది పాండవులకు తెలియని పరిణామము వలె ఉన్నది.
    శత్రువునాకు శత్రువు మనకు మిత్రుడు అను వాస్తవము ఇందు కనిపించుచున్నది.
    7. సుశర్మ చేసినది యుద్దము కాదు దోపిడీ మాత్రము. అతడు యుద్దము ప్రకటించలేదు. దొంగచాటుగా ఆవులను మళ్ళించినాడు. ఇది రాజ్యమును ఆక్రమించుటకాదు ధనమును అపహరించుట. యుద్దములు దోపిడికి మారుపేరు కావచ్చును. కాని యుద్దమున కొన్ని నియమములను పాటించుట జరుగును. ఇచట అది జరుగలేదు.
    8. దాడి జరిపినది కృష్ణపక్షపు అష్టమినాడు. చీకటి త్వరగా పడురోజది. యుద్దము చీకటిపడు వరకు ముగియలేదు. అష్టమినాడు వెన్నెల వచ్చుటకు పదహారు గడియల రాత్రి అగును. అనగా సుమారు అయిదు గంటలగును. అయిదు గంటలు చీకటిలో ఉభయ సైన్యములు ఏమి చేసినవి? ఇది విరాటునకే ఉపకరించినట్లున్నది. ధర్మరాజాదులు మంచి వ్యూహము రచించినారు. వెన్నెల వచ్చిన తరువాత యుద్దమున పాండవులధి పైచేయి అయినది. సుశర్మ పట్టుబడినాడు.
    9. ధర్మరాజు, పట్టుబడిన సుశర్మను విడిపించుటలో ఔచిత్యము కనిపించదు. అతడు దుర్యోధనుని, సైంధవుని కూడ విడిచి పుచ్సినాడు.
    విరాటుడు ఇంకా నగరమునకు చేరలేదు. మరునాడు సూర్యోదయము అయినది. దుర్యోధనుని మహా సైన్యము ఉపప్లావ్యమునకు ఉత్తరమున ఉన్న గోగణములను ఆక్రమించినది. విరాటుని గోపాలురు కురు సైన్యమును ఎదిరించినారు. గవాధ్యక్షుడు వచ్చిన వారు కౌరవులు అని తెలుసుకున్నాడు. ఆ సైన్యమున భీష్మ, ద్రోణ కర్ణాదులను చూచినాడు. బెదిరినాడు. భయపడి నగరమునకు ఉరికి వచ్చినాడు.
    గవాధ్యక్షుడు నగరమునకు చేరినాడు. రిక్తముగా ఉన్నది. రాజ భవనమున విరాటుడు లేడు. సైన్యము లేదు. అతనికి విరాటుని సుపుత్రుడు ఉత్తరుడు మాత్రము కనిపించినాడు. అతనికి విన్నవించినాడు:-
    "రాజపుత్రా! కౌరవ సైన్యములు మన గోవులను ఆక్రమించినవి. నీవు శౌర్యవంతుడవు, రాక్రమవంతుడవు, మహాతపస్సు వలన పుట్టినావని నీ తండ్రి నిన్ను సదా పొగడుచుండును. నీ పరాక్రమము చూపు సమయము వచ్చినది. త్వరగా కవచ, ధనుర్భాణములు ధరించి, రథము ఎక్కి బయలుదేరుము. శత్రు సైన్యములను చీల్చి చెండాడుము. మన గోవులను విడిపింపుము".
    ఉత్తరుడు స్త్రీజనము మధ్య ఉన్నాడు. అతడు గవాధ్యక్షుని మాటలు విన్నాడు "ఏమీ కౌరవులు మన గోవులను ఆక్రమించినారా! వారికి ఉత్తర కుమారుని ప్రతాపమును గురించి తెలియనట్లున్నది. ఇదిగో! ఇప్పుడే బయలుదేరుచున్నాను. కౌరవ సేనలను చీల్చి చెండాడగలను. ఏదీ రథము? రథము సిద్దము చేయుడు. అవును నాకు సారథి కాగలవాడు కనిపించడే? సారథి లేక నా రథమెట్లు నడచును? నేను యుద్దమెట్లు చేతును? అయ్యో! నాకు ఒక సారథిని సమకూర్చిన కౌరవుల అంతము చూడగలను" అని బీరములు పలికినాడు.
    ఉత్తరుడు ప్రజ్ఞా వాక్యములు పలికినపుడు ద్రౌపది అక్కడనే ఉన్నది. ఆమె అర్జునుని వద్దకు ఉరికినది. వచ్చిన ఆపదను గురించి వివరించినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.