Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
అప్పుడు భీముడు సుశర్మను కట్టిన రథము వద్ద నకుల సహదేవులను కాపుంచి సుశర్మ సైనికులను చాల దూరము వరకు తరిమి కొట్టినాడు. భీముడు విరాటుని గోసమూహములను తరలించుకొని వచ్చి ధర్మరాజును దర్శించినాడు. విరాటుడు ధర్మరాజాదులను చూచి సంభ్రమ ఆశ్చర్యములతో అన్నాడు:-
"మహాత్మా! కంకుభట్టా! నీవు నా ప్రాణములను, మానమును రక్షించినావు. నాదేహమును రాజ్యమును కాపాడినావు. వంటల వాడయిన వలలుడు ప్రళయకాల రుద్రునివలె పోరాడి నన్ను విముక్తుని చేసినాడు. దామగ్రంథి తాటిపండ్లు రాల్చినట్లు శత్రువుల తలలు రాల్చినాడు. తంత్రీపాలుడు ఎక్కడ చూచినను తానయి యుద్దమున శత్రుసైన్యములను చెండాడినాడు. మీరు నలుగురు తప్ప నా సైన్యమున గాయపడని భటుడు లేడు. మీరు నాదేహమును రాజ్యమును రక్షించినారు. కావున కంకుభట్టా! ఈ దేహమును, రాజ్యమును నీకు సమర్పింతును. నీవు అందుకు సమ్మతింపుము, మత్స్య దేశమును రక్షించుకొనుము. నాచేత పనులు చేయించుకొని నన్ను రక్షింపుము".
"మహారాజా!" ధర్మరాజు వినమ్రుడయి అన్నాడు "నీవు ఆపదలలో మమ్ములను కాపాడినావు. నీకు జయము కలుగుటయే మాకు కావలసినది. మాకు రాజ్యసంపదలు అక్కరలేదు. ఇంత ప్రీతి పూర్వకముగా మమ్ములను గౌరవించినావు. అదియే మాకు సకల ధనములతో సమానము. అయినను నా ఇష్టము అడిగినావు కాబట్టి చెప్పుచున్నాను. మనుషులను పంపి నగరమున నీ విజయమును గురించి చాటింపు వేయించుము. శోభన ధ్వజము ఎత్తించుము. మనము నగరమునకు చేరిన తరువాత మమ్ములను నీ ఇష్టము వచ్చినట్లు సన్మానించుము".
"మరొక మాట-సైన్య సమేతముగా ఈ సుశర్మను విడిపింపుము".
విరాటుడు ధర్మరాజు మాటలు విన్నాడు. నగరమునకు భటులను పంపినాడు. పెడరెక్కలు విరిచి కట్టబడి, తలవంచుకుని, మూర్తీభవించిన దైన్యమువలె ఉన్న సుశర్మను, పరివార సహితముగా విడిపించినాడు.
సుశర్మ పడగ చితికిన పామువలె అచటి నుండి వెళ్ళిపోయినాడు.
విరాటుడు, ధర్మరాజాదులు యుద్దభూమిని కలయచూచినాడు. తునాతునకలయి పడి ఉన్న దేహములు కల ఆ రణరంగము యమధర్మరాజు వంట ఇమ్టిగా కనిపించినది. వారు అక్కడి నుంచి బయలుదేరినారు. వెన్నెల విరిసిన ఇసుక తిన్నెలపై పడుకొని ఆరాత్రి గడిపినారు.
ఆలోచనామృతము
1. దుర్యోధనుని చారులు అంతగా సమర్ధులు అయినట్లు కనిపించరు. వారు పాండవుల కొఱకు ఒక సంవత్సరమంతయు, అన్ని దేశములందు వెదకినారు. తెలుసుకొనుటకు అవకాశములు ఉన్నను పాండవుల ఉనికిని కనిపెట్టలేకపోయినారు. ఇంకొకటి కూడ కావచ్చును. చారులకు పాండవుల మీద సానుభూతి ఉండి ఉండవచ్చును. వారు సంవత్సరాంతమున వచ్చి పాండవులు కనిపించలేదని చెప్పినారు. అంతేకాదు తమ ప్రభువును సంతోషపెట్టుటకు పాండవులు చచ్చి ఉందురని విన్నవించినారు.
చారులు ప్రభువు మన్ననలకు మాత్రము ప్రాకులాడిన ప్రభువులకు ముఖస్తుతులు చేసిన ప్రమాదము సంభవించునను విషయము భారతదేశపు చరిత్రలో ఈ మధ్యనే ఋజువయినది. ఇటువంటిదే ఏదో అప్పుడు జరిగినట్లున్నది. నిరంకుశ ప్రభువులకు తమ ఉద్యోగులు కూడా ఒక్కొక్కపుడు తోడ్పడరు. ఇది చరిత్ర ఎరిగించిన సత్యము.
2. దుర్యోధనుడు సభ తీర్చినాడు. సభముందే చారులు సింహబలుని వృత్తాంతము వివరించినారు. కాని కర్ణుడు, దుశ్శాసనుడు, ద్రోణుడు, భీష్ముడు వీరిలో ఎవరును అందుగురించి ఆలోచించలేదు. వారు చెప్పినవి వెంటనే పాండవులను కనుగొనుటకు అంతగా ఉపకరించునట్లు లేవు.
దుర్యోధనుడు మాత్రమే కీచక వధను గురించి సరిగా అంచనా వేయగలిగినాడు. అతని అంచనా సరియైనది. అతను రచించిన వ్యూహము అమోఘమయినది. రెండువైపుల నుండి దాడికి ఎత్తువేసినాడు. పాండవులను పట్టుటకు సరియైన ఉపాయము ఆలోచించినాడు.
దుర్యోధనునకే అట్టి ఆలోచన వచ్చినది. మిగిలిన సభాసదులకు ఎవరికిని రాలేదు. భీష్మద్రోణాదులకన్న దుర్యోధనుడు తెలివయినవాడనుకుందమా? కాదు.
పాండవులను పట్టుటలో దుర్యోధనునకు ఉన్నంత ఆసక్తి మరొకరికి లేదు. ఆసక్తి ఉన్నవానికే ఆలోచనలు సరియైనవి వచ్చును. ఇది మానవ మనస్తత్వము. మన ముందు జరుగుచున్న దానిని గురించి కూడ మనకు ఆసక్తిలేనిది అంతగా పట్టించుకొనము. అవసరము ఉన్నచో అవి ఏమూల ఉన్నను దానిని గురించి అన్వేషింతుము. మరొక విషయము. ఆసక్తి ఉన్నవానికి అదే మననము జరుగుచుండును. ఏ కొద్ది జాడ కనిపించినను మనసు అటువైపు ఉరుకును.
అందువలన దుర్యోధనునకు మాత్రమే సరియైన ఆలోచన వచ్చి ఉండవచ్చును.





