Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "అన్నా! ధర్మరాజా! నీవు విచారించకుము. దుర్యోధనునకు రోజులు దగ్గరపడినవి. మనకు ధర్మదేవుని వరము ఉన్నది. నేను వంటలవాడనై విరాటుని సేవింతును. మల్లుతనము చూపి విరాటుని మురిపింతును. అక్కడ నా పేరు "వలలుడు" అగును అని చెప్పినాడు భీముడు.
    "అర్జునా! నీవు పరాక్రమమున ప్రచండుడవు. ఖాండవనమును దహింపచేసినావు. ఈశ్వరుని గెలిచినావు. ఇంద్రుని సింహాసనమున కూర్చున్నావు. కాలకేయులను ఓడించినావు" ధర్మరాజు గొంతు పూడినది. కన్నీరు జల జల రాలినది "నీవు ఏరీతిగా సేవకావృత్తిని అవలంబింతువు నాయనా" అన్నాడు ధర్మరాజు.
    "అన్నా! అనతి కాలములోనే కర్ణుడు నాచేత కడతేరనున్నాడు. నీవు విచారించకుము. దైవము మనకు సాయము చేసినాడు. నేను దేవలోకమున ఉండగా ఊర్వశి నన్ను నపుంసకుడు అగునట్లు శపించినది. ఆ శాపము అజ్ఞాతవాస సమయమున ఒక  సంవత్సరము మాత్రము ఉండునట్లు ఇంద్రుడు అనుగ్రహించినాడు. కావున నేను నపుంసకుడనయి రాజకన్యలకు నాట్యము నేర్పుచు విరాటుని సేవింతును. అప్పుడు నాపేరు "బృహన్నల" అగును" అన్నాడు అర్జునుడు.
    అశ్వశిక్షకుడనయి 'దామగ్రంథి' యను పేర విరాటుని కొలుతునని నకులుడును, గోరక్షకుడనయి "తంత్రీపాలుడు" అను పేర విరాటుని కొలుతునని సహదేవుడును అన్నారు.
    "ద్రౌపది మిగుల సుకుమారి. కష్టములను సహింపజాలదు. పనులు చేయించుటేగాని చేయుట ఎరుగదు. ఈమె సౌందర్యము దాచినను దాగునను దాగునది కాదు. ఈమె ఏవిధముగా విరాటుని సేవింపనున్నదో ఆ తలపు మాత్రమున నాకు దుఃఖము ముంచుకొని వచ్చుచున్నది" అని దుఃఖము దిగమ్రింగి మౌనము వహించినాడు ధర్మరాజు. అందరి ఎడదలలో బాధ కదలాడినది. గుండెల చప్పుడులు వినిపించునంతటి నిశ్శబ్దత ఆవరించినది.
    "నాథా! ధర్మరాజా!" ద్రౌపది నిశ్శబ్దతను విరిచినది. కౌరవులకు కాలము దగ్గరపడినది. దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు హతమారనున్నారు. పాండవులను విజయలక్ష్మి వరించనున్నది. ఇది విచారమునకు కాదు ఉత్సాహమునకు సమయము.
    "నేను సైరంధ్రి వేషము ధరించి విరాటుని భార్య యొక్క అంతఃపురమున చేరెదను. అప్పుడు నాపేరు "మాలిని" అగును" అన్నది ద్రౌపది.
    ద్రౌపది మాటలకు అందరును సంతోషించినారు. అయినను అన్నాడు ధర్మరాజు:-
    "ద్రౌపదీ! నీవు మన వంశమునకు సదాచార సంపదగల పవిత్ర మహిళవు. రాజభవనములందు దుష్టులు, దుర్మార్గులు ఉందురు. నీవు అప్రమత్తురాలవయి ప్రవర్తింపవలెను".
    "నాథా! సైరంధ్రి వేషమున ఉన్నపుడు మితభాషినై ఉందును. వ్రతనియమము కలిగి ఉందును. సైరంధ్రులు పతివ్రతా స్వభావము కలిగి ప్రవర్తింతురు".
    ధర్మరాజు ద్రౌపది మాటలకు సంతసించినాడు.
    నిర్ణయములు జరిగినవి. ధర్మరాజు బహిరంగమున అందరితో అన్నాడు:-
    "తమ్ములారా! మనము, మనము చేసికొనిన ఏర్పాట్ల ప్రకారము నడుచుకొనవలసి ఉన్నది. మన అగ్నిహోత్రములను ధౌమ్యుడు రక్షించును. వంటవాండ్లు, పరిచారికా స్త్రీలు ద్రుపద రాజు పట్టణమునకు వెళ్ళుదురు. ఇంద్రసేనాది మన సారథులు ద్వారకకు వెళ్ళుదురు. పాండవులను గురించి వీరిలో ఎవరిని అడిగినను తమకు తెలియదనియు. ద్వైతవనమున తమను విడిచి వెళ్ళినారనియు చెప్పవలెను".
    ధౌమ్యునకు పాండవులు భక్తి పూర్వకముగా నమస్కరించినారు. ధౌమ్యుడు పాండవులందు వాత్సల్యము గలవాడయి, వారిని దీవించినాడు. అతడు పాండవులకు శుభము కలిగించు నిమిత్తము అగ్నిహోత్రమును ప్రజ్వలింప చేసినాడు. పూజలు చేసినాడు. వేద మంత్రములు చదివినాడు. పాండవులు అగ్నిహోత్రమునకు, ధౌమ్యునకు ప్రదక్షిణము చేసినారు.
    పాండవులు ద్రౌపది, ధౌమ్యులతో కూడి మత్స్య దేశమునకు ప్రయాణము సాగించినారు. దశార్ణ దేశమునకు ఉత్తరముగను, పాంచాల దేశమునకు దక్షిణముగను సాల్వ, శూరా దేశములనుండి నడచి వెళ్ళినారు. వారు కాళిందీనది దక్షిణపు గట్టున నడిచి పశ్చిమ దిక్కునకు వెళ్ళినారు. వారు గ్రామములనుండి కాక అరణ్యములనుండి ప్రయాణము చేసినారు. అరణ్యములు అందముగా ఉన్నవి. వారు జలాశయములలో స్నానములు చేసినారు. పుణ్య తీర్ధములందు స్నానమాడినారు. అడవుల అందములను చూచుచు మత్స్యదేశమున ప్రవేశించినారు. ధౌమ్యుడు అక్కడి నుండి ఆ సమీపము నందలి ఒక పుణ్యాశ్రమమునకు వెళ్ళినాడు.
    పాండవులు మత్స్య దేశము చేరినారు. ఆ దేశపు రాజధాని అయిన ఉపప్లావ్యమునకు సాగినారు. రాజధానికి త్వరగా చేరవలెనని వారు త్వరత్వరగా నడిచినారు. ఆ నడకకు ద్రౌపది అలసిపోయినది. కూలబడినది. "నాథా! ధర్మరాజా! ఎంతో నడచి అలసినాను. నాపాదములు బొబ్బలు ఎక్కినవి. కాళ్ళ నుండియు, గోళ్ళ నుండియు రక్తము కారుచున్నది. ఇంక ఒక్క అడుగయినను  వేయలేను" అన్నది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.