Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ద్రోణుని మాటలు విన్న భీష్ముడు వచించినాడు:-
"దుర్యోధనా! ద్రోణుడు ఒక్కడు నీ ఎదుట నిజము చెప్పినాడు. పాండవులు దైవబల సంపన్నులు. వారు మహాత్ములు. అందువలన వారిని తెలుసుకొనుట కష్టమయినది. నాకు పాండవులును, మీరును సమానులు. అయినను నీవు అడిగినావు కావున చెప్పుచున్నాను".
"ధర్మరాజు ఉన్న దేశమున జనులు నిర్మల బుద్ధిగలవారయి ఉందురు. వారు సన్మార్గులను రక్షించి దుర్మార్గులను శిక్షించి, అభ్యుదయము కలిగి ఉందురు. ఆదేశమున ధన ధాన్యములకు, పాడిపంటలకు లోపము ఉండదు. అటువంటి దేశమేదియో కనుగొని పాండవులను వెదికించవలెను".
"భీష్మ పితామహా!" కృపాచార్యుడు అన్నాడు. "నీవు చెప్పిన రీతిన పాండవులను వెదికించుట సమంజసముగా ఉన్నది. కాని పాండవులు అజ్ఞాతవాసము పూర్తిచేసి యుద్దమునకు వచ్చిన వారిని ఎదిరించుటకు దుర్యోధనుడు సైన్యమును సర్వసన్నద్ధము చేయవలసి ఉన్నది".
దుర్యోధనుడు అందరి మాటలు విన్నాడు. తనకు తోచిన ఆలోచనమును సభ వారికి వెల్లడించినాడు.
"కర్ణాది మిత్రులారా!" దుర్యోధనుడు ప్రారంభించినాడు. సభ సాంతము నిశ్శబ్దముగా విన్నది. "సింహబలుడు, భీముడు, శల్యుడు, బలరాముడు సమాన భుజ పరాక్రమము కలవారు. వీరిలో ఒకరిని మరొకరు గెలువగలరేగాని వేరువారు గెలువలేరు. కావున సింహబలుని చంపినవాడు భీమ, బలరామ, శల్యులలో ఒకడు కావలెను. శల్య బలరాములు ఇద్దరును సింహబలుడున్న స్థలమున లేరు. కావున సింహబలుని చంపినవాడు భీముడే కావలెను".
"పాండవులును, ద్రౌపదియు మారువేషములతో విరాటుని పట్టణమున ఉన్నట్లు తోచుచున్నది. సింహబలుడు వలచిన స్త్రీ ద్రౌపది అయి ఉండవచ్చును. గంధర్వుని నెపమున భీముడే, సింహబలుని చంపినాడనుట నిశ్చయము. అంతేకాక ఇప్పుడు భీష్మపితామహుడు వివరించిన లక్షణములు విరాటుని రాజ్యమున ఉన్నట్లు వార్తలు అందుచున్నవి".
"విరాటుడు మనకు విరోధి. కావున విరాటుని రాజ్యము మీదికి దండెత్తవలెను. దండెత్తి అతని గోవుల మందలను ఆక్రమించవలెను. అప్పుడు విరాటునకు సాయపడుటకు పాండవులు వత్తురు. ఆవిధముగా వారికి అజ్ఞాతవాసము భంగము అగును. వారు మరల అడవులకు వెళ్ళవలసి వచ్చును. ఆవిధముగా మనకు సకల రాజ్యలక్ష్మిని అనుభవించు అవకాశము లభించును".
"పాండవులు విరాటుని రాజ్యమున లేరనుకుందము. అయినను మనకు నష్టముకాదు. విరాటుని సకలసంపదలను కొల్లగొట్టి తేవచ్చును. ఈవిధముగా చేయుటకు మీకు సమ్మతమయిన అందుకు తగుప్రయత్నములు చేయుడు".
సభాసదులందరు దుర్యోధనుని మాటలు విన్నారు. వారిలోని సుశర్మ కర్ణ, దుశ్శాసనులను సంప్రదించినాడు. తదుపరి దుర్యోధనునకు విన్నవించినాడు:-
"మహారాజా! మా త్రిగర్త రాజ్యమునకు పొరుగున ఉన్నది మత్స్యరాజ్యము. పూర్వము సింహబలుడు సాళ్వ, కేకయ సైన్యములను సాయముగా తీసుకొని నన్ను పెక్కుమారులు ఓడించినాడు. నాకు అవకాశము ఇచ్చిన ఇప్పుడు నేను వెళ్ళి విరాటుని మీదికి దండెత్తుదును. వాని సకల ఐశ్వర్యములు అపహరించి వాని పొగరు అణతుణు. విరాటుని గోవులను అనాయాసముగా పట్టితెత్తును. అడ్డుపడిన ఎడల పాండవులను వెల్లడి చేయుదుణు".
కర్ణుడు సుశర్మ వ్యూహమును బలపరచినాడు.
"దుశ్శాసనా!" దుర్యోధనుడు అన్నాడు. "సుశర్మ చెప్పిన కర్ణుడు బలపరచిన వ్యూహము బాగున్నది. నాకు మరొక ఉపాయము తోచినది. చెప్పెదను వినుము. నీవు మన సైన్యములను రెండుగా విభజించుము. ఈ కృష్ణపక్షపు అష్టమినాడు సుశర్మ సైన్య సమేతముగా వెళ్ళి విరాటుని పట్టణపు దక్షిణ దిశన ఉన్న గోవులను పట్టుకొనుము. విరాటుడు తన సైన్యమును తీసుకొని సుశర్మమీదికి దండెత్తుణు. అంతట మనము మిగిలిన సైన్యముతో ఉత్తరదిశన ఉన్న గోవులను పట్టుకొందుము. అప్పుడు పాండవులు తప్పక మన మీదికి యుద్దమునకు వత్తురు. ఆవిధముగా మనము పాండవుల అజ్ఞాతవాసమును భంగము చేయవచ్చును".
సభ దుర్యోధనుని వ్యూహము విన్నది. కర్నాదులు దుర్యోధణుని వ్యూహమును మెచ్చుకున్నారు. బలపరచినారు. యుద్దసన్నాహములు సాగినవి. సుశర్మ సైన్యముగా విరాటుని మీదకు దండెత్తినాడు. అతడు మత్స్యదేశము చేరినాడు. సుశర్మ విరాటుని మీద యుద్దము ప్రకటించలేదు. సాధారనముగా సైన్యములు సాగునపుడు మ్రోగించు వాద్యములు మ్రోగించలేదు. ఇతర చిహ్నములు ప్రకటించలేదు. దొంగ చాటుగ విరాటుని పట్టణమునకు దక్షిణదిశన ఉన్న గోవులపై దాడి చేసినాడు. విరాటుని పట్టణమునకు దక్షిణదిశన ఉన్న గోవులపై దాడి చేసినాడు. విరాటుని పట్టణమునకు దక్షిణదిశన ఉన్న గోవులపై దాడి చేసినాడు. విరాటుని గోపాలురు దాడికి సిద్దముగాలేరు. అయినను ధనుర్భాణములతో శత్రువును ఎదిరించినారు. సుశర్మ సైనికులు గోపాలురను చీల్చి చెండాడినారు. చావగా మిగిలిన గొల్లలు గాయములు గలవారయి రక్తములు కారుచుమ్డగా విరాటుని సభకు వెళ్ళి, నమస్కరించి "మహాప్రభూ! ప్రమాదము జరిగినది. త్రిగర్త దేశపు రాజు సకల సైన్యములతో వచ్చి, దాడిచేసి గోవులను మరలించుకొని పోవుచున్నాడు. మాశక్తికొలది పోరినాము. మన గోపాలురందరు హతులయినారు. మిగిలిన మేము విన్నవించుటకు వచ్చినాము" అన్నారు.
"ఏమి త్రిగర్త రాజు సుశర్మ వచ్చినాడా!" విరాటుడు గర్జించినాడు. "అతనికి నాశక్తి తెలియదా! నా గోవులనే అపహరించునా! మంత్రులారా! యుద్దమునకు సన్నాహములు చేయుడు. నా కొఱకు రథము సిద్దము చేయుడు. యుద్దమునకు సిద్దముగా ఉన్నాను. దండయాత్ర సాగించుడు"





