Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"భీమా! నాథా! ఎట్లయినను నా మనసు మంట చల్లార్చు ఉపాయము ఆలోచింపుము. మన అజ్ఞాతవాసమునకు భంగము కాకుండ సింహబలుడు చచ్చు ఉపాయము ఆలోచించవలెను" అని బోధించినది.
ఉభయులు మౌనము వహించినారు. వారిలో ఎన్నియో ఆలోచనలు ముసురుకున్నవి. చాలాసేపు ఆలోచనలలో మునిగి పోయినారు. ఏదో ఆలోచన-ఉపాయము తట్టినట్లు భీముడు ద్రౌపది భుజములు పట్టి ఊపినాడు.
"ద్రౌపదీ! ఉపాయము తట్టినది. రేపురాత్రికి సింహబలుని చావు ని- క్కము" అన్నాడు భీముడు. ద్రౌపది ఆనందమున భీముని పట్టుకొని ఊపినది. ఆమె కనులలో వెలుగులు గోచరించినవి.
"ఉపాయము తెలియ చెప్పెదను. వినుము. ఈరోజు సింహబలుడు నిన్ను అవమానించి వెళ్ళినాడు. కావున వాడు నిన్ను పట్టుటకు మరల రేపు తప్పక వచ్చును. వాడు వచ్చినపుడు నీవు వాని ఇష్టమునకు సమ్మతించినదానివలె నటించుము. నర్తనశాలను సంకేత స్థలముగా నిర్ణయించి రాత్రికి ఒంటరిగా అక్కడికి రమ్మని చెప్పుము. నర్తనశాలలో వానిని చంపి నీకు సంతోషము కలిగింతును. అజ్ఞాతముగా వానిని చంపుటకు ఇంతకుమించిన ఉపాయములేదు. మాటలలో కాలము తెలియలేదు. తెల్లవారనున్నది. జనులు మేల్కొనవచ్చును. త్వరగా వెళ్ళుము. నేను చెప్పినట్లు చేయుము, అని ద్రౌపదిని పంపించినాడు భీముడు. కలతబారిన మనసుతో పడకమీద మేను వాల్చినాడు.
రాత్రి గడచినది. చీకట్లు తొలగినవి. తెల్లవారనున్నది. తూరుపు ఎర్రవారినది. చెట్లమీద పక్షుల గుంపులు మేల్కొన్నవి. రెక్కలు విదిలించి, కీచుకీచుమని ప్రకృతిని మేల్కొల్పినవి. పక్షుల కిచకిచలు చూడగా చెట్లు మేల్కొన్నట్లున్నది. అరుణోదయము ఆకాశమును ఎర్రపరచినది. అది కుంకుమ రాల్చుచున్నట్లున్నది. ఆ ఎర్రని కాంతికి తామరలు వికసించినవి. అవి మరింత ఎర్రనయినవి. ఎర్రని తామరలందు ముసిరిన నల్లని తుమ్మెదలు చీకట్ల గుంపులుగా కనిపించినవి. మలయామారుతము వీచినది. ఆ పిల్లగాలులకు, తుమ్మెదల తాకిడికి పూవులురాలినవి. ఆ విధముగా రాలిన పూవులు మన్మధుని పురాతన శరశాలలవలెనున్నవి.
కీచకునకు రాత్రి నిదురలేదు. ఉదయమగుటకు వేచి పడుకున్నాడు. తెల్లవారగా లేచినాడు. ఉదయ కాలమందు చేయదగిన పనులను ఆత్రముగా ముగించుకున్నాడు. అందముగా అలంకరించుకున్నాడు. కామాతురునకు మరొక ధ్యాస ఉండదు. అతడు త్వరత్వరగా సుధేష్ణ అంతఃపురమున దూరినాడు. అటు ఇటు చూడక ద్రౌపది కొఱకు వెదకుచు ఉరికినాడు.
కీచకునకు ద్రౌపది తటిల్లతవలె కనిపించినది. అతడు అక్కడ ఆగినాడు. ఆమె అతనిని చూడదలచలేదు. తలవంచినది. మౌనము వహించినది. కీచకుడు ఆమె వద్దనే అటుఇటు తిరిగినాడు. కూని రాగములు తీసినాడు. చప్పట్లు చరిచినాడు. నేలను తన్నినాడు. పకపక నవ్వినాడు. వికార చేష్టలు చేసినాడు.
ద్రౌపది ప్రతిమవలె నిలిచినది. మాట్లాడలేదు.
"సైరంధ్రీ! మౌనమే వహింతువు. మాట్లాడిన నోటి ముత్యములు రాలునా! ఒక చూపు చూచిన పూలవానలు కురియునా? అడుగు సైతము వేయవే రాయంచలు ఆడునా? నా ప్రాణములు నీమీద నిలిపినాను. నీ పాదములు కొలుచు భాగ్యము కలిగింపుము. ఈ నగరము సాంతము నీకు పాదాక్రాంతము అగును. నా భుజబలము వలన మత్స్యరాజ్యమును రక్షించుచున్నాను. పేరుకు మాత్రము విరాటుడు రాజు. అసలు ప్రభువును నేనే. ఎంతమంది స్త్రీలను పట్టినను నన్ను అడ్డగించువారు లేరు. నిన్న చూచినావు గదా నిండు సభముందు నిన్ను పట్టినాను. ఒక్కడైనను నన్ను ఎదిరించలేదు. అంతేకాదు పల్లెత్తుమాట అనలేదు. చూచినావుగదా నాప్రతాపము. ఇక నీగంధర్వ భర్తలలో ఒకడయినను దిగిరాలేదు. నిన్ను రక్షించలేదు. తెలిసినదా నా మహాత్మ్యము! నీవు నన్ను తప్పించుకొనలేవు. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను పట్టగలను. నీ మీద నాకు మనసయినది. నిన్ను వదులుత సాధ్యపడదు. నీవు కరుణించుము. నన్ను కనికరించుము. నా ఒడిలోనికి రమ్ము. నన్ను మురిపింపుము" అని యాచించినాడు సింహబలుడు.
ద్రౌపది దుర్బలుని మాటలు విన్నది. మనసులో నవ్వుకున్నది. "సింహబలా!" అని కీచకుని చూచినది. ఆ చూపుతూపులకు కీచకుని ప్రాణములు లేచి వచ్చినవి. అతడు ద్రౌపది పలుకులు వినుటకు ఆరాటపడినాడు.
"విన్నావా! కామాతురునివలె ప్రవర్తించుట నీవంటి వానికి తగదు. భర్తలు ఉన్న స్త్రీలు పరపురుషులతో రమించవలెనన్న జంకుదురు. మనసులందు ఎంతకామము ఉన్నను అణచుకొందురు. కావున నీవు నన్ను బయట పెట్టరాదు. సమయ సందర్భములను గమనించి, రహస్యము చెడకుండ, నీ కోరికకు తగిన భోగములను అనుభవించుము" అన్నది ద్రౌపది. సింహబలుని కవ్వించినది.
ద్రౌపది మాటలు విన్నాడు సింహబలుడు. పొంగిపోయినాడు. సంతోషము పట్టలేకపోయినాడు. "మాలినీ! నా మీద దయదలచినావు. చాలును. అంతేచాలును. కామాతురుడనయి సర్వము మరచినాను. నీవు చెప్పినది నిజము. సంకేత స్థలము నిర్ణయింపుము. అక్కడికి నీవు చెప్పినపుడే వత్తును" అని దేబరించినాడు.





