Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
నూట ముప్పది రెండవ సూక్తము
ఋషి - నృమేధపుత్ర శకపూతుడు. దేవత - అశ్వినులు - మిత్రావరుణులు
ఛందస్సు - వేరు వేరు
1. ఎవడు యజ్ఞము చేయుచున్నాడో అతనికి ఆకాశము ధనమిచ్చును. భూమి సంపదలు కలిగించుము. యజ్ఞకర్తకే అశ్వినిలు సుఖ సంపదలిచ్చి సుఖవంతుని చేయుదురు.
2. మిత్రావరుణులారా! మీరు పృథివిని పోషించుచున్నారు. ఉత్తమ సుఖముల కొరకు మేము మిమ్ము ఆరాధించుచున్నాము. యజమానుల విషయమున మీ మైత్రీభావ ప్రభావమున మేము శత్రుంజయులము అగుదుము గాత.
3. మిత్రావరుణులారా! మేము మీ కొరకు యజ్ఞ సామాగ్రి సమకూర్తుము. అప్పుడే మా వద్దకు ప్రియధనము చేరుచున్నది. యజ్ఞదాతకు అందునట్టి ధనములకు ఉపద్రవములు కలుగవు.
4. బలశాలి మిత్రా! నీవు ఆకాశము నందలి సూర్యుని కన్న భిన్నుడవు.
వరుణా! నీవు సమస్తమునకు సామ్రాట్టువు. నీ రధపతాక ఇటువైపే వచ్చుచున్నది.
హింస నాశకమగు ఈ యజ్ఞమునకు ఇసుమంత అశుభమును తాకజాలదు.
5. నేను శకపూతుడను. నీచ స్వభావ శత్రువును నష్టపరచగలను. ఏలనన మిత్రదేవుడు 'నా హితైషి' అగుచున్నాడు. మిత్రదేవత నాదేహమును - యజ్ఞ సామాగ్రిని రక్షించునుగాత.
6. మిత్రావరుణులారా! మీరు వశిష్ఠ జ్ఞానవంతులు మీ తల్లి అదితి. ద్యావాపృథ్వులను జలముచే పావనము చేయుడు. దిగువ లోకములకు ఉత్తమ సామాగ్రి అందించును. సూర్య కిరణములచే సమస్త భువనములను పవిత్రము చేయండి.
7. మిత్రావరుణులారా! మీరు స్వయంకృషితో సామ్రాట్టులు అయినారు. మీ రథము వనములందు సంచరించునది. అది అశ్వస్థానమున నిలుచునుగాక. సకల శత్రువులు ఆక్రందించుచున్నారు. మీరు నృమేధ ఋషిని విపత్తుల నుండి రక్షించినారు.
నూట ముప్పది మూడవ సూక్తము
ఋషి - పిజివనపుత్ర సుదాసుడు - దేవత - ఇంద్రుడు, చందస్సు - వేరు వేరు
1. ఇంద్రునిసేన అతని రథము ముందు ఉన్నది. దానిని పూజించండి. శత్రువు ఎదుట నిలిచి బెదిరించినపుడు ఇంద్రుడు పారిపోవడు. వృత్రవధసేయును. ఇంద్రుడు మా స్వామి. అతడు మమ్ము గురించి ఆలోచించును గాత శత్రువు వింటి అల్లెత్రాడు తెగునుగాత. "అన్యకేషాం జ్యాకా అధిధన్వసు".
2. ఇంద్రా! దిగువ ప్రవహించు నదులకు నీవే విముక్తి కలిగించినావు. నీవే మేఘమును వర్షింపచేసినావు. నీవు అజేయుడవు. శత్రువునకు అవధ్యుడవై అవతరించినావు. నీవు విశ్వపాలకుడవు నిన్ను సర్వశ్రేష్ఠునిగ భావించి నీ దరి చేరినాము. "అన్యకేషాం జ్యాకా అధిధన్వసు".
3. అదాతయగు శత్రువు దృష్టిపథము నుండి తొలుగునుగాక. మా స్తుతులు ప్రస్థానము సాగించునుగాత.
ఇంద్రా ! మమ్ము వధించదలచిన శత్రువును హతమార్చుము. నీ దానశీలత మాకు ధనము ప్రసాదించునుగాత. "అన్యకేషాం జ్యాకా అధిధన్వసు".
4. ఇంద్రా! తోడేళ్ల వంటివారు మా చుట్టు చేరుచున్నారు. వారిని నేలరాల్చుము. నీవు శత్రుంజయుడవు. శత్రుపీడా కారకుడవు. "అన్యకేషాం జ్యాకా అధిధన్వసు".
5. మాకు నికృష్టులు, తోటివారు, అనిష్టకర్మలుచేయు శత్రువులు ఉన్నారు. ఇంద్రా! ఆకాశము భూమిని వంగదీసినట్లు వారిని వంగపెట్టుము. "అన్యకేషాం జ్యాకా అధిధన్వసు".
6. ఇంద్రా ! మేము నిన్ను 'అ'నుసరించు వారలము. నీ బాంధవ్యమునకు అనుకూలములగు కార్యములకే ఉపక్రమించుచున్నాము. మమ్ము పుణ్యమార్గమున నడిపించుము. మేము పాపములను తరింతుముగాక. "అన్యకేషాం జ్యాకా అధిధన్వసు".
7. ఇంద్రా! దేని ప్రభావమున మా మనో రధములు ఫలించునో - అట్టి విద్యను మాకు బోధించుము.
ఈ గోవు పృథివీరూప. ఆమె విశాల స్తనములు గలదై సహస్రధారలుగ దుగ్ధములు వర్షించి మమ్ము పరితుష్టులను చేయును గావుత.
నూట ముప్పది నాలుగవ సూక్తము
ఋషి - యువనాశ్వపుత్ర మాంధాత - గోధయను బ్రహ్మవాదిని దేవత
ఇంద్రుడు ఛందస్సు - పంక్తి, మహాపంక్తి
1. ఇంద్రా! నీవు ఉషస్సువలె జగముల వెలుగులు నింపువాడవు. నీవు మహానుల కన్నా మహానుడవు మానవులకు సామ్రాట్టువు.
దేవీజానిత్య్ర జనీజనద్భద్రా జనిత్య్ర జీజనత్. దేవమాత న్మిన్ను కన్నది. నిన్ను కన్నా తల్లి భద్రయైనది.
2. మమ్ము వధించదలచిన శత్రువు ఎంతటి బలవంతుడైనను వాని బలమును నీవు త్రుంచి వేయుదువు. మాకు హాని తలపెట్టినవానిని నేలకూల్చెదవు.
"దేవీ జనిత్య్ర జీజనద్భాద్రా జనిత్య్ర జనీజనత్".
3. ఇంద్రుడు శక్తిశాలి. శత్రు సంహారకుడు - అందరికి ఆనందము పంచువాడు. అతడు తన శక్తిచే ఎంతో అన్నమును మా వైపు పంపునుగాత - సర్వప్రకారముల మమ్ము రక్షించును గాత.
"దేవీ జనిత్య్ర జీజనద్భాద్రా జనిత్య్ర జనీజనత్".
4. శత క్రతు ఇంద్రా! నీవు బహువిధ అన్నములకు ప్రేరణ కలిగించువాడవు. సోమ యజ్ఞకర్తయగు యజమానిని రక్షించుచున్నావు -ధనము ప్రసాదించుచున్నావు.
"దేవీ జనిత్య్ర జీజనద్భాద్రా జనిత్య్ర జనీజనత్".
5. స్వేద సమమముగ ఇంద్రుని ఆయుధములు నలు దిశలందు పడునుగాక. దూర్వార తంతువులవలె సర్వ వ్యాపకములు అగునుగాక. మా దుర్బుద్ధి తొలగునుగాక.
"దేవీ జనిత్య్ర జీజనద్భాద్రా జనిత్య్ర జనీజనత్".
6. ఇంద్రుడు జ్ఞాని - ధనికుడు. అతడు మహా అంకుశము వంటి శక్తి ఆయుధమును ధరించును. మేక తన మునిగాళ్లతో చెట్టుకొమ్మను వంచును. అట్లే ఇంద్రుడు తన శక్తి ఆయుధముచే శత్రువును గుంజి హతమార్చును.
"దేవీ జనిత్య్ర జీజనద్భాద్రా జనిత్య్ర జనీజనత్".
7. దేవతలారా! మీ విషయమున మేము ఎట్టి లోపము రానీయము. ఏ పని
యందును ఉదాసీనత కనబరచము. మంత్రము, శ్రుతిని అనుసరించి ఆచరింతుము. రెండు చేతులు కలిపి యజ్ఞ సామగ్రిని సేకరింతుము.
నూట ముప్పది అయిదవ సూక్తము
ఋషి - యమగోత్ర కుమారుడు - దేవత - యముడు ఛందస్సు -అనుష్టుప్
1. ఏ సుందర పత్ర భరిత వృక్షము నందు దేవతల సహితుడై యముడు పానము చేయున్నాడో ఆ వృక్షము మీదనే నేను నా పూర్వజుల సహచరుడను కావలెనని నరపతియగు నా తండ్రి కోరిక.
2. నేను నిర్దయుడను అయినాను. నా తండ్రి వచించిన 'పూర్వజుల సాహచర్య, విషయమును మరచినాను. విరక్తుడను అయినాను. ఇప్పుడు విరక్తి విడిచినాను. అనురక్తుడను అయినాను.
యముని మాట
3. నచికేతకుమారా ! నీవు ఒక విచిత్ర రథము కోరినావు. దానికి చక్రములు ఉండవు. దండము ఒకటే యగును. అది సర్వత్ర సంచరించును. తెలివి లేక నీవు ఆ రథమును ఎక్కినావు.
4. 'కుమారా! బుద్ధిమంతులగు బంధువులను విడిచినావు. ఆ రథమును నడిపినావు. అది నీ తండ్రి ఉపదేశమును అనుసరించి సాగినది. ఆ ఉపదేశము దానికి నావ అయినది. ఆశ్రయము అయినది. ఆ నావ మీద ఈ రథము ఇచటి నుండి సాగిపోయినది.
5. ఈ బాలకునకు జన్మనిచ్చిన వారెవరు? ఈ రథమును ఎవరంపినారు. ఈ బాలకుడు యముని ద్వారా జీవలోకమునకు మరల ఎట్లు పంపబడినాడు? వీటన్నింటిని నేడు మనకు ఎవడు చెప్పగలడు?
6. యముని ద్వారా బాలకుని మరల జీవలోకమునకు పంపుట తొలుతనే చెప్పబడినది. ప్రథమపిత ఉపదేశము మూలాంశము విదితమైనది. తదుపరి ప్రత్యాగమన ఉపాయము వివరించబడినది.
7. ఇది యముని నివాస స్థానము. దీనిని దేవతలు నిర్మించినారని చెప్పుకొందురు. యముని ప్రసన్నుని చేయుటకు వేణుగానము చేయబడును. స్తుతులచే యముడు భూషితుడగును.
కఠ ఉపనిషత్తు నందలి నచికేతుని కథ ప్రపంచం ప్రఖ్యాతము. దానికి ఇది మూలము అగుచున్నది. ఆసక్తి గలవారు నా రచన 'అమృత ఉపనిషత్తులు' చూడగలరు.
నూట ముప్పది ఆరవ సూక్తము
ఋషి - వాతారశన పుత్రులు , జాతి, వాతజూతి, దేవత, అగ్ని, సూర్య, వాయువులు
1. కేశియను సూర్యాగ్ని ద్యావాపృథ్వులను పోషించుచున్నాడు. కేశియే సకల భువనములను ప్రకాశింపచేసి, దర్శనీయము చేయుచున్నాడు. ఈ కేశియే జ్యోతి అనుచున్నాడు.
2. వాతరశన వంశజులగు మునులు పసుపు పచ్చిని వస్త్రములు ధరింతురు. వారు దేవత్వము పొంది, వాయువునాకు అనుగాములు అగుచున్నారు.
3. మేము సకల లౌకిక వ్యవహారములను విసర్జించినాము. వాయువును అధిరోహించి నాము. మీరు మా దేహములను మాత్రము చూడగలరు. మా ఆత్మ వాయు రూపము అగుచున్నది.
4. మునులు ఆకసమున ఎగురగలరు. సకలమును దర్శించగలరు. ఎందరు దేవతలో అందరు వారి బంధువులు అగుచున్నారు. వారు సుకృతముల కొరకే జీవింతురు.
5. వాయుగమనమునకు మునులు అశ్వరూపులు అగుచున్నారు. వారు వాయువు సహచరులు. దేవతలు మునులను ఆశించుచుందురు. వారు పూర్వ, పశ్చిమ సముద్రము లందు వసించుచుందురు.
6. కేశి దేవత అప్సరల, గంధర్వుల, హరిణముల మధ్య విహరించుచుండును. వారు తెలియగలవానిని అన్నింటిని తెలియుదురు. వారు రసోత్పాదకులు. ఆనంద ప్రదాతలగు మిత్రులు.
7. కేశి రుద్రునితో కలసి జలపానము చేయునపుడు వాయువు జలములను కదలించును. కఠిన మాధ్యమిక వాక్కును భంగపరచును.
నూట ముప్పది యేడవ సూక్తము
ఋషి - భరద్వాజ, కశ్యప, గౌతమ, అత్రి, విశ్వామిత్రాదులు, దేవత
విశ్వేదేవతలు ఛందస్సు - అనుష్టుప్
1. దేవతలారా! నేను పతితుడను - ఉద్దరించండి. నేను అపరాధిని - అపరాధముల నుండి తప్పించండి. నన్ను చిరంజీవిని చేయండి.
2. సముద్ర పర్యంతము - అవలకూడ వాయువు వీచును. అది రెండు విధములది. ఒకటి స్తోతలకు బలప్రదాత. మరొకటి పాపధ్వంసమై వీచును గాత.
3. వాయువా ! నీవు ఇటు వీచుము. ఓషధులు తెమ్ము. అహితకరమును ఇచట నుంచి తీసికొని పొమ్ము. నీవు లోకములకు ఔషధరూపమవు. నీవు దేవదూతగ సాగుదువు.
4. యజమానీ ! నీ కొరకు సుఖములు, బాధించని రక్షణలు తెచ్చినాను. నీకు బలము కలిగించు కార్యము చేసినాను. ఇక నీ వ్యాధులను దూరము చేయుదును.
5. ఇపుడు దేవతలు, మరుద్గణములు, చరాచరులు రక్షింతురుగాక. ఈ వ్యక్తి వ్యాధి రహితుడు అగునుగాక.
6. జలమే ఔషధము. రోగశాంతి కారకము. జలమే వైద్యము. నీకు అటువంటి జలము చికిత్స కారకము అగునుగాత.
7. రెండు చేతులకు పది అంగుళులు ఉన్నవి. మాటకు ముందు జిహ్వ సాగుతుంది. వ్యాధి నివారణకు నా రెండు చేతులతో నిన్ను తాకుచున్నాను.
నూట ముప్పది ఎనిమిదవ సూక్తము
ఋషి - ఉరుపుత్ర అంగుడు, దేవత - ఇంద్రుడు ఛందస్సు - జగతి
1. ఇంద్రా! యజ్ఞకర్తలు నీ స్నేహము కోరినారు. యజ్ఞ సామాగ్రి కూర్చినారు. యజ్ఞము చేసినారు. బలాసురుని వధించినారు. అప్పుడు నీవు స్తుతించబడినావు. నీవు కుత్సర్షికి ఉషస్సు కలిగించినావు. జలములకు విముక్తి కలిగించినావు. వృత్రుని సర్వకర్మలను ధ్వంసము చేసినావు.
2. ఇంద్రా! నీవు జనని వంటి జలములకు విముక్తి కలిగించినావు. పర్వతములను వడకించినావు. గోవులను తోలుకొనిపొయినావు. మధురసోమము సేవించినావు. వర్షము కలిగించినావు. ధనములను పెంచినావు.
యజ్ఞోపయోగ స్తుతి వచనములు ఇంద్రుని కీర్తించినవి. ఇంద్రుని సాధన వలన సూర్యుడు దీప్తిశాలి అయినాడు.
3. ఆకసమున సూర్యుడు తన రథమును నడిపించినాడు. ఆర్యులు దస్యులు చేత పరాజితులు కాబోరని నిశ్చయించినాడు.
ఇంద్రుడు యజ్వర్షితోస్నేహము చేసినాడు. పిప్రునామక మాయావి అసురుని బల వీర్యములను నష్టపరచినాడు.
4. ఇంద్రుడు దుర్దక్షుడు. అతడు దుర్ధర్ష శత్రుసేనను అంత మొందించినాడు. దేవ శూన్యుల సంపదను ధ్వంసము చేసినాడు. సూర్యుడు ప్రత్యేక మాసమున భూసారమును పీల్చుతాడు. అట్లే ఇంద్రుడు శత్రువుపురములందున్న ధనము పీల్చివేసినాడు.
స్తోత్రములు అందుకున్న ఇంద్రుడు ప్రదీప్త అస్త్ర శస్త్రములతో శత్రువును పడ గొట్టినాడు.
5. ఇంద్రుని సేనను ఎదిరించగలవారు లేరు. అతడు స్వరసంచారి. వజ్రమున వృత్రుని వంధించి, పతాక ఎగురవేసినాడు.
ఇంద్రుని వజ్రమునకు శత్రువు బెదరునుగాక. ఉష రథమును నడిపించినది.
6. ఇంద్రా ! సమస్త వీరకృత్యములు నీవియే యని వినుచున్నాము. వంటరిగ నీవు యజ్ఞ విఘ్నకర్తలగు అసురులను వధించినావు. ఆకాశమున చంద్రుని రాకపోకలను ఏర్పాట్లు చేసినావు. వృత్రుడు సూర్యుని రథచక్రమును భంగ పరచినాడు. అపుడు సర్వపిత ద్యులోకము నీ ద్వారముగనే రథచక్రమును నిలువరింప చేసినది.
నూట ముప్పది తొమ్మిదవ సూక్తము
ఋషి - విశ్వావసు గంధర్వుడు, దేవత - సదీతాదులు - ఛందస్సు - త్రిష్టుప్
1. సవిత సూర్య కిరణవంతుడు, ఉజ్వల కేశవంతుడు. అథదుఇ తూర్పున క్రమాగతముగ ఉదయించును. అతడు అవతరించగనే పూష అగ్రసరుడు అగును. అతడు సమస్త లోకములను ఆలోకించును రక్షించును.
2. అతడు మానవులపై కృపాదృష్టి కలవాడు. ఆకాశ మధ్యమున వసిస్తాడు. ద్యావా పృథ్వులను, వాటి మధ్యనున్న ఆకాశమును తన దృక్కులతో పూర్ణము చేయును. సకల దిశలను, మూలలను ప్రకాశింపచేయును. అతడు పూర్వ, పర, మధ్య, ప్రాంత భాగములకు వెలుగు కలిగించును.





