Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
ఒకపుడు వేరు , వేరు వస్త్రములు ధరించును. అట్లు అతడు మరల మరల ఈ లోకమునకు వచ్చుచుండును - పోవుచుండును.
నూట డెబ్బది ఎనిమిదవ సూక్తము
ఋషి - తాక్ష్యపుత్ర అరిష్టనేమి - దేవత - తారుక్ష్యుకు ఛందస్సు - త్రిష్టుప్
1. తారుక్ష్యుడు - గరుడుడు - పక్షధారి - సోమము తెచ్చుటకు పంపబడినవాడు. శత్రుం జయుడు, శత్రు రథవిజేత, అతని రథము అజేయము. అతడు సేనలకు సంగ్రామ ప్రేరకుడు. అతనినే మేము శుభములు కోరి ఆహ్వానించుచున్నాము.
2. మేము ఇంద్రుని దానశక్తిని ఆహ్వానింతుము. అట్లే గరుడుని దానశక్తిని ఆహ్వానింతుము. మంగళము కొరకును - విపత్తు నుండి దాటుటకు నావను వలె అట్టి దానశక్తిని ఆశ్రయిస్తాను.
ద్యావా పృథ్వులారా! మీరు విశాలురు - బృహతులు - సంవ్యాపకులు - గంభీరులు. రాకపోకలందు మమ్ము బాధించవలదు.
3. సూర్యుడు స్వతేజమున వర్షమున, జలమును విస్తరింప చేయును, అట్లే గరుత్మంతుడు పంచజనులకు పరిపూర్ణ భండారము కలిగించును. గరుడుని గతి శత, సహస్ర ధన ప్రదాత్రి యగుచున్నది. శరము సరిగా గురిపెట్టినపుడు ఆటంకము ఉండనట్లే గరుడ గమనమునకు ఆటంకము ఉండదు.
నూట డెబ్బది తొమ్మిదవ సూక్తము.
ఋషి - ఉశీన పుత్ర శిబి దేవత - ఇంద్రుడు -ఛందస్సు - అనుష్టుప్, త్రిష్టుప్
1. పురోహితులారా! లేవండి. ఇంద్రునకు సముచిత భాగము సమర్పించుటకు ఉద్యమించండి. అది పచనమైనదో హోమము చేయండి. ఉడుకకున్న ఉత్సాహమున ఉడికించండి.
2. ఇంద్రా ! హవ్యము సిద్ధమైనది. సమీపమునకు విచ్చేయుము. సూర్యుడు నెత్తి మీదకు వచ్చినాడు. వంశరక్షకుడగు పుత్రుడు అటునిటు తిరుగు తండ్రి కొరకు నిరీక్షించు రీతి - బంధుజనులు హస్తములందు యజ్ఞ సామాగ్రితో నీ కొరకు నిరీక్షించుచున్నారు.
3. ఆవుపాలను కాచి తోడేసినంత ఓకే పవిత్ర వినూత్న పదార్థము సిద్ధము అగును. అది 'దధి ధర్మహవి 'అగుచున్నది. బహుధన ధాత, వజ్రధర ఇంద్రునకు మధ్యాహ్న సవనమున 'ధధి ధర్మహవి' సమర్పించబడును. ఆ హవిని ఇంద్రుడు ఆనందముగ ఆస్వాదించునుగాత.
నూట ఎనుబదవ సూక్తము
ఋషి - ఇంద్ర పుత్ర జయుడు దేవత - ఇంద్రుడు ఛందస్సు - త్రిష్టుప్
1. పురుహూత ఇంద్రా! నీవు శత్రుంజయుడవు. నీ తేజస్సు సర్వశ్రేష్ఠము. నీ దానమును ఇటు మళ్లింపుము. కుడిచేతితో ధనము నిమ్ము. నీవు ధనములకు - స్తోత్రములకు స్వామిని అగుచున్నావు.
2. అడవి మృగము భయంకరము అయినట్లు ఇంద్రా! నీవు భీకరాకారమున దూరపు స్వర్గము నుండి దిగి వచ్చుచున్నావు. వాడియైన వజ్రమునకు సానపట్టి శత్రువులను వధించుము. విపక్షులను దూరము చేయుము.
3. ఇంద్రా ! నీవు తేజోవంతుడవై జన్మించినావు. ఆ తేజము అత్యాచార నివారకము. నీవు నరుల కోర్కెలు తీర్చువాడవు, పగతురను దండించువాడవు అగుచున్నావు. నీవు దేవతల కని ఈ లోకమును విస్తరింప చేసినావు.
నూట ఎనుబది ఒకటవ సూక్తము
ఋషులు - వేరువేరు - దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - త్రిష్టుప్
1. ఎవరు ప్రథలో, ఎవరు సప్రథలో వారి నుంచి వసిష్ఠుడు - ధాతయు, దీప్తుడును అగు సవిత మరియు విష్ణువు నుండి రధంతర సామము తెచ్చినాడు. ఇది అనుష్టుప్ ఛందము గలది. ధర్మమును హవిని శుద్ధము చేయునది అగుచున్నది.
2. ఏది నిగూఢ బృహత్ సామమో, దేవి ద్వారమున యజ్ఞము అనుష్ఠింపబడునో అది తిరోహితము అయినది. దానిని సవిత మున్నగువారు కనుగొన్నారు. ధాత, దీప్త సవిత, విష్ణు, అగ్ని నుంచి భరద్వాజుడు బృహత్ సామమును తెచ్చినాడు.
3. అభిషేక క్రియా నిష్పాదక ధర్మ యజుస్సు యజ్ఞకార్యము లందు ప్రధానముగ ఉపయుక్త మగునది. దాతమున్నగు దేవతలు మనసున ధ్యానించి దానిని పొందినారు. పురోహితులు ధాత, విష్ణు, సూర్యుల నుండి దానిని తెచ్చినారు.
నూట ఎనుబది రెండవ సూక్తము
ఋషి - బృహస్పతి పుత్ర తపమూర్ధుడు, దేవత - బృహస్పతి, ఛందస్సు - త్రిష్టుప్
1. బృహస్పతి దుర్గతిని నష్టపరచునుగాక. పాప నాశమునకు స్తుతికి స్ఫూర్తి కలిగించును గాత. అమంగళము శమింపచేసి దుర్మతిని నష్టపరచును గాత. యజమాని రోగమును నాశనముచేసి భయమును హరించునుగాత.
2. ప్రయాజ యందు నరాశంస అగ్ని మమ్ము రక్షించును గాత. అనయాజ మందు మాకు శుభములు కూర్చునుగాత. అమంగళము నశింపచేసి, దుర్మతిని దూరము చేయును గాత. యజమాని రోగమును నాశము చేసి, భయమును హరించునుగాత.
3. స్తోత్ర ద్వేషులగు రాక్షసులను బృహస్పతి దగ్ధము చేయునుగాత. అట్లయిన హింసకులు మరణింతురు. అమంగళము నశింపచేసి, దుర్మతిని దూరము చేయునుగాత. యజమాని రోగమును నాశనముచేసి, భయమును దూరించునుగాత.
నూట ఎనుబది మూడవ సూక్తము
ఋషి - ప్రజాపతి పుత్ర ప్రజావంతుడు దేవత - యజమాని,
పత్ని, ఆత్మ -ఛందస్సు - త్రిష్టుప్
1. యజమానీ! నేను మనోనేత్రమున నిన్ను చూచినాను. నీవు జ్ఞానివి. తపము నుండి పుట్టిన వాడవు. తపముతో శ్రీవృద్ధి పొందినావు. ఇచట ధనాదులను పుత్రులను పొందుము. ప్రసన్నుడవు అగుము పుత్రులే నీ కోరికగా ఉన్నారు. సంతానము కనుము.
2. పత్నీ! నేను మనో నేత్రమున నిన్ను చూచినాను. నీ రూపము కాంతి మంతము. నీవు సమయమును అనుసరించి గర్భము కోరుచున్నావు. నీవు పుత్రుని కోరినావు. నా వద్దకు వచ్చి తరుణిని అగుము. పుత్రుని కనుము.
3. నేను హోతను. నేనే వృక్షాదులందు గర్భాదాన కారణమును. నేనే అన్యప్రాణులకు గర్భాదానము చేయును. నేను భూమి మీద ప్రజలను ఉత్పత్తి చేయుదును. అన్యస్త్రీ లందును పుత్ర ఉత్పాదకుడను అగుచున్నాను. యజ్ఞము వలన అన్నింటికి సంతానము కలిగించినాడు.
నూట ఎనుబది నాలుగవ సూక్తము
ఋషి - త్విష్ట - దేవత - వేరు వేరు - ఛందస్సు - అనుష్టుప్
1. స్త్రీ యోనిని విష్ణువు గర్భాధాన ఉపయుక్తము చేయునుగాక. త్వష్ట రూపము ఏర్పరచును గాథ ప్రజాపతి వీర్యపాతమున సహాయపడునుగాక. దాత నీ గర్భమును పోషించునుగాత.
2. సినీవాలీ! నీవు గర్భమును పోషింపుము. సరస్వతీ ! నీవు సహితము గర్భమును పోషించుము స్వర్ణకమల భూషణ అశ్వినీ ద్వయమా! సంతానము పిలుచుచున్నాము.
3. పత్నీ ! నీ గర్భస్థ సంతానము కొరకు అశ్వినులు అరణులు పట్టియున్నారు. పదవ మాసమున ప్రసవించుటకు అదే గర్భస్థ సంతానమును పిలుచుచున్నాము.
నూట ఎనుబది అయిదవ సూక్తము
ఋషి - వరుణపుత్ర - సత్యధృతి - దేవత - ఆదిత్యుడు - ఛందస్సు - గాయత్రి
1. మిత్ర, అర్యమ, వరుణుల సతేజ, దుర్ధర్ష, మహదాశ్రయము మాకు లభించునుగాత.
2. గృహమందు, పథోమందు, దుర్గమ స్థానమందు, ఆ ముగ్గురుని ఆశ్రయించిన వారిని ఎంతట శత్రువును ఏమి చేయజాలడు.
3. ఈ ముగ్గురు అదితి పుత్రులు ఎవరికి నిరంతరము జ్యోతి ప్రసాదించుచున్నారో వారికి జీవన రక్షణ కలుగును. వారిని ఎంతటి శత్రువును ఏమి చేయజాలడు.
నూట ఎనుబది ఆరవ సూక్తము
ఋషి - వాతగోత్ర ఉలస్యుడు - దేవత - వాయువు - ఛందస్సు - గాయత్రి
1. వాయువు ఔషధ సమమై మా హృదయములందు చేరునుగాత. వాయువు కళ్యాణ కరము సుఖకరము అయి ఆయుర్దాయము పెంచునుగాత.
2. వాయువా! నీవు మాకు తండ్రివి, తల్లివి, బంధుడవు. మా జీవితమునకు ఔషధమవు అగుము.
3. వాయువా! నీ ఇంట అమృతనిధి ఉన్నది. అందు నుంచి మా జీవితము కొరకు అమృతము ప్రసాదించుము.
నూట ఎనుబది ఏడవ సూక్తము
ఋషి - అగ్నిపుత్ర వతుడు - దేవత - అగ్ని - ఛందస్సు -గాయత్రి
1. నరులారా! వరపుత్రవతుడు అగ్నికి మనసు శత్రువు నుండి రక్షించుణుగాత. 'సనఃపర్షదతిద్విషః.
2. అగ్ని అత్యంత దూర ప్రదేశమగు ఆకాశము నుండి విచ్చేసినాడు అగ్ని మనసు శత్రువు నుండి రక్షించునుగాక. 'సనఃపర్షదతిద్విషః'
3. అగ్ని వృష్టి వర్షకుడు. ఉజ్వల శిఖలవాడు. రాక్షసులను వధించువాడు. సనఃపర్షదతి ద్విషః - అగ్ని మనసు శత్రువు నుండి రక్షించునుగాత.
4. వాయువు సకల భువనములను భిన్న రూపములతోను, మిశ్రమ రూపములతోను అవలోకకించును. 'సనః పర్షదతిద్విషః.'
5. అగ్ని ద్యులోకమునకు ఆవల కాంతిమయ రూపమున ఆవర్భివించినాడు. 'సనః పర్షదతిద్విషః.'
నూట ఎనబది ఎనిమిదవ సూక్తము
ఋషి - అగ్నిపుత్ర శ్యేనుడు - దేవత - అగ్ని - ఛందస్సు - గాయత్రి
1. పురోహితులారా - యజమానులారా! అగ్ని జ్ఞాని, అతనిని ప్రజ్వలింపచేయండి. అతడు విచ్చేసి కుశలమీద ఆసీనుడు అగునుగాత.
2. బుద్ధిమంతులగు యజమానులు అగ్నిపుత్రులు అగుచున్నారు. అగ్ని వర్షము కలిగించువాడు. అతని కొరకు విశాలము, శోతనకరమగు స్తుతికి ప్రేరణ కలిగించుచున్నాను.
3. అగ్నికాళి, కరాళాది సుందరి జ్వాలలచే దేవతలకు వానిని అందించుచున్నాడు. అగ్ని దేవతల సహితుడై మా యజ్ఞమునకు విచ్చేయునుగాత.
నూట ఎనుబది తొమ్మిదవ సూక్తము
ఋషిక - సర్వరాజ్ఞి - దేవత - సూర్యుడు - ఛందస్సు -గాయత్రి
1. సూర్యుడు గతిపరాయణుడు - తేజస్వి అతడు ఉదయాచలము చేరినాడు. మాతృమూర్తియగు ప్రాగ్దిశను ఆలింగనము చేసికొన్నాడు. తదుపరి పితృమూర్తి యగు ఆకసమున సాగినాడు.
2. సూర్యుని దేహమున కాంతి సంచరించును. అట్టికాంతి అతని ప్రాణ మధ్యము నుండి వెడలుచున్నది. అతను మహానుడు అయినాడు. ఆకసమున వ్యాపించినాడు.
3. సూర్యుని ముప్పది స్థానములు శోభిల్లును. గతి పరాయణుడగు సూర్యుని కొరకు స్తుతులు ఉచ్చరించబడును. అతడు నిత్యము తన కిరణములచే శోభిల్లును.
నూట తొంబదవ సూక్తము
ఋషి - మధుచ్ఛంద పుత్ర అఘమర్షణుడు - దేవత - సృష్టి -ఛందస్సు - అనుష్టుప్
1. ప్రజ్వలిత తపస్సు నుండి యజ్ఞము. సత్యము ఆవిర్భవించినవి. తదుపరి రాత్రింబవల్లు అనంతరము జలజ సముద్రము కలిగినవి.
2. జలపూర్ణ సముద్రము నుండి సంవత్సరము పుట్టినది. తదుపరి రాత్రింబవళ్లు కలిగినవి. అతడు సమస్త ప్రాణులకు స్వామి యగుచున్నాడు.
3. పూర్వకాలమును అనుసరించియే ఈశ్వరుడు సూర్యచంద్రులను స్వర్గ, పృథివి, అంతరిక్షములను సృష్టించినాడు.
ఋగ్వేద సంహిత యందలి చివరి
నూట తొంబది ఒకటవ సూక్తము
ఋషి - సంవనుడు - దేవత అగ్ని - సమత - ఐక్యత - ఛందస్సు - త్రిష్టుప్, అనుషుప్
1. అగ్నీ! నీవు వరదుడవు. ప్రభువవు. నీవు సమస్త ప్రాణులందు నిలిచి ఉన్నావు. నీవు యజ్ఞవేది మీద జ్వలింతువు. 'నోవసూనాభర' -మాకు ధనములను అందించుము.
2. స్తోతలారా! మీరు కలసి ఉండండి. ముక్తకంఠమున స్తుతులు చదవండి. మీరు ఏక మనస్కులు అగుదురుగాత ప్రాచీన దేవతలు ఏకమై హవి స్వీకరించినారు. మీరు సహితము ఏకమై ధనాదులు తీసికొనండి.
3. పురోహితులు ఏకమున వచ్చెదరుగాత. ఏకమై స్తుతింతురుగాక. వారు ఏకచిత్తులు, ఏకమనస్కులు అగుదురుగాక.
పురోహితులారా! మిమ్ము ఒకే మంత్రముతో మంత్రిస్తాను. ఒకే హవితో హవనం చేస్తాను.
4. సమానీవ ఆకూతిః సమానా హృదయానినః
సమానమస్తునో మనో యథావః సుసహాసతి.
మీ సంకల్పములు సమానములు అగునుగాత. మీ హృదయములు సామములు అగునుగాత మీ మనసులు సమానములు అగునుగాత. మీరు సంపూర్ణముగా సంఘటితులు అగుదురుగాత.
అక్షర వాచస్పతి డాక్టర్ దాశరధి రంగాచార్య రచించిన శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత యందలి పదవ మండలమును, ఋగ్వేద సంహితయు సమాప్తము.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.
ఓం శాంతిః శాంతిః శాంతిః
* సమాప్తం *




