Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ధర్మరాజు తూర్పుముఖముగా కూర్చున్నాడు. చేతులను జోడించినాడు. తలవంచినాడు. "ధర్మదేవా! నీవు నాయందు దయతలచి అజ్ఞాతవాసము విజయవంతము అగునట్లు వరమును ప్రసాదించినావు. ఇప్పుడు ఆ కాలము వచ్చినది. మమ్ములను ఇతరులు ఎరుగకుండునట్లు అనుగ్రహింపుము" అని ప్రార్దించినాడు.
    ప్రార్ధన ముగించి చూచుకొనగా ధర్మరాజునకు సన్యాసి వేషము వచ్చినది. ధర్మరాజు వేషమును చూచి అందరును ఆశ్చర్యపడినారు. భీమార్జున, నకుల, సహదేవ, ద్రౌపదులకు కూడ వారు నిర్ణయించుకొనిన రూపములు వచ్చినవి. అందుకు వారికి ఆశ్చర్యము, సంతోషము కలిగినది.
    అజ్ఞాతవాసము రహస్య సమాలోచనమునకు అనుకూలము. వారు తమలో తాము కొన్ని పేర్లు నిర్ణయించుకున్నారు. ధర్మరాజు జయుడు, భీముడు జయంతుడు, అర్జునుడు విజయుడు, నకులుడు జయత్సేనుడు, సహదేవుడు జయద్భలుడు అను పేర్లు నిర్ణయించుకున్నారు.
    "భీమాదులారా! మనము అందరము ఒకేసారి విరాటుని వద్దకు వెళ్ళరాదు. నేను ముందు వెళ్ళుదును. మీరు ఒక్కొక్కరు తరువాత రండు" అని నియమించి ధర్మరాజు ఉపప్లావ్యనగరము వైపు సాగినాడు.
    
                                                                                     ఆలోచనామృతము

    1. పాండవులకు వనవాసము సులభముగనే గడిచినది. పన్నెండు సంవత్సరములు తీర్ధయాత్రలందును, ఆయుధ సమార్జనము నందును, సత్కథా కాలక్షేపములందును గడిపినారు. ముని జనులు, బ్రాహ్మణులు, పరివారము వారి వెంట ఉన్నది. ఒక్క సైంధవుని ఉదంతమున తప్ప ఇబ్బందులు కలుగలేదు. అజ్ఞాతవాసము అటువంటిది కాదు. అది అతిక్లిష్టమయినది. పాండవులవంటివారు గుర్తింపబడకుండుట కష్టతమము. అందుకే అందుకొఱకు ఎంతో ఆలోచనము, ఏర్పాటు, ప్రణాళికా రచన అవసరము అయినది.
    2. అజ్ఞాతవాస ప్రణాళికకు బీజము అరణ్యపర్వపు చివరనే వేయబడినది. యక్షప్రశ్నలు వేసి ధర్మరాజుని పరీక్షించినాడు ధర్మదేవుడు. కర్ణుని రక్షించుటకు సూర్యుడు, అర్జునుని గెలిపించుటకు ఇంద్రుడు వచ్చినటులే అజ్ఞాతవాసము విజయవంతము చేయించుటకు యమ ధర్మరాజు వచ్చినాడు.
    ముగ్గురు తండ్రులు ముగ్గురు కొడుకులకు మేలు చేయుటకు వచ్చినారు. ఇచట పుత్రులు అర్ధించుట కనిపించదు. తండ్రు-లకు ఉండు వాత్సల్యము అటువంటిది. అడుగకుండనే వారు మేలుచేసినారు.
    ముగ్గురు తండ్రులలో ధర్మదేవుడు చేసిన మేలు గొప్పది. అది ప్రస్తుతమునకు అవసరము అయినది. అజ్ఞాతవాసము విజయవంతము కాకున్న యుద్దపు ప్రసక్తిలేదు. కాబట్టి ధర్మదేవుడు చేసిన ఉపకారము గొప్పది.
    3. మనకు తెలిసినంత వరకు అరణ్యవాసము చేసిన వారు చాలమంది ఉన్నారు. శ్రీరామచంద్రుడు, నలుడు, హరిశ్చంద్రుడు మున్నగువారు. కాని అజ్ఞాతవాసము చేసినవారు కనిపించరు. ఈ పరీక్ష పాండవులకే వచ్చినది. అజ్ఞాతవాసము అతి దుష్కరము అని తెలిసియే ఈ నియమము విధించినారు. పాండవులను జీవితాంతము అరణ్య, అజ్ఞాత వాసములతో సతమతము చేయుట వారి ధ్యేయము.
    4. అజ్ఞాతవాసము గడుపవలసిన రాజ్యమును గురించి ఎంతో ఆలోచన జరిగినది. అజ్ఞాతవాసమునకు కురుదేశము పనికిరాదు. అది కౌరవుల ఆధిపత్యమున ఉన్నది. కాబట్టి కురుదేశపు చుట్టున ఉన్న దేశములను గురించి ఆలోచించినారు. కురుదేశమునకు ఆవల ఉన్న దేశములమీద కౌరవుల ఆధిపత్యము ఎంత? ఆయాదేశముల రాజకీయ ప్రతిపత్తి ఏమి? ఇందుగురించి రాజకీయజ్ఞులు పరిశీలనము జరిపి నిర్ణయించవలసి ఉన్నది.
    కాగా కురుదేశమునకు  ఆవల ఉన్న దేశములందు నివసించుటకు పాండవులు నిర్ణయించుటణు చూడగా కౌరవుల ఆధిపత్యము వాటిమీద ఉన్నట్లు కనిపించదు. అంతేకాక పాండవులను కౌరవులు గుర్తించుట జరిగినను అదినిరూపించుటకు ఆ రాజ్యము పై దండెత్తవలసి ఉండును. దండెత్తుటకు కొంత సమయము పట్టును. పాండవుల అండ ఉన్న రాజును గెలుచుట కౌరవులకు కష్టము అగును. వీటన్నింటిని ఆలోచించి కురుదేశమునకు దూరముగా ఉన్న దేశమును ఎన్నుకొనుట జరిగినది.
    5. మత్స్యదేశము కురుదేశమునకు అందుబాటులో లేనిది కావచ్చును. ఇది వింధ్యకు దక్షిణమున ఉండవచ్చును. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిని విరాటరాజు పట్టణముగా పేర్కొందురు. నేను చూచినపుడు అక్కడ ఒక విరాటరాజు గద్దె అనుదిబ్బ, ఒక భీముని గుడి ఉండెను. అక్కడ జమ్మి చెట్లు ఎక్కువ. నేలకొండపల్లి అయినను కాకున్నను పాండవులు అజ్ఞాతవాసము చేసినది తెలుగుదేశమే కావచ్చునని నా ఉద్దేశము. ఎందువలన అనగా భీమవరము, భీమునిపట్నము, భీమదేవరపల్లి మున్నగు భీముని పేరుగల ఊళ్ళు తెలుగుదేశమునందే ఉన్నవి.
    శ్రీరాముడు అరణ్యవాసము చేసినది కూడ భద్రాచల ప్రాంతమున తెలుగు దేశమునందే.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.