Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ద్రౌపది మనసు వికసించినది. కీచకునిచావు దగ్గరపడినదని ఆనందించినది.
    "సింహబలా! నర్తనశాలలో రాత్రులు ఎవరూ ఉండరు. మనకు రహస్యముగా ఉండును. అక్కడికి మరెవ్వరురారు. ఈ రాత్రి నీవు అక్కడికి ఒంటరిగా రమ్ము. నేను అక్కడ నీకొరకు వేచియుందును. నీవెంట మరెవరు ఉన్నను అచట నీకు నేను కనిపించను. విన్నావా?" ద్రౌపది వల విసిరినది.
    వలలో చిక్కుకున్నాడు సింహబలుడు. "విన్నాను. ఈ రాత్రి నర్తనశాలకు ఒంటరిగా వత్తును. సైరంధ్రీ ఒకసారి నిన్ను తాకనా!" విలవిలలాడినాడు కీచకుడు వలలోని పిట్టవలె.
    ద్రౌపది నవ్వినది. "ఇప్పుడు వలదు. రాత్రికి నీదానను. ఈ రాత్రి నర్తనశాలకు నీవు ఒంటరిగా రావలెను. నీవెంట మరెవ్వరు ఉన్నను నీకు నేను కనిపించను" ద్రౌపది స్పష్టము చేసినది.
    "మాలినీ! ఈరాత్రికి నర్తనశాలకు ఒంటరిగా వత్తును. ఒక్కడనే వత్తును. ఒక్కడనే వత్తును. విన్నావా! ఒక్క చిరునవ్వు ఒక్క నవ్వు నవ్వవా?" ప్రార్దించినాడు సింహబలుడు.
    ద్రౌపదికి నిజముగానే నవ్వువచ్చినది. నవ్వినది.
    సింహబలుని ప్రాణము విలవిలలాడినది. మనసు ఒప్పుకున్నను అటునుంచి తిరిగివెళ్ళినాడు. రాతిరిరాక కొఱకు ఎదిరిచూచినాడు.
    ద్రౌపది సింహబలునితో మాట్లాడి వంట ఇంటికి వెళ్ళినది. రహస్యముగా భీముని కలుసుకున్నది. జరిగిన వృత్తాంతమంతయు వివరించినది. అప్పుడు భీముడు అన్నాడు:-
    "ద్రౌపదీ! కార్యము చాల చక్కగా సానుకూలపరచినావు. ఇక సింహబలుని నూకలు చెల్లినవి. వాడు రేపటి సూర్యోదయము చూడలేడు. ఈరాత్రికి వానిని అంతము చేతును. వానిని ఎట్లు వదింతునో వివరించెదను వినుము.
    సింహబలుడు కామాంధుడయి ఒంటరిగా నర్తనశాల వచ్చును. అక్కడ నీవు ఉండవు. నీ బదులు నేను ఉందును. అక్కడ కారుచీకటి ఉండును. కాన అతడు గుర్తించలేడు. అప్పుడు నన్ను నీవు అనుకొని పట్టుకొనును. నేను వానిని సింహమువలె పట్టివేతును. వానితో భయంకరముగా యుద్దముచేసి వానిని హతమార్తును. నీకు ఆనందము కలిగింతును".
    "నాథా! భీమా! మనము అజ్ఞాతవాసమున ఉన్నాము. నీవు భయంకరమయిన యుద్దముచేసి బయటపడరాదు. సింహబలుని రహస్యముగా, గుట్టురట్టుకాకుండ వధించవలెను. ఈ విషయమున నీవు అతిజాగ్రత్త వహించవలసి ఉన్నది. నేను సహితము ఈ రాత్రికి నీతో నర్తనశాలకు వత్తును. సింహబలుని చావును నేను కనులార చూచి ఆనందింతును" అని చెప్పి, భీముని హెచ్చరించి ద్రౌపది సుధేష్ణ అంతఃపురమునకు చేరినది. ద్రౌపది సహితము రాతిరి రాకకు ఎదురు చూడసాగినది.
    ఎదిరిచూచిన రాతిరి కావచ్చినది. పడమటిరాణి సూర్యుని తన కౌగిట చిక్కించుకున్నది. ఆమె అనురాగమునకు పడమటిదిక్కు రాగరంజితముఅయినది. ఆమె సిగ్గుక్రమముగా తీరి ఎర్రవారిన దిక్కు నల్లవారినది. ఆకాశమున చుక్కలు వెలిగినవి. నగర వీధులందు సందడులు తగ్గినవి. గృహములందు దీపములు వెలిగినవి. చంద్రుడు ఉదయించినాడు. జారులకు చోరులకు సంతసము కలుగునట్లు చంద్రుడు అస్తమించినాడు. అప్పుడు పెను చీకటులు కమ్ముకున్నవి. చీకటిలో ఎత్తుపల్లములు కనిపించక భూమి సాంతము సమతలముగా కనిపించినది. కన్ను తెరచినను, మూసినను ఒకేరీతిగా ఉన్నది. కన్ను పొడుచుకున్నను కనిపించుటలేదు. కాటుకవంటి చీకట్లు సర్వత్ర అలముకున్నవి. ఎదిరి చూచిన రాత్రి వచ్చినది. ద్రౌపది బయలుదేరినది. భీమునివద్దకు చేరినది. భీముడు ఆమెను చూచినాడు. ఉప్పొంగినాడు. పెండ్లికి బయలుదేరినట్లు తలగుడ్డ చుట్టుకొని బయలుదేరినాడు. ద్రౌపది భీముని అనుసరించినది.
    ద్రౌపది భీములు నర్తనశాలకు చేరినారు. నర్తనశాల అంధకార బంధురముగా ఉన్నది. వివేకహీనుని హృదయమువలె అంధకార దూషితమయి ఉన్నది. జారిణుల ప్రేమవలె నిరూపించ సాధ్యము కాకున్నది. ఘోరారణ్యమువలె నిర్మానుష్యముగా ఉన్నది. పిసినారుల ధనమువలె నిరుపయోగముగా ఉన్నది. అభ్యసించని శాస్త్రమువలె ఆగమ్య గోచరముగా ఉన్నది. స్వప్నమందలి పదార్ధమువలె కంటికి కనపడకున్నది. విషమకావ్యమువలె అలంకార శూన్యమై ఉన్నది. అవివేకుని రాజ్యమువలె జారచోరులకు మనోహరముగా ఉన్నది.
    భీముడు నర్తనశాల ద్వారమును జాగ్రత్తగా చూచినాడు. చీకటి ఏమియు కనిపించలేదు. భీముడు ద్రౌపదిచేయి పట్టుకొని చీకటి నిండిన నర్తనశాలలో ప్రవేశించినాడు. తడుముకొనుచు వెళ్ళి మధ్యప్రదేశము చేరినాడు. అక్కడ ఉత్తర కొఱకు ఉండిన పాన్పును చూచినాడు. దానిపై తాను కూర్చున్నాడు. ద్రౌపదిని దూరముగా మరొక స్థలమున కూర్చుండుటకు నియమించినాడు. ద్రౌపది కూర్చున్నది.
    ఉభయులు సింహబలుని రాకకు నిరీక్షించసాగినారు. బయట అడుగుల చప్పుడు  వినిపించినది. ఉభయులు సచేతనులయి కూర్చున్నారు. వచ్చువాడు సింహబలుడని గ్రహించినాడు. అడుగుల చప్పుడును బట్టి ఒక్కడే వచ్చుచున్నాడని తెలుసుకొని సంతోషించినారు.
    సింహబలుడు అలంకరించుకొని వచ్చినాడు. అతనిలో కామము బుసలు కొట్టుచున్నది. అతడు గొంతువరకు కల్లు తాగినాడు. బయట చీకటి అతని మనసు చీకటి. అడుగులు తడబడగా నర్తనశాలలో ప్రవేశించినాడు. సింహపు గుహలోనికి ప్రవేశించు ఏనుగువలె నర్తనశాలలోనికి దూరినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.