Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ద్రౌపది శక్తి స్వరూపిణివలె అంతపురమున ప్రవేశించినది. ఆమె ముఖమున విజయోత్సాహము తాండవమాడుచున్నది. ఆమె కనులలో ఆనందము నాట్యము చేయుచున్నది. ఆమె నేలకు దిగిన మహాశక్తివలె ఉన్నది. అంతఃపురమున ఆమెను చూచినారు. అందరు దూరము జరిగినారు. వినయము కనబరచినారు. ద్రౌపది సుధేష్ణవద్దకు వెళ్ళినది. సుధేష్ణ ఆమెను చూచినది. లేచినది. ద్రౌపదికి పక్కనున్న ఆసనము చూపినది. తనకు సమానముగా కూర్చుండపెట్టినది. అన్నది:-
"తల్లీ మాలినీ! నీ సౌందర్యము చూచి పురుషులు పిచ్చివారగుచున్నారు. నీ భర్తలను చూచి జనులు భయపడి చచ్చుచున్నారు. కావున నిన్ను ఈ పట్టణము నుంచి పంపించవలెనని మహారాజు నన్ను కోరినాడు. కావున నీవు ఈ పట్టణము, మారాజ్యము విడువుము. నీ ఇష్టము ఉన్నచోటికి వెళ్ళుము".
"మహారాణీ! ద్రౌపది శాసించినట్లు యాచించినది. మరొక పదమూడు రోజులు మాత్రము నీ ఇంట ఉందును. నా భర్తలు మహాబలవంతులు. శూరులు. వీరులు. వారివలన మీకు, మీ రాజ్యమునకు గొప్ప ఉపకారము జరుగనున్నది. నేను మీ రాజ్యము వదిలిపోయిన మీకు అరిష్టము కలుగవచ్చును. కావున పూర్వమువలెనే మరి పదమూడు రోజులు మాత్రము మీ ఇంత ఉండుటకు అనుమతించుడు".
సుధేష్ణ ద్రౌపది మాటలు విన్నది. ఆమె కాదనలేకపోయినది. "మాలినీ! నీ ఇష్ట ప్రకారము కానిమ్ము. నీవు ఎప్పటివలెనే నావద్ద ఉండుము. పదమూడు దినములు ఉండుటకు నీకు అనుమతించినాను" అన్నది.
ద్రౌపది అంతఃపురమున ఉండిపోయినది.
ఆలోచనామృతము
1. ఇది సాంతము ద్రౌపది కథకాదు. ఒక ఆడదాని కథ. ఐదుగురు మగవారు గుట్టు చప్పుడు కాకుండ అజ్ఞాతవాసము గడిపినారు. ఒక ఆడది గడపలేక పోయినది. అందమయిన ద్రౌపదిని సైరంధ్రిగా ఉంచుకొనుటకే రాణి శంకించినది. విరాటుడు మిగిలిన ఐదుగురికి నిశ్శంకగా కొలువులు ఇచ్చినాడు.
అందమయిన పరిచారికవల్ల అపకారములు జరుగునని గృహిణులు అందరు ఎరుగుదురు. నాటి నుండి నేటి వరకు ఇది కొనసాగుచునే ఉన్నది. స్త్రీకి భద్రత నాడు ఉన్నట్లు కనిపించదు. నేడు లేదు.
ఇటువంటి అవాంతరములను ఎదుర్కొనుటకు ఆనాటి స్త్రీలు సిద్దముగా ఉండిరని తెలియుచున్నది. వారికి ఏదో విద్య నేర్పువారుగా కనిపించుచున్నది. వారు తమ శీల రక్షణకు ఎదురు తిరిగినారు.
దమయంతిని అరణ్య మధ్యమున చెరచుటకు వచ్చినాడు ఒకడు. వానితో పోరాడి ఆమె వానిని భస్మము చేసినది. ద్రౌపదిని నిండు సభలో అవమానించినారు కౌరవులు. ఆమె తన ప్రజ్ఞాపాటవములతో కౌరవులను ఓడించినది. భర్తలు కోల్పోయిన రాజ్యమును తిరిగి ఇప్పించినది. మరొక సారి సైంధవుడు ఆమెను పట్టి చూచినాడు. ద్రౌపది సైంధవునకు లొంగలేదు. వాడు తన మీదికి రాగా సైంధవుని పడదోసినది. కీచకుడు ఆమెను పట్టవచ్చినప్పుడు వానిని పడదోసినది. వానికి చిక్కకుండ ఉరికినది. తన మనము కాపాడుకున్నది. వాని ప్రాణములు తీసినది.
స్త్రీలు అబలలుగా ఉన్నంత కాలము వారి మాన ప్రాణములు దక్కవు. వారి మాన ప్రాణములు దక్కించుటకు స్త్రీలు బలవంతులు కావలెను. ఎదిరించుటకు సిద్దపడవలెను అనుటకు ఇది ఒక ఉదాహరణ.
2. ద్రౌపదికి ఒక్కడు కాదు అయిదుగురు మహా మహిమాన్వితులయిన భర్తలున్నారు. ఆనాడు కౌరవసభలో ద్రౌపదిని అవమానించినపుడు, ఆమె బట్టలు నిండు సభలో విప్పినపుడు నిస్సహాయులయి చూచినారు. పెదవి కదపలేక పోయినారు. ఇక్కడ విరాటుని నిండు సభముందు కీచకుడు ఆమెను పడద్రోసినాడు. సభలో ధర్మరాజు ఉన్నాడు. భీముడు ఉన్నాడు. సాక్షీభూతులుగా చూచినారు. నిస్సహాయులు అయినారు. పెదవి కదపలేక పోయినారు.
మనకు తెలిసినంతవరకు స్త్రీకి ఇంత దురంతమయిన అవమానము భర్తలముందు జరుగుట ఎరుగము. ద్రౌపదిని సీతతోను, సావిత్రితోను పోల్చినారు. సీతమ్మతల్లిని భర్త శ్రీరాముడు శంకించినాడు. ఆమెకు పరులవలన అవమానము జరుగలేదు. సావిత్రికి అవమానమన్నది లేదు.
ద్రౌపది మూడు సార్లు అవమానములకు గురి అయినది.
ఇందుగురించి కొంత ఆలోచించవలసి ఉన్నది. బహుభర్తృక సిద్దాంతమును వ్యాస మహర్షి ఒకానొక సందర్భమున ప్రయోగాత్మకముగా ప్రవేశ పెట్టినాడు. ద్రౌపదికి అయిదుగురిని ఇచ్చి పెళ్ళి చేయించినాడు. సమాజమునకు ఈ ప్రయోగము కళ్యాణకారిగా కనిపించినట్లు లేదు. బహుభర్తృక సిద్దాంతము మీద వ్యాస మహర్షికి విశ్వాసము సడలినది. కాదు అంతరించినది. దీనిని మరొకరు ఉదాహరణగా గ్రహించరాదు. ఇట్టి వివాహములు ఇకముందు జరుగరాదు అనుకొని ఉండును. అందువలన ఎక్కువమంది భర్తలున్న స్త్రీలకు భద్రత లేదు అని నిరూపించుటకు ద్రౌపదికి ఇన్ని అవమానములు కల్పించినాడేమో అని ఒక ఆలోచన. ఇట్టి ఆలోచన వచ్చుటకు కారణము ఏమన నాగరక సమాజములలో ద్రౌపదికి ముందుగాని, ద్రౌపదికికి తరువాతగాని బహుభర్తృక సిద్దాంతము అమలున లేదు. మరొక విషయము ద్రౌపదికి అయిదుగురి భర్తలవలన అయిదుగురు పుత్రులు కలిగినారు. భారత యుద్దమున వారు అయిదుగురును చచ్చినారు. ఆ సంతానము నుంచి వారి సంతతిని కొనసాగించ దలచలేదు. కురు వంశమునకు మిగిలిన వాడు అభిమన్యునకు ఉత్తరకు కలిగిన పరీక్షిత్తు. అభిమన్యుడు ఒక భార్య ఒక భర్తకు కలిగినవాడు. అట్లే పరీక్షిత్తు ఒక భార్య ఒక భర్తకు కలిగినవాడు.





