Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



                              మూడవ అనువాకము

           (దేవ యజన స్వీకారము వర్ణించబడుచున్నది.)

    1. కోరికలు తీరుటకు ఈ యజ్ఞము సంకల్పించినాము. దేవతాకము, సుఖప్రదము, వర్చస్సు నిచ్చునది, యజ్ఞము నిర్వహించునదగు బుద్ధిని కలిగిఉన్నాము.

    (యజమాని ఆచమనము చేయవలెను.)

    2. ఏ దేవతలు మనోజాతలో - మనో యుజలో - సుదక్షులో - దక్షపుత్రులో వారు మమ్ము రక్షింతురు గాత. పాలింతురు గాత. తేభ్యోనమస్తే - వారికి నమస్కరించుచున్నాను. తేభ్యస్వాహా. వారికి స్వాహా. 

    3. అగ్నీ! నీవు మమ్ము రక్షించుటకు అప్రమత్తుడవై ఉండుము. మమ్ము నిర్భయముగా నిద్రించనిమ్ము. మాకు నాశము లేకుండ చేయుము. మాకు మేల్కొను సామర్థ్యము ప్రసాదించుము.

    4. త్వమగ్నే వ్రతపా అసి దేవ అమర్త్యేష్వాః త్వమ్ యజ్ఞేష్వీడ్యః

    అర్థమునకు 1 - 14 - 13 చూడండి.

    5. నన్ను రక్షించుటకు సమస్త దేవతలు నన్ను కూడి ఉందురు గాత. పూష హిరణ్యాదికములను ఇచ్చును గాత. సోమ దేవత వస్త్రములు ఇతర ధనము ఇచ్చును గాత. సవిత ధనము నిచ్చునుగావుత.

    సోమదేవా! యజ్ఞమునకు అవసరమగు సమస్తము నిమ్ము. నన్ను సమృద్దుని చేయుము. యజ్ఞభారము వహించుము. విరాధి మాహమాయుషా - నేను ఆయువియుక్తుడను కాను.

    6. సోమదేవా! నీవే హిరణ్యమూర్తివి. మమ భోగాయభవ. హిరణ్యాదులు నాకు అనుభవమునకు వచ్చును గాత. నీవే వస్త్రమవు. మమ బోగాయభవ. నీవే గోవువు. మమ భోగాయభవ. నీవే అశ్వమవు. మమ భోగాయభవ. నీవే మేకవు. మమ భోగాయభవ. నీవే గొర్రెవు. మమ భోగాయ భవ.

    (యజమాని ఇతరులు అందించిన హిరణ్యాదులు స్వీకరించును.)

    7. హిరణ్యాదిద్రవ్యమా! త్వావాయవే అనుదిశామి. నిన్ను వాయువునకు సమర్పించుచున్నాను. త్వా వరుణాయ అనుదిశామి. త్వానిఋత్యై అనుదిశామి. త్వా రుద్రాయ అనుదిశామి.

    8. జలదేవతలారా! అడుగు మోపి మిమ్ము దాటను. ఏలనన మీ కెరటముల వలన హవిస్సునకు కారణమగు ధాన్యము పండుచున్నది. మీరు ఇంద్రియములకు శక్తిని ఇచ్చుచున్నారు. దాహము తీర్చుచున్నారు. సుఖము కలిగించుచున్నారు.

    మట్టిగడ్డలు ఆధారముగా నీటిని దాటుదును.

    9. రథమా! నిత్యాగ్ని నుండి సోమయాగమునకు పయనింపుము. బృహస్పతి నీకు అగ్రగామి అగును గాత. పయనము ముగిసినంత భూమండలమునందలి శ్రేష్ఠస్థానమున నిలువుము.

    రథాభిమానివగు సూర్యదేవా! శత్రువులగు రాక్షసాదులను యజ్ఞభూమికి దూరముగా ఉంచుము.

    10. ఇది పూర్వము దేవతలు సేవించిన ప్రదేశము. మేము ఇచటికి చేరుకున్నాము. ఇచట ఋగ్యజుస్సామ మంత్రములచే సోమయాగము పూర్తి చేయుదుము. అట్లు చేసి ధన సమృద్ధి అన్న సమృద్ధి గలవారమై సుఖింతుము.

                            నాలుగవ అనువాకము

             (సోమము కొనుట చెప్పబడుచున్నది.)

    1. కాంతివంత హిరణ్యమా! జుహువు నీకు దేహమగును. ఆజ్యము వర్చస్సు అగును. కావున నీవు జుహువును కలిసికొనుము. ఆజ్యరూపకాంతిని పొందుము.

    (బంగారమును దారముతో కట్టి నేతి గిన్నెలో వేయవలెను.)

    2. వాగ్దేవతా రూపకమగు సోమక్రయణీ! నీవు వేగవంతవు. మనసుచే నిబద్ధింపబడుదానవు. యజ్ఞమునకు ప్రియమవు. సత్య ప్రేరణ కలదానవు. నీ ప్రేరణ వలన మంత్రములు చదువు వాక్కును నిబద్ధింతును - స్వాహా.

    3. హిరణ్యమా! నీవు శుక్రమసి - దీప్తి కలదానవు. అమృతం అసి

    ఆజ్యమా! విశ్వేదేవతలకు హవిస్సువు అగుచున్నావు.

    (యజమాని ఆజ్యమును చూడవలెను.)

    4. సూర్యదేవా! ఏతశములను గుర్రముల మీద సాగుచున్నావు. అగ్నిదేవా! నీవు తేజస్సును ప్రకాశించుచున్నావు. సూర్యుని వలన కంటిని - అగ్ని వలన కంటి పాపను పొందినాను.

    5. వాగ్రూప సోమక్రయణీ! నీవు చిత్తమవు. బుద్ధివి. దక్షిణవు. యజ్ఞ సంబంధివి. క్షత్రియవు. అదితివి. సోమము విక్రయించువాని కొరకు తూర్పునకు వెళ్ళుము. తదుపరి మాకు ఎదురుగా రమ్ము.

    సోమక్రయణీ! హితము కూర్చు దేవత నీ కాలును కట్టివేయును గాత. పూష నిన్ను భయము నుండి రక్షించును గాత. ఇంద్రుడు యాగాధ్యక్షుడు. అతని కొరకు నిన్ను తల్లి అనుమతించును గాత. పితా అనుమన్యతామ్. సగర్భ్యః - తోబుట్టువులు - అనుమన్యతామ్. సయూద్యఃసఖా అనుమన్యతామ్.

    సోమక్రయణీ! ఇంద్రుని కొరకు సోమదేవుని గూర్చి వెళ్లుము. రుద్రుడు నిన్ను సూర్య మార్గము నుంచి మరలించును గాత.

    స్వస్తి సోమ సఖా పునరేహిరయ్యా. నీకు శుభము కలుగును గాత. సోమ సఖుడవగుము. ధనముతో తిరిగిరమ్ము.

    సోమము కొనుటకు బంగారము అవసరము. అంతటితో చాలదు. బేరమునకు మాట అవసరము. కావున సోమక్రయణి స్వర్గమగును. వాక్కు అగును. గోధనము కూడా అగును.

                               అయిదవ అనువాకము

      (సోమక్రయిణి గోవును సోమలత అమ్ముచోటునకు తీసికొని వెళ్లుట చెప్పబడుచున్నది.)

    1. సోమక్రయిణీ! నీవు వసువవు అగుచున్నావు. నీవు రుద్రాసి. ఆదిత్యాసి. శుక్రాసి - ప్రకాశమవు అగుచున్నావు. చన్ద్రాసి (గోవు అడుగున అడుగు వేయుచు యజమాని 6 అడుగులు వేయవలెను.)

    2. నిన్ను బృహస్పతి సుఖ ప్రదేశమున ప్రవేశపెట్టును గాత. వసువులు, రుద్రులు నిన్ను గుర్తింతురు గాత.

    (ఏడవ అడుగు గుర్తును దోసిలిచే గ్రహించవలెను.)

    3. సోమక్రయిణి యొక్క పాదము పృథివికి శిరస్సు - దేవతల యజనస్థానము - ఘృతపతియు అగును. ఆజ్యమా నిన్ను ఆ పాదపు గుర్తున ప్రవహింపచేయుచున్నాను - స్వాహా.

    4. రాక్షసులు, శత్రువులు నశింతురు గాత. ఇదిగో రాక్షసుల తలలు నరుకుచున్నాను. మేము ద్వేషించువారి, మమ్ము ద్వేషించువారి తలలు ఉత్తరించుచున్నాను.

    (జింక కొమ్ముతో గోవు అడుగు గుర్తును పెకిలించవలెను.)

    5. అధ్వర్యుని వద్ద ధనము ఉండును గాత. యజమాని వద్ద ధనము ఉండును గాత. యాజమాన పత్ని వద్ద ధనము ఉండును గాత.

    (నేతితో తడిసిన ఏడవ అడుగు ధూళిని స్థాలి యందుంచి అధ్వర్యుడు యజమాని దంపతులకు ఇవ్వవలెను.)

    6. సోమక్రయిణీ దేవీ! నీవు ఊర్వశీ సహితవై నా భార్యను చక్కగా చూడుము.

    (యజమాని తన భార్యను సోమక్రయణికి చూపవలెను.)

    7. త్వష్ట ప్రజాపతి అనుగ్రహము కలదానవు అయినాను. రేతస్సు కలదానను అయినాను. నా భర్త రేతస్సును ధరించినాను. వీరుడగు పుత్రుని పొందగలను.

    (భార్య యజమానిని చూడవలెను.)

    8. నేను ధనసమృద్ధి కల దానను అగుచున్నాను.

    (సోమక్రయణిని చూడవలెను.)

                           ఆరవ అనువాకము

        (కొలతల సోమక్రయము చెప్పబడుచున్నది.)

    1. సోమలతా! నీ అంశము మరొక అంశమును కలియును గాక. ఒక కణుపుతో మరో కణుపు కలియును గాత. నీ సుగంధము యజమాని కోరికలను రక్షించును గాత. నీ యొక్క రసము దేవతలను సంతోష పెట్టును గాత. నీవు కొలుచుటకు సాధ్యము కానిదానవు. బంగారమే నిన్ను కొనగలదు.

    (అధ్వర్యు హిరణ్య పాణిచే సోమలతను తాకవలెను.)

    2. సూర్యుని కాంతి పైలోకములందు ఉండును. ఊహకు అందని రీతి ప్రకాశించును. ద్యావాపృథ్వులు భానుని హస్తములు. అతడు వానిచే ప్రేరణ కలిగించును. అతడు యాగములందు ఉండును. ఫలితము కలుగునంత వరకు ప్రోత్సహించు చుండును.

    సూర్యుడు రత్నములనిచ్చువాడు. సర్వ దర్శనీయుడు. అందరు అతనిని ధ్యానించుచుందురు. అట్టి సవితృదేవతను నేను ప్రార్థించుచున్నాను. అతడు హిరణ్యపాణియై నావద్దకు రావలెను. సోమమును కొలత వేయవలెను.

    3. కొలువగా మిగిలిన సోమలతా! ప్రజల కొరకు నిన్ను కూర్చుచున్నాను. ప్రాణము కొరకు నిన్ను కట్టుచున్నాను. వ్యానము కొరకు నిన్ను విప్పుచున్నాను. నీవు జనులను అనుసరించి జీవించుము. జనులు నిన్ను అనుసరించి జీవింతురు గాత.

    (కొలువగా మిగిలిన సోమమును అధ్వర్యుడు మూట కట్టవలెను. మరల విడదీయవలెను.)

                                 ఏడవ అనువాకము

                (సోమము కొనుట చెప్పబడుచున్నది.)

    1. సోమము బలకరము. అధికరసయుతము. ఇంద్రియములకు బలము కలిగించునది. పాపనాశిని. తేజోవంతము. సుఖకరము. నాశరహితము.

    సోమమును అమ్మువాడా! నీకు హిరణ్యము నిచ్చి సోమము కొనుచున్నాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.