Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
సుధేష్ణ ద్రౌపది మాటలలోని కరకుదనమును అదరిపడినది. "మాలినీ! కోపగించుకొనకుము. జరిగిన దానిని మరచిపొమ్ము. దుఃఖము మానుము. నేను నా తమ్ముని కీచకుని దండింతును. నీకు సంతోషము కలిగింతును" అని ఓదార్చినది.
సుధేష్ణమాటలు విన్నది ద్రౌపది. నవ్వినది.
ద్రౌపది నవ్వునకు అనేక అర్ధములు అగుపించినవి.
"అమ్మా! మహారాణీ! ఇంత దయతలచినావు. చాలును. నీవు నీ తమ్ముని మీద కోపము వహించపనిలేదు. నాభర్తలు, మహాబలపరాక్రవంతులయిన గంధర్వులు ఉన్నారు. వారు నా అవమానమునుచూచినారు. వారు రోషమును దిగమింగి ఉండలేరు. వారే సింహబలుని శిక్షింతురు. సింహబలుడు చచ్చినగాని నా దుఃఖము ఆరదు"అని అక్కడి నుంచి వెళ్ళిపోయినది.
ఆమె నడకలో ప్రతీకారజ్వాల ప్రజ్వరిల్లినది.
సుధేష్ణ ద్రౌపది మాటలు విన్నది. ఆమె నడక చూచినది. సుధేష్ణ ముఖము వాడినది. ఆమె గుండెలో గుబులు పుట్టినది. అక్కడ ఉండిన సుధేష్ణ పరిజనులు సంతోషించినారు. సింహబలుడు నీచుడని, అతడు చావవలెనని కోరుకున్నారు. ద్రౌపది ప్రతిన నెరవేరవలెనని మనసార ఆశించినారు.
ద్రౌపది అవమాన భారము సహించలేకపోయినది. కోపము దుఃఖము ఆమెను దహించ సాగినవి. ఆమె స్నానమాడలేదు. భుజించలేదు. పడకటింటికి చేరినది. పాన్పుమీద పడినది. కన్నీరు జల జల రాలగా ఏడ్వసాగినది. ఆమెలో అనేక ఆలోచనలు గిరగిర తిరిగినవి. భీమునికి చెప్పి కీచకుని చంపించవలెనని నిశ్చయించుకున్నది. ఆ ఊహ ఆమెకు కొంత ఊరట కలిగించినది. ఆమె సూర్యుడు క్రుంగుటకు రాత్రి అగుటకు వేచి ఉన్నది.
అట్లుండగా సాయంకాలమయినది. ద్రౌపదికి కలిగిన అవమానము సహించలేక, సిగ్గుపడి, సూర్యుడు అస్తాద్రి చేరినాడు. చీకట్లు కమ్ముకున్నవి. రాత్రి అయినది. జనులు నిద్రకు ఉపక్రమించినారు.
అప్పుడు ద్రౌపది లేచినది. దుఃఖము దిగమింగినది. తన శరీరమునందలి దుమ్ము కడుగుకున్నది. తెల్లని శుభ్రమయిన వస్త్రము ధరించినది. అందరు నిద్రించినారని ధృవపరచుకున్నది. భీముడు ఉండు పాకశాలవైపు పయనము సాగించినది.
ద్రౌపది వంట ఇంటికి చేరినది. అక్కడ భీముడు నిద్రించుచున్నాడు. భీముని తట్టిలేపినది. భీముడు లేచినాడు. ద్రౌపదిని చూచినాడు. చకితుడు అయినాడు. "అర్ధరాత్రి వచ్చినావు. ఎవరును చూడలేదు కదా!" అడిగినాడు.
ద్రౌపది భీముని మాటలు విని మండిపడినది. "సభా సమక్షమున అవమానింపబడిన దానను, నన్ను ఎవరూ చూచినమాత్రమేమి? పలువురి ఎదుట నన్ను పట్టి, పడదోసి, తన్నిన సింహబలుడు నిశ్చింతగా నిదురించుచున్నాడు. నా అవమానమును కనులార చూచిన నీవును గాఢముగా నిదురించుచున్నావు! నీలోని బలము ఉడిగినదా! నెత్తురు చచ్చినదా! నా అవమానమును చూచి ఆనాడు కౌరవ సభలో అంతగా గంతులు వేసినావే! ఆ పౌరుషమంతయు నశించినదా! లేక వంటలవానిని అయి అన్నియు మరచినావా? నేను దాసిని అయినాను కాబట్టి దయ తప్పినావా?".
"మీ అన్న బహు ధర్మాత్ముడు. భార్యకు జరుగుచున్న అవమానమును సహించగలడు. అతని గాలి నీకు సోకినదా? లేక అతడు నీకు ఉపదేశించినాడా? అవమానము మింగమన్నడా? ప్రతీకారము చేయవద్దన్నాడా?"
"సింహబలుడు బ్రతికి ఉండగా నీకు నిదుర పట్టవచ్చు. ధర్మరాజు నిద్రించవచ్చు. కాని సింహబలుని బొందిలో ప్రాణమున్నంత వరకు నేను మాత్రము అన్నము ముట్టను. నిద్రపోలేను" అని భీముని పురికొల్పినది ద్రౌపది.
"ద్రౌపదీ!" భీముడు అరవబోయినాడు. ద్రౌపది భీముని నోరుమూసినది. "మన అజ్ఞాతవాసము ముగియలేదు. జనులు మేల్కొందురు. మెల్లగా మాట్లాడుము"అన్నది ద్రౌపది.
భీముడు లేచి కూర్చున్నాడు. ద్రౌపది మాటలు గ్రహించినాడు. మెల్లగా అన్నాడు:-
"ద్రౌపదీ! నిండు సభయందు ఆ దుర్మార్గుడు నిన్ను అవమానించినపుడు నేను మండిపడినాను. ఉద్రేకమున ఉప్పొంగినాను. అప్పటి నా స్థితి నీవు ఊహించలేవు. ఆకలిగొన్న సింహమువలె దూకి సింహబలుని, వారి పరిజనమును విరాటుని కూడ నుగ్గుచేసి ఉందును. బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, ధర్మమూర్తి అయిన ధర్మరాజు నన్ను శాంతింప చేసినాడు. అతని చూపులు, అతని మాటలందలి సందేశమును గ్రహించినాను. ఆ సమయమున ఆవేశామున నేను ఏమి చేసినను జనులు మనను గుర్తింతురు. ముగియనున్న అజ్ఞాతవాసము భంగమగును. మరల మనము వనవాసము చేయవలసి వచ్చును. దుర్యోధనుడు గెలిచినట్లగును. అందువలన శాంతించినాను. సత్యవ్రతుడయిన ధర్మరాజు కీర్తించవలసినవాడు. అతనిని నిందించరాదు".
భీముని మాటలు విన్నది ద్రౌపది. తామున్నస్థితి గ్రహించినది. "నాథా! నాదుస్థితి నీకు తెలియకున్నది. నేను అత్తగారయిన కుంతికి భయపడలేదు. దైవమునకు కూడ అంతగా భయపడను. ఇప్పుడు సైరంధ్రిగా మహారాణికి సేవలు చేయునపుడు ప్రాణములు అరచేత పెట్టుకొని జీవించుచున్నాను. ఆ విధముగా సేవలు చేసినను దుర్మార్గునిచేత అవమానము తప్పలేదు. దుఃఖ పరతాపము వలన బుద్ధి నశించినది. అందువలన ధర్మరాజును తూలనాడినాను. ధర్మరాజు ధర్మసత్య స్వభావయోగ్యతలు తెలియనిదానను కాను. ధర్మరాజు సమస్త జనులచేత స్తుతింపదగినవాడు".





