Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ఒక భార్యకు ఒక భర్త. ఒక భర్తకు ఒక భార్య. ఈ సిద్దాంతమందే సమాజ శ్రేయస్సు నిలిచిఉన్నది. ఈ సిద్దాంతము ప్రచలింప చేయుటకే వాల్మీకి శ్రీ మద్రామాయణమును ప్రవచించినాడు. వ్యాసుడు చివరకు ఆ సిద్దాంతమునే నమ్మినాడు. దానినే ప్రవర్తింప చేసినాడు.
    ఇందుగురించి మరింత చర్చించవచ్చును.
    3. అధికారమున ఉన్న వారికి కొన్ని నియమనిబంధనలు బాధ్యతలు ఉండును. అధికారేతరులకు అవి ఉండవు. వారు పెత్తనము సాగించిన అనేక అనర్ధములకు కారకులు అగుదురు.
    కీచకుడు అధికారేతరుడు. రాజ్యము విరాటునిది. విరాటుడు బలహీనుడు. రాజ్యమున పెత్తనము చేసినవాడు కీచకుడు. కీచకునకు బాధ్యతలు లేవు. దుర్మార్గము అతని స్వభావము. ఆ రాజ్యమున అందమయిన ఆడది ఉండుటకు వీలులేదు. ఆమె అతని స్వాధీనము కావలసినదే. అతడు అన్నదానికి అడ్డులేదు. అతడు సుధేష్ణకు తమ్ముడు. అతనిని వారించుబలము విరాటునకు లేదు. సింహబలుడు బలవంతుడుకావచ్చును. బలమునకు ఒక నియమము, నిబంధన, శాసనము అవసరము. అవి లేనినాడు ఎన్ని అనర్ధములకు దారితీయునో ఇందువలన స్పష్టమయినది.
    ద్రౌపది సుధేష్ణ అంతఃపురమున ఉన్నది. మహారాణి ద్రౌపదికి మాట ఇచ్చినది. అందుకు తగినట్లే ద్రౌపదిని కీచకుని కంటపడకుండ చాలాకాలము కాపాడినది. కీచకుడు అకస్మాత్తుగా ద్రౌపదిని చూచినాడు. ఆమెను కోరినాడు. ఆ కోరిక మంచిదికాదు. అది సుధేష్ణకు తెలుసును. అయినను వారించలేకపోయినది. తమ్ముడు అను బలహీనత ఆమెను లొంగదీసినది. నీచ కార్యము తలపెట్టినది. ద్రౌపదిని సింహబలుని వద్దకు పంపినది.
    ద్రౌపది నిస్సహాయ. మగధీరులు మగలు అయినను దిక్కులేనిది అయినది. అయినను ఆత్మశక్తితో దుర్మార్గునితో పోరినది. తనను రక్షించువారు ఉందురను భ్రమతో సభముందుకు ఉరికినది. రాజు విరాటుడు, నిండు సభలోని జనము, ధర్మరాజు, భీముడు ఆమెకు సాయము చేయలేకపోయినారు. కీచకుని వారించలేకపోయినారు. అంతటి బలవంతుడు కీచకుడు! అంతటి బలహీనులు అక్కడి రాజు, ప్రజలు. ఆడదానిని కిరాతకుని బారినుండి రక్షించలేని కిరాతక రాజ్యమది.
    ఈనాటికి మన సమాజములో కీచకులు ఉన్నారు. ఇంత బలమయిన రాజకీయ వ్యవస్థ ఉన్ననూ ఆడది కీచకులకు బలి అగుచునే ఉన్నది. కీచకుడు ఒక వ్యవస్థ. అది రాజకీయ బలమునకు అతీతముగా దుర్మార్గములు చేయుచుండును. దానిని అదుపు చేయుట అసాధ్యము కాకున్నను కష్టము.
    కీచకుడు మనిషిలో అంతర్గతుడయి ఉన్నాడు. అతనిని నిగ్రహించుట అసాధ్యము కాకున్నను కష్టము.
    4. కీచకుడు అధికారమునకు అతీతుడు. అటువంటి వాని వలననే అనర్ధములు వచ్చుచున్నవి. కురు రాజ్యము ధృతరాష్ట్రునిది. అసలు అధికారము అతనిది. దుర్యోధనునకు అధికార బలములేదు. ధృతరాష్ట్రుని బలహీనతయే దుర్యోధనుని బలము. దుర్యోధనుడు ధృతరాష్ట్రుని కొడుకు, కాకున్న యువరాజు అనుకుందము. శకునికి ఏమి బలము ఉన్నది. అతడు గాంధారికి సోదరుడు-దుర్యోధనునకు మేనమామ. అతనికి ఇసుమంత అధికార బలము లేదు. కాని అతడే పెత్తనము వహించినాడు. అన్ని అనర్ధములకు కారకుడు అయినాడు. అక్కడ శకుని ఇక్కడ కీచకుడు అధికారమునకు అతీతులు.
    అధికారమునకు అతీతులు అన్ని అనర్ధములకు కారకులు అగుచున్నారని హెచ్చరించుచున్నాడు వ్యాస మహర్షి! అతని హెచ్చరికను మానవాళి చెవిన పెట్టుటలేదు.
    నేడు మనమున్నది ప్రజా స్వామ్యము. అధికారము ఎవరికి ఎల్లపుడు ఉండునది కాదు. అయినను అధికారేతరులు పెత్తనము సాగించుచునే ఉన్నారు. ఈ మధ్యనే ఇట్టివ్యక్తి ఒకడు సుడిగాలివలె లేచి ఆరిపోయినాడు.
    అధికారేతరులు రాజ్యములందు, రాజకీయములందే కాదు కుటుంబములన్దును చేరుదురు. కుటుంబ విచ్చిత్తికి శాయశక్తుల ప్రయత్నింతురు. వారి నుండి జాగరూకులయి ఉండుట ఎంతయిన అవసరము.
    అధికారేతరులు ప్రమాదకారులు. తస్మాత్ జాగ్రత్త- జాగ్రత్త!




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.