Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
వీడు మంచి మాటలతో వినువాడుకాడు అనుకున్నది ద్రౌపది "కీచకా! నన్నుకోరుకొనకు. నీ ప్రాణములకే ముప్పుతెచ్చుకొనకు. నేను అనాధను అనుకొనుచున్నావు. నాకు అయిదుగురు భర్తలు ఉన్నారు. వారు గంధర్వులు. మహాబలపరాక్రమ, శౌర్యధైర్యవంతులు. వారు నీ ప్రాణ మానములను హరించగలరు. కావున నీ కోరిక చంపుకొనుము. నీవు జీవింపుము" అని హెచ్చరించినది ద్రౌపది.
"సుందరీ! సైరంధ్రీ! ఏల నన్ను బెదరింతువు! నా ప్రాణములకు ముప్పురదు. నన్ను ఎదిరించువారు ముల్లోకములందు లేరు. నన్ను బెదిరించుట మానుము. నీవు అంగీకరించుము. నా ప్రాణములు కాపాడుము" అని బీరములు పలికినాడు కీచకుడు.
"కీచకా!" ద్రౌపది ఉద్రేకముగా అన్నది. "నీవు నీచుడవుగా కనిపించుచున్నావు. నీకు విచక్షణ లేనట్లున్నది. అందని ఫలముల కేల అర్రులు చాతువు? ఆడది అగ్నివంటిది. దానిని ఆశించి ఎందుకు నశింతువు? పూర్వము సీతా సాధ్విని కోరి రావణుడు మొదలంట నశించినాడు. బుద్ధి తెచ్చుకొనుము. నీ కోరిక చంపుకొనుము. నీవు జీవింపుము".
కీచకుడు ద్రౌపది మాటలు విన్నాడు. ఆమె తనకు లొంగునట్లు లేదని గ్రహించినాడు. ద్రౌపదిని అక్కడనే వదిలి ఆరాటముగా అక్కదగ్గరకు వెళ్ళినాడు. కాదు. ఉరికినాడు.
"అక్కా! అది, ఆ స్త్రీ, సుందరి, సైరంధ్రి, నా మనసున చిచ్చు పెట్టినది. నన్ను దహించుచున్నది. నాకు ఆమె పొందు కావలెను. నేను దగ్గరకు పోయిన ఆమె దూరము అగుచున్నది. నన్ను లెక్క చేయకున్నది. ఆమెను నావద్దకు పంపుము. లేకున్నా నేనేమగుదునో నాకు తెలియదు. నేనేమి చేతునో నాకు తెలియదు. ఇక నీ ఇష్టము" అన్నాడు కీచకుడు. విసురుగా వెళ్ళిపోయినాడు.
సుధేష్ణ తమ్ముని వెనుక సాగినది. కొంత దూరమున అతనిని ఆపినది. కీచకునకు నీతులు చెప్పినది. పరస్త్రీలను కోరవద్దన్నది. కార్చిచ్చును కౌగలించవద్దన్నది. కీచకుడు వినలేదు. ద్రౌపదికి గల అయిదుగురు గంధర్వ భర్తలను గురించి చెప్పినది. అతడు పట్టించుకొనలేదు.
"అక్కా! నాకు నీతులు కాదు సైరంధ్రి కావలెను. ఇప్పుడే, ఇక్కడనే, ఆమెను రప్పింపుము. ఒప్పింపుము. కాకున్న నేనేమగుదునో నాకు తెలియదు. నేనేమి చేతునో నాకు తెలియదు" ఆవేశముగా అన్నాడు కీచకుడు.
కామియగువాడు ఎన్నిమాటలు చెప్పినను వినడు. ఎన్ని నీతులు చెప్పినను తలకు ఎక్కవు. సైరంధ్రి లేకున్న వీడు ఇప్పుడే చచ్చునట్లున్నాడు. వెనుకనుండి వచ్చు ఆపదలను వెనుక చూచుకొనవచ్చును అనుకున్నది సుధేష్ణ.
"తమ్ముడా! నీకు కావలసిన సైరంద్రిని నీ ఇంటికి పంపుదును. నిశ్చింతగా వెళ్ళుము. కల్లు తెమ్మని సైరంధ్రిని ఇప్పుడే నీవద్దకు, నీఇంటికి పంపుదును. ఆ తరువాత నీ ఇష్టము వెళ్ళుము" అని కీచకుని పంపినది.
కీచకుడు తన ఇంటికి చేరినాడు. అచట నానావిధ పదార్ధములను కూర్చినాడు. మధుర రసములను తెప్పించినాడు. ఇంటిలోని జనులందరిని పంపించినాడు. ఒంటరిగా ఒక మనోహర స్థలమున ద్రౌపదిరాకకై నిరీక్షించుచు, నిలువలేక అటు ఇటు పచారు సేయసాగినాడు. ద్రౌపది రావలసిన దిశకే చూపు వప్పగించి చూడ సాగినాడు.
సుధేష్ణ సైరంధ్రిని పిలిపించినది. సైరంధ్రి వచ్చి ఆమె ఎదుట నిలిచినది. తలవంచుకున్నది. ద్రౌపది దిగమింగిన దుఃఖమువలె కనిపించినది. ద్రౌపది మాట్లాడలేదు. సుధేష్ణ మాట్లాడలేదు. ఇద్దరి మనసులందు ఏవో ఆలోచనలు ముసురుచున్నవి. ఏవో తుఫానులు చెలరేగుచున్నవి.
సుధేష్ణ మౌనము సహించలేకపోయినది. "సైరంధ్రీ! నాకు దప్పిగా ఉన్నది. కల్లు తాగవలెననిపించుచున్నది. నా తమ్ముని ఇంత మంచి కల్లు ఉండును తెచ్చి పెట్టుము" అనవలసిన మాటలు అని బరువు దించుకున్నది. ఒక నిట్టూర్పు విడిచి ద్రౌపదిని చూచినది.
ద్రౌపది తల ఎత్తి సుధేష్ణను చూచినది. ఆమె చూపులు అగ్నిబాణములవలె ఉన్నవి. వాటి తాకిడికి సుధేష్ణ ముఖము వాడినది. ఆమె తలవంచుకున్నది.
"అమ్మా! మహారాణీ! ఇది నీకు న్యాయమా?" ద్రౌపది అడిగిన మాటలు సుధేష్ణకు ఈటెలుగా తగిలినవి. "కల్లు తెచ్చుటకు ఇతర పరిచారికలు లేరా? నన్నే పంపవలెనా? గౌరవముగా బ్రతికిన దానను. గంధర్వుల భార్యను. మానహీనను కాను. నేను ముందే చెప్పినాను. నన్ను చెడుపనులకు పంపవద్దని, ఎంగిలికి లోబరచవద్దని, ఆనాడు నీవు అంగీకరించినావు నన్ను కొలువు ఉంచుకున్నావు. ఇప్పుడు ఈ పనికి నియమించుట తగదు. నీకు అనేక మంది పరిచారికలు ఉన్నారు. వారిలో ఒకరిని పంపమని మనవి".
ద్రౌపది మాటలు విన్నది సుధేష్ణ. ఆమెలో ఆటుపోట్లు వచ్చినవి. మనసు గాలికి దీపమువలె రెపరెపకొట్టుకున్నది. ఏమి అనవలెనో అర్ధము కాలేదు. అయినను అన్నది.
"సైరంధ్రీ! నీయందుగల స్నేహమున కల్లు తెమ్మన్నాను. ఇది నీచకార్యము కాదు. స్నేహ కార్యము. నా తమ్ముని ఇంటికి పొమ్మన్నాను. అది పరగృహము ఎట్లగును? అదిగో అక్కడ బంగారు కూజా ఉన్నది. తీసుకొని వెళ్ళుము" సుధేష్ణ అక్కడ నిలువలేకపోయినది. దిగ్గునలేచి వెళ్ళిపోయినది.





