Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
అర్జునుడు విరాటుని కొలువులో చేరినాడు.
నకులుడు విరాటుని సభామంటపమునకు వచ్చినాడు. అప్పుడు విరాటుడు గుర్రములను పరీక్షించుచున్నాడు. నకులుడు ప్రవేశించినాడు. గుర్రములను పరీక్షించసాగినాడు. విరాటుడు నకులుని చూచినాడు. అతడు పరీక్షించు పద్దతిని గమనించినాడు. అశ్వవిద్యయందు సమర్దునిగా గుర్తించినాడు. నకులుడు అది గమనించినాడు. విరాటుని వద్దకు వెళ్ళినాడు. నమస్కరించినాడు. అన్నాడు:-
"మహారాజా! నాపేరు దామగ్రంథి". అశ్వవిద్యలో సమర్దుడను. నాకు అశ్వముల అవయవ లక్షణములు తెలియును. వాటి ఆయుఃప్రమాణము తెలియును. గుర్రమును చూచి వయసు చెప్పగలను. వాటి గర్భములు, ఆహారము, జాతి మున్నగునవి చెప్పగలను. అశ్వముల వైద్యము, పోషించు విధానము ఎరుగుదును. యుద్ద సమయమందు నా బలపరాక్రమములు చూపి ప్రకాశింపగలను.
నన్ను పూర్వము ధర్మరాజు పెంచినాడు. అతడే నాకు అశ్వవిద్య చెప్పించినాడు. అతడు నన్ను తమ్మునిగా చూచుకున్నాడు. ధర్మరాజునకు రాజ్యము పోయి, అడవులు పట్టినాడు. నేను కొలువు కొరకు వెదకుచు నీదగ్గరకు వచ్చినాను. నన్ను అశ్వపాలకునిగా నియమింపుము. నీకు ఇష్టము కాకున్న మరొక రాజును వెదకికొందును. విద్యకు గౌరవము ఉండకపోదు".
"దామగ్రంథీ" విరాటుడు అన్నాడు. నిన్ను చూడగా నా రాజ్యమును అంతయు రక్షించగల సమర్దుడవుగా కనిపించుచున్నావు. నీకు తగిన ఉన్నత పదవి ఇవ్వదలచినాను. నీవు అశ్వశిక్షణమునందే ఆసక్తి కనబరచినావు. నీ ఇష్ట ప్రకారముకానిమ్ము. నిన్ను నా అశ్వశాలలన్నింటికి ముఖ్యునిగా నియమించినాను. నా అశ్వ భటులను నావలెనె నీవును పాలింపుము.
నకులుడు విరాటుని కొలువులో చేరినాడు.
సహదేవుడు గొల్లవేషమున విరాటుని రాజసభకు వచ్చినాడు. నకులుని దేహకాంతిని చూచి విరాటుడును, సభికులును ఆశ్చర్యపడినారు. కనురెప్పవాల్చక అతని రాకను గమనించ సాగినారు.
సహదేవుడు విరాటుని వద్దకు వచ్చినాడు. నమస్కరించినాడు. "మహారాజా! నాపేరు తంత్రీపాలుడు. గోవులను రక్షించుటయందు సమర్దుడను. నారక్షణమున గోవులకు వ్యాధులు ఉండవు. కీడు కలుగదు. క్రూరమృగముల బాధ ఉండదు. పాడి తగ్గదు, పెరుగుచుండును.
నన్ను పూర్వము ధర్మరాజు పెంచినాడు. అతడే నాకు గోరక్షణ విద్య చెప్పించినాడు. అతడు నన్ను తమ్మునిగా చూచుకున్నాడు. ధర్మరాజు రాజ్యముపోయినది. అతడు అడవులు పట్టినాడు. నేను కొలువు కొరకు వెదకుచు నీవద్దకు వచ్చినాను. నన్ను గోరక్షకునిగా నియమింపుము. నీకు ఇష్టముకాకున్న మరొక రాజును వెదకికొందును. విద్యకు గౌరవము ఉండకపోదు" అన్నాడు.
"తంత్రీపాలా! నిన్ను చూడగా నా రాజ్యమును అంతయు రక్షించగల సమర్దుడవుగా కనిపించుచున్నావు. నీకు తగిన ఉన్నత పదవిని ఇవ్వదలచినాను. నీవు గోరక్షణమునందే ఆసక్తి కనబరచినావు. అట్లే కానిమ్ము. నిన్ను నాగోశాలలన్నింటికీ రక్షకునిగా నియమించినాను. నా గోపాలురను నావలెనే నీవు పాలింపుము" అన్నాడు.
సహదేవుడు విరాటుని కొలువులో చేరినాడు.
తదుపరి ద్రౌపది సైరంధ్రి వేషమున విరాటుని పట్టణమగు ఉపప్లావ్యమున ప్రవేశించినది. ఆమె రాజమార్గము ద్వారా సాగినది. అప్పుడు ద్రౌపది మేఘముచేత కప్పబడిన చంద్రరేఖవలె, మంచుచేత కప్పబడిన తామరవలె, దుమ్ముచేత కప్పబడిన దీపమువలె ఉన్నది. ఆమె సౌందర్య లావణ్యములు మరుగునపడినవి. ఆమె వేషము వేసిన పరిచారికవలె కనిపించినది. ఆమెను చూచి జనులు ఆశ్చర్యపడినారు. వింతగా చూడసాగినారు. పలుకరించుటకు ప్రయత్నించినారు. ఆమె అగ్నిశిఖవలె సాగిపోయినది.
విరాటుని భార్య సుధేష్ణ స్త్రీ పరిజనముతో మేడమీద విహరించుచున్నది. ఆమెకు ద్రౌపది కనిపించినది. ఆమె ద్రౌపది రూప లావణ్యములు చూచినది. ఆశ్చర్యపడినది. ఆమెకు ద్రౌపది పరిచారికలవలె కనిపించలేదు. శాపవశమున నేలకు దిగిన గంధర్వాంగనవలె కనిపించినది. పురజనులు ద్రౌపదిని వెర్రిగా చూచుచున్నారు. అది ఆమెకు బాగనిపించలేదు. పరిచారికను పంపి ద్రౌపదిని పిలిపించినది.
ద్రౌపది పరిచారికణు అనుసరించినది. మేడ మెట్లు ఎక్కినది. సుధేష్ణ వద్దకు వచ్చినది. తలవంచి, వినయముగా మహారాణి ముందు నిలుచున్నది. అప్పుడు పిల్లతెమ్మర వీచినట్లు అయినది. వెన్నెల విరిసినట్లు అయినది. అంత దగ్గరగా ద్రౌపదిని చూచినది. సుధేష్ణకు కాంతిరేఖ ముందుకు వచ్చి నిలచినట్లు అయినది. ఆమె కనులు మిరుమిట్లుగొలిపినవి. గొంతు పూడుకొనిపోయినది. మాటరాలేదు.
"అమ్మా! మహారాణీ!" ద్రౌపది మాట్లాడినది. "నేను సైరంధ్రి జాతియందు పుట్టినాను. నా పేరు మాలిని. పూర్వము సత్యభామవద్ద, అటు తరువాత ద్రౌపది వద్ద పనులు చేసినాను. వారు నన్ను ప్రాణప్రధముగా చూచుకున్నారు. ఇప్పుడు నీవద్దకు వచ్చినాను. నాకు అన్నవస్త్రములు ఇచ్చిన చాలును. నిన్ను సేవించుచుందును".
ద్రౌపది మాటలు విన్నది సుధేష్ణ తేరుకున్నాది. "మాలినీ! నీ అందము చూచి నేనే చకితను అయినాను. మా మహారాజు నిన్ను చూచిన మోహించక మానడు. నా చేతితో నేనే నా సంసారమునకు చిచ్చుపెట్టుకొనలేను" అన్నది.





