Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"మహారాజా! ధర్మరాజు పలికినాడు. సకల జనులు అతని మాట వినుటకు ఏకాగ్రులయినారు. మన ఇంత వంటలవాడు ఉన్నాడు. వలలుడు. అతడు పూర్వము ధర్మరాజు సభలందు అనేకమంది మల్లులను గెలిచినాడు. అతనిని పిలిపించుము. నిన్ను మెప్పించగలడు".
విరాటుడు వెంటనే వలలుని పిలిపించినాడు. "నీవు ఈ మల్లునితో యుద్దము చేయవలసి ఉన్నది" అన్నాడు. భీముడు ధర్మరాజును చూచినాడు. ధర్మరాజు కనుసైగచేసి తన సమ్మతిని తెలియచేసినాడు.
"మహారాజా! పూర్వము ధర్మరాజు సభలందు అనేకమంది మల్లులతో పోరినాను. ఇప్పుడు వీనితో పోరి నీకు వినోదము కలిగింతును" అన్నాడు భీముడు. సాధనములను సమకూర్చుకున్నాడు. ఊరికి వచ్చినాడు. రంగమున దూకినాడు.
భీముడు మల్లుని నఖ శిఖ పర్యంతము చూచినాడు. మల్లుడు భీముని చూచినాడు. ఇరువురును అరచేతులతో మట్టిని అంటుకున్నారు. శరీరములపై చల్లుకున్నారు. భుజాస్ఫాలనములు చేసి యుద్దమునకు దిగినారు.
మల్లుడు భీముని మీదకు ఉరికినాడు. మల్లుని భంగము చేయగలడు భీముడు. అయినను తప్పుకున్నాడు. కాని దాడి చేయలేదు. విరాటునాకు వినోదము కలిగించుటకు భీముడు చాలాసేపు మల్లునితో "ఉత్తుత్తి" పోరాటము సలిపినాడు. ఆ పట్టులకే మల్లుడు నీరసించినాడు. డీలా పడినాడు. అప్పుడు భీముడు మల్లుని మొలపట్టి పైకెత్తినాడు. గిరగిర తిప్పినాడు. నేలమీదవేసినాడు. నేలమీద పడిన మల్లుని కాలు సేతులు వ్రేలాడినవి. ముక్కునుండి, నోటినుండి నెత్తురులు కారినవి. భీముడు మల్లుని చంపదలచలేదు. వదలివేసినాడు. రక్తసిక్తుడయిన మల్లుడు లేచి ఒడలు దులుపుకున్నాడు. ఓడిన గుర్తుగా తలవంచి నిలిచినాడు. భీముడు విజయోత్సాహమున నిలిచినాడు.
జనులందరు భీముని విజయమును కేకలు వేసి చప్పట్లు చరచి కొనియాడినారు. మెచ్చుకున్నారు. విరాటుడు మెచ్చుకున్నాడు. ధనము ఇచ్చినాడు. భీముడు అక్కడ ఉన్న యాచకులకు ఆ ధనమును ఇచ్చినాడు.
ధర్మరాజు భీముని మెచ్చినాడు.
అప్పుడప్పుడు భీముడు ఆవిధముగా విరాటునాకు వినోదములు కలిగించినాడు.
పాండవుల అజ్ఞాతవాస సంవత్సరము ముగియనున్నది. కొన్ని రోజులు మాత్రము మిగిలినవి. అట్లుండగా ఒకనాడు సింహబలుడు అను కీచకుడు సుధేష్ణ అంతఃపురమునకు వచ్చినాడు. అతడు సుధేష్ణకు తమ్ముడు. విరాటుని బావమరిది. మత్స్యదేశపు సేనాధిపతి. కీచకుడు రూపవంతుడు. బలవంతుడు. గర్వవంతుడు.
కీచకుడు అంతఃపురమునకు వచ్చినాడు. అక్కడ ద్రౌపదిని చూచినాడు. ఆమె అందమును అవలోకించినాడు. ఆశ్చర్యపడినాడు. ద్రౌపది సౌందర్యమునకు ముగ్ధుడు అయినాడు. అతనిలో కామము మొలచినది. కీచకుని మనసు పిట్ట అయినది. ద్రౌపది అందము అను వలలో చిక్కుకున్నది. గిజగిజ కొట్టుకున్నది.
కీచకుడు ద్రౌపదినే చూడసాగినాడు. ఆమె అందమును కనులతో తాగ సాగినాడు. అతని అవయవములందు కామాగ్ని రగిలినది. అగ్నిని ఆర్పవచ్చును. కామాగ్నిని ఆర్పుట దుస్తరము. అది మనిషిని కాల్చి బూడిద చేయును.
ద్రౌపది కీచకుని చూపులు చూచినది. ఆమె అవమానమున కృంగినది. కోపమున మండినది. దుఃఖమున తపించినది. దిక్కులేనిదానివలె వడకినది.
ద్రౌపది నిలిచినది. సింహబలుని చూచినది. వాడు కామవికారమున కాలుచున్నాడు. ఆమె గ్రహించినది. తన బలహీనతను తిట్టుకున్నది. దుఃఖమును దిగమింగినది. భయమును పారదోలినది. ధైర్యము వహించినది. సాహసము కనబరచినది. కీచకుని చూచినది. ఆ చూపులందు ధైర్యసాహసములు ఉన్నవి. ధిక్కారము ఉన్నది. తృణీకారము ఉన్నది. తూష్ణీభావము ఉన్నది.
కీచకుడు ద్రౌపది చూపులు చూచినాడు. ఆ చూపులందలి దావాగ్నిని చూచినాడు. వెనుకంజ వేసినాడు. వెనుదిరిగి, పెద్ద పెద్ద అంగలు వేసి వెళ్ళిపోయినాడు. ద్రౌపది తలవంచుకున్నది. అక్కడి నుండి వెళ్ళిపోయినది. అంతయు చూచుచుండిన సుధేష్ణ పరిచారికలు నిట్టూర్పు విడిచినారు.
ఆ కథ అంతటితో ముగియలేదు. కీచకుడు కామాగ్ని తప్తుడు. అతడు ఒకచోట నిలువలేక పోయినాడు. కాలుకాలిన పిల్లివలె తిరిగినాడు. అతనికి లోకము సాంతము ద్రౌపదిగా కనిపించినది. ద్రౌపది చిచ్చు అతని మనసును రగిలించసాగినది.
కీచకుడు నిలువలేక పోయినాడు. సుధేష్ణవద్దకు ఉరికినాడు. ఆమె పాదములకు మ్రొక్కినాడు. సుధేష్ణ బంగారుపీట తెప్పించి వేసినది. కూర్చున్నాడు. కాని తత్తరపాటుగానే ఉన్నాడు. "అక్కా! ఆమె, అదే నేను చూచినా సుందరి ఎవరు? పేరేమి? కులమేమి? మగడున్నాడా? వాడెవ్వడు? నీకు ఆమెయందు అభిమానము ఎందులకు? కీచకుడు అడుగుచున్నాడు కాని అతని చూపులు ద్రౌపదిని వెదకుచున్నవి. మనసు గిలగిలలాడుచున్నది. గుండె దడదడలాడుచున్నది.
సుధేష్ణ తమ్ముని చూచినది. అతని కామ పరితాపము గ్రహించినది. అతని వేషము పిచ్చిగా ఉన్నది. చేష్టలు వెకిలిగా ఉన్నవి. ఆమె ఇతర సంభాషణములు సాగించినది. కీచకుడు అది వినలేదు. అక్కడి నుండి లేచినాడు. సుధేష్ణ అతనిని చూచుచు ఉండిపోయినది.
కీచకుడు తడబడుచున్న నడకతో సాగినాడు. ద్రౌపది కొరకు తిరుగసాగినాడు. తిరిగినాడు. తిరిగినాడు. తుదకు ద్రౌపది కనిపించినది. అక్కడ ఆగినాడు. నిలిచిపోయినాడు".
"సుందరీ! నీవంటి అందగత్తెను నేను ఈ లోకమున చూడలేదు. నీ పేరేమి? నీవు ఎవ్వరిదానవు? దేవలోకము నుండి ఎప్పుడు దిగివచ్చినావు?".
ద్రౌపది లేచి నిలిచినది. అతని మాటలు విననట్లు ప్రవర్తించినది. అతనిని చూడలేదు. నేలను చూచినది. ఆమె చూపులకు నేల కృంగిపోవలసినది. కాని పోలేదు.
"సుందరీ! ఒకసారి ఇటు చూడవా! పూలజల్లు కురిపించవా? ఒకసారి నవ్వవా! ముత్యాలు రాల్చవా? ఒక్కపలుకు పలుకవా? కోకిలలు కూయించవా?"
"నిన్ను చూడజాలక చూడకున్నాను. తాకజాలక తాకకున్నాను. కోరిక మాత్రము మనసున రగులుచున్నది. మన్మధుడు నన్ను కాల్చుచున్నాడు. నీవు కాదన్న కాలిచత్తును. అవునని నన్నుకాపాడుము, బ్రతికించుము".
ద్రౌపది నిర్వికారముగా నిలిచినది. నేర్పుగా తప్పించుకొనవలెను అనుకున్నది. నయముగ చెప్పిచూడ దలచినది. అన్నది:-
"అన్నా! నేనెక్కడ? నీవెక్కడ? ఏమిటీ వెఱ్ఱి కామము? నీవంటి సజ్జనులకు పరస్త్రీలను కోరుట తగునా? నీకు అక్కచెల్లెండ్రు ఉన్నారు. అదియైన తలచవా? నా స్థితిని చూచినావా? మురికిగా ఉన్నాను. మాలిన వస్త్రము ధరించినాను. హీనకులమున పుట్టినాను. పెండ్లి అయిన దానను. పతివ్రతను. నన్నుకోరుట నీకు ధర్మముకాదు. నీ కోరిక చంపుకొనుము. నీవు జీవించుము".
"కోమలీ! నీవు హీనకులమున పుట్టినదానవుకాదు. అందుకు నీ సౌందర్యమే సాక్షి. గంధర్వాంగనవంటి నీవు నీచకులమున పుట్టుటయా! అసంభవము. ఇక పరస్త్రీని భోగించిన పాపమందువా? నేను నరకమున పడి నరకబడుదునుగాక-కాని ఈ మన్మధబాధ ఓర్చలేను. నీవు అంగీకరించుము. నా ప్రాణములు కాపాడుము" అని ఏడ్చినంత పనిచేసినాడు కీచకుడు.





