Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
3. సూర్యదేవర సంపదలకు మూల పురుషుడు. అతడు తన సామర్థ్యమున ద్రష్టవ్య పదార్ధములను వెలిగించును. సవితవలెనే సూర్యుని కార్యములన్నియు ఫలవంతములు అగును. ఎచట సర్వసంపదలు ఏకత్రితములు అగునో అచట సూర్యుడు ఇంద్రుని బోలి వెలుగొందినాడు.
4. సోమమా! మందహాస జలము విశ్వావసు గంధర్వుని చూచినది. పుణ్య కర్మ ప్రభావమున జలము విలక్షణముగ వెడలినది. జలప్రేరక ఇంద్రుడు ఈ విషయము తెలిసి కొన్నాడు. పలుదిశల సూర్యమండలమును వీక్షించినాడు
5. దేవలోకవాసియు - జలసృష్టికర్తయునగు విశ్వావసుడు ఈ విషయములు మాకు తెలియపరచును గాక. ఏది వాస్తవమో, ఏది అజ్ఞాతమో అను విషయమున మా ఆలోచనలకు ప్రేరకుడు అగును గాత. మా జ్ఞానములకు రక్షకుడు అగునుగాత.
6. నదుల చరణములందు ఇంద్రుడు ఒక మేఘమును గాంచినాడు. ప్రస్తర ద్వారమును ఆవిష్కరించినాడు. గంధర్వుడు సమస్త నదుల జలముల విషయము వివరించినాడు. ఇంద్రుడు మేఘముల శక్తిని ఎరింగివాడు.
మాట నలుబదవ సూక్తము
ఋషి - పావక అగ్ని - దేవత - శుద్ధి అగ్ని ఛందస్సు - వేరువేరు
1. అగ్నీ! నీ వద్ద ప్రంశసనీయ అన్నము గలదు. నీ జ్వాలలందు విశిష్ఠ దీప్తి కలదు. నీ దీప్తి ప్రకాండము. దీప్తియే నీ సంపద. నీవు కార్యకుశలుడవు. నీవు దాతలకు ఉత్తమ అన్న, బలప్రదాతవు.
2. అగ్నీ! నీవు ప్రకాశముగ ఉదయింతువు. అపుడు నీ తేజము సమస్తమును స్పష్టము చేయును. అవి శుక్ల వర్ణమున వర్ధిల్లును.
అగ్నీ! నీవు ద్యావా పృథ్వులను తాకుచున్నావు. నీవు పుత్రుడవు - ద్యావా పృథ్వులు తల్లులు అగుచున్నవి. అందుకే ఆటలాడుచు వానిని కౌగిలించుకొనుచున్నావు.
3. అగ్నీ! నీవు తేజోపుత్రుడవు. జ్ఞానివి. ఉత్తమ స్తోత్ర పాఠములతో స్థాపించబడుచున్నావు. ఆనందించుము. నానావిధ - నానారూప యజ్ఞ సామాగ్రి నీయందే ఆహుతి అగుచున్నది.
4. అగ్నీ! వికసించనున్న కిరణమండలమున శోభిల్లుచు మా ధనమును వర్ధిల్లచేయుము. నీవు సుందరముగ అవతరించినావు. నీవు సమస్త ఫలప్రద యజ్ఞమును స్పృశించుచున్నావు.
5. అగ్నీ! నీవు యజ్ఞమునకు శోభ సమకూర్చువాడవు. జ్ఞానివి. విశేష అన్నప్రదాతవు. ఉత్తమ పదార్థ ప్రాపకుడవు. మేము నిన్ను స్తుతించుచున్నాము. అత్యంత సుందరమును, ఆనంతమును అగు అన్నమును ప్రసాదించుము. సమస్త ఫలితములను కలిగించు ధనము కలిగించుము.
6. అగ్ని యఇజ్ఞ్ పయోగి -సర్వదర్శకుడు - విశాలుడు. మానవులు అగ్నిని సుఖములు అర్థింతురు.
అగ్నీ ! నీవు సర్వము వినగలవాడవు. నీ వైశాల్యము నిరుపమానము. నీవు దేవలోక వాసివి. యాజమానపతి, పత్నులు నిన్ను స్తుతించుచున్నారు.
నూట నలుబది ఒకటవ సూక్తము
ఋషి - అగ్ని దేవత - విశ్వే దేవతలు, ఛందస్స - అనుష్టుప్
1. అగ్నీ ! ఉపయుక్తమును ఉపదేశించుము. మాకు అనుకూలుడవు - ప్రసన్నుడవు అగుము. నీవు ధనదాతవు మాకు ధనము ప్రసాదించుము.
2. అర్యమ, భగ, బృహస్పతి, అన్యదేవతలు మరియు వాక్యమయి సరస్వతి మున్నగు వారు మాకు ధనము ప్రసాదింతురుగాత.
3. మమ్ము రక్షించుమని మేము సోమరాజు, అగ్ని సూర్య, ఆదిత్యగణ, విష్ణు, బృహస్పతి, ప్రజాపతులను ఆహ్వానించుచున్నాము.
4. ఇంద్ర, వాయు, బృహస్పతులను ఆహ్వానించుటలో ఆనందము ఉన్నది. మేము వారలను ఆహ్వానించుటలో ఆనందము ఉన్నది. మేము వారలను ఆహ్వానించుచున్నాము. ధనప్రాప్తి కొరకు వారు మా విషయమున ప్రసన్నులు అగుదురుగాక.
5. స్తోతా! దానము కొరకు అర్యము, బృహస్పతి, ఇంద్ర, వాయు, విష్ణు, సవిత, సరస్వతులను ప్రార్థించండి.
6. అగ్నీ! నీవు సమస్త అగ్నులతో కలసి మా స్తోత్రముల యొక్కయు యజ్ఞము యొక్కయు సిరులను వర్ధిల్లచేయుము. మా యజ్ఞము కొరకు దాతలను, ధనదానమునకు ప్రేరణ కలిగించుము.
నూట నలుబది రెండవ సూక్తము
ఋషి - శారంగజాత జరితుజి - దేవత - అగ్ని ఛందస్సు - వివిధము
1. అగ్నీ! మేము జారితులము - నీ స్తోతలము. బలపుత్ర అగ్నీ! నీతో సమమగు ఆత్మీయుడు మరొకడు ఉండడు. నీ నివాస స్థానము సుందరము. దానికి మూడు ప్రకోష్ఠములు ఉన్నవి. నీ మంటలకు మేము కాలుదుము. కావున నీ ఉజ్వల జ్వాలలను దూరముగా ఉంచుము.
2. అగ్నీ! నీవు అన్నముకోరి ప్రత్యక్షమైనప్పటి నీ సుందర రూపము చెప్పనలవిగానిది. బంధువువలె నీవు సమస్త భువనములను అలంకరించుచున్నావు. అటు నిటు కదలు నీ జ్వాలలు మా స్తవములను ఆవిర్భవింప చేయుచున్నవి. పశువుల కాపరివలె నీ జ్వాలలు అగ్రమున సాగుచున్నవి.
3. దీప్తిశాలి అగ్నీ! దహించునపుడు అనేక తృణములను వదలుచున్నావు. ధాన్యభరిత క్షేత్రమును శూన్యము చేయుచున్నావు. మేము నీ ప్రబల శిఖల ఆగ్రహమున పడకుందుము గాక.
4. నీవు వృక్షాదులను క్రింద, మీద కాల్చునపుడు దోచుకొను సేనవలె - విడివిడిగా సాగుదువు. నీకు వాయువు తోడయినపుడు - మంగలి తల గొరిగినట్లు - అసీను ప్రదేశములను ముండనము చేయుదువు.
5. అగ్ని అనేక శిఖలు గలది. వారి గమ్యము ఏకము. కాని రథములు అనేకములు.
అగ్నీ! నీ శిఖలచే అరణ్యములను దహిస్తావు. వినమ్రమవుతావు ఉన్నత భూమిని అధిరోహిస్తావు.
6. అగ్నీ ! నీవు స్తుతించబడుచున్నావు. నీ యందు తేజస్సు, జ్వాలలు, బల పరాక్రమములు ఉదయించును గాత. బుద్ధివర్ధిల్లునుగాక. పైకి సాగుము. క్రిందకు దిగుము. నిన్ను సమస్త దేవతలు చేరుకొందురుగావుత.
7. ఇది జలముల మూలభూమి. ఇచట సముద్రము ఉన్నది. అగ్నీ! నీవు అన్యస్థానమునకు చేరుము అచటనే స్వేచ్ఛగ సంచరించును.
8. అగ్నీ! నీ ఆగమన, ప్రత్యాగమునందు దుర్వారములు పుష్పించునుగాక. ఇది తాటకము. ఇవి శ్వేత పద్మములు. ఇది సముద్రము.
అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య రచించిన శ్రీమదాంధ్ర వచన
ఋగ్వేద సంహిత యందలి ఎనిమిదవ అష్టకము నందలి
ఏడవ అధ్యాయము సమాప్తము.
నూట నలుబది మూడవ సూక్తము
ఋషి - సంఖ్య పుత్ర ఆత్రేయుడు. దేవత - అశ్వినులు ఛందస్సు - అనుష్టుప్
1. అశ్వినులారా ! యజ్ఞములు చేసి, చేసి అత్రి ఋషి వృద్ధుడు అయినాడు. మీరు అతనిని తీర్చిదిద్దినాడు. అశ్వమువలె గమ్యస్థానము చేరినాడు. పాతబడిన రధమును కొత్తదానిగ చేసినట్లు కక్షీవంతునకు నవయవ్వనము ప్రసాదించినారు.
2. ప్రబల పరాక్రమ శత్రువులు - జవనాశ్వము వంటి అత్రి ఋషిని కట్టిపెట్టినారు. గట్టి ముడిని విప్పినట్లు మీరు అత్రిని విడిపించినారు. అతడు నవయవ్వనుని వలె ధరిత్రి మీద సాగిపోయినారు.
3. శుభ్రవర్ణ, సుందర నాయకద్వయమా! అత్రికి జ్ఞానము కలిగించండి. అపుడు నేను మరిన్ని స్తుతులు చేసెదను.
4.ఉత్తమ అన్నవంత నాయకద్వయమా! మీరు మా ఇంట జరిగిన యజ్ఞమహోత్సవ ఆరంభమును మహాసంరంభమున రక్షించిన తీరు కానగా మా దానములను, స్తోత్రములను గ్రహించినారని అర్ధమైంది.
5. భుజ్యుడను వాడు సముద్రమున పడినారు. తరంగముల మీద తేలి కొట్టుకొను చున్నాడు. అప్పుడు మీరు పక్షినావ మీద సముద్రము మీదకు చేరినాడు. భుజ్యుని రక్షించినారు - యజ్ఞయోగ్యుని చేసినారు.
6. సర్వజ్ఞ నాయకద్వాయమా! భాగ్యవంతులవలె దాతలై, ధన సహితులై మా వద్దకు విచ్చేయండి. పాలు పొదుగున చేరిన రీతి మమ్ము ధనపూర్ణులను చేయండి.
నూట నలుబది నాలుగవ సూక్తము
ఋషి -గరుడపుత్ర సుపర్ణుడు. దేవత - ఇంద్రుడు ఛందస్సు - వేరు వేరు
1. ఇంద్రా ! నీవు సృష్టి కర్తవు. ఇది సొమము. అమృత సమము. అశ్వమువలె పరుగులు తీయును. ఇది బలకరి. జీవన స్వరూపము.
2. ఇంద్రుడు దాత. అతని ఉజ్వల వజ్రము స్తవనీయము. ఇంద్రుడు ఊర్ధ్వ కృశనుడను స్తోతకు పాలకుడు. ఋభువుల వలె ఇంద్రుడు యజ్ఞకర్తను పాలించుచున్నాడు.
3. ఇంద్రుడు దీప్తిగలవాడు. యజమానులు అతని ప్రజా. అతడు వారి వద్దకు రాకపోకలు సాగించును. నేను సుపర్ణర్షిని. నా వంశమును అతడు వర్ధిల్లచేసినాడు.
4. గరుడపుత్రుడు సుపర్ణుడు. దూర దేశము నుండి సోమము తెచ్చినాడు. అది సకల కర్మలకు ఉపయోగపడునది - ఉత్సాహమును ఉరికించునది.
5. అది ఎర్రనిది, సృష్టికర్త వంటిది. సుందరము. అన్యులు నష్టపరచరానిది. దానిని తన చరణములచే గరుడుడు తెచ్చినాడు.
ఇంద్రా! సోమము స్వీకరించుము. మాకు అన్నము, పరమాయువు, జీవనము ప్రసాదించుము. సోమము కొరకు మాతో స్నేహము చేయుము.
6. ఇంద్రుడు సోమపానము చేయును. దేవతలకు, మాకు తగురీతి గట్టి భద్రత కలిగించును.
ఉత్తమ కర్మ ఇంద్రా! యజ్ఞము కొరకని మాకు అన్నము, పరమాయువు ప్రసాదించుము. యజ్ఞమునకని ఈ సోమమును మేము సమర్పించుచున్నాము.
నూట నలుబది అయిదవ సూక్తము
ఋషి - ఇంద్రాణి, దేవత - సపత్ని -ఛందస్సు - వేరు వేరు
1. ఇది ఓషధి. తీవ్రశక్తియుక్తము. దీనిని నేను త్రవ్వి తీస్తాను. ఇది దుఃఖము, భర్తకు వలపు కలగించును.
2. ఓషధీ! నీ పత్రములు ఉన్నతముఖములు. నీవు భర్తకు వలపు కలిగించు ఉపాయమవు. నీ శక్తి అద్భుతము. నా సవతిని దూరము చేయుము, నా స్వామి నా వశమున ఉండునట్లు చేయుము.
3.ఓషధీ! నీవు ప్రధానివి. నేను ప్రధానిని అగుదునుగాత. ప్రధానులందు ప్రధానిని అగుదునుగాక. నా సవతి నీచులందు నీచ అగునుగాక.
4. నేనునా సవతిని పేర్కొనను, సవతి అందరకు అప్రియ అగును. దానిని దూరమున కన్నా దూరమునకు పంపివేతును.
5. ఓషధీ! నీ శక్తి విలక్షణము. నా సామర్ధ్యము విచిత్రము. రమ్ము. శక్తి సామర్ధ్యములు కలిపి సపత్ని బలము నిర్మూలింతము.
6. పతిదేవా! ఈ శక్తి సంపన్న ఓషధిని నీ తల క్రింద ఉంచినాను. తలదిండు అందించినాను. ఆవుదూడ కొరకు, నీరు పల్లమునకు వలె నీ మనసు నా వైపు పరుగులిడును గాక.
నూట నలుబది ఆరవసూక్తము
ఋషి - ఇరంమదపుత్ర దేవముని, దేవత - అరణ్యములు, ఛందస్సు - అనుష్టుప్
1. మహారణ్యములారా! చూచుచుండగనే అంతర్ధానమగుదురు. చూపు అందనంత దూరమునకు చేరుదురు. మీరు గ్రామ మార్గము ఏల తెలిసికొనరు? మీకు వంటరితనము భయము కలిగించదా?
2. ఒక మృగము ఆబోతువలె గర్జించును. ఒక పక్షి కిచకిచమని దానికి సమాధానమువలె పలుకునా. అవి తెరలు తెరలుగా ధ్వనిచేయుచు మహారణ్యపు కీర్తిగానము చేయుచున్నట్లు ఉండును.
3. ఈ విపినము నందు ఒక మూల ఆవులు మేయుచున్నవి - ఒకచోట లతాగుల్మాదుల గృహములు ఉన్నవి.
ఇది సాయం సంధ్య - వనము నుంచి అనేక శకటములు వెడలుచున్నవి.
4. ఒకడు ఆవును పిలుస్తున్నాడు. ఒకడు కట్టెలు కొట్టుచున్నాడు. రాత్రులు అరణ్యము లందున్న వారు ధ్వనులు వింటారు.
5. అరణ్యములు ఏ ప్రాణిని వధించవు. పులులు, దొంగలు లేకున్న భయమే లేదు. వనములందున్న రుచిగల ఫలములు తిని హాయిగ కాలక్షేపము చేయవచ్చును.
6. వనములందు కస్తూరి పరిమళములు ఉన్నవి. ఆహారము ఉన్నది. శ్రమలేకున్నది.
అరణ్యములు హరిణముల మాతృరూపలు. అట్లని నేను అరణ్యములను స్తుతించు చున్నాను.
నూట నలుబది ఏడవ సూక్తము
ఋషి - శిరీష పుత్ర సువేదసుడు - దేవత - ఇంద్రుడు -ఛందస్సు - జగతి - 5 త్రిష్టుప్
1. ఇంద్రా! నీ క్రోధమును ప్రధానముగ భావించుచున్నాను. నీవు వృత్రుని వధించినావు. లోక కళ్యాణమునకు వర్షము కురిపించినావు. ద్యావా పృథ్వులు నీ అధీనమందు ఉన్నవి.
వజ్రధర ఇంద్రా ! నిన్ను చూచి పృథివి గడగడలాడును.
2. ఇంద్రా! నీవు ప్రశంసనీయుడవు, అన్నము సృష్టించ సంకల్పించినావు. నీ శక్తిచే వృత్రుని తొలగించినావు. మానవులు గోవులను కోరి నిన్ను యాచింతురు. సకల హవన, యజ్ఞములందు నిన్నే ప్రార్థించుచున్నాము.
3. ఇంద్రా! నీవు ధనికుడవు. పురుహూతుడవు. వీరు విద్వాంసులు. వారి ముఅద్ము అవతరించుము. నీ కటాక్షమున వారు సిరి వర్ధిల్లు ధనికులు అయినారు. పుత్ర, పౌత్రులను, అన్య అభిలషితములను, విశిష్ఠ ధనము ఆశించి యజ్ఞములు చేయుదురు. నిన్ను ప్రార్థింతురు.
4. ఎవడు ఇంద్రునకు సోమపాన జనిత ఆనందము కలిగించుచున్నాడో అట్టివాడు కోరిన ధనము కొరకు ప్రార్థించుచున్నాడు.
ధనిక ఇంద్రా! నీవు యజ్ఞదాతకు శ్రీ వృద్ధి కలిగింతువు. అట్టివాడు సేవకులు, ధనము, అన్నమున, పరిపూర్ణుడు అగుచున్నాడు.
5. బలము కొరకు నీవు స్తుతించబడుదువు. మాకు ధనము, బలము ప్రసాదించుము.
ప్రియదర్శన ఇంద్రా! నీవు మిత్రా వరుణులవలె అలౌకిక జ్ఞానమునకు అధికారివి. నీవు మాకు అన్నమును పంచి ఇచ్చుచున్నావు.
నూట నలుబది ఎనిమిదవ సూక్తము
ఋషి - వేనపుత్ర పృథువు - దేవత - ఇంద్రుడు - ఛందస్సు త్రిష్టుప్
1. ప్రభూత ధనవంత ఇంద్రా! మేము సోమము, అన్నము సంపాదించినాము. నిన్ను స్తుతించుచున్నాము. నీ మనసునకు అనుకూలమగు సంపదను మాకు మరింత ప్రసాదించుము. నీ అనుగ్రహమున మేము మా పరిశ్రమ వలననే ధనము కలుగుదుము గాక.
2. ఇంద్రా! నీవు ప్రియదర్శిని - వీరుడవు. నీవు పుట్టినావు. సూర్యమూర్తిని అయినావు. దాస నీవు వర్షకారివి. నీవు సోమము సమర్పించుచున్నాము.





