Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "మహారాజా! సభికులారా!" ద్రౌపది పలికినది. సభ అచేతన దశనుండి చేతనదశకు వచ్చినది. అందరు ఆమె మాటలు వినుటకు తలలు ఎత్తినారు.
    "ఇది న్యాయమా? ఇది ధర్మమా?" ద్రౌపది ధర్మదేవతనే నిలువరించి ప్రశ్నించినది "నా భర్తలు అయిదుగురు. వారు గంధర్వులు. శక్తిమంతులు. పరాక్రమవంతులు. మహావీరులు అరిభయంకరులు. వారు నాకు కలిగిన అమానుషమయిన అవమానమును చూచి మిన్నకున్నారు. అది నాకు ఆశ్చర్యము కలిగించుచున్నది".
    "ఈ సభలో ఇంతమంది జనులున్నారు. అందరును నాకు అవమానము జరుగుటను కనులార చూచినారు. ఈ కీచకుడు దుర్మార్గముగా నన్ను పట్టినాడు. పడదోసినాడు. నేను వివాహితను. పతివ్రతను. నిండుసభముందు నన్ను అవమానించినాడు. సభికులారా! మీకు ధర్మలోక భయము ఉన్నట్లు తోచదు. దయా దాక్షిణ్యములు ఉన్నట్లు కనిపించవు. అసలు పౌరుషము ఉన్నట్లు తోచదు".
    సభలోఉన్న ధర్మరాజు, భీముడు, ద్రౌపది వాక్యములు విన్నారు. మాట్లాడలేదు. సభికులు ద్రౌపది పరుష వాక్యములు విన్నారు. మాట్లాడలేదు. భర్తలు పలుకలేదు. సభ పలుకలేదు. ద్రౌపదిలోని అవమానాగ్ని ఆరలేదు. ఆమె విరాటుని సంబోధించినది:-
    "మహారాజా! పాపకార్యము చేయువారిని దండించుట ప్రభువుల ధర్మము. నన్ను అవమానించిన పాపాత్ముడు సింహబలుడు మీముందే నిలిచి ఉన్నాడు. మీముందే వాడు నన్ను జుట్టుపట్టి లాగినాడు. తన్నినాడు. పడదోసినాడు. ఈ విధముగా నిండు సభముందు ఒక పతివ్రతను అవమానించుట ఇంతవరకు జరిగి ఉండలేదు. ఇది మీముందు జరిగినది. మీరు మిన్నకుండుట ధర్మదేవత మౌనము దాల్చినట్లున్నది".
    ద్రౌపది ఉపన్యాసము విరాటుని కదిలించినది. అతనిలోని దయారసము పొంగినది. ధర్మము చేయవలెననియే అనుకున్నాడు. కీచకుని శిక్షించవలెననియే అనుకున్నాడు. కాని అతనికి సింహబలుని జయించుశక్తి లేదు. ఏమి చేయుటకు తోచలేదు. అప్పుడు విరాటుడు "సాంత్వనమున వల్కిరోషభరిత స్థితి గంపిత మూర్తియైన యాతని మది కుందువాపిన నతండును బోయె నివాసభూమికిన్".
    కీచకుడు ఆ స్థలము వదలి వెళ్ళిపోయినాడు. అప్పుడు సభలోని జనులు పలు విధములుగా చెప్పుకున్నారు.
    "ఈమె రూప సౌందర్యమును చూచిన సైరంధ్రివలె తోచదు. గంధర్వాంగన సైరంధ్రి వేషము వేసినట్లున్నది".
    "ఈమెను తనముందు అవమానించగా విరాటుడు మిన్నకున్నాడు. అది మంచిదికాదు".
    "మహారాణి ఉపేక్షించుటవలననే సైరంధ్రికి ఇంత అవమానము జరిగినది".
    ద్రౌపది మాటలు విని, విరాటుని బలహీనతను చూచిన ధర్మరాజు కోపము దిగమ్రింగి ద్రౌపదితో అన్నాడు:-
    "మాట్లాడినది చాలు. విరాటుడు నీ అవమానమును తెలుసుకున్నాడు. నీ భర్తలగు గంధర్వులకు సమయ నియమములు ఉన్నట్లున్నవి. వారును మిన్నకున్నారు. నిండు సభలందు భర్తలణు ఇట్లు తూలనాడుట మంచిదికాదు. ఇక్కడినుంచి వెళ్ళుము. సుధేష్ణాదేవి అంతఃపురమునకు చేరుము".
    ద్రౌపది ధర్మరాజు మాటలు విన్నది. ధర్మరాజు ఆమెను అక్కడినుంచి వెళ్ళిపొమ్మన్నాడు. ఆమె కదలలేదు. అక్కడనే నిలిచి ఉన్నది.
    ద్రౌపది మరేమో చెప్పదలచినదని ధర్మరాజు జంకినాడు. "మాలినీ! ఏమది కదలక అట్లే నిలిచి ఉన్నావు? అనేక విధముల పోకలు పోవుచు తమ ఇష్ట ప్రకారము నాట్యమాడు స్త్రీవలె నీవు ఇక్కడ నిలిచి ఉండుట మంచిదికాదు. సభముందు నిలిచి మాట్లాడుట కులస్త్రీలకు తగదు. వెళ్ళుము. ఇక్కడి నుంచి నిష్క్రమించుము" అన్నాడు.
    ద్రౌపది ధర్మరాజు మాటలు విన్నది. ఆమె గుండెలో సెగలు ఎగసినవి. అన్నది:-
    "కంకుభట్టూ! నీవన్నది నిజము. నా మగడు నాట్యములాడు వాడు. అతని వలెనె నేనును మేళముకట్టి నాట్యములాడుచు జీవింతును. అంతేకాదు నా మగడు జూదరి. అందువలన జూదరికి భార్యను అయినాను. అది నా స్థాయి. నాకు సంస్కారము, గర్వము భర్తలణు బట్టియేగదా వచ్చునది".
    ద్రౌపది తన కోపము వెళ్ళగక్కినది. ధర్మరాజును ఈసడించినట్లు చూచినది. విసురుగా వెళ్ళిపోయినది.
    సభాస్థలము నుండి బయలుదేరిన ద్రౌపది సుధేష్ణవద్దకు వెళ్ళినది. సుధేష్ణ ద్రౌపదిని చూచినది. ఏమి ఎరుగని దానివలె "మాలినీ! ఎందుకు అట్లున్నావు? శరీరము దుమ్ముకొట్టుకొని ఉన్నది. ముఖము చిన్నబోయినది. వెంట్రుకలు విరబోసి ఉన్నవి. ఏమి కారణము? ఏమి అయినది" అని అడిగినది.
    "మహారాణీ! ఎరుగని దానివలె అడుగుచున్నావు. మీ తమ్ముడు కీచకుడేకదా నా అవమానమునకు కారకుడు. నీవేకదా నన్ను కల్లు తెచ్చుటకు పంపినావు! నేను అక్కడికిపోగా నీతమ్ముడు నన్ను పట్టినాడు. నేను అతనికి లొంగక అతనిని పడదోసి, మహారాజు సభవైపునకు ఉరికినాను. నీతమ్ముడు నన్ను వెన్నంటినాడు. నిండు సభముందు నన్ను పట్టినాడు. తన్నినాడు. పడదోసినాడు. నాకు నీవుచూచుచున్న ఈ గతి పట్టించినవాడు నీ తమ్ముడు. నీ తమ్ముడు కీచకుడు, సింహబలుడు".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.