Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "యతీంద్రా! సంతోషము. మీవంటి వారు నన్నువెదకుకొనుచు వచ్చుట నా అదృష్టము. మీరు నావద్ద నివసించుటయే నాకు పరమ శుభము. జూదము ఆడెడు వారియందు నాకు కొంత ప్రీతి కలదు. మీకు ఇష్టము వచ్చినంత కాలము నావద్ద ఉండుడు. మీకు సకల సౌకర్యములు కలిగింతును" అన్నాడు విరాటుడు. అతడు ధర్మరాజుతో చేతులు కలిపి స్నేహము కనబరచినాడు.
    ధర్మరాజు విరాటుని కొలువున "కంకుడు"గా చేరినాడు.
    భీముడు వంటలవానిగా విరాటరాజు సభకు చేరినాడు. అతడు వంటవానివలె లేడు. మదపు ఏనుగువలె ఉన్నాడు. అతని విశాల వక్షము, మహాభుజములు చూచి ఉలికి పడినాడు విరాటుడు. అతని బుద్ధివశము తప్పినది. వచ్చినవాడు సూర్యుడో, చంద్రుడో, ఇంద్రుడో అనుకున్నాడు. అతనిని గురించి అడుగుదామనుకున్నాడు. భీముని దేహమునందలి బలమును చూచి మిన్నకున్నాడు.
    "మహారాజా!" భీముడు పలికినాడు. కంచు గంటలు మ్రోగినట్లయినది. "నేను నాలవజాతి వాడను. నిన్ను కొలుచుటకు వచ్చినాను. పూర్వము ధర్మరాజు నన్ను పోషించినాడు. ధర్మరాజును సేవించినట్లుగా నిన్ను సేవించగలను" నాపేరు "వలలుడు".
    నేను వంటలు చేయగలను. వంటల విషయమున నాతో సమానుడు మరొకడు లేడు. నన్నువంటలవానిగా ఉంచుకొనుము. నాకు అన్నవస్త్రములు పెట్టిన చాలును.
    "నేను మహాబలవంతుడను. మదపుటేనుగులను, ఎలుగుబంట్లను, పెద్దపులులను, సింహములను ఎదిరించి పోరగలను. మహాభయంకరముగా పోరెడి జెట్టి మల్లులను  గడియలో ఓడించగలను. ఆశ్చర్యము కలుగునట్లు ముల్లులతో పోరగలను".
    "మహారాజా! నీవు నన్ను వంటలవానిగా పరిగ్రహింతువా మంచిది. కాకున్న మరొక చోటికి వెళ్ళెదను. బలము ఉన్నవానికి ఆశ్రయము ఇచ్చురాజులకు కొదువలేదు".
    విరాటుడు తేరుకున్నాడు. మహాబలవంతుడు లభించుట అదృష్టము అనుకున్నాడు. అన్నాడు:-
    "వలలుడా! నీ భుజబల పరాక్రమములను చూచి నీకు గొప్ప స్థానము కల్పించవలెను అనుకున్నాను. నా ఏనుగుల దండుకు అధికారిగా నియమించదలచినాను. నీవు వంటలవానిగా ఉండదలచిన నీ ఇష్టము. నీవు మా పాక గృహమునకు ప్రభువువు. పరిచారకులు అందరు నీ ఆజ్ఞకు లోబడి ఉందురు".
    భీముడు విరాటుని కొలువున "వలలుడు"గా చేరినాడు.
    అర్జునుడు నపుంసకునిగా విరాటుని సభకు చేరినాడు.
    అర్జునుడు చొక్కా ధరించినాడు. అందువలన అతని దేహకాంతి మరుగున పడినది,. ముంగురులు అర్జునుని నొసలు కప్పినవి. అర్జునుని ముఖము అదొక సౌందర్యము గలదయినది.
    విరాటుడు అర్జునుని చూచినాడు. ఆశ్చర్యమున మునిగినాడు. ఇతడు మరుగున పడిన సూర్యుడా! నివురు కప్పిన నిప్పు అగునా! వేషధారియైన విష్ణువా? ఇంత తేజోవంతునకు ఈ నపుంసకరూపమేమి? అనుకున్నాడు. చకితుడు అయినాడు. నోటమాట రాలేదు.
    "మహారాజా!" అర్జునుని గొంతు ఖంగుమన్నది "నేను నపుంసకుడును. పేరు 'బృహన్నల'. కన్యలకు నాట్యము నేర్పుటకు సమర్దుడను. నన్ను నీ కొలువునందు ఉంచుకొనుము".
    "బృహన్నలా! నీవు దీర్ఘబాహువులు, విశాల వక్షము కలిగి ఉన్నావు. నీముఖమున ఇంద్రతేజము వెలుగొందుచున్నది. నీవు నపుంసకుడవు అయినను గొప్ప ధనుర్వేత్తగా కనిపించుచున్నావు. ఇదిగో నా ధనుస్సును తీసుకొనుము. మత్స్యరాజ్యమును నీకు అప్పగింతును. మమ్ములను అందరిని ఏలుము" అన్నాడు విరాటుడు.
    "మహారాజా! ఒక క్రూర శాపము వలన నాకు నపుంసకత్వము కలిగినది. నేను కళారాధకుడను. నాకు రాజ్యముతో నిమిత్తము లేదు. నాకు నాట్యశాస్త్రము తెలియును. వాద్యశాస్త్రమును అభ్యసించినాను. వాటిని బోధించగల ప్రావీణ్యమును ఆర్జించినాను. నన్ను నాట్యాచార్యునిగా నియమింపుము" అన్నాడు. నాటి నుండి అర్జునుడు బృహన్నల.
    "బృహన్నలా! నీరూప ప్రకాశమును చూచి నీకు రాజ్యము అప్పగించదలచినాను. నీవు నాట్యాచార్యునిగానే ఉండదలచిన సంతోషముగా ఉండుము. నా కూతురు "ఉత్తర"కు నాట్యము నేర్పుము" అని అర్జునితో చెప్పిన విరాటుడు ఉత్తరను పిలిపించినాడు.
    మన్మథుని పుష్పబాణము వలె ప్రకాశించు ఉత్తర సభామంటపమునకు వచ్చినది. సభలో వెలుగులు వెదజల్లినవి. విరాటుడు ఉత్తరణు దగ్గరకు తీసుకున్నాడు  లాలించినాడు. బృహన్నలతో అన్నాడు:-
    "ఈమె నా కూతురు ఉత్తర. నాట్యము నేర్చుకొనుటకు యోగ్యురాలు. ఇంకా చిన్నది. బాల్యక్రీడలందు ఆసక్తిగలది. ఈమెకు బాల్యక్రీడలందు ఇష్తమును పోగొట్టి, నాట్య విద్యయందు అభిలాష కలిగించుము. నాట్యము నేర్పుము. రాజభవనమందు నీ ఇష్టము వచ్చినరీతి సంచరించుము" అని చెప్పి ఉత్తరను బృహన్నలకు అప్పగించినాడు విరాటరాజు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.