Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "అమ్మా! నీవు అట్లు తలచవద్దు. నేను సామాన్య స్త్రీనికాదు. నన్ను అంటుకున్నవాడు అగ్నిని అంటుకున్నట్లు భస్మమగును. నాకు అయిదుగురు భర్తలు. వారు గంధర్వులు. ఒకానొక కారణమున శత్రువులు, నా భర్తలముందే నన్ను జుట్టుపట్టి ఈడ్చినారు. నా భర్తలతో వనములందుండి కంద మూలములు తిని జీవించినాను. ఈ ఒక్క సంవత్సరము నియమము పాటించవలసి ఉన్నది".
    "అమ్మా! నీవు అనుకొనునట్లు జరుగుటకు వీలులేదు. నా భర్తలు నన్ను ఏమరియుండరు. నన్ను నీచ దృష్టితో చూచిన వానిని శివకేశవులు అడ్డువచ్చినను హతమార్చి తీరుదురు. అంతేకాదు నా చిత్తము పురుషులను స్మరింపదు. కాబట్టి నీ సంశయము విడువుము. నన్ను నీవద్ద కొలువు ఉంచుకొనుము. సజ్జనులు స్తుతించునట్లుగా ప్రవర్తింతును. పెద్దలు మెచ్చునట్లుగా వర్తింతును".
    "అమ్మా! ఒక్కమాట! నన్ను చెడుపనులకు పంపవద్దు. ఎంగిలికి లోబరచవద్దు. అందుకు అంగీకరించిన నా భర్తలు అయిదుగురును నేనును మిమ్ము కొలుచుచుందుము" అన్నది. ఆమె దీనముగా ఉన్నది.
    సుధేష్ణ ద్రౌపది మాటలు విన్నది. ఆడదాని కష్టములు గ్రహించినది. ఆమె మనసు కరిగినది. సుధేష్ణ కనులు చెమ్మగిలినవి. ఆమె ద్రౌపదిని ఓదార్చినది. ద్రౌపదిని తనకు పరిచారికగా గ్రహించి ఆదరించినది.
    ద్రౌపది సుధేష్ణ కొలువులో చేరినది.
    
                                                         ఆలోచనామృతము
    
    1. ఎంతటి వీరులు పాండవులు- ఎంతటి దుర్బలుడు విరాటుడు! పాండవులు విరాటుని కొలువున చేరవలసి వచ్చినది. దీనినే "కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్" అన్నారు. పాండవులు ఏనుగులవంటివారు. విరాటుడు దోమతో సమానము. ఏనుగులగుంపు దోమ కుత్తుకలో చొరుట సాధ్యమా? అసాధ్యము. పాండవులు అతిదీనులయి అసాధ్యమయిన పనిని సాధ్యము చేసినారు.
    2. విరాటుడు కురు భూమికి అతిదూరముగా ఉన్న వాడనుట నిశ్చయము. అతనికి పాండవుల కథ తెలిసినట్లు కనిపించదు. ఎన్నిసార్లు ధర్మరాజు మాట ఎత్తినను అతడు ఉలకడు పలుకడు. కనీసము ధర్మరాజునకు సానుభూతి ప్రకటించడు.
    ద్రౌపది సుధేష్ణకు చాల స్పష్టముగా అయిదుగురు భర్తలు. ఉన్న విషయము చెప్పినది. అనేకమంది భర్తలు ఉండుట అసామాన్యము. అది ఆనాటి నుండి ఈనాటి వరకు ద్రౌపదికే చెల్లినది. కాని ద్రౌపది విషయము సుధేష్ణకు తెలిసినట్లు కనిపించదు.
    అయిదుగురు పురుషులు, ఒక స్త్రీ ఒకేసారి తన కొలువున చేరినారను అనుమానము సహితము రాదు విరాటునికి.
    అట్లనిన పాండవుల కథ మత్స్యదేశమునకు తెలియదని తేట తెల్లమగుచున్నది.
    3. పాండవులు అయిదుగురును, ద్రౌపదియు ఒకేరోజు విరాటుని సభకు వచ్చి  ఉండరు. ఒకరి తరువాత ఒకరు విరాటుడు కొలువు తీరినపుడే వచ్చినారు.
    విరాటుడు బహిరంగ ప్రదేశమున కొలువు తీరినట్లు కనిపించును. వచ్చిపోవువారిని అతడు గమనించిన తీరు, అశ్వ  పరీక్ష మున్నగువానిని చూచి అది బహిరంగ ప్రదేశము కావచ్చునని నిర్ణయించవలసి వచ్చినది.
    4. లక్క ఇంటి కథ సందర్భమున దుర్యోధనుడు అద్బుతమయిన చారు చాతుర్యమును ప్రదర్శించినాడు. కాని ఇప్పుడు అతని చారులు కనిపించరు. ఇందుకు రెండు కారణములు కావచ్చును.
    i) హస్తినలో దుర్యోధనుని బలము క్షీణించుచున్నది.
    ii) చారులను, ఇతరుల రాజ్యమునకు పంపుటకు వీలులేకపోయి ఉండవచ్చును.
    5. ఆనాటికే విద్యను అనేక విశిష్ట విభాగములుగా విభజించి శిక్షణ ఇచ్చినట్లు కనిపించుచున్నది. నాట్య విద్య, గోరక్షణ, అశ్వశిక్షణలు మాత్రమేకాక పరిచారికా విద్యయందును శిక్షణ ఉన్నట్లు కనిపించుచున్నది. అందుకు తోడ్పడిన సంస్థలు ఎటువంటివి? అవి నేటి విశ్వవిద్యాలయములు వంటివి అగునా అను విషయము విద్యావిషయికులు పరిశోధించవలసి ఉన్నది.
    6. విరాటుడు అయిదుగురికి ఆశ్రయము ఇచ్చుటలో ఆశ్చర్యము కనిపించదు. విద్యావంతులు, సాంకేతిక నిపుణులు దొరుకుత నేటికి కూడ దుర్లభముగా ఉన్నది. అనేక దేశములు ఇతర దేశముల నుండి సాంకేతిక నైపుణ్యమును అరువుకు తెచ్చుకొనుచున్నారు. తన రాజ్యమునకు వచ్చిన నిపుణులను ఎవడు వదలుకొనును? అదికాక విరాటుడు బలహీనుడు. పాండవులు బలవంతులు అని గ్రహించినాడు. వారిని వదలుకొనదలచలేదు.
    7. పాండవులందరికి సులభముగనే కొలువులు దొరికినవి. ద్రౌపదికి అట్లుకాదు. ఆమె ప్రాధేయ పడవలసి వచ్చినది. ఈనాటికి కూడ అందమయిన పని కత్తెను పెట్టుకొనుటకు ఆడవాళ్ళు అంగీకరించరు. అందమయిన ఆడది తమ కొంప కూల్చునని వారి ఉద్దేశము. అట్లు కూలిన ఉదంతములు కూడా ఉన్నవి.
    తనకు ఉపయోగపడుదరని విరాటుడు పాండవులకు ఆశ్రయము ఇచ్చినాడు. సుధేష్ణ అట్లు కాదు. ద్రౌపది వలన తనకు అపకారము కలుగవచ్చునని ఊహించినది. అయినను సాటి ఆడదిగా ద్రౌపది పరిస్థితి తెలుసుకొని సానుభూతితో ఆశ్రయము ఇచ్చినది.
    8. ద్రౌపదికి, దమయంతికి ఆశ్రయము లభించుటలో సామ్యములు కనిపించుచున్నవి. రాణులు మేడల మీద ఉండుట, వీధిన వెళ్ళువారిని గమనించుట మున్నగు వానిని గురించి ఆలోచించవలెను.
    9. పాండవులు అలవిగాని స్థితిలో ఉన్నారు. కొంచముండుట వారికి కొదువకాదు. కొండ అద్దమందు కొంచమైఉండదా? దీనిని వేమన పద్యము నుండి గ్రహించినాను.
    
                                                         నర్తనశాల
    
    విరాటుని నగరమున పాండవులు అజ్ఞాతవాసము గడుపుచుండిరి. సహనము, భయము, వినయము, మెళుకువ కార్యాలోచనము మున్నగు సద్గుణములు కలిగి, సకల జనులకు సంతోషము కలిగించుచున్నారు.
    ఒకనాటిమాట. విరాటుడు సభాతీర్చి ఉన్నాడు. ఒక మల్లుడు పిడుగువలె సభలో దూకినాడు. అతడు భయంకరముగా ఉన్నాడు. "రాజా! నేను సకల రాజుల సభలకు వెళ్ళినాను. నన్ను ఎదిరించమని సవాలు చేసినాను. ఏ రాజ్యమునందును నన్ను ఎదిరించు మొనగాడు కనిపించలేదు. నీ రాజ్యమున ఎవడయినా ఉన్నాడా? నీవును ఓటమినీ అంగీకరింతువా?" అని అడిగినాడు. అతని మాటలు విన్నారు. రూపము చూచినారు. విరాటుని మల్లులు గడగడలాడినారు. వారినోట మాటరాలేదు. మల్లులను చూచిన విరాటుడు సభాసదుల చిత్తరువులు అయినారు. ఎవరినోటివెంటను మాటరాలేదు. సభలో నిశ్శబ్దము ఆవహించినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.