Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    6. అజ్ఞాతవాసమునకు తగిన దేశమునకు ఉండవలసిన లక్షణములు మూడు అని చెప్పినారు.
    i) సుభిక్షమగుట.
    ii) జనులు ఎక్కువగా  ఉండుట.
    iii) రాజకీయ సుస్థిరత.
        పై మూడు లేని దేశమున కల్లోలములు ఉండును. కల్లోలము ఉన్న దేశమున జనులే ఉండరు. అజ్ఞాతవాసమునకు ఎట్లు పనికి వచ్చును? పైన సూచించిన లక్షణములు, సామాజికముగను, ఆర్ధికముగను, రాజకీయముగను అతి ప్రధానములు అయినవి. వాటిని గురించి ఇంకెంతయో చర్చించవచ్చును.
    7. విరాటుడు బలవంతుడుగా తోచడు. కౌరవులు పాండవుల కొఱకు బలవంతులవద్దనే వెదికింతురు. బలహీనుల జాడకుపోరు అను ఉద్దేశ్యమున విరాట రాజ్యమును ఎన్నుకున్నట్లు కనిపించుచున్నది. ఆరుగురు విడిగా ఉండుట ప్రమాదము. ఒకేచోట ఉన్నను అంతగా పట్టించుకొనని మారుమూల రాజ్యము మత్స్యదేశము  కావలెను.
    8. ఆయుధములను దాచిపెట్టుట ఒకపెద్ద సమస్య. వస్తువులను పాతిపెట్టి అవసరము అయినపుడు తీసుకొనుట ఆనాటికి తెలియనట్లున్నది. అది చాల భద్రమయిన పద్దతి. నేటికిని అమలులో ఉన్నది.
    9. ఆయుధములను దాచుటకు శ్మశానమును ఎన్నుకున్నారు. ఈ శ్మశానము హిందువుల శ్మశానముగా కనిపించదు. ఆ లక్షణములు అక్కడ కనిపించవు. కాల్చిన జాడలుగాని పూడ్చిన జాడలుగానిలేవు.
    అది పారశీకుల శ్మశానమువలె కనిపించుచున్నది. పారశీకులు శవములను పూడ్చరు. దహనము చేయరు. శవములను అట్లే ఒక బహిరంగ ప్రదేశమున వదలివేతురు. శరీరము పశుపక్ష్యాదులకు ఆహారము కావలెననునది వారి ఉద్దేశ్యము.
    అప్పటికి భారతదేశమున అందునను ఉపప్లావ్యమున పారశీకులు ఉన్నట్లు విదితము.
    10. పారశీకులు విదేశీయులు. నగరమున బహుకొద్దిమంది ఉందురు. ఒక సంవత్సరకాలమున ఎక్కువమందికి శ్మశానమునకు వచ్చు అవసరము ఉండకపోవచ్చును. అంతేకాక శవములను బహిరంగస్థలమున పారవేయుటవలన దుర్గంధము వ్యాపించి ఉండును. అట్లని అది భద్రమయిన ప్రదేశముగా నిర్ణయించినారు.
    11. ధర్మరాజు అబద్దము ఆడినాడు. దూరముగా ఉన్న గొల్లలకు తనతల్లి ముదుసలి, నూరేళ్ళు నిండినది చనిపోయినది అని చెప్పినాడు. ఆపదలందు అబద్దము ఆడుట తప్పుకాకపోవచ్చు. శుక్రనీతి ఒకటి ఉన్నది.
    12. శవములను దహనము చేయుట తమ ఆచారముకాదు. శవమును వదిలివేయుట తమ కులాచారము అని ధర్మరాజు చెప్పినాడు. అది పారశీకుల ఆచారము. అందును బట్టియు అక్కడ పారశీకులు ఉన్నారనియు, వారి ఆచారములు ఇతరులకు తెలియుననియు విదితము అగుచున్నది.
    13. జమ్మిచెట్టు చింత చెట్టువలె దట్టమయినది. ఆకులు చిన్నవి అయినను లోని వస్తువును అగపడనీయవు. కాగా జమ్మి ఫలములను ఇచ్చు వృక్షముకాదు. అందువలన అది జనులకు అంతగా ఉపకరించదు. అదియునుగాక అది శ్మశానములో ఉన్నపుడు దాని జోలికి ఎవరునుపోరు. జమ్మి భయంకరముగా వర్ణింపబడినది. దాని దరిదాపులకు ఎవరునురారు. అందువలన అది భద్ర ప్రదేశమని అచట ఆయుధములను భద్రపరచినారు.
    14. ఆయుధములు లేని పాండవులను గురించియు, కోదండములేని శ్రీరాముని గురించియు ఊహించలేము. ఆయుధములేక మనవలసి వచ్చిన అత్యంత క్లిష్టమయిన అజ్ఞాతవాసము అది. ఒక సంవత్సరము ఎవరికిని, భీమునకు కూడ కనిపించరాదని ఆయుధములను ప్రార్దించినాడు ధర్మరాజు. ఎంతటి క్లిష్టస్థితి ఎంతటి దయనీయదశ!
    
                                                    అలవిగానిచోటు
    
    అది మత్స్యదేశపు రాజధాని నగరము ఉపప్లావ్యము. ఆ దేశపు రాజు విరాటరాజు. సభతీర్చి ఉన్నాడు. ధర్మరాజు సన్యాసి వేషమున ప్రవేశించినాడు. ధర్మరాజు దీప్తికి విరాటుడు ముగ్ధుడు అయినాడు. సన్యాసిని చూచినాడు. సింహాసనము నుండి లేచినాడు. ఎదురేగినాడు. స్వాగతము చెప్పినాడు. నమస్కరించినాడు. తోడితెచ్చినాడు. ఆసనము చూపినాడు. ధర్మరాజు కూర్చున్నాడు. విరాటుడు అప్పుడు అడిగినాడు:-
    "యతీంద్రా! మీరు మహాత్ములుగా కనిపించుచున్నారు. మీరెవరు? మీపేరేమి? ఏకారణమున నావద్దకు వచ్చినారు?".
    "మహారాజా! అన్ని విషయములందును నిజము చెప్పువారు ఈ లోకమున దుర్లభులు. సకల జనులు తమకు తోచినట్లు నిజము చెప్పుదురు".
    "మాది కురుదేశము. నేను బ్రాహ్మణుడను. సజ్జన ప్రియుడగు ధర్మరాజునకు మిత్రుడను. సన్యాసము స్వీకరించినాను. జూదము ఆడుట కొంత నేర్చినాను. కొందఱు నాతో మాయజూదము ఆడినారు. నాధనమును అపహరించినారు. నన్ను అవమానించినారు. అందువలన విరక్తుడను అయినాను. నేను నీతిశాస్త్రమును అభ్యసించినాను. ధర్మపరులతో స్నేహము చేసినాను. నాపేరు "కంకుడు". నీవు సాధుపురుషుడవు అని ఎరిగి నీవద్దకు వచ్చినాను. నాకు ఒక సంవత్సరము వ్రతము ఉన్నది. అది నీవద్ద జరిపి, నీకు మేలుచేసి నాకు కీడు కలిగించిన వారిని గెలుచుటకు వెళ్ళుదును" అని చెప్పినాడు ధర్మరాజు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.