Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ద్రౌపది సుధేష్ణ వెళ్ళిన వైపు చూచినది. తన స్థితిని తలచుకున్నది. గత్యంతరము లేదనుకున్నది. కన్నీరు తుడుచుకున్నది. ధైర్యము తెచ్చుకున్నది. బంగారు గిన్నె అందుకున్నది. కీచకుని ఇంటివైపు సాగినది.
    ద్రౌపది మనసు వికలము అయినది. గుండె దడదడలాడినది. నోరు ఆరిపోయినది. కాళ్ళు తడబడినవి. ఒడలు చెమటలు కారినవి. ముఖము తెల్లబారినది. ఆవేదన, భయము, ఆతురత కనిపించినవి. ఇవ్విధంబున ద్రుపద పుత్రి దురవస్థం బొందుచు మహాపదలకుం అరిహరణంబునకు హరిస్మరణంబయని తన హృదయ పుండరీకంబునం బుండరీకాక్షు నిక్షేపించుకొని బెబ్బులియున్నపొదను సొచ్చులేడిచందంబున సింహబలుమందిరంబు సొచ్చినంత.
    కీచకుడు ద్రౌపదిని  దూరము నుండియే చూచినాడు. వానికి తొందరపాటు హెచ్చినది. కంఠమునందుగల హారములు సవరించ సాగినాడు. కన్నులందు చిలిపిదనము తొంగిచూచినది. దేహమున చిరు చెమటలు కలిగినవి. అతడు ద్రౌపదిని చూచినాడు. వెకిలిగా నవ్వినాడు.
    ద్రౌపది తలవంచుకొని, కూజాపట్టుకొని వాకిట నిలిచినది. "సుధేష్ణ దప్పిగొని ఉన్నది. కల్లుతెమ్మని నన్ను ఇక్కడికి పంపినది. కల్లుపోయించుము" అన్నది.
    "వయ్యారీ! వాకిట ఏల నిలుతువు! రమ్ము. నా గుండె వాకిట చేరుము. దప్పి సుధేష్ణది మాత్రమే తీర్తువా? నా దాహము తీర్పవా? నా తనువు, మనసు నీ కొఱకు తపించుచున్నవి. రావా నన్ను ఏలుకొనవా? సిగ్గువదులుము. రమ్ము. నా కౌగిట చేరుము" అన్నాడు కీచకుడు. అడుగుముందుకు వేసినాడు.
    "సుధేష్ణ దప్పిగొని ఉన్నది. కల్లు తెమ్మని నన్ను ఇక్కడికి పంపినది. నేను త్వరగా వెళ్ళవలెను. కల్లుపోయించుము. ఆలస్యమయిన మహారాణి కోపించును" ఒక అడుగు వెనుకకు వేసి అన్నది ద్రౌపది.
    "మాలినీ! సుధేష్ణకు కల్లు కావలెనా? అది నీవు తీసుకొని వెళ్ళవలెనా? కల్లు సుధేష్ణకు నిమిషములో అందును. దానిని ఇతరులచేత పంపుదును. రమ్ము నీవు కల్లు త్రాగుము. మన్మథుని బాధ భరించలేకున్నాను. నన్ను కాపాడుము".
    "సైరంధ్రీ! నిన్ను నా రాణిని చేసికొందును. నా రత్నహారములన్నింటిని నీకు ఇచ్చెదను. నా సౌధములను నీకు అప్పగింతును. దాస, దాసీ జనమును సమకూర్తును. నా భార్యతో నీకు చాకిరి చేయింతును" అన్నాడు ముందుకు ఉరికినాడు. ద్రౌపదిని పట్టినాడు.
    ద్రౌపది ధైర్య సాహసములు గలది. ఆమె లొంగలేదు. ఏడవలేదు. తన చేతులతో కీచకుని గట్టిగా త్రోసినది. ద్రౌపది తోపునకు కీచకుడు కూలినాడు. కీచకుని పడదోసిన ద్రౌపది వాకిలి దాటి ఉరికినది. ఆమె ఉరక సాగినది. ఎక్కడికి పోవలెను? ఆమె ఆలోచించినది. వెనుకకు చూచినది. సింహబలుడు ఉరికి వచ్చుచున్నాడు. తనను తరుముకొని వచ్చుచున్నాడు. ఆమెకు విరాటుని సభ గుర్తుకు వచ్చినది. సభవైపు ఉరికినది. విరాటుడు సభ తీరి ఉన్నాడు.
    సింహబలుడు ద్రౌపదిని వెన్నాడినాడు. మదపుటేనుగు జంతువును పట్టుటకు, రాక్షసుడు అప్సరసను పట్టుటకు, గద్ద నాగసర్పమును పట్టుటకు, పిల్లి గోరువంకను పట్టుటకు ఉరికినట్లు ఉరికినాడు సింహబలుడు. నిండుసభ. విరాటుడు చూచుచున్నాడు. సభికులు చూచుచున్నారు. సభలో ఉన్న ధర్మరాజు చూచుచున్నాడు. భీముడు చూచుచున్నాడు. కీచకుడు అందరి ఎదుట, బహిరంగ ప్రదేశమున ద్రౌపదిని భయంకరముగా పట్టినాడు. ద్రౌపది విదిలించి కొట్టినది. కీచకుడు కిందపడినాడు. కిందపడిన కీచకుడు లేచినాడు. ఒడుపు తప్పిన సర్పమువలె నిట్టూర్పులు విడిచినాడు. మహా కోపమున సభను చూచినాడు. విరాటుని చూచినాడు.
    ద్రౌపదికి జరిగిన అమానుషము అయిన అవమానమును చూచినాడు. ధర్మరాజు తలవంచుకున్నాడు. భీముడు ఆగ్రహోదగ్రుడయినాడు. అతడు ప్రళయ భయంకరమయిన అగ్గివలె మండిపడినాడు. అతనికి అజ్ఞాతవాసము గుర్తుకురాలేదు. ఆవేశామున అన్నియు మరచినాడు. సింహబాలుని చంపదలచినాడు. ఎదురుగా ఉన్న ఒక వృక్షమును మహారౌద్రముగా చూచినాడు.
    భీముని చూచి ధర్మరాజు అదిరిపడినాడు. "వలలుడా! నీవు చూచునది వంటచెరకుగా పనికివచ్చు వృక్షముకాదు. అది పుష్పించి, ఫలించు చెట్టు. జనులకు నీడ ఇచ్చి, పక్షులకు తావరము కలిగించు వృక్షము. వంట కట్టెలకు దీనిని ఖండింపరాదు" అని నిగూఢముగా సందేశమును అందించినాడు.
    ధర్మరాజు నిగూఢమయిన సందేశమును భీముడు గ్రహించినాడు. ఆగ్రహముణు అణగదొక్కుకున్నాడు. ద్రౌపదిని పట్టిపడవేసినాడు కీచకుడు. ఆమె ఒడలంతయు మట్టితో నిండినది. ముఖము ధూళి ధూసరితము అయినది. వెంట్రుకలు చెదరిపోయినవి. ఆమె కనులలో ప్రతీకార జ్వాల ప్రజ్వరిల్లినది. ఆమెకు ధర్మరాజు సందేశము అర్ధము అయినది. కోపమును అణచుకొనుటకు ప్రయత్నించినది. ఆమె లేచి నిలబడినది. ఆమె మూర్తీభవించిన శోకమువలె ఉన్నది. మంట సెగకు మగ్గిన  తీగవలె ఉన్నది.
    ఆమెను చూచినాడు కీచకుడు. అదరినాడు. కదలక మెదలక నిలిచినాడు. సభసాంతము ద్రౌపదిని చూచినది. కృంగినది. చిత్తరువువలె నిలిచినది. ఒక్కడు పెదవి కదల్పలేదు.
    ద్రౌపది విరాటుని చూచినది. అతడు తలవంచుకున్నాడు. సభను సాంతము కలయచూచినది. ఆమెచూపు వాడికి తట్టుకొనలేక పోయినారు. సభ సాంతము తలవంచుకున్నది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.