Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



                                                                                                        ఓం    
                                                  శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
    
                                                              శ్రీమహాభారతము
                                                                     విరాటపర్వము
    
    నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్
    దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము దీరయేత్

    పాండవులు పన్నెండు సంవత్సరముల వనవాసము పూర్తి చేసినారు. వనవాస సమయమున పాండవుల వెంట అనేకమంది బ్రాహ్మణులు ఉండినారు. పాండవులు అయిదుగురును చేతులు జోడించి వారికి నమస్కరించినారు. ధర్మరాజు వారితో అన్నాడు:-
    "మహాత్ములారా! దుర్యోధనుడు దుర్భుద్ది కలవాడయి మమ్ములను కష్టముల పాలు చేసినాడు. మీరును పన్నెండు సంవత్సరములు మాతో కష్టములు అనుభవించినారు. మేము పదమూడవ సంవత్సరమున అజ్ఞాతవాసము జరుపవలసి ఉన్నది. మేము ఒక సంవత్సరము జనులున్న పట్టణమున ఉండవలెను. అట్లుండియు ఇతరులు మమ్ములను ఎరుగకుండునట్లు ప్రవర్తించవలసి ఉన్నది. దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణాదులు మా అజ్ఞాతవాసము భంగము చేయుటకు సర్వవిధముల ప్రయత్నింతురు. అజ్ఞాతవాసమునకు భంగము కలిగిన మరల పన్నెండు సంవత్సరములు వనవాసము చేయవలసి ఉండును. కావున మేము మారు వేషములతో అజ్ఞాతముగా ప్రవర్తింతుము. అజ్ఞాతవాసము భంగము కాకుండునట్లు మీరు మమ్ము అనుగ్రహింపవలెను".
    బ్రాహ్మణులు ధర్మరాజు మాటలు విన్నారు. పాండవులకు కలిగిన ఆపదలకు మిగుల విచారించినారు. "ధర్మమూర్తులగు పాండవులారా! మీ కష్టములు కలకాలము ఉండునవికావు. దుర్భుద్ధి అయిన దుర్యోధనునకు అపజయము ప్రాప్తింపనున్నది. మీ అజ్ఞాతవాసము విజయవంతముగా ముగించుగాత. అప్పుడు మీ దర్శనము చేసుకొందుము" అని బ్రాహ్మణులు తమ తమ స్థానములకు వెళ్ళిపోయినారు. అటుపిమ్మట పరిజనులందరు పాండవుల అనుమతిపొంది తమతమ స్థానములకు వెళ్ళిపోయినారు.
    అప్పుడు పాండవులు ద్రౌపదీ, ధౌమ్య సహితులయి రథములు ఎక్కి సాగినారు. కొంత దూరము సాగి ఆ రాత్రి అక్కడ నివసించినారు. తెల్లవారి చేయవలసిన అజ్ఞాతవాసమును గురించి కార్యాలోచనము సాగించినారు.
    "అర్జునా!" ధర్మరాజు విచారముతో అడిగినాడు "మనము ద్రౌపదితో కూడి ఎక్కడికి వెళ్ళినను శత్రువులు మనను గుర్తించక మానరు. ఈ సంవత్సరము ఎచ్చట ఏరీతిగా గడుపవలెనో తెలియకున్నది".
    "అన్నా! ధర్మరాజా! విచారించకుము. ధర్మదేవుడు నీ ధర్మబుద్ధికి సంతోషించి వరమును ఇచ్చినాడు. దాని ప్రభావమున మనలను ఇతరులు ఎరుగజాలరు. కావున మనము ఈ సంవత్సర పర్యంతము నివసించు ప్రదేశమును గురించి ఆలోచించవలసి ఉన్నది. కురుదేశము చుట్టును పాంచాల, చేది, మత్స్య, సాల, విదేహ, బాహ్లిక, దశార్ణ, శూరసేన, కళింగ, మగధ దేశములు ఉన్నవి. ఈ దేశములన్నియు సుభిక్షముగా ఉన్నవి. జనులచేనిండి ఉన్నవి. సుస్థిరములయి ఉన్నవి. వీనిలో మీరు నిర్ణయించిన దేశమున నివసింతము" అని సూచించినాడు అర్జునుడు.
    ధర్మరాజు అర్జునుని మాటలు విన్నాడు. ధర్మదేవుని వరమును తలచుకొని సంతోషించినాడు. నివాసస్థలమును గురించి ఆలోచించినాడు. "అర్జునా! ఆలోచించి చూడగా మత్స్యదేశము మంచిదిగా తోచుచున్నది. విరాట రాజు ధర్మాత్ముడు, సజ్జన ప్రియుడు. మహాబలవంతుడు. మనము అందఱము విరాటరాజు దగ్గరకు వెళ్ళి ఉందుము. ఇది నాకు సమ్మతము. మనలో ఎవరెవరు ఏయే పనులు చేయుచు విరాటుని సేవించవలసి ఉన్నదో నిర్ణయించవలసి ఉన్నది. కావున అందును గురించి ఆలోచించుడు" అన్నాడు ధర్మరాజు.
    అందరును అందును గురించి ఆలోచించ సాగినారు.
    "అన్నా!" అర్జునుడు గద్గద స్వరమున ధర్మరాజుతో అన్నాడు. "నీవు మానమే విభవముగా గలవాడవు. సుకుమారుడవు. గాంభీర్యము గలవాడవు. గౌరవవంతుడవు. కృపాసముద్రుడవు. సత్యవంతుడవు. ధర్మవంతుడవు. జనులను ఏలుటయేగాని ఎవరిని కొలిచి ఎరుగవు. అట్టి నీవు ఏ రూపమున విరాట రాజును కొలిచెదవో చెప్పుము".
    అర్జునుని మాటలు విన్నారు. అందరి గుండెలు తడిసినవి. కనులు చెమ్మగిలినవి. రాజసూయ యాగము చేసిన ధర్మరాజు సేవకుడుగా జీవించవలసి వచ్చినది. మౌనము వెలసినది. కొంతసేపు ఎవరును మాట్లాడలేదు.
    "అర్జునా! ఎంతటివారయినను కాలమునకు లొంగవలసి ఉండును. కాలమే దైవము. దైవమును వ్యతిరేకించు శక్తి మానవునకు లేదు. నేను సన్యాసి వేషము ధరించి విరాటుని సభయందు ఉందును. నా పేరు "కంకుడు" అగును. నేను రాజునకు పుణ్య కథలు చెప్పెదను. అప్పుడప్పుడు నావద్ద ఉన్న పాచికలతో విరాటరాజుతో జూదమాడి అతనికి వినోదము కలిగింతును" అన్నాడు ధర్మరాజు. అతడు భీముని చూచి "తమ్ముడా! నీవు మహాబలవంతుడవు. సౌగంధికము తెచ్చినపుడు యక్షులను ఓడించినావు. హిడింబ, కిమ్మీర, బక, జటాసురులను వధించినావు. నీవు ఏరీతిగా సేవకావృత్తిని అవలంబింతువు నాయనా" అని కన్నీరు రాల్చినాడు ధర్మరాజు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.