Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    3. సోమ, వరుణ రాజుల -  బృహస్పతి, అనుమతుల శరణమందుండి - ఇంద్రా ! నీ స్తోత్రమున ప్రవృత్తుడను అయినాను. ధాతవు, విధాతవగు నీ అనుమతితో సోమము సేవించుచున్నాను.

    4. ఇంద్రా ! నీవు ప్రేరణ కలిగించినావు. చరుమున్నగు ఆహార పదార్థములను నీకు సమర్పించినాను. సర్వ ప్రథమ స్తోతలమై ఈ స్తుతిని ఉచ్చరించుచున్నాము.

    ఇంద్రుని మాట :-

    విశ్వామిత్ర జమదగ్నులారా! సోమము అందగనే ధనముతో మీ ఇంటికి వచ్చెదను. అపుడు మీరు నన్ను విశేషముగ స్తుతించండి.
       
                               నూట ఆరువది ఎనిమిదవ సూక్తము
           ఋషి - వాతగోత్న అనిలుడు - దేవత - వాయువు ఛందస్సు - త్రిష్టుప్

    1. వాయువు రథముతో సమానవేగముగ పరిగెత్తును. అట్టి వాయువు మహిమను నేను స్తుతించుచున్నాను. వాయువు శబ్దము వజ్రసమము. ఇది వృక్షాదులను వంచి, కూల్చిసాగును. ఇది  నలుదిశల ఎరుపు పరచి ఆకాశము ఆలంబనముగ సాగును. ఇది నేల దుమ్మును లేపుచు సాగును.

    2. వాయుగతి పర్వతాదులను సహితము వడకించును. అశ్వములు యుద్ధమున పడినట్లు వాయువు పర్వతముల మీద్ఫా పడును. వాయువు అశ్వములు కట్టిన రధమును అధిరోహించి సమస్త భువనముల సామ్రాట్టువలె సాగును.

    3. వాయువు ఆకసమున సంచరించును. ఏనాడును దానికి స్దిరత్వము లేదు. నీరు జల బంధువులు జలమున కన్న మున్ను పుట్టినవారు. వీరు సత్యస్వభావులు. వీరు ఎచట పుట్టినారు? ఎచటి నుంచి వచ్చినారు?

    4. వాయుదేవత దేవతల ఆత్మస్వరూపుడు. భువనముల స్వరూపుడు. ఇతడు యథేచ్ఛగ సంచరించును. వారి శబ్దము బహుధ్వనులది వారి రూపము అప్రత్యక్షము హవి సహితులమై మేము వాయువును ఆరాధింతును.
   
                              నూట అరువది తొమ్మిదవ సూక్తము
               ఋషి - కక్షీవద్గోత్రశబరుడు - దేవత - గోవు ఛందస్సు - త్రిష్టుప్

    1. గోవుల వైపు సుఖకర వాయువు వీచునుగాత. గోవులు బలవర్ధక తృణ, పత్రములు ఆస్వాదించునుగాత. అవి ప్రాణ సంతృప్తికర జలములు త్రాగునుగాక.

    రుద్రదేవా ! చరణయుక్త, అన్న స్వరూప గోవులను స్వచ్ఛముగ ఉంచుము.

    2. గోవులు కొన్ని సమవర్షలై ఉండును. కొన్ని విభిన్నవర్ణలై ఉండును. కొన్ని ఏకవర్ణలై ఉండును. యజ్ఞాగ్ని గోవులను తెలియుచున్నాడు. అంగదుల సంతానము తపమాచరించి వానిని పృథివి మీద ఏర్పరచినాడు.

    3. గోవులు తమను దేవతల యజ్ఞమునకు అర్పించుచున్నవి. సోముడు వాని అశేష ఆహుతులను ఎదుంగుచున్నాడు. ఇంద్రుడు వారి దుగ్ధపూర్ణలను చేసి సంతానయుక్తలనుగ మన గోష్ఠమునకు పంపినాడు.

    4. దేవతలు, పితరులు పరిశీలించినారు. ప్రజాపతి మాకు గోవులను ప్రసాదించినాడు. మా గోవులను అన్నింటిని కళ్యాణయుక్తలను చేసి - వాని సంతానము వర్ధిల్లుటకు గాను - మా గోష్ఠముల కంపినారు.
   
                                  నూట డెబ్బదివ సూక్తము
    ఋషి - సూర్యపుత్ర విభ్రాటుడు దేవతసూర్యుడు - ఛందస్సు - 1,3 జగతి - 4 పంక్తి

    1. సూర్యదేవుడు అత్యంత దీప్తివంతుడు, మధుతుల్య సోమరస పానము చేయును. యజ్ఞము చేయు వారికి ఉత్తమ ఆయువును ప్రసాదించును. అతడు వాయు ప్రేరణతో ప్రజలను స్వయముగ రక్షించును. ప్రజలను పోషించును. వారికి ప్రకాశము కలిగించును.

    2. సూర్యరూపమగు కాంతి గోళము ఉదయించుచున్నది. అతడు ప్రకాండ దీప్తిశాలి. సంస్థాపితుడు. సర్వోత్కృష్ట అన్నదాత. అతడు ఆకసమున నిలిచినాడు. ఆకాశమునకు ఆశ్రయము కలిగించుచున్నాడు. అతడు శత్రుహంత. వృత్రఘ్నుడు. అసుర ఘాతకుడు. విపక్ష సంహారకుడు.

    3. సూర్యుడు సమస్త జ్యోతిర్మయ పదార్ధములందు శ్రేష్టుడు - అగ్రగణ్యుడు. అతడు విశ్వజిత్తు - ధనవిజేత, అనంత ప్రకాశవంతుడు. సమస్త పదార్ధములను కనబరచువాడు. వర్ణము కలిగించుటకు విస్తరిల్లినాడు.

    అతడు బల సంపన్నుడు - అక్షయ తేజోవంతుడు.

    4. సూర్యదేవా! నీవు జ్యోతిష్మంత ప్రకాశకుడవై - ఆకాశమున విరాజిల్లినావు. నీ ప్రతాపము సకల కర్మలకు సహాయకము. యజ్ఞములకు అనుకూలము - భువనమునలకు పుష్టికరము అగుచున్నది.
   
                                  నూట డెబ్బది ఒకటవ సూక్తము
         ఋషి - భృగుపుత్ర ఇటుడు - దేవత - ఇంద్రుడు - ఛందస్సు గాయత్రి

    1. ఇంద్రా ! 'ఇట' ఋషి నీకు సోమము అర్పించినాడు, అపుడు నీవు అతని రథమును రక్షించినావు. సోమయుక్త ఇటుని కేక విన్నాను.

    2. యజ్ఞము కంపించినది. ధనుర్ధారి యగు యజ్ఞపు మస్తకము నుండి దేహమును వేరు చేసినావు.

    3. ఇంద్రా! అస్త్ర బుధ్న పుత్రుడు నిన్ను తేప , తేప స్తుతించినాడు. కావున వేనపుత్ర పృధువును అతనికి వశపరచినావు.

    4. ఇంద్రా! సూర్యబింబము పడమట క్రుంగినపుడు అతడు ఎచటికి వెళ్లునది దేవతలు సహితము ఎరుంగరు. నీవు మరల సూర్యుని తూర్పునకు తెస్తావు.
   
                                 నూట డెబ్బది రెండవ సూక్తము
               ఋషి - ఆంగిరస సంవర్తనుడు - దేవత - ఉష ఛందస్సు -విరాజ

    1. ఉషా! వింత వెలుగుతో విచ్చేయుము. నిండు పొదుగుతో అవులు దారి పట్టినవి.

    2. ఉషా! ఇవిగో సంపన్న స్తోత్రములు. వానిని ఆకలించుటకు రమ్ము. యజమాని దాన సామాగ్రి అందుకుంటాడు. దాతృత్వము ప్రసాదిస్తాడు. యజ్ఞ సంపాదన చేస్తాడు.

    3. అన్నము కూర్చినాము. ఉత్తమ వస్తుదానమునకు సంసిద్దులము అయినాము. సూత్రము వంట యజ్ఞమును విస్తార పరుస్తున్నాము. నీకు యజ్ఞము అర్పిస్తున్నాము.

    4. ఉష తన సోదరి రాత్రి యొక్క అంధకారము పోగొట్టినది. ఉత్తమ బుద్దిచే రథమును నడిపించినది.
   
                                  నూట డెబ్బది మూడవ సూక్తము
              ఋషి - అంగిరస ధ్రువుడు - దేవత - రాజు - ఛందస్సు - అనుష్టుప్

    1. రాజా! నిన్ను రాజ్యాధిపతిని చేయుచున్నాము. నీవు ఈ  రాజ్యపు ప్రభువవు అగుము. స్థిరముగ, నిశ్చలముగ నిలుపుము. ప్రజ్ఞ నిన్ను అభిలషించును గాక. నీ రాజ్యమునకు హాని కలుగకుండును గాక.

    రాజకీయాన్ని ఎంత స్పష్టముగా వివరించుచున్నాడో గమనించండి. మేధావి - సామాజిక నేత - ధర్మము రాజును చేస్తున్నది.

    భారత తాత్వికతలో ధర్మం రాజకీయాన్ని శాసించింది. సమాజం రాజకీయాన్ని శాసించింది అనడం మరింత సమంజసం. ప్రస్తుతం రాజకీయం కండకావరం. ధన మదంతో సమాజాన్ని శాసిస్తున్నది. ఇది భారత, పాశ్చాత్య తాత్త్వికతల మౌలిక భేదం.

    రాజు - రాచరికం - చంచలం కారాదు. స్థిరం కావాలి. ప్రజలు అభిలషించేట్లుగా రాజు రాజ్యం పాలించాలి.

    రాజ్యానికి హాని కలుగకుండ సమాజం - రాజకీయం చూడాలి.

    2. రాజా! నీవు రాజ్యముణ పర్వతమువలె నిశ్చలముగ నిలుపుము. రాజ్య భ్రష్టుడవు కారాదు. ఇంద్రునివలె ఇచట నిశ్చలముగ నిలువుము. రాజ్యమును పరిపాలించుము.

    3.  ఇంద్రుడు  ధ్రువములగు హవిస్సులు అందుకున్నాడు. రాజును ధ్రువముగ ప్రతిష్ఠించినాడు. బ్రహ్మణస్పతియు, సోమరాజును సదాలోచన కలిగింతురుగాక.

    స్ధిరత్వానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇంద్రుని అంతటి స్ధిరముగ ఉండమని చెప్పి, ఇంద్రుడే ప్రతిష్టించినాడు  అంటున్నాడు, ఇంద్రుడు దేవరాజు మాత్రం  కాదు. 'శత క్రతు' నూర్ల సత్కార్యములు చేసినవాడు. రాజు విద్వాంసుల మేధావుల సూచనలను అనుసరించాలి అంటున్నాడు.

    ఒక్కసారి నేటి అరాచకీయ రాచకీయన్ని పరిశీలించండి.

    1. భారత ప్రభుత్వం సార్రీ "గవర్నమెంట్ ఆఫ్  ఇండియా"లో భారతీయత లేశమాత్రం లేదు. రాజ్యాంగం సహితంగా సమస్తం పాశ్చాత్యులు మన మీద  రుద్దినవే!

    2. ఏ రాజకీయ పార్టీకి, సత్యం, ధర్మం, నీతి, నియమం అనేవి ఉన్నాయనే విషయం తెలియదు. ప్రజలను వంచించడంలో వారిని ఓట్లిచ్చే యంత్రాలను చేసి మాటలు తమ దగ్గర  ఉంచుకోవడంలో ఒకరిని మించిన వారు మరొకరు. ఎవరికీ దేశం ప్రజలు పట్టితేరు - అధికారమే పరమావధి!

`    3. ప్రభుత్వంలోను, విధానాల్లోనూ, అస్థిరత్వం! కొంతకాలం రష్యావిధానాలు - ఇపుడు అమెరికా బానిసత్వం.

    4. 'బ్రహ్మణాస్సంతు నిర్భయాః' బ్రహ్మణులు భయంలేని వారు కావాలి అనేది వేద సూత్రం. మేధావులు నిర్భయంగా ఆలోచించి వివరించ గలగాలి. ఈ దేశంలో ఒక్క పార్టీ సహితం మేధావులకు స్వేచ్ఛ ఇవ్వడానికి సిద్ధంగా లేదు.

    వేదపు ఆదర్శం ఎంత నిత్యసత్యం అయిందో గమనించండి. నమస్కరించండి.

    4. ఆకాశము ధ్రువము. పృథివి ధ్రువము. ఈ పర్వతములు ధ్రువములు! సమస్త విశ్వము ధ్రువము. అట్లే ప్రజల మధ్య రాజు ధ్రువముగా నిలుచునుగాక.

    5. 'ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః

    ధ్రువంత ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతాం ధ్రువమ్".

    వరుణ రాజు స్థిరుడు అగును గాక. బృహస్పతి దేవత స్థిరుడు అగునుగాక. ఇంద్రాగ్నులు స్థిరులై రాజ్యమును స్థిరముగ పోషింతురుగాక.

    ప్రభుత్వం పంచభూతము లంతటి స్థిరం కావాలి. అంతటితో చాలదు. మేధావులు, వర్షములు, ఇంద్రుడు అగ్ని అస్థిరులు కాక స్థిరులే దేశాన్ని పోషించాలి.

    ప్రభుత్వానికి స్థిరత్వం ప్రధాన అంశం అంటున్నది వేదం.

    ఈ ప్రభుత్వాలు సర్వత్ర అస్థిరములు.

    అనిశ్చితములు!

    ఈ దేశ భాగ్యం అనిశ్చితం - అస్థిరం.

    'నమో భరత మాతా'

    6. అక్షయ హవి యందు అక్షయ సోమరసమును మిశ్రమము చేయుచున్నాము. కావున ఇంద్రుడు ప్రజలను ఏకముగను, పన్నులిచ్చి వారిగను చేసినాడు.

                                  నూట డెబ్బది నాలుగవ సూక్తము
                ఋషి - ఆంగిరస అభివర్త దేవత -  రాజు ఛందస్సు - అనుష్టుప్

    1. యజ్ఞ సామాగ్రి సహితముగ దేవతల వద్దకు చేరవలెను. ఇంద్రుడు యజ్ఞ సామాగ్రి అందుకున్నాడు. అనుకూలుడు అయినాడు.

    బ్రహ్మణస్పతీ! మేము ఆ విధముగ యజ్ఞము చేసినాము. మాకు రాజ్యప్రాప్తి కలిగించుము.

    2. రాజా! ఎవరు మాకు విపక్షులో - ఎవరు మాకు హింసక శత్రువులో - ఎవరు సేనా సహితులై మా మీదకు  వచ్చెదరో - ఎవరు మమ్ము ద్వేషింతురో వారిని పరాజితులను చేయుము.

    3. సవిత నీకు అనుకూలుడు అయినాడు. సోమము నీకు అనుకూలుడు అయినాడు. సమస్త ప్రజా నీకు అనుకూలురు అయినారు. ఆ విధముగా నీకు అందరి అభిమానము లభించినది.

    4. దేవతలారా! ఎట్టి యజ్ఞ సామాగ్రిచే ఇంద్రుడు యజ్ఞకర్త, అన్నవంతుడు అయినాడో దానితోనే నేను యజ్ఞము చేసినాను. అందువలన నేను శత్రురహితుడను అయినాను.

    5. నాకు పగవారు లేరు. నేను పగవారిని పరిమార్చినాను. నేను ఈ రాజ్యమునకు రాజును. శత్రు నివారణయందు సమర్థుడను అయినాను. నేను సకల ప్రాణుల, మంత్రముల అధీశ్వరుడను అయినాను.

                                నూట డెబ్బది అయిదవ సూక్తము
 ఋషి - అర్పుదసర్పపుత్ర ఊర్ధ్వగ్రావుడు - దేవత - సోమము - ఛందస్సు - గాయత్రి

    1. ప్రస్తాములారా! సవితా దేవత స్వశక్తిచే మిమ్ము సోమము సమర్పించుమని నిర్దేశించినాడు. మీరు మీ కార్యము నిర్వర్తించండి. సోమము అందించండి.

    2. ప్రస్తరములారా! దుఃఖమును తొలగించండి. దుర్బద్ధిని తొలగించండి. గోవులను మాకు ఔషధ స్వరూపులను చేయండి.

    3. ప్రస్తరములు పరస్పరము కలసినవి. నలువైపుల గల విశాల ప్రస్తరపు శోభనందినవి. రసవర్షక సోమము మీద ప్రస్తరములు తమ బలమును ప్రదర్శించుచున్నవి.

    4. ప్రస్తరములారా! యజమాని సోమయజ్జ కర్తయగుచున్నాడు. అతని కొరకు మీరు సోమము సిద్ధము చేయండి. సవితా దేవత మిమ్ము అందుకు నియమించినాడు.

                                  నూట డెబ్బది ఆరవ  సూక్తము
                    ఋషి - ఋభుపుత్ర సునుడు, దేవత - ఋభు, అగ్నులు,
                                   ఛందస్సు - గాయత్రి, అనుష్టుప్

    1. ఋభువులు మహా సంగ్రామమునకు వెడలినారు. బిడ్డలు తల్లిచుట్టు నిలుచుందురు. ఋభులు అట్లే లోక పోషణార్థము పృథివికి నలువైపుల వ్యాపించి ఉన్నారు.

    2. అగ్ని జ్ఞాని. దేవయోగ్య స్తోత్రములచే అతనిని ప్రసన్నుని చేయండి. అగ్ని మన హవ్యములను వహించునుగాత.

    3. ఇతడు అగ్ని. దేవతల వద్దకు వెళ్లువాడు. ఇతడు హోత. యజ్ఞమందు ఇతనిని స్థాపించబడును. అగ్ని రథము వలె హవ్యము వహించును. అగ్నిని యజమానులు, పురోహితులు పరివేష్ఠించి ఉంటారు. అగ్నికి  యజ్ఞ  సంపన్నము తెలియును.

    4. అగ్ని రక్షకుడు అగును.  ఇతని ఆవిర్భావము అమృత ఆవిర్భావము వంటిది. అతడు బలశాలురకు బలశాలి. పరమాయువు వర్ధిల్ల చేయుటకే అగ్ని అవతరించినాడు.

                                నూట డెబ్బది ఏడవ సూక్తము   
  ఋషి - ప్రజాపతి పుత్ర పతంగుడు - దేవత - మాయ ఛందస్సు - జగతి - త్రిష్టుప్

    1. విద్వాంసులు మనసుతో ఆలోచించినారు. మనో నేత్రమున అవలోకించినారు. ఒక పక్షిని ఆత్మను - దర్శించినారు. దానిని మాయ చుట్టుకున్నది. ఇది సముద్ర మధ్యమందు ఉన్నదని విద్వాంసులు వచించినారు. వారు విధాత కిరణముల లోనికి చేరదలచుచున్నారు.

    2. పక్షి మనసు నందుండియే మాట నేర్చినది. గర్భ మధ్యమందు ఉండగనే గంధర్వుడు వాక్కు నేర్పినాడు. ఆ వాణి దివ్య, స్వర్గ సుఖప్రధాత్రి. బుద్ధికి అధీశ్విరి. విద్వాంసులు సత్యమార్గముణ ఆ వాణిని రక్షించుచున్నారు.

    3. ఆత్మ గోపాలకుడు. అతనికి నాశనము లేదు. అతడు ఒకపుడు దగ్గర - ఒకపుడు దూరమున అనేక మార్గములందు సంచరించుచుండును. అతడు ఒకపుడు అనేక వస్త్రములు ఒకేసారి ధరించును.  




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.