Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
21. లోకమునకు దిక్కు ఎవరు? జలమేది? అన్నమేది? విషయము ఏది? శ్రాద్ధమునకు కాలము ఏది?
లోకమునకు దిక్కు ప్రాజ్ఞులు. ఆకాశము జలము. భూమి అన్నియు అగును. ప్రార్థన విషయమగును. బ్రాహ్మణుడు శ్రాద్ధకాలము అగును.
22. తపస్సునకు లక్షణములు ఏవి? దమమునకు లక్షణములు ఏవి? క్షమమునకు లక్షణములు ఏవి? సిగ్గునకు లక్షణములు ఏవి?
వర్ణాశ్రమ ధర్మమున ప్రవర్తించుట తాపమునకు, మనసును నిగ్రహించుట దమమునకు, సుఖదుఃఖాదులను సహించుట క్షమకు, అకార్యములను చేయకుండుత సిగ్గునకు లక్షణములు.
23. జ్ఞానము అనగా ఎట్టిది? శవము అనగా ఏమి? శ్రేష్ఠమయిన దయ ఏది? ఆర్జవము అనగా ఏమి?
బ్రాహ్మమును ఎరుగుట జ్ఞానము. చిత్తశాంతి శమము. సకల భూతములకు సుఖమును ఆశించుట పరమదయ. సకల భూతములందు సమబుద్ధి కలిగి ఉండుట ఆర్జవము.
24. మానవులకు జయింపరాని శత్రువు ఎవరు? అంతము లేని వ్యాధి ఏది? ఎటువంటివాడు అగును?
జయింపరాని శత్రువు కోపము. లాభము అంతము లేని వ్యాధి. సర్వభూతములకు మేలు కోరువాడు సాధువు. దయలేనివాడు అసాధువు.
25. మోహము అనగా ఏది? అహంకారము అనగా ఏది? సోమరితనము అనగా ఏది? దుఃఖము అనగా ఏది?
ధర్మమార్గమును ఎరుగకుండట మోహము. దేహమందు అభిమానము అహంకారము. ధర్మకార్యములు చేయకుండుట సోమరితనము. అజ్ఞానము దుఃఖము అగును.
26. ఋషులచే చెప్పబడిన స్థైర్యమేది? ధైర్యమేది? స్నానమేది? దానమేది?
వర్ణాశ్రమ ధర్మములందు ప్రవర్తిల్లుట స్థైర్యమనియు, ఇంద్రియ నిగ్రహము ధైర్యమనియు, కామక్రోధాదులను విడుచుట స్నానమనియు, ప్రాణులను రక్షించుట దానమనియు ఋషులు ప్రవచించినారు.
27. పండితుడు ఎవడు? నాస్తికుడు ఎవడు? కామము అనగా ఏమి? మత్సరము ఎటువంటిది?
ధర్మము తెలిసినవాడు పండితుడు. మూర్ఖుడు నాస్తికుడు. సంసారమునకు కారణము అయినది కామము. మనః పరితాపము మత్సరము అగును.
28.అహంకారమనగా ఏమి? దంభము అనగా ఏమి? దైవము అనగా ఏది? నీచత్వము అనగా ఏమి? అజ్ఞానము అహంకారము. ఇతరులు మెచ్చుటకు చేయు ధర్మకార్యము దంభము. దాన ఫలము దైవము. పరులను దూషించుట నీచత్వము అనబడును.
29. ధర్మార్థకామములు పరస్పర విరోధము గలవి. నిత్య విరోధములయిన ధర్మార్థ కామములకు మానవునియందు కూడిక ఎట్లు కలుగును?
భార్యా ధర్మములు అన్యోన్యవశములయి ఉన్నపుడు ధర్మార్థకామములు కలిసియే ఉండును.
30. మానవుడు దేనిచేత అక్షయమయిన నరకమును పొందును?
విద్యా బుద్ధులు, ధనము కలిగి పరులకు పెట్టక, తాను అనుభవించక, పెట్టెదనని పిలిచి లేదని చెప్పువాడు అక్షయ నరకమును పొందును.
31. పురుష శబ్దమునకు అర్హుడు ఎవడు? సర్వధనవంతుడు ఎవడు?
పుణ్యకార్యముల వలన భూమ్యాకాశములందు కీర్తి వ్యాపించి ఉండువాడు పురుషుడు అనబడును. సుఖ దుఃఖములందు కార్యాకార్యములందు సమబుద్ధికలవాడు సర్వధనుడు అనబడును.
అని వివరించిన విని యుదిష్ఠిరు దెస బ్రసాద మధురంబైన యాలోకనంబు నిగుడ నయ్యక్షవరుండు మహాత్మా మదీయంబులైన బ్రశ్నంబు లన్నింటికి సదుత్తరంబు లిచ్చితి నీవలనం బ్రీతుండనైతి నీ తమ్ములందొక్కరుని ప్రాణంబు లిచ్చెద నడుగు మనిన నతండు,
"మహాత్మా! నా తమ్ములగు భీమార్జున నకుల సహదేవులు నలుగురిలో నకులుని బ్రతికింపుము" అని కోరినాడు ధర్మరాజు.
"ధర్మరాజా! విచిత్రమయిన కోరిక కోరినావు. బలపరాక్రమములు కలవారు భీమార్జునులు. నీకు ప్రియులు. వారిలో ఒకరిని బతికించమని కోరక నకులునకు ప్రాణము పోయుమని కోరినావు. అందులకు కారణము ఏమి?" అని అడిగినాడు యక్షుడు.
"మహాత్మా! మా తల్లికి కలిగిన ముగ్గురు పుత్రులలో నేను జీవించి ఉన్నాను. పాండురాజునకు రెండవ భార్య అయిన మాద్రికి కలిగిన ఇద్దరు పుత్రులలో ఒకడు జీవించుట ధర్మము. అందువలన నకులుని ప్రాణములు కోరినాను. నాకు ఎంత హాని కలిగినను నేను ధర్మహానికి భయపడుదును. ఇది సత్యము" అని ధర్మరాజు వివరించినాడు.
అనిన నతండు నీదైన ధర్మజ్ఞతకు మెచ్చితి. నీ తమ్ములందరు లబ్ధ జీవితులయ్యెదరనిన నాక్షణంబ విగత క్షుత్పిపాసులై యన్నలువురు నిద్రవోయి మేల్కొనిన తెరంగున సముత్థితులైనంజూచి విస్మితుండై ధర్మ పుత్రుండిట్లనియె,
"దేవా! నీవుయక్షడవని నామనసు నమ్ముట లేదు. నీవు విష్ణుదేవుడవో, శివుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో లేక నా తండ్రి అయిన యమధర్మరాజువో అయి ఉందువు. నీవు ఎవరయినది చెప్పి నన్ను ధన్యుని చేయుము".
"ధర్మరాజా!" యక్షుడు చిరునవ్వు నవ్వి అన్నాడు. "నేను ధర్మదేవుడను. నా పుత్రుడవగు నిన్ను చూచుటకు వచ్చినాను. నీవు పరమధార్మిక బుద్ధికలిగి ఉన్నావు. నన్ను ఆశ్రయించిన జనులకు కీడు కలుగదు. కావున నీకు ఇష్టమయిన వరమును ఇచ్చెదను కోరుము".
తనముందు ఉన్నవాడు యమధర్మరాజు అని తెలుసుకున్నాడు ధర్మరాజు. అతనికి నమస్కరించినాడు స్తుతించినాడు. "ధర్మదేవా! నా ఆశ్రమమునందలి ఒక బ్రాహ్మణుని అరణిని ఒకమగలేడి ఎత్తుకొని పోయినది. దానిని అతనికి ఇప్పించి కరుణించ ప్రార్థన" అని వరము అడిగినాడు.
"నాయనా! ధర్మరాజా! నిన్ను పరీక్షించుటకు గాను నేనే మగలేడినయి బాపని అరణిని గ్రహించినాను. అది అతనికి ఇప్పటికే అందినది. మీరు పన్నెండు సంవత్సరముల వనవాసము పూర్తిచేసినారు. ఒక సంవత్సరము అజ్ఞాతవాసము గడపవలసి ఉన్నది. ఆ అజ్ఞాతవాసమందు మీరు ఎక్కడెక్కడ ఏరూపముల ఎవ్వరెవ్వరు ఏవిధముగా సంచరింప గోరెదరో ఆయా రూపములు మీకు లభించును. మీరు ఏ ప్రకారముగా ఉన్నను మిమ్ములను ఇతరులు గుర్తించనట్లు వరము ఇచ్చినాను. ఇంకేమయిన వరము కావలసిన అడుగుము" అన్నాడు ధర్మదేవుడు.
"మహాత్మా! ధర్మదేవా! నీవు ఆది దేవుడవు. నన్ను కరుణించినావు. అంతేచాలు. అయినను ఒక వరము అడిగెదను. "నామది యెల్లనాడును గ్రోధమోహాదులం బెడబాసి ధర్మువునంద నెక్కొన జేయవే" అని ప్రార్థించినాడు ధర్మరాజు.
"అనిన నద్దేవుండతనికి నవ్వరంబొసంగి యనంతరంబయంతర్హి తుండయ్యె గౌంతేయులు గ్రమ్మఱి నిజాశ్రమంబున కరిగి వరమానండంబు బొందిరి".
ఇది పాండు తనయుల వనవాస ప్రకారము.
లక్ష్మణాచార్య బుచ్చమాంబా పౌత్రుండును, వేంకటాచార్య వేంకటాంబా పుత్రుండును మహాకవి కృష్ణమాచార్యుల అనుజుండును శాకుంతల, మాళవికాగ్ని మిత్ర, విక్రయోర్వశీయాద్యనేకబాల సాహిత్య రచయితయు అయిన దాశరథి రంగాచార్య విరచితంబయిన మహాభారతమున అరణ్యపర్వము సమాప్తము.





