Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    6. ఉత్తరవేదీ! ఇంద్రఘేషః వసుభిః పురస్తాత్ - తూర్పు దిశన - పాతు - రక్షించును గాత.

    మనోజవాః త్వాపితృభిః దక్షిణతః పాతు.

    ప్రచేతాః త్వారుద్రై పశ్చాత్ - పశ్చిమ దిశన - పాతు.

    విశ్వకర్మాత్వా ఆదిత్యైః ఉత్తరతః పాతు.

    7. ఉత్తరవేదీ! నీవు సింహివి. శత్రుసంహారకవు స్వాహా!

    సింహివి. చక్కని సంతానమును, భృత్యులను ఇచ్చుదానవు స్వాహా.

    సింహివి. పశువులు మున్నగు ధనములు ఇచ్చుదానవు. స్వాహా.

    సింహివి. ఐశ్వర్య, ప్రతిష్ఠ ప్రదాయినివి. స్వాహా.

    దేవతలను అర్థించు యజమానికి స్వాహా.

    8. జుహూ! త్వాభూతేభ్యః ఉద్గృహ్ణామి - పైకి లేపుచున్నాను.

    9. మధ్యమపరిధే! త్వమ్ విశ్వాయురసి. పృథివీమ్ దృంహ - దృఢపరచుము.

    దక్షిణపరిధే! ధృవక్షితిరసి - స్థిరమైనదానవు. అంతరిక్షం దృంహ.

    ఉత్తరపరిధే! అసి అచ్యుతక్షిత్ - నశింపని నివాసము కలదానవు. దివందృంహ.

    10. 'అగ్నేర్భస్మాసి పురీషమసి' సమిధలారా! మీరు అగ్నికి ప్రకాశమగుచున్నారు. పూరకములు అగుచున్నారు.

    (మిగిలిన సమిధలను వేదియందు ఉంచవలెను.)

                             పదమూడవ అనువాకము

        (హవిర్ధానము - హవిస్సులు ఉంచు శకటమును గూర్చి చెప్పబడుచున్నది.)

    1. యజమాని విద్వాంసుడు. ఘనుడు. విప్రుడు. ఇతని హోతలు విప్రులు. వారు యజమాని మనసును నియంత్రించుచున్నారు.

    సవితా దేవత సృష్టి ఎంతో గొప్పది. మార్గములను తెలిపిన అతడొక్కడే సర్వమును కలిగించుచున్నాడు.

    (అధ్వర్యుడు గార్హ పత్యాగ్నియందు ఆజ్యమును హోమము చేయవలెను.)

    2. అక్షదేవా! గృహములందు మంచి మాటలవాడవు అగుము. శుభములు గూర్చు పలుకులు పలుకుము.

    అక్షరదేవతలారా! యజమాని దేవతలను గూర్చి యజ్ఞము చేయుచున్నాడని దేవతలకు చాటండి.

    (అధ్వర్యుడు అనుమంత్రణ చేయవలెను.)

    3. మాకు కలుగు పుత్రుడు అందరకు జీవనాధారుడు, వీరుడు. అందరను వశపరచుకొనగలవాడు కావలెను. అతడు కర్మల యందు అలసట ఎరుగనివాడు కావలెను.

    4. విష్ణువు విశ్వమును మూడుగా విభజించినాడు. అతడు ఒక అడుగు భూమి మీద, మరొకటి అంతరిక్షమున, మూడవది భూలోకమున పెట్టినాడు. ఈ విష్ణువు యొక్క పాదరేణువులందు సకల ప్రపంచము అంతర్భూతమై ఉన్నది.

    మంచి పాలిచ్చు ఆవులు - మంచి ఆహారములు గల ద్యావాపృథ్వులు - మానవాళి కొరకును, వారి యశస్సు కొరకును ఉపయోగపడును గాత.

    విష్ణువు సమస్త జగములను విభజించి స్థాపించినాడు కదా! ఆ విష్ణువే లోకములన్నింటిని స్వతేజమున పోషించుచున్నాడు.

    (అధ్వర్యుడు హవిర్ధానమునకు అభిముఖముగా యజ్ఞము చేయవలెను.)

    5. హవిర్ధానములారా! మీరు ఈ యజ్ఞమును బాధలు లేకుండ చేయండి. యజ్ఞమును పైలోకమున ఉన్న దేవతలకు అందించండి. అసురులకు అందనీయకండి.

    6. శకటములారా! మీరు ఉత్తరవేది యొక్క పశ్చిమ భాగమున మొదటి మూడడుగులు విడువండి. మిగిలిన ప్రదేశమున విహరించండి.

    7. విష్ణువా! నీవు స్వర్గము నుండి గాని, భూమి నుండి గాని, అంతరిక్షము నుండి గాని చేతులందు ధనము నింపుకొని రమ్ము. ఆ చేతులతోనే మాకు రత్నాదులను అందించుము.

    విష్ణువు పృథివీ సంబంధమగు పరమాణువులను నిర్మించినాడు. స్వర్గము నేలకూలకుండ నిలిపిఉంచినాడు. మూడు లోకములందు మూడు అడుగులు పెట్టినాడు. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం - ఆ విష్ణువు యొక్క ఘనకార్యములను ప్రవచించుచున్నాను.

    8. దర్భమాలే! త్వంవిష్ణోః లలాటం అసి

    9. విష్ణోః పృష్ఠమ్ అసి - వెన్ను - వీపు

    10. పైన కప్పిన చర్మములారా! మీరు విష్ణువునకు దవడలు అగుచున్నారు.

    11. రజ్ఞువా! విష్ణువునకు బంధనము అగుచున్నావు.

    12. గ్రంథీ! నీవు విష్ణువునకు ధ్రువమవు అగుచున్నావు. హవిర్ధాన మంటపమా! నీవు విష్ణు సంబంధివి. నిన్ను తాకుచున్నాను.

                                     పదునాలుగవ అనువాకము

    (సామిధేనీ, యాజ్య, పురోనువాక్య మంత్రములు చెప్పబడుచున్నవి. సమిధలచే చేయునది సామిధేని. అప్పటికి జనించిన శత్రువులను సంహరించునది పురోనువాక్యమగును. పుట్టబోవు శత్రువును సంహరించునది యాజ్య అగును.)

    1. సామిధేనీ ఋక్కు :- అగ్నీ! మృగమును పట్టుటకు పరచిన పాశము వంటి బలమును ఇమ్ము. ఆ బలమున మేము రాక్షసులను నివారించగలము. మంత్ర సహితుడైన రాజు ఏనుగు మీది వలె రాక్షసుల మీదికి ఉరుకుము. శత్రుసేనను వెంబడించి హింసించుము. పారిపోవు సేనలను తరుముము. మిగిలిన సేనను బాణములచే గ్రుచ్చుము.

    (1 - 15 వరకు సామిధేని ఋక్కులు.)

    2. అగ్నీ! నీ విస్ఫులింగములు భ్రమణ శీలములు. అవి సర్వత్ర రాలుచున్నవి. నీవు మరింత జ్వలింపుము. ఆ మంటలతో అసురులను తాకుము. నీవు హుత హవిస్సులతో కూడినవాడవు. నీ విస్ఫులింగములు మీద పడునవి. కాల్చునవి. వానిని మహాజ్వాలలను సృష్టించుము. రాక్షసులను హింసించుము.

    3. అగ్నీ! రాక్షసులు చిత్రవధ చేయువారు. మాకు శత్రువులు. వారు దగ్గర ఉందురు. దూరమున ఉందురు. వారిని కట్టి పడవేయుటకు త్వరత్వరగా పాశములను కలిగించుము. నిన్ను హింసించగలవాడు లేడు. నీవు మమ్ము పాలించుము. బాధించునట్టి ఎంతటి రక్కసియు నీ వద్దకు చేరకుండును గాత.

    4. అగ్నీ! జాగృతుడవగుము. లెమ్ము. సర్వత్ర శత్రువుల మీద పడుము. నీ ఆయుధములు పదునైనవి. నీవు శత్రువును మిగులనీకుము. పూర్తిగా దహించుము. సమిధాన అగ్నీ! మా మీద పగబూనిన వానిని పడగొట్టము. ఎండిన కట్టెను వలె భస్మము చేయుము.

    5. అగ్నీ! నీవు పైకి ఎగయుము. దైవిక శక్తులను ఆవిష్కరించుము. రాక్షసుల శక్తులను క్షీణింపచేయుము. దెబ్బ తిన్న, దెబ్బ తినని శత్రువుల నందరను హతమార్చుము.

    6. యవ్వనాగ్నీ! నీవు నీ ఇంట ఉందువు. సర్వత్ర వ్యాపించి ఉందువు. యజమాని నీకు హవిస్సులు అర్పించుచున్నాడు. అతనికి నీ మంచి మనసు తెలియును. నీవు ధనములకు స్వామివి. యజమానికి గృహము, యశస్సు నిత్యము కలిగించు చుండుము.

    7. అగ్నీ! నీకు యజమాని స్వగృహమున - జీవిత పర్యంతము నిత్య హవిస్సులు సమర్పించుచున్నాడు. మంత్రములచే నిన్ను సంతోషపెట్టుచున్నాడు. అందువలన యజమాని సౌభాగ్యవంతుడు, మంచి దాట కావలెను. అతని యాగములన్నియు సుదినములవి కావలెను.

    8. అగ్నీ! నీవు అనుగ్రహబుద్ధివి. నిన్ను నేను పూజించుచున్నాను. ఈ వాక్కు అర్వాదీనము. స్తుతిరూపము. దీనిని నీ కొరకు మరల మరల ఉచ్ఛరించుచున్నాను. ఇది నీ మనసునకు పట్టును గాత. మమ్ము అనుగ్రహింపుము. మేము మంచి రథములు, గుర్రములు కలిగి నిన్ను సేవింతుము. నీవు నిత్యము మాకు సామర్థ్యము కలిగించుము.

    9. అగ్నీ! ఈ లోకమున తన మేలు కోరువాడు రాత్రింబవళ్ళు నిన్నే సేవించుచున్నాడు. మేము సన్మనస్కులమై నిన్ను పూజించుచున్నాము. మమ్ము అనుగ్రహింపుము. మేము ధనికులము అగుదుము. నిన్ను సేవింతుము.

    10. యజమాని హవి రూప ధనముతో నిన్ను చేరుచున్నాడు. నీవు అతనిని రక్షించుచున్నావు. అతడు చక్కని గుర్రములు కలవాడు - హిరణ్యము కలవాడు అగుచున్నాడు.

    11. అగ్నీ! నిన్ను చుట్టమును చేసికున్నాను. అంతే. నా మాటలచే అసురల తేజస్సును అడుగంటించినాను. నా తండ్రి గోతముని వంటి ఉపాధ్యాయుడు. అతని ద్వారా నాకు నీ చుట్టరికము కలిగించుము.

    అగ్నీ! నీవు దేవతల ఆహ్వాతవు. యువతముడవు. యాగనిష్పాదకుడవు. మా అధ్యయనముల అర్థము తెలిసినవాడవు అగుచున్నావు.

    12. అగ్నీ! నీ కిరణములు ఉత్తమములు. మిథ్యారహితములు. మూర్చారహితములు. దురిత తమో నివారకములు. సుఖసేవ్యలు. అప్రమత్తలు. బాధించనివి. శ్రమ ఎరుగనివి. పాలించునవి. ఒకేసారి సర్వత్ర ప్రసరించునవి. అట్టి నీ కిరణములు ఈ యాగస్థానమున ఉండవలెను. రక్షించవలెను.

    13. అగ్నీ! నీ కిరణములు మంచిగా పాలించునవి. అవి 'మమత' యను స్త్రీ యొక్క అంధ సంతానమును చూచినవి. వారి అంధత్వము పోగొట్టినవి - రక్షించినవి.

    అగ్నీ! నీవు సర్వజ్ఞుడవు. చక్కని పనుల నీ కిరణములను రక్షించినావు. శత్రు రాక్షసులు ఆ కిరణములను పరాభవించదలచినారు. పరాభవించజాలరైరి!

    14. అగ్నీ! మేము నీసహితులమై యజ్ఞము చేయుచున్నాము. నీకు మాకు రక్షకుడవు అగుచున్నావు. నీ ప్రేరణ వలననే మేము అన్నము తినుచున్నాము. సత్య సంరక్షక అగ్నీ! మాకు ఇహ, పరములనొసంగుము.

    అగ్నీ! నీ భక్తులను కించపరచవు. వారి వ్రతములను పూర్తి చేయించుము.

    15. అగ్నీ! సామిధేని ఋక్కుల చేత నిన్ను సేవించుచున్నాము. "అయాతే అగ్నే! సమిధా విధేమ" మా స్తుతులను గ్రహించుము. రాక్షసులను దహించుము. నీ తేజస్సు ఉపకారకమగును. శత్రువుల ద్రోహముమండియు వారి నిందల నుండియు - అనుష్ఠాన లోపము నుండియు మమ్ము కాపాడుము.

    16. పురోనువాక్యము - అగ్ని రాక్షస సంహారకుడు. అన్నవంతుడు. అట్టి అగ్నిని అభిముఖముగా ప్రజ్వలింపచేయుచున్నాను.

    అగ్ని జగములకు మిత్రుడు, విశాలుడు, రక్షకుడు, అతనిని సేవించుచున్నాను.

    అగ్ని యజ్ఞములందు తీక్షణముగా జ్వలింపచేయబడువాడు. అతడు హింసకుల నుండి మమ్ము రేయింబవళ్ళు రక్షించును గాత.

    17. యాజ్య - ఈ అగ్ని తేజస్సు ఎంతటిది! ఎంత ప్రకాశించుచున్నాడు!! అగ్ని యొక్క రెండు జ్వాలలు అమితముగా మండుచున్నవి!!! అవి అసుర సంబంధములను, అతిక్రమింపనలవి కాని మాయలను ధ్వంసము చేయుటకు సాగినవి.

    18. యాజ్య - అవి అగ్ని కిరణములు. వాడియైన ఆయుధములు. పురోడాశముచే ధ్వని చేయునవి. అవి రాక్షసులను సంహరించుటకు ద్యులోకమునందు సహితము ప్రసరించును గాత. ఈ అగ్ని జ్వాలలు మమ్ము సంతోషపరచుటకే శత్రువులను నశింపచేయుచున్నవి. అందువలన అసుర బాధలు మమ్ము తాకకున్నవి. "భామానవరన్తే పరిభాదో అదేవీః"


          శ్రీమదాంధ్రవచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత 
          మొదటి కాండమునందలి రెండవ ప్రపాఠకము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.