Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ధర్మరాజు సహదేవుని చూచినాడు. అతడు అలసి ఉన్నాడు. నకులుని చూచినాడు. అతడును అలసి ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు అర్జునునితో "ద్రౌపది అలసి ఉన్నది. మనమును డస్సి ఉన్నాము. కాని మనము ఇచట నిలువలేము. కావున నీవు ద్రౌపదిని ఎత్తుకొని ఉపప్లావ్యము వరకు నడువుము" అన్నాడు. అర్జునుడు ద్రౌపదిని ఎత్తుకొని సాగినాడు. వారు అలసి ఉన్నారు. అయినను నడచినారు. నడువగ, నడువగా ఉపప్లావ్యము కనిపించినది.
    అర్జునుడు ద్రౌపదిని చల్లని చెట్టు నీడలో దించినాడు. అందరును అలసి ఉన్నారు. కూర్చున్నారు. ధర్మరాజు మాత్రము ఆలోచించుచునే ఉన్నాడు. "తమ్ములారా! ఆయుధములను ధరించి మనము నగరము లోనికి పోరాదు. గాండీవమును సకల జనులు గుర్తించగలరు. మనము పట్టుబడక తప్పదు. అందువలన మన అజ్ఞాతవాసము భంగము అగును. కావున మనము ఆయుధములను దాచు ప్రయత్నము చేయవలెను. అందుకు తగిన ప్రదేశమును చూడవలసి ఉన్నది" అన్నాడు.
    అర్జునుడు అలసి ఉన్నాడు. అయినను స్థలము చూచుటకు వెళ్ళినాడు. పరిశీలించినాడు. ఒక స్థలమును నిర్ణయించినాడు. ధర్మరాజాదులను తీసుకొని వెళ్ళినాడు. వారికి ఆ ప్రదేశము చూపినాడు. అన్నాడు:-
    "ఇది శ్మశాన భూమి. భయంకరముగా ఉన్నది. ఆ పక్కన పెద్ద జమ్మి చెట్టు ఉన్నది. దాని కొమ్మలు పొడవుగా ఉన్నవి. సకల దిక్కులందు వ్యాపించి ఉన్నవి. పిల్లకొమ్మలు పెనవేసుకొని సందులేక ఉన్నది. పగటికాలమున సహితము చెట్టు లోనికి వెలుతురు పోవునట్లు లేదు. కారుచీకటి కమ్మి ఉన్నది. చెట్టునందు కాకులు, గుడ్లగూబలు గుంపులుగా ఉండి అరచుచున్నవి. వాని ధ్వని భయంకరముగా ఉన్నది. చెట్టునందు పాములు కూడ పాకుచున్నవి. ఇది శ్మశానము. ఇటుపక్కకు సాధారణముగా జనులురారు. శ్మశానము పక్కన ఉన్న ఈ చెట్టు అతి భయంకరముగా ఉన్నది. ఇది మన ఆయుధములు దాచుటకు సరియైన ప్రదేశముగా నాకు తోచుచున్నది".
    ధర్మరాజు శ్మశానమును చూచినాడు. జమ్మిని చూచినాడు. అర్జునుని మాటను అంగీకరించినాడు."ఈ జమ్మి చెట్టు భూత, ప్రేత పిశాచము-లకు నెలవువలె కనిపించుచున్నది. ఈ చెట్టువద్ద దుర్గంధము వ్యాపించి ఉన్నది. కావున ఈ చెట్టువద్దకు ఎవరునురారు. మన ఆయుధములను అన్నింటిని పీనుగువలె కట్టుకట్టి, ఆ కట్టమీద తోలువెంట్రుకలు చుట్టి ఈ జమ్మిచెట్టుమీద పెట్టుదము. ఎవరును ఈ చెట్టువద్దకు రాలేరు. మనము నిశ్చింతగా ఉండవచ్చును" అన్నాడు.
    ధర్మరాజు మాటలు విన్నారు. పాండవులందరు తమ తమ ఆయుధములను ధర్మరాజు ముందు ఉంచినారు. పాండవులు శూరులు, వీరులు, వారికి ఆయుధములు ప్రాణములవంటివి. వాటిని విడిచినపుడు వారు విలవిలలాడినారు. మనసులు తల్లడిల్లినవి. కన్నీరు జలజల రాలినది.
    ధర్మరాజు దుఃఖమును దిగమింగినాడు. ధనుస్సులు, అంబుల పొదులు, కవచములు, కత్తులు, ముద్గర గదాద్యాయుధములను ఒక కట్టగా కట్టినాడు. అవి సర్పాకారముగా ఉండునట్లు కట్టబడినవి. ఆ సమీపమున పడి ఉండిన ఒక పశువు చర్మమును సహదేవుడు ఒలిచి తెచ్చినాడు. దానిని ఆకట్టకు చుట్టినాడు. ఆయుధములకట్టను తీసుకొని ధర్మరాజు జమ్మిచెట్టు ఎక్కినాడు. ఆయుధములను జమ్మి చెట్టుమీద పెట్టినాడు. అక్కడి శ్మశానమున శుష్కించిన ఒక శవము పడి ఉన్నది. దానిని తెప్పించినాడు. ఆయుధముల కట్టమీదపెట్టి కట్టినాడు. ఆ దుర్గంధమునకు ఆదరిదాపులకు ఎవరూరారని, ఆయుధములు భద్రముగా ఉన్నవని నిశ్చయించుకున్నాడు. జమ్మిచెట్టు దిగినాడు.
    అప్పుడు ధర్మరాజు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, దిక్పాల, సూర్య, చంద్రాదులను పితృదేవతలను స్మరించినాడు. భూమ్యాకాశములను ప్రార్ధించినాడు. ఆయుధముల అధిదేవతలకు నమస్కరించినాడు. ప్రార్దించినాడు:-
    "ఆయుధములారా! మీ రూపములను నాకును, అర్జునునకు తప్ప ఇతరులకు చూపరాదు. ఇతరులకు మీరు ఘోర సర్పాకారములవలె కనిపించవలెను. భీముడు ఉద్రేక స్వభావము గలవాడు. అతనికి కూడ కనిపించరాదు"
    ధర్మరాజు భీముని చూచినాడు. అతని కనులు నిప్పులు కురియుచున్నవి. ఉచ్చ్వాస నిశ్వాసములు వేగముగా సాగుచున్నవి. ధర్మరాజు భీముని వద్దకు వెళ్ళినాడు. భీమునకు శాంత వాక్యములు చెప్పినాడు. అతనిని కౌగిలించుకున్నాడు. శాంతింప చేసినాడు.
    ధర్మరాజు అటుచూడగా కొందరు గొల్లపిల్లలు కనిపించినారు. వారు తాము చేయుచున్న పనులను గమనించుచున్నారని అనుకున్నాడు. వారివద్దకు వెళ్ళి అన్నాడు:-
    "గొల్లలారా! మా తల్లి నూరేళ్ళ ముదుసలి చనిపోయినది. మా కుల ధర్మము ప్రకారము శవమును కట్టకట్టి జమ్మిచెట్టునకు వ్రేలాడతీసినాము. మేము శవములను దహనము చేయము. ఇది మా వంశాచారము. మా పెద్దలు ఇట్లే చేసినారు. మేమును అట్లే చేసినాము" అని వారికి నచ్చచెప్పినాడు.
    యమధర్మరాజు వరము, తాము భద్రపరచిన పద్దతిని బట్టి ఆయుధములు బయటపడవని పాండవులు నిశ్చయించుకున్నారు. వారు అక్కడి నుండి బయలుదేరి నది వద్దకు చేరినారు. స్నానములు చేసినారు. జపహోమాదులు నిర్వర్తించినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.