Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    విరాటరాజు గర్జనవిన్నారు మంత్రులు. యుద్ద సన్నాహములు ప్రారంభము అయినవి. విరాటుని తమ్ములు శతానీకుడు, మదిరాశ్వుడు, సూర్యదత్తుడు, విరాటుని పెద్దకొడుకు శంఖుడు యుద్దమునకు బయలుదేరినారు.
    యుద్ద సన్నాహములను చూచిన ధర్మరాజు "మహారాజా! పూర్వము ఒక ముని వలన నేను మంత్ర పూర్వకముగా బాణములను పొందినాను. యుద్దము చేయుట అభ్యసించినాను. అంతేకాదు మీకొలువున ఉన్న వలలుడు, దామగ్రంథి, తంత్రీపాలుడు యుద్ద విద్యలో సమర్ధులు. వారికి నాకు నాలుగు రథములను ధనుర్భాణాది సాధనములను ఇప్పించిన మేమును యుద్దమున మీకు సాయము చేతుము" అన్నాడు.
    విరాటుడును ధర్మరాజు మాటలకు అంగీకారము తెలిపినాడు. పంచపాండవులలో నలుగురు కవచాదులు ధరించి, ధనుర్భాణములతో రథములను ఎక్కి తామే సారథ్యము చేసుకొనుచు సాగినారు.
    విరాటుని సైన్యము వేగముగా సాగినది. ఏనుగులు చెవులు విసరుట వలన పెనుగాలులు వీచినట్లుండెను. రథములు ధ్వనులు పర్వతములలో ప్రతి ధ్వనించినవి. గుఱ్ఱపు డెక్కలవలన లేచిన దుమ్ము మబ్బులవలె లేచినది. భూమి ఈవేగమునాకు తట్టుకొనలేక ఊయలవలె ఊగినట్లు కనిపించినది.
    విరాటుడు సమధిక ఉత్సాహముతో సింహనాదముచేసి, సుశర్మ సైన్యములను తాకినాడు. సుశర్మయు యుద్దమునకు సిద్దముగా ఉన్నాడు. ఉభయ సైన్యములు కలియబడి యుద్దము సాగించినవి.
     కాల్బలములు తాకినవి. బాణపరంపర సాగినది. సైనికులు తలలు తెగికూలినారు. అయినను లెక్కచేయక పోరుసాగించినారు. అశ్వికులు ఒకరినొకరు తాకినారు. ఒక్కొక్కరు అనేకమందితో పోరినారు. గుర్రములు తెగినవి. కూలినవి. అయినను లెక్కచేయక పోరుసాగించినారు. ఏనుగుల దళములు తాకినవి. వాటి ఘీంకారములతో దిక్కులు పిక్కటిల్లినవి. ఏనుగులు అనేకులను తొక్కి చంపినవి. హాహాకారములు చెలరేగినవి. అయినను లెక్కచేయక పోరు సాగించినారు. రథికులు ఒకరికి ఒకరు తలపడినారు. ఒకరి రథము నుంచి మరొకరి రథము మీదికి దూకినారు. గుర్రములు చచ్చినవి. రథములు కూలినవి. అయినణు లెక్క చేయక పోరు సాగించినారు.
    విరాటుని తమ్ములగు శతానీకుడు, మదిరాశ్వుడు సూర్యదత్తుడు, విరాతుని పెద్దకొడుకు శంఖుడు మహావీరులవలె పోరినారు. సుశర్మ సైన్యములో వందలమందిని కూల్చినారు. రథములను విరిచినారు. కవచములను చీల్చినారు. గుర్రములను చంపినారు. ఏనుగులణు ఏడిపించినారు. ప్రళయకాల రుద్రులవలె సమరము సాగించినారు.
    విరాటుడు సుశర్మను ఎదిరించినాడు. ఉభయులు రౌద్రము రూపవంతమయి వచ్చినటుల యుద్దము సాగించినారు. విరాటుడు సుశర్మ రొమ్మున, ముఖమున పది బాణములు నాటినాడు. మరి పది బాణములచే గుర్రములను కొట్టినాడు. సుశర్మ విరాటుని మీద ఏబది బాణములు ప్రయోగించినాడు. అయినను ఉభయులు చలించలేదు. ఉభయులు ఎదురుపడి శరములతో పోరు సలిపినారు.
    రణరంగమున భీషణ సమరము సాగినది. అక్కడ లేచిన దుమ్ముఆకాశమునంటినది. ఇంతలో సూర్యుడు పశ్చిమాద్రికి చేరి చిగురించిన వృక్షమువలె ఎర్రబడినాడు. సూర్యుడు అస్తమించినాడు. చీకట్లు కమ్ముకున్నవి. అప్పుడు ఉభయ పక్షముల సైనికులను యుద్దము చేయజాలక సమయము చాలించి నిలిచిఉండిరి.
    ఇంతలో చంద్రుడు ఉదయించినాడు. వెన్నెల విరిసినది. వెన్నెల వెలుగులో ఉభయులు యుద్దము సాగించినారు. అప్పటికి విరాటుడు సుశర్మతో తలపడుచున్నాడు. సుశర్మకు అతని తమ్ముడు సాయముగా వచ్చినాడు. త్రిగర్త రథికులు అనేకులు వచ్చి విరాటుని రథమును చుట్టుముట్టినారు. సుశర్మ సోదరులు తమ రెండు  రథములను విరాటుని రథము మీదకు తోలినారు. విరాటుని సారథిని కూల్చి, గుఱ్ఱములను చంపినారు. ఆవిధముగా విరాటుడు రథము లేనివాడు అయినాడు. సుశర్మ విరథుడయిన విరాటుని పట్టుకొని, తన రథము మీదకు తెచ్చి, సింహనాదము చేసినాడు.
    సుశర్మ సింహనాదము విన్న విరాటుని సేనలు భయపడి పారిపోయినవి. సుశర్మ విజయమును తెలుపు వాద్యములు మ్రోగినవి. సుశర్మ విజయగర్వమున విరాటుని తీసుకొని మరలిపోవుటకు ఆయత్తుడు అయినాడు.
    అది చూచిన ధర్మరాజు భీమాదులను పురికొల్పి యుద్దమునకు ఉరికినాడు. ధర్మరాజు, భీమ, నకుల సహదేవులు ఒక్క పెట్టున సుశర్మను ఎదిరించినారు. ఆయుద్దమున ధర్మరాజు వేయిమంది రథికులను, భీముడు రెండువేలమందిని, నకులుడు ఏడువందలమందిని, సహదేవుడు మూడువందలమందిని కూల్చినారు.
    ధర్మరాజు సుశర్మను ఎదిరించి భయంకరముగా పోరినాడు. సుశర్మ నాలుగు బాణములువేసి ధర్మరాజు గుర్రములను నొప్పించినాడు. ధర్మరాజు సుశర్మ గుర్రములను చంపి సారథిని కూల్చినాడు. సుశర్మ విరథుడయి బిక్కపోయినాడు. అది కనిపెట్టి విరాటుడు రథము నుండి దూకినాడు. ఒక గదను అందుకొని విజ్రుంభించినాడు. భీముడు విరాటుని రథము మీదికి దూకినాడు. సుశర్మను పట్టినాడు. పెడ రెక్కలు విరిచి కట్టినాడు. భీముడు దిక్కులు పిక్కటిల్లునట్లు సింహనాదము చేసినాడు. ఆ సింహనాదము విని సుశర్మ తమ్ముని యుక్తము అతని సైనికులు బెదిరి, చెదిరి పారిపోయినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.