Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    5. ద్రౌపది చాతుర్యమునకు విస్మయము నొందవలెను. కీచకుని కంటపడిన ఆడది మాన మర్యాదలతో బయటపడుట అసంభవము అని ఆమెకు తెలియును. వారిని హతమార్చుటకు ఆమె భీముని ఎన్నుకున్నది. భీముడు వచ్చి ఆమెను రక్షించలేదు. ఆమె భీమునితో కీచకుని చంపించినది.
    ద్రౌపది అయిదుగురు భర్తలు విరాట రాజు కొలువుననే ఉన్నారు. అయినను ఆమె భీమునినే ఎన్నుకున్నది. ఎందువలన అనగా మిగతావారు ధర్మరాజు మాట జవదాటరు.ధర్మరాజుకు ద్రౌపది మాన రక్షణము కన్న, అజ్ఞాతవాస రక్షణ ముఖ్యము. భీముడు ఆవేశపరుడు. జరిగిన అవమానమును కనులార చూచినాడు. అందువలన ఆమె భీముని ప్రోత్సహించినది. భీముని ఆవేశము కట్టలు తెంచుకొని అజ్ఞాతవాసము భంగము కాకుండ చూచిన విజ్ఞురాలు ద్రౌపది.
    కీచకుని చావుకు ద్రౌపది కారణభూతురాలని సరిగా కనుగొన్నారు ఉపకీచకులు. కీచకుని వధించినది భీముడు కావచ్చును కాని కీచకవధకు కారకురాలు ద్రౌపది మాత్రమే.
    6. కీచకుడు ద్రౌపది మీద కోరికతో చచ్చినాడు. కావున ద్రౌపదిని అతని పీనుగుకు కట్టి దహనము చేతుము అన్నారు ఉపకీచకులు. ఇష్టమయిన వస్తువులను చచ్చినవారి సమాధిలో పెట్టిపూడ్చుట ఈజిప్టు దేశమున ఒక ఆచారము ఉండెను. అటువంటి ఆచారము ఆనాటి భారతదేశమున కూడ ఉన్నదేమో పరిశీలించవలసి ఉన్నది.
    7. విరాటుడు కీచకుని వారించలేకపోయినాడు. ఉపకీచకులను మందలించలేకపోయినాడు. తుదకు ద్రౌపదిని వెళ్ళగొట్టు విషయమున కూడ సుధేష్ణతో చెప్పించినాడు. విరాటుడు ఎంత బలవంతుడో ఇందువలన మనము తెలుసుకొనవచ్చును.
    విరాటునకు సభతీర్చుట తప్ప మరొక పని ఉన్నట్లు కనిపించదు.
    
                                               దక్షిణ గోగ్రహణము
    
    దుర్యోధనుడు హస్తినలో కొలువు తీరినాడు. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్య, అశ్వత్ధామ, సుశర్మ, శకుని, దుశ్శాసనాదులను, పెద్దలగు పండితులును సభలో ఆసీనులయి ఉన్నారు. దేదీప్యమానముగా ప్రకాశించుచున్న సభలోనికి వేగులవారు ప్రవేశించినారు. వారు దండప్రణామములు ఆచరించినారు. దుర్యోధనునకు విన్నవించినారు.
    "మహాప్రభూ! పాండవులు ఉన్న ప్రదేశము కనుగొనుటకు తాము మమ్ములను ఆదేశించి పంపినారు. మేము తమ ఆజ్ఞను అనుసరించి అడవులన్నియు వెదకినాము. ఒకచోట పాండవుల రథములుపోయిన జాడ కనిపించినది. ఆ జాడలను అనుసరించి వెళ్ళినాము. అవి ద్వారకకు చేరినవి. ద్వారక సాంతము గాలించినాము.పాండవుల జాడ కనిపించలేదు. అంతట మేమందరము విడివిడిగా నానా దేశములను కలయజూచినాము. పాండవులజాడ కనిపించలేదు. మాకు చూడగా పాండవులు ఈ భూమండలమున ఉన్నట్లు కనిపించదు. పాండవులు నశించిపోయినట్లే మాకు తోచుచున్నది".
    "మహారాజా! ఒక విశేషము విన్నవింతుము. మత్స్యదేశమును మన శత్రువు విరాటుడు ఏలుచున్నాడు. ఆదేశమునకు రాజధాని అయిన ఉపప్లావ్యమున ఒక వింత జరిగినది. విరాటుని బావమరిది సింహబలుడు ఒక స్త్రీ నిమిత్తమయి అర్ధరాత్రి కాలమున చచ్చినాడు. అతనిని గంధర్వులు ఆయుధములేక, యుద్దము చేయక వికారముగా చంపినారని జనులు చెప్పుకొనుచున్నారు. ఆ గంధర్వులు సింహబలుని తమ్ములందరను వధించినాడు. కావున విరాటుడు మహా దుఃఖమున ఉన్నాడు. విరాటుడు మీకు శత్రువు అయినందున విన్నవించవలసి వచ్చినది. తదుపరి ప్రభువుల ఆదేశము ఎట్లయిన, అట్లు చేయగలము".
    దుర్యోధనుడు చారుల విన్నపము విన్నాడు. వారిని పంపించినాడు. సభను ఉద్దేశించి అన్నాడు:-
    "పాండవుల అజ్ఞాతవాసము ముగియ వచ్చినది. వారు రాకమునుపే వారిని కనుగొని మరల అడవులకు పంపవలసి ఉన్నది. మనము పంపిన చారులు పాండవులను కనుగొనలేకపోయినారు. పాండవులను తెలుసుకొను ఉపాయమును, మీకు తోచిన రీతిన నాకు తెలియపరచప్రార్ధన".
    దుర్యోధనుని మాటలు విన్న సభవారు ఆలోచించుచునే ఉన్నారు. కర్ణుడు "మహారాజా! నేర్పరులయిన వారిని వివిధ వేషములు వేసి నానాదేశములకు పంపిన పాండవులు ఒకటి రెండు రోజులలో బయటపడుదురు" అన్నాడు.
    "అన్నా! దుర్యోధనా!" దుశ్శాసనుడు అన్నాడు "పాండవులను వెదికించుట వ్యర్ధము. వారు అడవులందు క్రూరమృగముల పాలయి చచ్చి ఉందురు. వారు చచ్చిన స్థలమందు ఇప్పటికే గడ్డిమొలచియుండును. కావున నిశ్చింతగా కురురాజ్య లక్ష్మిని అనుభవింపుము".
    ద్రోణుడు దుశ్శాసనుని ఆపేక్షించినాడు "పాండవులు క్షాత్రగుణ సమృద్ధులు, బలవంతులు, ధైర్యవంతులు, గుణవంతులు. వారికి దైవబలము ఉన్నది. వారు నశించరు. కావున నీకు శక్తి ఉన్న ఎడల వారిని వెదకు ఉపాయము సూచించుము" అన్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.