Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
3. ఇంద్రా! నీవు విద్వాంసుడవు. ప్రభుడవు. మేధావివి, ఋషుల స్తుతులు ఆశించువాడవు. నీవు మా స్తుతులను ఆమోదించుము. మేము నీకు సొమము సమర్పింతుము. ఆనందము కలిగింతుము. మాకు అంతరంగివి అగుము.
రథారూఢ ఇంద్రా! ఈ సమస్త ఆహార పదార్ఘములు నీకు నివేదించుచున్నాము.
4. ఇంద్రా! ఇవి ప్రముఖ స్తుతులు నీ కొరకే చదువబడినవి.
వీర! ఎవరు ప్రముఖులందు ప్రముఖులో వారికి అన్నము ప్రసాదించుము. నీతో స్నేహము చేసిన వారు యజ్ఞములు చేయుదురు గాత. నిన్ను స్తుతించుటకు కూడినవారిని రక్షింపుము.
5. వీర ఇంద్రా! నిన్ను ఆహ్వానించుచున్నాను. వేనపుత్ర పృథువు నిన్ను స్తుతించుచున్నాను. అతడు ఘృతయుక్త యజ్ఞ గృహమున చేరినాడు. నిన్ను స్తుతించుచున్నాడు. నీరు పల్లమునకు పరుగులు పెట్టినట్లు ఇతర స్తోతలు నీవైపు పరుగులు పడుచున్నారు.
నూట నలుబది తొమ్మిదవ సూక్తము
ఋషి - హిరణ్య స్తూపపుత్ర అర్చితుడు - దేవత - సవిత - ఛందస్సు - త్రిష్టుప్
1. వివిధ పద్దతులతో సవిత పృథ్విని స్థిరపరచినాడు. నిరాధారముగ ద్యులోకమును నిలిపి పెట్టినాడు. ఆకాశమున సముద్రమంతటి జలరాశిని ఏర్పరచినాడు. మేఘరాశి అశ్వము వలె దేహము దులుపును. అది నిరుపద్రవముగ నిలిచి ఉన్నది.
సవితా దేవత అట్టి మేఘము నుండియే జలమును తీయుచున్నాడు.
2. ఏ స్థానమున నిలిచి సాగరసమ మేఘరాశి భూమిని ఆర్ధ్రము చేయుచున్నదో ఆ స్థానమును సవిత ఎరుంగును. జలపుత్ర సవిత వలననే పృథివి, ఆకాశము, ద్యులోకము విస్తరిల్లినవి.
3. సోమము స్వర్గమున పుట్టినది. అమరము. దానితో దేవతలు యజింతురు. అట్టి వారిలో అందరు సవిత తరువాత ఆవిర్భవించినవారే. గరుత్మంతుడు సవిత కన్న మున్ను పుట్టినవాడు. సవిత యొక్క సోమహరణ క్రియను అనుసరించి అతడు ప్రఖ్యాతుడు అయినాడు.
4. ఎల్లరు ప్రార్థించు సవిత స్వర్గపాలకుడు అగుచున్నాడు. గోవు గ్రామమునకు వెళ్లునంత, యోధుడు అశ్వము వద్దకు వెళ్లునంత, కొత్తగ ఈనిని ఆవు దూడ వద్దకు వెళ్లునంత, స్త్రీ భర్త దగ్గరకు వెళ్లునంత ఉత్సాహముగ సవిత మా వద్దకు వచ్చును గాత.
5. సవితా ! నా తండ్రి, అంగిరో వంశీయుడు, హిరణ్యస్తూవుడు నిన్ను యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాడు. నేను నీ ఆశ్రయము కోరినాను. నీకు ప్రణమిల్లుచున్నాను. నిన్ను సేవించుటకు యజమాని సోమలత విషయము వలె - అప్రమత్తుడనై ఉన్నాను.
నూట ఏబదవ సూక్తము
ఋషి - వసిష్ఠపుత్ర సృళీకుడు - దేవత - అగ్ని ఛందస్సు - వేరువేరు
1. అగ్నీ ! నీవు దేవతలకు హవిస్సు వహించువాడవు. నిన్ను ప్రజ్వలితుని చేసినాము. ప్రదీప్తుడవు ఆగుము. ఆదిత్య, వసు, రుద్రుల సహితముగ మా యజ్ఞమునకు విచ్చేయుము - సుఖములు ప్రసాదించుము.
2. ఇది యజ్ఞము. ఇది స్తవము. స్వీకరించును. దరి చేరుము.
ప్రదీప్త అగ్నీ! మేము మనుష్యులము. సుఖములు ప్రసాదించుమని నిన్ను పిలుచు చున్నాము.
3. అగ్నీ! నీవు జ్ఞానివి. విశ్వ ప్రార్ధితుడవు. నిన్ను స్తుతి వచనములచే కీర్తించుచున్నాము. ఎవరు సుఖప్రదులో ఆ దేవతలతో సుఖమునకు విచ్చేయుము.
4. అగ్ని దేవతల పురోహితుడు. మానవులు, ఋషులు అగ్నిని ప్రజ్వలితుని చేసినారు. బోలెడు ధనము కలుగుటకు అగ్నిని ఆహ్వానిస్తున్నాను. అగ్ని మాకు సుఖములు ప్రసాదించునుగాత.
5. అగ్ని - యుద్ధములందు - అత్రి, భరద్వాజ, గవిష్ఠర, కణ్వ, త్రసదసులను రక్షించినాడు. పురోహిశ వసిష్టుడు అగ్నిని సుఖములిమ్మని ఆహ్వానించినాడు.
నూట ఏబది ఒకటవ సూక్తము
ఋషి -కామగోత్ర శ్రద్ధ - దేవత -శ్రద్ధ -ఛందస్సు - అనుష్టుప్
1. శ్రద్ధతోనే అగ్ని ప్రజ్వలించబడును. శ్రద్ధతోనే యజ్ఞ సామాగ్రి ఆహుతి ఇవ్వబడును. శ్రద్ధ సమస్త మస్తకము అగును. దీనిని నేను స్పష్టము చేయుచున్నాను.
2. శ్రద్ధా! దాతకు అభీష్ట ఫలము ప్రసాదించుము. దానము చేయగోరువారి కోరికలు తీర్చుము. నా శ్రేయోభిలాషులకు, యాజ్ఞికులకు కోరినవరము ప్రసాదించుము.
3. ఇంద్రాదులు అసుర వధ విషయమున ఉగ్ర శ్రద్ధ వహించినారు. అట్లే శ్రద్ధా! భోక్తలకు, యాజ్ఞికులకు కోరిన వరములు ప్రసాదించుము.
4. నరులు, దేవతలు వాయువును రక్షకునిగ చేసికొని శ్రద్ధను ప్రార్థింతురు. సంకల్పము కలిగినపుడు జనులు శ్రద్ధను ఆశ్రయించుచున్నారు. శ్రద్ధ కారణముగనే జనులు ధనము పొందుచున్నారు.
5. ఉదయము, మధ్యాహ్నము మేము శ్రద్ధనే ఆశ్రయించుచున్నాము.
శ్రద్ధా ! మమ్ము జగమున శ్రద్ధావంతులను సేయుము.
నూట ఏబది రెండవ సూక్తము
ఋషి - శాస - దేవత - ఇంద్రుడు - ఛందస్సు - అనుష్టుప్
1. నేను ఇంద్రుని ఇట్లు స్తుతించుచున్నాను:-
ఇంద్రా ! నీవు మహా శత్రు భక్షకుడవు. అద్భుతడవు. నీ మిత్రునకు మృత్యువు కలుగదు. పరాజయము ఉండదు.
2. ఇంద్రుడు శుభప్రదాత - ప్రజాపతి - వృత్రఘ్నుడు. శత్రువశకర్త, వరదుడు. సోమపాయి, అభయ ప్రదాత. అతడు మా ముందునకు విచ్చేయునుగాత.
3. వృత్రఘ్న ఇంద్రా! రాక్షసులను, శత్రువులను వధించుము. అనిష్టకర శత్రుకోపమును రాల్చుము.
4. ఇంద్రా! మా పగవారిని హతమార్చుము. యుద్ధార్థులగు విపక్షము వారిని బలహీనులను చేయుము మమ్ము నికృష్టులను చేయు వారిని జఘన్య అంధకారమున త్రోయుము.
5. ఇంద్రా! శత్రువు మనసును నష్టపరచుము. మమ్ము హీనులను చేయదలచినవారి మీద నీ ఉగ్ర అస్త్రము ప్రయోగించును. మము శత్రు క్రోధము నుండి రక్షింపుము. ఉత్తమ సుఖములను ప్రసాదించును. శత్రువు యొక్క ఘాతుక ఆయుధమును విడుచుము.
నూట ఏబది మూడవ సూక్తము
ఋషిక - ఇంద్రమాత - దేవత ఇంద్రుడు -ఛందస్సు - గాయత్రి
1. కర్తవ్యపరాయణులైన ఇంద్ర మాతలు ఆవిర్భూత ఇంద్రుని సేవింతురు. ఇంద్రుని నుండి ఉత్కృష్ట ధనము పొందుదురు.
2. ఇంద్రా ! నీవు బల, వీర్య, తేజములతో జన్మించినావు. నీవు అభీష్ట వరదుడవు.
3. ఇంద్రా! నీవు వృత్రఘ్నుడవు - ఆకసమును విస్తరింపచేసినావు. నీ శక్తిచే స్వర్గమును పైన నిలిపి ఉంచినావు.
4. ఇంద్రా! సూర్యుడు నీ సహచరుడు. నీవు సూర్యుని నీ రెండు చేతులతో పట్టి ఉంచినావు. నీవు స్వశక్తితో వజ్రమునకు పదను పెట్టుదువు.
5. ఇంద్రా! నీ తేజస్సుతో ప్రాణుల అద్భుతములు చేయుదువు. నీవు సమస్త దేశములను ఆక్రమించి నిలిచినావు.
నూట ఏబది నాలుగవ సూక్తము
ఋషిక - వివస్వత దుహిత యమి - దేవత - ప్రేతము - ఛందస్సు - అనుష్టుప్
1. కొందరు పితరులకు సోమరసము ప్రవహించును. కొందరు ఘృతము సేవింతురు.
ప్రేతమా! ఏ పితరుల కొరకు మధువు పరుగులు పెట్టునో నీవు వారిని చేరుము.
2. తపోబలమున అచలులు అయిన తపోబలమున స్వర్గమున చేరిన, కఠిన తపమాచరించిన పితరులు ఉన్నారు.
ప్రేతమా! నీవు వారిని చేరుము.
3. యుద్ధ భూమిలో యుద్ధము చేసిన మాయా మోహములను వదిలిన బహు దక్షిణలు ఇచ్చిన పితరులున్నారు.
ప్రేతమా? నీవు వారిని చేరుము.
4. పుణ్య కర్మలు చేసి ప్రాచీన పుణ్యవంతులైన - పుణ్యబుద్ధితో తపమాచరించిన పితరుల వద్దకు యమదేవా! ఈ ప్రేతమును చేర్చుము.
5. శత సత్కర్మలు చేసిన సత్పురుషులు -సూర్యారాధకులు - తపో బలశాలురగు పితరుల వద్దకు యమదేవా! ఈ ప్రేతమును చేర్చుము.
ఆలోచనామృతము
1. మరణము అంతము కాదు. కనీస విరామము కాదు. మరణం కేవలం పరిణామం.
జీవితం నిరంతరం. కల్పాంతం వరకు సాగుతుంది. కల్పాంతంలో కేవలం జలం - సాగరం - సముద్రం ఉంటుంది. భగవానుడు వటపత్ర శాయిగా జలనిధిలో విహరిస్తుంటారు. సమస్త ఆత్మలు ఆ స్వామిలో ఉంటాయి.
ఈ విషయం తెలియకనే జనులు దుర్మార్గాలు చేస్తున్నారు! ఆత్మహత్యలు చేసుకుంటున్నారు!!
2. జీవితం కోరికల మయం. కర్మమయం. కోరికలోంచి కర్మ పుట్టుతున్నది. కోరికలు, కర్మలు అనంతములు. అని ఒక జీవితానికి చాలవు. అని తదుపరి జన్మకు కొనసాగు తుంటాయి. మరణం అంతం కాదు. మార్పు మాత్రమే!
ఈ విషయం తెలియకనే జనులు దుర్మార్గాలు చేస్తున్నారు! ఆత్మహత్యలు చేసుకుంటున్నారు!!
3. జీవితం కర్మమయం. అంటే పనిమయం. పనిచేయని లిప్త ఉండదు. ప్రతి పనికి ఫలితం, పర్యవసానం ఉంటాయి. తప్పదు. నిప్పు కాలుస్తుంది. గాలి మండిస్తుంది. నీరు చల్లారుస్తుంది. పనిని బట్టి ఫలితం సత్కార్యం సత్పలితాన్ని ఇస్తుంది. దుష్కార్యం దుష్ఫలితాన్నిస్తాయి. కర్మ మరణంతో అంతం అవుతుంది. ఫలితం మరో జన్మకు సాగుతుంది!
బ్యాంకులో డబ్బు దాచుకుంటాడు. ఇది కర్మ. మనిషి పోతాడు. వడ్డీ వస్తూనే ఉంటుంది. ఇది ఫలితం.
బ్యాంకులో అప్పుచేస్తాడు. ఇది కర్మ. మనిషిపోతాడు. రుణం తీరదు. ఇది ఫలితం!
ఈ విషయం తెలియకనే జనులు దుర్మార్గాలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు!
4. ఇద్దరు ఒకే రకపు పని చేస్తున్నారు. ఒకనికి ఫలిస్తున్నది. ఒకనికి వికటిస్తున్నది. వికటించినవాడు దైవాన్ని తిట్టిపోస్తున్నాడు. ఇందులో దైవ ప్రమేయం లేదు. అది పూర్వకర్మ మీద ఆధారపడుతున్నాది. మన ఈ జన్మ పూర్మజన్మ కర్మల కొనసాగింపే!
ఈ విషయం తెలియకనే జనులు దుర్మార్గాలు చేస్తున్నారు! ఆత్మహత్యలు చేసుకుంటున్నారు!!
5. కల్ ' జగ్ నహీఁయహ్ కర్ జుగ్ హై
క్యాజాబ్ సౌదా నగదహై
ఇస్ హాత్ దౌ ఉస్ హాతలే
ఇది కలియుగం కాదు. కర్మయుగం వ్యాపారం సాంతం రొక్కమే!
ఒకచేత ఇవ్వు మరో చేత తీసికో.
మన విద్యా విధానం సాంతంలో జీవిక బోధిస్తున్నారు. జీవితం బోధించడం లేదు.
ఈ విషయం తెలియకనే జనులు దుర్మార్గాలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు!!
6. వేదం చెడు తలంచదు మధు కరిష్యే! అందుకే ప్రేతాన్ని సత్కార్యం చేసిన వారిని చేరమంటున్నది. ఆ ప్రేతం సత్కర్మలు ఆచరించింది కావచ్చు.
నూట ఏబది అయిదవ సూక్తము
ఋషి - భరద్వాజ పుత్ర శిఠింబిఠుడు - దేవత - బ్రాహ్మణస్పతి
విశ్వేదేవతలు - ఛందస్సు - అనుష్టుప్
1. అలక్ష్మీ ! నీవు దాన విరోధినివి, కుత్సిత భాషివి. వికట ఆకృతివి. నిత్య క్రోధనివి. నీవు పర్వతము మీదకు రమ్ము. నిన్ను దూరము చేయు ఉపాయము చేయగలను.
2. అలక్ష్మీ వృక్షలతా సస్యములను సమూలముగ నాశనము చేయునది. దుర్బిక్షము తెచ్చునది. దానిని నేను ఈ లోకమునుండియు ఆ లోకము నుండియు, పంపి వేయగలను.
ఉగ్రతేజ బ్రహ్మణ స్పతీ! దాన విరోధిని యగు ఈ అలక్ష్మిని దూరతీరములకు పంపి రమ్ము.
3. అదిగో ఒక దుంగ సముద్రమున తేలుచున్నది. దానికి నాథుడు లేడు. వికట ఆకృత అలక్ష్మీ! దాని మీద సముద్రపు ఆవలికి చేరుము.
4. హింసామయి, కుత్సితభాషి అలక్ష్ములారా! మీరు సమయ తత్పరులై వేగముగ సాగిపోయినపుడు ఇంద్రుని సమస్త శత్రువులు జల బుద్భుదముల వలె విలీనములు అయినారు.
5. వీరలు గోవులను ఉద్దరించినారు. అగ్నిని విభిన్న స్థానములందు స్థాపించినారు. దేవతలకు అన్నము అందించినారు. అట్టి వారిని ఆక్రమించగల శక్తిశాలురు ఏరి?
నూట ఏబది ఆరవ సూక్తము
ఋషి - అగ్నిపుత్ర కేతువు - దేవత - అగ్ని , ఛందస్సు - గాయత్రి
1. గుర్రపు పందెములందు జవనాశ్వములను పరిగెత్తింతురు. అట్లే మా స్తుతులు అగ్ని వైపు ఉరుకులు పెట్టుచున్నవి. అగ్ని అనుగ్రహమున మేము ధనము జయింతుముగాత.
2. అగ్నీ! నిన్ను ఆశ్రయించి మేము గోవులను పొందుచున్నాము. నీవు నీ సేనను రక్షించిన రీతి మమ్ము రక్షింపుము. మాకు ధన లాభము కలిగించుము.
3. అగ్నీ! మాకు అనేకగోవుల, అశ్వముల దినము ప్రసాదించుము. ఆకాశమును వర్ణపు స్నానము చేయింపుము. వర్తకులను వాణిజ్య కార్యమందు ప్రవర్తిల్లచేయుము.
4. సూర్యుడు నిత్య సంచారి. అజరుడు. ప్రకాశకుడు. అతనిని ఆకసమున అగ్నియే నిలిపినాడు.
5. అగ్నీ! నీవు ప్రజల జ్ఞాపకమవు. ప్రియతముడవు. శ్రేష్ఠుడవు. యజ్ఞ గృహమున ఆసీనుడవు అగుము. స్తుతులు వినుము. అన్నము ప్రసాదించుము.
నూట ఏబది ఏడవ సూక్తము
ఋషి - ఆప్త్యపుత్ర భువనుడు - దేవత - విశ్వేదేవతలు ఛందస్సు -ద్విపదత్రిష్టుప్
1. సకల ప్రాణులు మాకు సుఖములు కలిగింతురు గాత, ఇంద్రాది సకల దేవతలు సుఖములు ప్రసాదింతురు గాక.
2. ఇంద్రుడు, ఆదిత్య గణములు మా యజ్ఞములను, పుత్ర పౌత్రాధులను ఉపద్రవ రహితులను చేయుదురుగాత.
3. ఇంద్రుడు, ఆదిత్యులు, మరుత్తులు సహకరింతురుగాత. మమ్ము రక్షింతురు గాక.





