Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    హిరణ్యము సహితము తేజోవంతము. సుఖకరము. నాశరహితము. అమృతమ్ అమృతేన క్రీణామి - అమృతమగు సోమమును అమృతమగు హిరణ్యమున కొనుచున్నాను. కావున హిరణ్యమిచ్చి సోమము కొనుట న్యాయమగును.

    నీకు కేవలము హిరణ్యమేకాదు. ఏడాది దూడగల ఆవును కూడ ఇచ్చుచున్నాను. కావున ఈ హిరణ్యము నీకు అదనపు లాభము అగును.

    (సోమ విక్రేతకు హిరణ్యమును ఇచ్చి సోమము తీసికొనవలెను.) (విలువలు సమములైనపుడే క్రయ విక్రయాదులని నాడే గ్రహించబడినదని తెలియవలెను.)

    2. బంగారము మావద్దనే ఉండవలెను.

    (సోమ విక్రేత కిచ్చిన బంగారము తీసికొనవలెను.) (అది అదనపు లాభము కదా!)

    3. మేకా! నీవు పుణ్యములకు దేహమవు. ప్రజాపతికి శరీరమవు. నీవు బహుసంతానమును పోషించు చున్నావు. అట్టి నీ చివరి సంతానమును ఇచ్చి సోమమును కరీదు చేయుచున్నాను. నేను నీకు బంధువును. నీ యొక్క సంతాన ధనము నావద్ద ఉండును గాత.

    4. తెల్లని ఉన్ని దారము జ్యోతిస్స్వరూప. అది నావద్ద ఉండవలసినది.

    (తెల్లని ఉన్ని దారము యజమానికి ఇవ్వవలెను.)

    5. నల్లని ఊలు దారము సోమ విక్రేత వద్ద ఉండవలెను.

    (నల్లని దారము సోమవిక్రేతకు ఈయవలెను.)

    6. సోమమా! నన్ను మంచి మిత్రునిగా భావించుము. నాకు మిత్రుడవగుము. నావద్దకు రమ్ము. యజమాని కుడితొడపై కూర్చుండుము.

    (సోమ విక్రేత నుండి సోమము తీసికొని దానిని యాజమాని కుడి తొడపై ఉంచవలెను.)

    7. స్వానభ్రాజాఙ్ఘారే బమ్భారే హస్తసుహస్తకృశానులారా! ఈ గోవులు మున్నగునవి సోమము కొను ధనములు. మీరు వానిని రక్షించండి. వానిని బాధించకండి.

    (స్వాన భ్రాజాదులు సప్తసూర్యమండలములు.)

                          ఎనిమిదవ అనువాకము

          (సోమము శకటముపై ఎక్కించుట చెప్పబడినది.)

    1. నేను యజమానిని. సోమము ఆయువు నిచ్చునది. రోగాది ఉపద్రవములు లేకుండ చేయునది. మేఘము మరియు ఓషధుల సారస్వరూపమైనది. దీనిని దేవతలకు లక్ష్యముగా చేసికున్నాను. సోమసహితుడనై లేచుచున్నాను.

    (యజమాని సోమమునందుకొని లేవవలెను.)

    2. సోమమా! నీవు విశాల అంతరిక్షమును అనుసరించి సాగుము.

    3. కృష్ణాజినము భూమికి స్థానమగును. సోమము దానిని అందుకొనును గాత.

    సోమము ద్యులోకమును నిలిపి ఉంచినది. ఆకాశ పరిమాణమును - భూమి బరువును కొలిచినది. సోమ దేవత మహిమ కలవాడు. ప్రకాశించువాడు. అతడు సమస్త లోకములందు వ్యాపించినాడు.

    4. వరుణ నామక సోముడు వృక్షములను పెంచినాడు. అంతరిక్షమును విస్తార పరచినాడు. అశ్వములకు వేగము కూర్చినాడు. గోవులందు పాలు చేర్చినాడు. మనసులందు సంకల్పము కలిగించినాడు. మానవులందు జఠరాగ్నిని నెలకొల్పినాడు. ద్యులోకమున సూర్యుని నిలిపినాడు. పర్వతములందు సోమలతను కల్పించినాడు.

    5. కిరణములు జగత్తులను చూడదలచినవి. సూర్యుని పైలోకములకు కొనిపోవుచున్నవి.

    (కృష్ణాజినమును సోమముపై కప్పవలెను.)

    6. ఎద్దులారా! మీరు బరువులు మోయువారు. బండిని లాగువారు. బాధించనివారు. కృషి చేయువారు. మీరు ఇటురండు.

    (ఎద్దులను సోమశకటము వద్దకు తేవలెను.)

    7. శమ్యా! నీవు ఎద్దును నియంత్రించుదానవు. యోక్త్రమా! నీవు ఎద్దును కాడికి తగిలించి ఉంచుదానవు. పగ్గము బండికి తగిలించబడినది.

    (బండికి ఎద్దును కట్టవలెను. 1. శమ్య - కాడి రంద్రమున వేయు చిర్ర. 2. యోక్త్రము - ఎద్దుకు కట్టు పగ్గము.)

                        తొమ్మిదవ అనువాకము

           (సోమ శకటమును యజ్ఞ శాలకు తోలుట.)

    1. భూతపతి సోమమా! నీవు ప్రాచీనవంశ హవిర్దానాది స్థలములకు సాగుము. మార్గమందు దొంగల నాయకుడుకాని, అతని అనుచరులు కాని నిన్ను చూడకుందురు గాత. తోడేళ్లు నీ జాడ తెలియకుండును గాత. విశ్వావసు గంధర్వుడు నిన్ను దొంగిలించుటకు చూడకుండును గాత.

    సోమమా! నీవు యజమాని యజ్ఞశాలకు త్వరత్వరగా చేరుము. దేవసదృశులగు అధ్వర్యాదులు నీవు నిలుచుటకు స్థలము శుభ్రపరచినారు.

    మేము శత్రుంజయము, ధన ప్రాప్యము, శ్రేయోదాయకము, పాపరహితమగు అనుష్ఠానమార్గమును అవలంబించినాము.

    (బండిని యజ్ఞశాలకు తోలవలెను.)

    2. సూర్యుడు సకల జగములను ఆవరించినవాడు. సర్వజ్ఞుడు. మిత్ర స్వభావి. అతనికి నమస్కరించుచున్నాము.

    ఋత్విజులారా! సూర్యుడు మహాదేవత. అతనిని సత్య స్వరూప కర్మమున సేవించండి. సూర్యుడు దూరమున కనిపించువాడు. దేవతగా ఆవిర్భవించినవాడు. పగటికి సంకేతమైనవాడు. ద్యులోకమునకు బిడ్డవలె ప్రీతిపాత్రుడు. అతనిని స్తుతించండి.

    (యజమాని సోమశకటమును ఆహ్వానించవలెను.)

    3. వరుణస్య స్కమ్భనమసి వరుణస్యస్కమ్భసర్జన మస్యున్ముక్తో వరుణస్యపాశః

    (8వ అనువాకపు 7వ మంత్రమున కట్టుట చెప్పబడినది. ఇది విడుచుట. శమ్యా యోక్త్రములను విడదీయవలెను.)

                           పదవ అనువాకము

    (సోమము అతిథి రూపముగ వచ్చినది. దాని సత్కారమునకు అతిథ్యేష్టి చెప్పబడుచున్నది.)

    1. హవిస్సా! అగ్నికి ఆతిథ్యమవగుచున్నావు. త్వావిష్ణవే నిర్వపామి - నిన్ను విష్ణువునకు సమర్పించుచున్నాను. సోమమునకు ఆతిథ్యమవగుచున్నావు. త్వావిష్ణవే నిర్వపామి. అతిథికి ఆతిథ్యమవగుచున్నావు. త్వావిష్ణవే నిర్వపామి. ధనములనిచ్చు అగ్నికి ఆతిథ్యమావగుచున్నావు. త్వావిష్ణవే నిర్వపామి. సోమమును తెచ్చిన శ్యేనమునకు ఆతిథ్యమవగుచున్నావు. త్వావిష్ణవే నిర్వపామి.

    2. సోమమా! ప్రాతస్సవనాదులు నీకు సంబంధించినవి. వాటి యందు హోమము చేయబడుచున్నది. నీవు ఆ హోమములను అన్నింటిని స్వీకరింపుము. నీవు గృహములను వర్థిల్ల చేయుదానవు. నీ అనుగ్రహమున మాపుత్ర పౌత్రాదులు వీరులు అగుచున్నారు. నీవు ఆ వీరులను పాలించు దానవు. ప్రాచీన వంశమను యజ్ఞశాలకు చేరుము.

    (యజమాని సోమమును యజ్ఞశాలకు చేర్చవలెను.)

    3. కృష్ణాజినమా! నీవు భూమికి స్థానమవగు చున్నావు. భూమియొక్క స్థానమున పరచుకొనుము.

    4. సోమమా! నీవు వరుణ పాశమును విడిపించుదానవు. యజ్ఞవ్రతమును అవలంబించినదానవు. వరుణ సంబంధివి. అందువలన మాకు వరుణాదుల సఖ్యము లభించును. మేము కర్మ భ్రష్టులము కాకుందుము గాత.

    (సోమముపై వస్త్రము కప్పవలెను.)

    5. ప్రాణము కొరకు 'త్వాగృహ్ణామి' - నిన్ను తీసికొనుచున్నాను. మనస్సు కొరకు త్వాగృహ్ణామి. జఠరాగ్ని కొరకు త్వాగృహ్ణామి. శక్తి స్వరూపము కొరకు త్వాగృహ్ణామి. శక్తి, ఓజిష్ఠముల కొరకు త్వాగృహ్ణామి.

    6. తనూన ప్త్రాజ్యమా! నిన్ను పూర్వము తిరస్కరించినవారు లేరు. నీవు ఎవరి చేతను తిరస్కరించబడని దేవతలకు సారమవు. అన్యోన్య విరోధముల నుండి మమ్ము రక్షించుచున్నావు. విరోధమునకు నీవు కారణము కాకున్నావు.

    (ఋత్విజులు ఆజ్యమును స్పృశించవలెను.)

    7. దీక్షాపతి నా దీక్షను గుర్తించును గాత. తపసత్తి నా దీక్షను గుర్తించును గాత. నేను శపథమును పొందినాను.

    తనూనప్త్రాజ్యమా! నన్ను సన్మార్గమున నడిపించుము.

                           పదకొండవ అనువాకము

        (రాక్షస విజయ నిమిత్త మంత్రములు చెప్పబడుచున్నవి.)

    1. సోమమా! నీవు దేవతా స్వరూపవు. నీ యొక్క సూక్ష్మావయవము శుష్కించు చున్నది. నశించుచున్నది. అది సోధనమును ఎరిగిన ఇంద్రుని కొరకు వర్థిల్లును గాత. నీవు సహితము ఇంద్రుని కొరకు వర్ధిల్లుము. ఋత్విజులకు ధనలాభము కలిగించుము. నీ అనుగ్రహమున నేను అభిషవ తంత్రమును పొందగలవాడను.

    2. ద్యావాపృథ్వులారా! మేము యజ్ఞము చేయుచున్న వారలము. మాకు యజ్ఞమును, ధనమును, అన్నమును, ఐశ్వర్యాదులను కలుగచేయండి.

    దివే నమః పృథివ్యై నమః

    3. అగ్నీ! నీవు సర్వ వ్రతములకు అధిపతివి. నేను వ్రతములను ఆచరించుచున్నాను. నా మనసు నీకే అర్పితమైనది. నీవు వ్రతమును రక్షించుచున్నావు కదా! అందువలన నీ మనసు నాయందు చేరినది. అట్లగుట వలన మనము ఉభయులము వ్రతులమే అయినాము. నౌవ్రతాని సహస్రవర్తన్తామ్. మన వ్రతములు జతగా జరుగును గాత.

    (యజమానికి అవాంత దీక్షనీయవలెను.)

    4. అగ్నీ! నీ శరీరము రుద్ర సంబంధము. అది మమ్ము రక్షించును గాత. తస్యాస్తే స్వాహా. నీ శరీరమునకు స్వాహా.

    (యజమానిచే అవాంత దీక్షను అనుష్ఠింపచేయవలెను.)

    5. అగ్నీ! నీవు లోహ నిర్మితుడవు. వృద్ధతముడవు. తాకుటకు అసాధ్యుడవు. అట్టి నీవలన ఉగ్రవాక్కును త్వేష వాక్కును నశింపచేసినాను. స్వాహా.

    అగ్నీ! నీవు రజత నిర్మితుడవు. వృద్ధతముడవు. తాకుటకు అసాధ్యుడవు. అట్టి నీవలన ఉగ్రవాక్కును, త్వేషవాక్కును నశింపచేసినాను. స్వాహా.

    అగ్నీ! నీవు హిరణ్య నిర్మితుడవు. వృద్ధతముడవు. తాకుటకు అసాధ్యుడవు. అట్టి నీవలన ఉగ్రవాక్కును, త్వేష వాక్కును నశింపచేసినాను స్వాహా.

    (ఉగ్రవాక్కు ఐహికము. త్వేషవాక్కు ఆముష్మికము. ఈ ఆహుతిని ఉపసత్తు అందురు. ఇవి ఉపసదములు.)

                             పన్నెండవ అనువాకము

    (11వ అనువాకమున మూడు ఉపపదములు చెప్పబడినవి. వానిలో రెండవ
    ఉపసద్ధినమునందు 32 అడుగుల వేదికకు పూర్వభాగమున ఉత్తరవేది నిర్మించుట
                                     చెప్పబడుచున్నది.)

    1. ఉత్తరవేదీ! నాకు అగ్ని రూప ధనమును అందించుము. జ్వాలా రూప అగ్ని తేజస్సును అందించుము. నేను అగ్నిని ఆరాధించువాడను. నన్ను రక్షింపుము. అవతాన్మావ్యధితమ్ - అగ్ని జ్వలింపడేమోనని వ్యధచెందుచున్న నన్ను రక్షింపుము.

    2. ఉత్తరవేదీ యందున్న అగ్నీ! నీవు నభోనామ్నవు. అంగిరస నామకుడవు. నీవు చాత్వాలమందలి మెత్తని మట్టి యందున్నావు. ఆయుష్పదమగు నభోనామమున ఏహి - విచ్చేయుము. నీనభోనామమును తిరస్కరించగలవారు లేరు. యజ్ఞ సంబంధివగు నిన్ను పిలుచుచున్నాను. ఉత్తర వేది యందు ఆ ధానము చేయుచున్నాను.

    (ఉత్తరవేది యందలి ధూళిని తొలగించవలెను.)

    3. రెండవ మంత్రమును మరి రెండు సార్లు చదివి ధూళిని తొలగించవలెను. మంత్రము లేకుండ నాలుగవ సారి తీసివేయవలెను.

    4. ఉత్తరవేదీ! నీవు సింహివి. కీర్తనీయవు.

    (అధ్వర్యుడు ఇసుక కలుపవలెను.)

    5. ఉత్తరవేదీ! ఉరు ప్రథస్య - గొప్పగా విస్తరిల్లుము. యజమాని నిన్ను మరింత విస్తరింపచేయును గాత. నీవు గట్టిదానవు. దేవతల కొరకు పరిశుద్ధవగుము. వారి కొరకు ప్రకాశించుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.