Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
సింహబలుడు చీకటిలో తడుముకొనుచు సాగినాడు. శాల మధ్యప్రదేశమునకు చేరినాడు. చేతితో పాన్పును తడిమి చూచినాడు. అతనికి ఆనందము కలిగినది. నిస్సంశయముగా పాన్పుపై ద్రౌపది ఉన్నదని నిశ్చయించుకున్నాడు.
చీకటిలో సింహబలుడు పానుపు దగ్గరికి వచ్చినాడు. దానిమీద తడిమి చూచినాడు. అతనికి భీముని దేహము తాకినది. అది సైరంధ్రి దేహము అనుకున్నాడు. అతనిలో కామాగ్ని రగిలినది.
"మాలినీ! నీవు నా మనసును గెలిచినావు. అనేకమంది స్త్రీలు నన్నుచూచి మురుతురు. పిట్టలవలె నావలలో చిక్కుదురు. నాకు బహుమానములు ఇత్తురు. నాతో పొందుకూడుటకు పరితపింతురు. నీవు మాత్రము నన్ను గెలిచినావు. ఇదిగో నీ కొరకు బహుమతులు తెచ్చినాను. పరిగ్రహింపుము. నన్ను అనుగ్రహింపుము" అన్నాడు, ఆరాటపడినాడు.
"సింహబలా!" భీముడు ద్రౌపది స్వరమున మృదువుగా అన్నాడు "నీవంటి మగవాడు లేడని అన్నావు. నిజము కావచ్చును. కాని నీకు నావంటి ఆడది లభించుటకూడ దుర్లభము. నీ దేహము, నాదేహము తాకిన ఎట్లుండునో నీకు తెలియదు. నన్నుపొందిన నీవు 'మరొక స్త్రీని పొందజాలవు" అని వికతముగా నవ్వినాడు భీముడు. వెంటనే కీచకునిమీద పడి తలపట్టి వంచినాడు.
కీచకునకు అది అనుకొనిన పరిణామము. అతడు దిద్దరపోయినాడు. తనమీద పడినవాడు గంధర్వుడు అనుకున్నాడు. బలమునంతయు కేంద్రీకరించి రెండు చేతులతో భీముని బలముగా నెట్టినాడు. భీముడు క్రింద పడినాడు. భీముడు సింహబలుని పడద్రోసి వానిపై కూర్చున్నాడు. ఈ విధముగా భీమ, సింహబలులు ఇద్దరు అతి భయంకరముగా పోరినారు.
ఒకరి దగ్గరికి ఒకరు పోవుచు, పట్టుచు, విడుచుచు, అదలించుచు, పడుచు, లేచుచు, ఉభయులు భీకరముగా పోరాడినారు. ఆవిధముగా పోరాడుచుండగా సింహబలుని బలము క్షీణించినది. భీముడు అది గ్రహించినాడు. సింహబలుని అణచిపట్టి క్రింద పడవేసినాడు. సింహబలుడు తన శక్తి చూపి పైకి లేచినాడు. అప్పుడు భీముడు పిడుగువంటి తన పిడికిటితో సింహబలుని గొంతు సంధియందు కఠినాముగా పొడిచినాడు. ఆ పోటుకు సింహబలుడు నేల కూలినాడు. కనుగ్రుడ్లు మిణకరించుకొని కిందపడి గిలగిల తన్నుకున్నాడు.
మదపుటేనుగు మహావృక్షమును కూల్చినట్లు భీముడు సింహబలుని నేలకూల్చినాడు. సింహబాలునకు భయంకరమయిన చావు కలిగించతలచిన భీముడు తన్నుకొనుచున్న సింహబలుని కాలు సేతులును, తలను వాని దేహములోనికి నుగ్గు నుగ్గుగా తురిమినాడు. అప్పుడు కీచకుని దేహము కమిలి కందుక తిత్తివలె కనిపించినది. సింహబలుని కళేబరమును నుగ్గునుగ్గుగాచేసి ముద్దవలె చేసినాడు భీముడు.
భీముడు తన పరాక్రమమును, కీచకుని చావును చూచుటకు ద్రౌపదిని పిలిచినాడు. ద్రౌపది నేలమీద పడిఉన్న కీచకుని కళేబరమును చూచినది-భీముని పరాక్రమమును చూచినది. ఆమె ఆనందమున పొంగినది. ఉబ్బితబ్బిబ్బు అయినది. ఆవేశమున భీముని ఆలింగనము చేసికొన్నది.
భీమునిలో పరమానందము పొరలినది. ద్రౌపదికి కీచకుని శవమును స్పష్టముగా చూపదలచి నిప్పుతెచ్చి మంటచేసినాడు. "దుష్టుడా! కీచకుడా! నన్ను అవమానించినావులే. మంచిదయినది. ఇంత భయంకరముగా చచ్చినావు. నీ చావు చూచిన మహదానందముగా ఉన్నది. పరస్త్రీలను పట్టువారికి ఇదే గతి పట్టును" అని శపించి అత్యంత గర్వముగా భీముని చూచినది.
"ప్రాణనాథా! నిన్న నిండుసభలో నాకు జరిగిన అవమానమును చూచి వచ్చిన రోషమును దిగమింగినావు. ఇప్పుడు ఈ నీచుని ఇంత ఘోరముగా చంపినావు. నాకు ఆనందము కలిగించినావు. స్త్రీజాతికి విముక్తి కలిగించినావు" అటువంటి నీ సాహసమును నేను పొగడజాలను. లోకములను జయించగల బలవంతుడు కీచకుడు. అట్టివానిని ఒక్కడవు, అనాయాసముగా హతమార్చినావు. నీ బలపరాక్రమములను, చూచుటకుగాని, ఊహించుటకుగాని, మెచ్చుకొనుటకుగాని కీర్తించుట కుగాని నాకు శక్తిచాలదు. ఇప్పుడు నాకు చెప్పరానంత ఆనందమును కలిగించినావు" అని కొనియాడినది పాంచాలి.
ఆమాటలు భీమునకు అమృతాయమానములు అయినవి. అతడు ఆనందమున మునిగినాడు. సంతోషము పట్టజాలకపోయినాడు. ద్రౌపదితో చెప్పి అచటినుండి వెళ్ళిపోయినాడు.
ద్రౌపదియు అచటినుంచి నిర్గమించినది.
రాత్రి ముగియనున్నది. ఉషోదయమయినది. నర్తనశాల పరిచారకులు శాలలో ప్రవేశించినారు. వారికి వికృత రూపమున ఉన్న శవము కనిపించినది. వారు భయపడినారు. అక్కడ పడి ఉండిన వస్తువులను బట్టి శవము కీచకునిది అని నిశ్చయించుకున్నారు. వారు కీచకుని తమ్ముల వద్దకు ఉరికినారు. ఉపకీచకులను నిద్రలేపి దుర్వార్త వినిపించినారు. ఉపకీచకులు ముందు నమ్మలేదు. వారికి కీచకుడు ఇంటిలో కనిపించలేదు. పరిచారకులు తెచ్చిన వార్త ధ్రువపరచుకొనదలచినారు. నర్తనశాలకు ఉరికినారు.
అప్పటికి తెల్లవారినది. లోకమున వెలుగులు పరచుకున్నవి. వచ్చిన వారందరు వింత కళేబరమును చూచినారు. కళేబరమునకు కాళ్ళులేవు. చేతులులేవు. తల సహితము కనిపించుటలేదు. కళేబరము మూటకట్టిన మాంసమువలె ఉన్నది. భయంకరముగా ఉన్నది. ఇంతలో అక్కడికి జనులు కూడినారు.





