Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ఉపకీచకులు కళేబరము తమ అన్నది అని నిశ్చయించుకున్నారు. శవము చుట్టు చేరినారు. గోడుగోడున ఏడ్వసాగినారు. 'మా  అన్నను గంధర్వులు చంపినట్లున్నారు. గంధర్వులచేత చచ్చినవారు ఇట్లే చత్తురు కాబోలును' అనుకొని దుఃఖించ సాగినారు.
    "కీచకుడు మహాబలవంతుడు. వీడు ఒక గంధర్వునిచేత కూలినాడు. వీని బలము పనికిరాలేదు. ఎంత బలవంతుడయినను చెడు కార్యము చేయునపుడు అతని బలము క్షీణించిపోవును. చెడు చేయువానికి చేటు తప్పదు" అనుకున్నారు అక్కడ కూడిన జనులు. వారు శవమువద్దకు వెళ్ళలేదు. దూరము నుండియే చూచినారు.
    ఉపకీచకులు ఏడ్చినారు. అలసినారు. వారిలో ఒకడు! "సోదరులారా! మన అన్న సింహబలుని కొఱకు ఎంత ఏడ్చినను ప్రయోజనము ఏమున్నది? అతడు మన ఏడ్పులను వినడు. ఒక పలుకు పలుకడు. కాబట్టి సింహబలుని దహన సంస్కారమునకు ఏర్పాట్లు చేయవలసి ఉన్నది" అన్నాడు. ఉపకీచకులు దహన సంస్కారపు ఏర్పాట్లలో మునిగినారు.
    ఉపకీచకులలో ఒకడు ఆలోచించినాడు. అందరితో అన్నాడు:-
    "మన అన్నచావునకు సైరంధ్రి కారణముగా కనిపించుచున్నది. నిన్న నిండు సభలో సింహబలుడు దానిని వెన్నాడినాడు. దాని భర్తలు గంధర్వులు పగబూని మన అన్నను చంపినట్లున్నారు. మన అన్న అగు సింహబలుడు సైరంధ్రిపైగల మోహమువలన చచ్చినాడు. కావున సైరంధ్రిని మన అన్న కళేబరమునకుకుట్టి దహనము చేయుదము. ఆవిధముగా చేసిన మన అన్నకు ప్రీతి కలుగును" అన్నాడు.
    ఉపకీచకులందరు ఆమాటలు విన్నారు. పొలోమని ఉరికినారు. ద్రౌపదిని పట్టినారు. పెడరెక్కలు విరిచికట్టినారు. ఆమెను పట్టుకొని విరాటుని వద్దకు వెళ్ళినారు. "మహారాజా! ఈ సైరంధ్రి మా అన్న చావునకు కారకురాలు. మేము దీనిని మా అన్న కళేబరముతో దహనము చేయదలచినాము. నీవు ఇందుకు సమ్మతించవలెను. అనుమతించవలెను" అన్నాడు.
    ఉపకీచకులు తొందరపాటున ఉన్నారు. వీరు నేను చెప్పినను వినువారుకారు. సైరంధ్రిని ఆమె భర్తలయిన గంధర్వులే రక్షించగలరు. అనుకున్న విరాటుడు "మీకు తోచిన ప్రకారము చేయుదు" అన్నాడు.
    విరాటుని మాటను అనుమతిగా గొని ద్రౌపదిని పట్టుకొని పోయినారు ఉపకీచకులు. ఆవిధముగా ద్రౌపదిని పట్టుకొని పోవునప్పుడు ద్రౌపది పెద్దగా అరచుచు ఏడ్చినది. "జయ, జయత్సేన, జయంత, జయద్బల గంధర్వులారా! మీరు మహాబలవంతులు. యముడు సహితము మిమ్ములను గెలువలేడు. నీచులు, దుష్టులు, ఉపకీచకులు నన్ను కట్టి పట్టుకొని పోవుచున్నారు. కీచకుని శవముపై కట్టి నన్ను దహనము చేయుదురట. మీరు రావలెను. నన్ను రక్షించవలెను" అని అరచినది. ఆమె అరుపు నగరమున ప్రతి ధ్వనించినది. అది ఆకాశమును అంటినది.
    ద్రౌపది ఆక్రందనను వంటశాలలో ఉన్న భీముడు విన్నాడు. భీమునిలో ఆవేశము పొంగినది. రౌద్రాకారము దాల్చినాడు. ఉరికినాడు. రహస్యముగా కోటను దాటినాడు. అరణ్యమున ఉరికినాడు. శ్మశానమునకు చేరుకున్నాడు.
    భీముడు శ్మశానము చేరుసరికి కీచకుని శవముమీద ద్రౌపదిని కట్టి తీసుకొని పోవుచున్నారు. భీముడు ఆ దృశ్యము చూచినాడు. ఆగ్రహోదగ్రుడు అయినాడు. అపర రుద్రుడు అయినాడు. అక్కడ ఉన్న ఒక మహావృక్షమును పెరికినాడు. అది పట్టుకొని జనులమీదికి ఉరికినాడు. అతనిని చూచి గంధర్వులు వచ్చినారని భయపడి జనులు పారిపోయినారు. కొందరు పల్లపు భూములందు దాగినారు. కొందరు చెట్లచాటున నక్కినారు. కొందరు నీటిలో దూకినారు.
    ఉపకీచకులు భీముని చూచి, దుడుచుకున్నారు. అన్న శవమును అచ్చటనే పడవేసినారు. పరుగులంకించుకున్నారు. భీముడు రౌద్రాకారమున వారిని తరిమినాడు. సింహబలుని తమ్ములందరిని నుగ్గునుగ్గుగా కొట్టి చంపినాడు. ఆవిధముగా నూటఅయిదుమంది ఉపకీచకులలో ఒక్కడు సహితము మిగులకుండ అందరిని వధించినాడు. నిర్మానుష్యమయిన శ్మశానమున ద్రౌపది కట్లు విప్పినాడు. ద్రౌపది లేచి చూచినది. శ్మశానము రణరంగమువలె ఉన్నది. కీచకుని సహితముగా నూట ఆరుగురు చచ్చిపడి ఉన్నారు. తన కొఱకు భీముడు ఇంతమందిని ఒంటరిగా వధించినాడు. ఆమెలో ఆనందము పొంగినది. సంతోషము ఉప్పొంగినది. భీముని ప్రేమగా చూచినది. గర్వముగా చూచినది. గౌరవముగా చూచినది. చూపులతో భీముని పొగడినది. కీర్తించినది. స్తుతించినది.
    భీముడు ఉబ్బి తబ్బిబ్బు అయినాడు. "శ్మశానమున మన పని తీరినది. నేను వంటశాలకు చేరుదును. నీవు అంతఃపురము చేరుము" అన్నాడు భీముడు. ఉభయులు వేరు వేరు మార్గముల బయలుదేరినారు.
    అక్కడ నగరమున ఉపకీచకులు చచ్చినారను వార్త విరాటునాకు తెలిసినది. అంతమంది ఒక్కసారి హతమారినందుకు అతడు జడుసుకున్నాడు. సుధేష్ణ వద్దకు ఉరికినాడు. ఆమె తమ్ములందరు చచ్చినారని దుఃఖించుచున్నది. విరాటుడు ఆమెను ఊరడించినాడు. "మహారాణీ! ఈ సైరంధ్రి వలన మరిన్ని ఉపద్రవములు రాకముందు ఆమెను మన రాజ్యము నుండి పంపివేయుట మంచిదిగా తోచుచున్నది. ఆమెతో ఆమాట చెప్పుటకు నాకు భయముగా ఉన్నది. ఏదో రీతిగా నీవే ఆమెతో చెప్పి పంపించుము" అని చెప్పి వెళ్ళిపోయినాడు. సుధేష్ణయు ద్రౌపదిని పంపించుటకు కృత నిశ్చయురాలయినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.