Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
4. ఎప్పుడు దేవతలు వృత్రాది అసురులను వధించి మరలినారో ఆనాడు దేవతల అమరత్వమునకు రక్షణ కలిగినది.
5. అనేక ఉపాయములచే స్తుతులను, దేవతల వద్దకు పంపుట జరిగినది. తదుపరి ఆకసము నుండి పడు వర్షము చూడనైనది.
నూట ఏబది ఎనిమిదవ సూక్తము
ఋషి - సూర్యపుత్ర చక్షువు - దేవత - సూర్యుడు - ఛందస్సు - గాయత్రి
1. దేవతల ఉపద్రవము నుండి సూర్యుడు - ఆకాశ ఉపద్రవముల నుండి వాయవు - భూమి ఉపద్రవముల నుండి అగ్ని మమ్ము రక్షించును గాత.
2. సవితా! మా అర్చనలు స్వీకరించుము. నీ తేజము కొరకు నూరు యజ్ఞములు చేయవలసి ఉండును. శత్రువు యొక్క ఉగ్ర ఆయుధముల నుండి రక్షింపుము.
3. సవిత మాకు చక్షువులు ప్రసాదించునుగాత. పర్వతములు చక్షువులు ప్రసాదించును గాత. విధాత చక్షువులు ప్రసాదించును గాత.
4. మా కన్నులకు చక్కని చూపు ప్రసాదించుము. సకలము స్పష్టముగ కనిపించునట్లు నేత్రములు ప్రసాదించుము. వానితో మేము సమస్తమును చూచెదముగాత.
5. సూర్యదేవా! మేము స్పష్టముగ చూచెదము గాత. మానవులు వేనిని చూచుచున్నారో వానిని విశేషముగ చూచెదము గాక.
నూట ఏబది తొమ్మిదవ సూక్తము
ఋషిక, దేవత - పులోమ తనయశచి - ఛందస్సు - అనుష్టుప్
1. సూర్యోదయము నా భాగ్యోదయము అని గ్రహించినాను. నా ముందు నా సపత్నులందరు దిగతుడుపే. నేను స్వామిని వశపరచుకున్నాను.
2. నేన పతాకను. నేనే మాస్తకమును. నా స్వామి నుంచి తీయని మాటలు వింటాను. నా స్వామి నన్ను విశ్వసిస్తారు. నా మాట ఆమోదిస్తారు. నా భావమునే అనుసరిస్తారు.
3. నా పుత్రుడు శూరుడు. నా పుత్రిక సర్వశ్రేష్ఠ శోభాశోభిత. నాకు సర్వము తెలియును. నా భర్త వద్ద నా మాటకే విలువ.
4. ఏ యజ్ఞమును చేసి ఇంద్రుడు బలశాలి, శ్రేష్ఠుడు అయినాడో - దేవతలారా! నేను అట్టి క్రతువునే ఆచరించినాను. అందువలన నా సమస్త శత్రువులు ధ్వంసము అయినారు.
5. నా శత్రువు బ్రతకడు. నేను శత్రువులను జయించినాను - వధించినాను. చంచల బుద్ధిగల వారి సంపద అన్యులు హరింతురు. అట్లే అన్య స్త్రీల తేజమును నేను హరించినాను.
6. నేను నా సపత్నులందరను జయించినాను. కావుననే శూరా ఇంద్రునిపై నా అధికారము చెల్లుతుంది. అన్య కుటుంబికుల పైకూడ నా పెత్తనమే సాగుతుంది.
నూట అరువదవ సూక్తము
ఋషి - వైశ్వామిత్రపూరణుడు - దేవత - ఇంద్రుడు - ఛందస్సు - త్రిష్టుప్
1. ఇంద్రా! ఇది సోమరసము. అత్యంత తీవ్రముగ చేసినాము. ఆహార పదార్థములు సిద్ధముగ ఉన్నవి. సేవింపుము.నీ రాధాశ్వములను ఇటు మరలింపుము. ఇతర యజమానులు నిన్ను సంతుష్ట పరచజాలరు. నీకే ఈ సోమమంతయు అర్పితము.
2. ఇదిగో ఈ సమర్పించిన, సమర్పించనున్న సోమము సొంతము నీ కొరకే అగుచున్నది. ఉచ్చరించబడు స్తుతులన్నియు నిన్నే పిలుచుచున్నవి.
ఇంద్రా! మా ఈ యజ్ఞమును గ్రహింపుము. నీవు సర్వజ్ఞుడవు. ఇచటనే సోమపానము చేయుము.
3. ఎవడు తల్లీ మనమున, నిష్కపట భావమున, ప్రీతియుక్త అంతః కరణమున, దైవ భక్తిచే ఇంద్రునకు సోమము సమర్పించుచున్నాడో అట్టి వారి గోవులను ఇంద్రుడు నష్ట పరచడు.
4. ఏ ధనికుడు. అతనికి సోమము సమర్పించునో అతనికి ఇంద్రుడు ప్రత్యక్షమగును. చేయిపట్టు కొనును. పుణ్యకర్మలను ద్వేషించు వారిని ఇంద్రుడు ధ్వంసము చేయును.
5. ఇంద్రా! గోవులు, అశ్వములు, అన్నము ఆశించి నీ రాకకు ప్రార్థించుచున్నాము. నీ కొరకే ఈ అభినవ, శ్రేష్ఠ స్తోత్రము రచించినాము. నీవు సుఖ ప్రదాతవని తెలిసి నిన్ను ఆహ్వానించుచున్నాము.
నూట అరువది ఒకటవ సూక్తము
ఋషి - ప్రజాపతి పుత్ర యక్ష్మనాశని - దేవత - ఇంద్రుడు ఛందస్సు - త్రిష్టుప్
1. రోగీ! ఈ యజ్ఞ సామగ్రిచే నిన్ను అజ్ఞాత యక్ష్మ, రాజయక్ష్మ విముక్తిని చేయు చున్నాను. అందువలన నీకు జీవన రక్ష కలుగును.
ఏవేని పాపగ్రహములు ముట్టడించి యున్నచో ఇంద్రాగ్నులారా! వాటి నుండి విముక్తి కలిగించండి.
2. ఈ రోగి ఆయువు క్షీణించుచున్నను. ఈ లోకమును విడుచుచున్నట్లనిపించినను, మృత్యువు వద్దకు చేరినను మృత్యు దేవత నిఋతి నుంచి మరలించి తేగలను. నా స్పర్శకు ఇతనికి నూరేళ్ల ఆయువు కలుగును.
3. నేను అర్పించిన ఆహుతి వలన సహస్ర నేత్రుడు ఇతనికి నూరేళ్ల పరమాయువు. ఆయువు కలిగించును. అట్టి ఆహుతి వలననే రోగిని మరలించి తెచ్చినాను. ఇంద్రుడు ఇతనిని సకల పాప విముక్తుని చేసి పూర్ణ ఆయువు ప్రసాదించునుగాత.
4. రోగీ! నీవు శతశరత్తులు - సుఖముగ శత హేమంతములు - శతవసంతములు జీవించుము. ఇంద్ర, అగ్ని, బృహస్పతులు హవ్యమున తృప్తులై ఇతనికి శతాయుష్యము ప్రసాదింతురు గాత.
5. రోగీ! నేను నిన్ను కనుగొన్నాను. మరలించి తెచ్చినాను. నీవు పునర్నవుడవు అయినావు. నీ సమస్త అవయవములను - నేత్రములను, పరమాయువును సాధించినాను.
నూట అరువది రెండవ సూక్తము
ఋషి - బ్రహ్మపుత్ర రక్షోహుడు దేవత - గర్భరక్షణం ఛందస్సు - అనుష్టుప్
1. అగ్ని స్తోత్రముతో ఏకమగునుగాత. రాక్షస హంత అగ్ని సమస్త బాధలను, ఉపద్రవములను, వ్యాధులను తొలగించునుగాత.
నారీ ! నీ గర్భమును ఆక్రమించిన బాధలు, ఉపద్రవములు, వ్యాధులను అగ్ని తొలగించునుగాత.
2. నారీ ! నీ గర్భమును మాంసభక్ష రాక్షసులు. రోగములు, ఉపద్రవములు ఆక్రమించినచో స్తోత్రయుక్త అగ్ని వానిని నాశము చేయునుగాత.
3. నారీ! పురుష వీర్యము పడునపుడు -శుక్ర స్థితి సమయమున - గర్భగమనమున, ప్రసవమప్పుడు నీ గర్భమునకు నష్టము తల పెట్టిన వానిని మేము దూరము చేయుచున్నాము.
4. నారీ! నీ గర్భమున నష్ట పరచుటకు నీ తొడలను చాచువాని, స్త్రీ పురుషుల మధ్య దూరు వానిని మేము దూరము చేయుచున్నాము.
5. నారీ! నీ సోదరుడు, పతి , పతి సంబధీకులు నీ గర్భమునకు , సంతతికి నష్టము కలిగించదలచినచో అట్టి వారలను మేము దూరము చేయుచున్నాము.
6. నారీ! నీ స్వప్నావస్ధలోగాని, నిద్రావస్దలో గాని నిన్ను ముగ్ధను చేయుటకు, నీ సంతతికి నష్టము కలిగించవచ్చు వానిని మేము దూరము చేయుచున్నాము.
ఈ సృష్టి కొనసాగింపు నారీ గర్భం మీద ఆధారపడి ఉన్నది. సమస్త పశు పక్ష్యాదులకు, కొనసాగింపు కూడు స్త్రీ గర్భం మీద ఆధారపడి ఉన్నది. సృష్టిలో మానవ స్త్రీ గర్భానికే అనేక ఆటంకాలు ఎదురు అవుతున్నాయి. అందుకే పూసిన ప్రతి పూవూ కాయ కాదు అను సామెత!
అట్లయ్యు స్త్రీ గర్భమును రక్షించవలసిన బాధ్యత సమాజం మీద ఉన్నదని గుర్తు చేస్తున్నది.
నూట అరువది మూడవ సూక్తము
ఋషి - కాశ్యప వివృహుడు - దేవత - రోగనాశని - ఛందస్సు - అనుష్టుప్
1. నీ నేత్రముల, శ్రోత్రముల, నాసికా రంధ్రముల, చుబుక, శిర మస్తిష్క, జిహ్వల నుండి వ్యాధిని వివృదోమహే, తొలగించుచున్నాము.
2. నీ గ్రీవా ధమనులు, స్నాయువు, ఆస్థిసంధి, భుజములు, హస్తములు, స్కంధముల నుండి వ్యాధిని వివృహామహే,
3. నీ అన్ననాడి, క్షుధనాడి, బృహద్దండము, హృదయ స్ధానము, మూత్రాశయము, యకృతు, అన్యాన్యమాంసపిండముల నుండి వ్యాధిని వివృహామహే.
4. నీ ఊరువులు, జఘనములు, జానవులు, గుల్మములు, పాసప్రాంతములు, నితం బములు, కటిప్రదేశము, మలద్వారము నుండి వ్యాధిని వివృహామహే.
5. మూత్ర విసర్జనస్థానము, లోమములు, నఖములు శరీరపు సర్వాంగముల నుండి వ్యాధిని వివృహామహే.
6. ప్రత్యేక అవయవము, ప్రత్యేక రోమము, సంధిస్థానము, నీ సర్వాంగములందలి రోగ ఉత్పత్తి స్థానముల నుండి వ్యాధిని వివృహామహే - తొలగించుచున్నాము.
ఆలోచనామృతము
1. శరీర నిర్మాణం, అవయవాలను గురించి తీరు వైద్యశాస్త్రంలో నాటి ప్రావీణ్యతను తెలియపరుస్తుంది. వేదం శాస్త్రానికి మూలం. ఆయుర్వేదం వైద్యశాస్త్రం. ఆయుర్వేదం కనుగొన్న వేప, తులసి లాంటి వనస్పతులకే మళ్లీ ప్రాధాన్యత కలుగుతున్నది! శతాబ్దాల్లోనే ఆల్లోపతి వైద్యం మీద వ్యామోహం తగ్గుతున్నది. వేల సంవత్సరాల ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరుగుతున్నది!
2. ఇంగ్లీషు వైద్యానిది నివారణ మాత్రమే! రోగి జీవితాంతం రోగియే! చికిత్స జీవితాంతం! వ్యాధి నిర్మూలన ఇంగ్లీషు వైద్యపు పరిభాషలో లేదు. అది వైద్యం కాదు- వ్యాపారం. వర్తకం ! Once patient is ever patient!
ఆయుర్వేదపుది వ్యాధి నిర్మూలన అంటే శరీరంలోని సమస్త అవయవాల నుండి వ్యాధి తొలగిపోవటం అని వివరించినాడు - గమనించండి.
నూట అరువది నాలుగవ సూక్తము
ఋషి - ఆంగీరస ప్రాచేతసుడు - దేవత -దుస్వప్ననాశని ఛందస్సు - వేరు వేరు
1. దుస్వప్నదేవా ! నీవు మనసు మీద అధికారము సాధించినావు. జరుగుము. పారిపొమ్ము. దూరమున సంచరించుము. బహుదూరమున నిర్రుతి ఉన్నాడు. అతను వద్దకు వెళ్లి "జీవించు వారి మనోరథములు బహు విశాలములు - వానిని భగ్నపరచకుము," అని చెప్పును.
2. జీవించు వారి మనోరథములు బహు విశాలములు వారు ఉత్తమ కావ్య వస్తువును కోరెదరు. ఉత్తమ, సుందర ఫలములను ఆశింతురు. వారిని యముడు కళ్యాణమయ దృష్టిచే చూచుచున్నాడు.
3. ఆశపడునపుడు, ఆశాభంగమైనపుడు, ఆశఫలించినపుడు, జాగ్రదవస్థయందును మేము అపకర్మలు చేయుదుము. అగ్ని అట్టి సమస్త పాపములను దూరము చేయును గాత.
4. ఇంద్ర, బ్రహ్మణస్పతులారా! మేము పాపములు చేసినాము. ఆంగీరస ప్రచేతసా! అట్టి అమంగళము నుండి మమ్ము రక్షించును.
5. నేడు మేము విజయులము అయినాను. ప్రాప్తవ్య ప్రాప్తి కలిగినది. అపరాధ విమక్తులము అయినాము. జాగ్రదవస్థ, నిద్రావస్థ, యందలియు, సంకల్ప జన్య పాపములును మమ్ము ద్వేషించు శత్రుల వద్దకు చేరునుగాత.
నూట అరువది అయిదవ సూక్తము
ఋషి - నిర్రుతి పుత్ర కపోతము - దేవత - విశ్వేదేవతలు ఛందస్సు -త్రిష్టుప్
1. దేవతలారా! ఈ కపోతము నిర్రుతి పంపినది. దుఃఖములు కలిగించుటకు మా ఇంట చేరినది. దానిని ఆరాధించి, దాని అమంగళమును దూరము చేయుదుము. మా దాస, దాసీజనులు - గోవులు, ఆశ్వాదులకు అమంగళము కలుగకుండునుగాత.
2. దేవతలారా! మా ఇంటికి పంపబడిన పావురము మాకు శుభంకరము అగునుగాక అమంగళము కలిగించకుండునుగాత. బుద్ధిమంతుడును, మాకు ఆత్మీయుడవు అగ్ని మా హవ్యములు స్వీకరించునుగాక ఈ రెక్కల ఆయుధము మమ్ము విడుచునుగాత.
3. రెక్కలు కలిగిన అస్త్ర స్వరూప కపోతము. మమ్ము వధించ కుండునుగాత. అగ్ని స్థాపితమైన స్థానముననే మేము ఆసీనులము అగుదుముగాత. మా జనులకు గోవులకు శుభము కలుగునుగాత.
దేవతలారా! ఇచట కపోతము మమ్ము దెబ్బతీయకుండునుగాత.
4. ఉలూకము అమంగళ ధ్వని చేయును. అది మిధ్య అగునుగాత. కపోతము అగ్ని స్థానమున నిలుచును. ఎవని దూతయై ఇది వచ్చినదో - ఆ మృత్యు స్వరూప యమునకు నమస్కారము.
5. దేవతలారా! ఈ పావురము పారద్రోల తగినది. మంత్రములచే దీనిని పారద్రోలండి. అమంగళము శమింపచేసి, ఆనంద సహితముగ ఆవును మేతకు పంపండి.
ఈ పావురము అతివేగముగ ఎగురునది. అది మా అన్నమును వదలి అవ్యస్ధానమునకు చేరునుగాత.
నూట అరువది ఆవర సూక్తము
ఋషి - వైరాజస శక్వరి - దేవత - శత్రునాశని - ఛందస్సు - అనుష్టుప్, మహాపంక్తి
1. ఇంద్రా! నేను సములందు శ్రేష్ఠుడను - శత్రువిజేతను - విపక్ష హంతను - సర్వ శ్రేష్ఠుడను అయి అశేష గోధన స్వామిని అగునట్లు చేయుము.
2. నేను శత్రు ధ్వంసకుడను అయినాను. ఇక నన్ను ఎవడును హింసింపజాలడు వధించ జాలడు. నా సమస్త శత్రువులు నాకు పాదాక్రాంతులు అయినారు.
3. శత్రువులారా! ధనుస్సు రెండు కొనలను నరము కట్టిపెట్టినట్లు మిమ్ము కట్టిపెట్టు చున్నాను. వాచస్పతీ! వారిని నా మాటతో మాట కలుప వలదని చెప్పండి.
4. నా వర్చస్సు నా కర్మలకు ఉపయుక్తము అగుచున్నది. ఆ వర్చస్సుననే శత్రువులను పరాజితులను చేయుటకు వచ్చినాను.
శత్రువులారా! మీ మనోవాక్కాయములను త్రుంచుచున్నాను.
5. మీ ఆర్జన శక్తిని అపహరించినాను. మీ కన్నా అధికుడను అయినాను. మీ తలల మీద ఆడుచున్నాడు. కప్పులు బెకబెకమనట్లు నాపాదాల కిందపడి మూలుగుచున్నారు.
నూట అరువది ఏడవ సూక్తము
ఋషి -విశ్వామిత్ర జమదగ్నులు - దేవత - ఇంద్రుడు - ఛందస్సు - జగతి
1. ఇంద్రా! ఇది మధుతుల్య సోమము. కలశమందున్న ఈ సోమమునకు నీవే స్వామివి. మాకు మరింత ధనము. విశిష్ఠ పుత్రాదులను ప్రసాదించుము. నీవు తపమాచరించి స్వర్గమును గెలిచినావు.
2. స్వర్గ విజేత ఇంద్రుని - సోమము అందుకొని ఆమోదించు ఇంద్రుని సమర్పింత సోమరసము కొరకు రమ్మని పిలుస్తున్నాము. మా ఈ యజ్ఞమును పరిగ్రహించుము. రమ్ము. శత్రు విజేత ఇంద్రుని శరణువేడ వచ్చినాను.





