Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
4. క్షత్రియులకు దేవ భావము ఏది? సాధు భావము ఏది? మానుష భావము ఏది?
క్షత్రియులకు అస్త్రవిద్య దేవ భావము. యజ్ఞములు చేయుట సాధుభావము అగును. భయము మానవ భావము అగును.
5. యజ్ఞ విహితములయిన సామములందు ముఖ్యమైన సామము ఏది? యజుస్సులలో ముఖ్యమయిన యజుస్సు ఏది? యజ్ఞాభావము ఏది? దేనిని అతిక్రమించిన యజ్ఞము లేనట్లగును?
యజ్ఞ విహితములయిన సకల సామములందు ప్రాణము ముఖ్య సామము అగును. యుజుస్సులలో మనసు ముఖ్యము అగును. ఋక్కు యజ్ఞమును ధరించుచున్నది. ఋక్కును అతిక్రమించిన యజ్ఞము లేనట్లుగును.
6. పైనుంచి పడువానిలో శ్రేష్ఠమయినది ఏది? భూమి లోపల ఉన్నవానిలో శ్రేష్ఠమయినది ఏది? భూమిపైన ఉన్నవానిలో శ్రేష్ఠమయినది ఏది? పుట్టుక గలవానిలో శ్రేష్ఠుడు ఎవడు?
పైనుండి పడువానిలో వర్షము శ్రేష్ఠము. భూమి లోపలి వానిలో బీజము శ్రేష్ఠము. భూమిపైన ఉన్నవానిలో గోవు శ్రేష్ఠము. పుట్టుక గలవానిలో పుత్రుడు శ్రేష్ఠము.
7. విషయ సుఖములను అనుభవించుచు, బుద్ధిమంతుడయి, జనుల చేత పూజింపబడుచు, సర్వభూత సమ్మతుడు అయినను జీవన్మృతుడు ఎవడు?
దేవతలకు, అతిథులకు. పితరులకు, బంధువులకు, భృత్యులకు పెట్టక తాను మాత్రము భుజించువాడు వదాన్యుడయ్యు జీవన్మృతుడు అగును.
8. భూమికన్న గురుతరమయినది ఏది? ఆకాశమున కన్నవిశాలమయినది ఏది? వాయువున కన్న వేగమయినది ఏది? గడ్డికన్న దట్టమయినది ఏది?
తల్లి భూమికన్న గురుతరము అయినది. తండ్రి ఆకాశమునకన్న విశాలమయినవాడు. వాయువున కన్న వేగమయినది మనసు. గడ్డికన్న దట్టమయినది చింత.
9. కన్నుమూయక నిద్రించునది ఏది? పుట్టుక కలిగియు చేతనము లేనిది ఏది? హృదయములేనిది ఏది? వేగము వలన వృద్ధిపొండునది ఏది?
కన్నుమూయక నిద్రించునది చేప. పుట్టుక కలిగియు చేతనము లేనిది గ్రుడ్డు. హృదయములేనిది రాయి. వేగమువలన వృద్ధి పొందునది నది.
10. బాటసారికి మిత్రుడెవడు? గృహస్థునకు మిత్రులెవరు? రోగ పీడితునకు మిత్రుడెవడు? మృతునకు మిత్రము ఏది?
బాటసారికి సహయాత్రికులు, గృహస్థునకు భార్య, రోగికి వైద్యుడు, మృతునకు దానము మిత్రములు అగుదురు.
11. సర్వ భూతములకు అతిథి ఎవడు? సనాతనము అయిన ధర్మము ఏది? అమృతము ఏది? జగత్తున వ్యాపించినది ఏది?
సర్వభూతములకు అతిథి అగ్నిహోత్రుడు. అమృతమయిన ధర్మము సనాతనమయినది. గోవులు, చంద్రుడు అమృతప్రాయములు. వాయువు జగత్తునందంతయు వ్యాపించి ఉన్నది.
12. సర్వదా ఒక్కడే సంచరించు వాడెవడు? మరల మరల పుట్టెడువాడు ఎవడు? చలికి ఔషధము ఏది? అన్నింటినిమించిన పాత్ర ఏది?
ఒక్కడు సంచరించువాడు సూర్యుడు. మరల మరల పుట్టువాడు చంద్రుడు. చలికి ఔషధము అగ్ని. అన్నింటిని మించిన పాత్ర భూమి.
13. ధర్మమునకు రక్షణము ఏది? కీర్తికి ఆధారము ఏది? స్వర్గమునకు మార్గము ఏది? సుఖమునకు కారణము ఏది?
ధర్మమునకు రక్షణము దాక్షిణ్యము. కీర్తికి ఆధారము దానము. స్వర్గమునకు మార్గము సత్యము. సుఖమునకు కారణము మంచి స్వభావము.
14. మానవునకు ఆత్మ ఎవరు? అతనికి దైవము కలిగించిన మిత్రము ఏది? అతనికి జీవనము ఎవనివలన కలుగుచున్నది? అతడు దేనివలన అధికుడు అగును?
మానవునకు ఆత్మ పుత్రుడు. దైవము కలిగించిన మిత్రము భార్య. జీవనము వర్షము. అతడు దానము వలన అధికుడు అగుచున్నాడు.
15. ధన్యములలో శ్రేష్ఠమయినది ఏది? దానములలో శ్రేష్ఠమయినది ఏది? లాభములలో శ్రేష్ఠమయినది ఏది? సుఖములలో శ్రేష్ఠమయినది ఏమి?
ధన్యములలో శ్రేష్ఠమయినది దాక్షము. దానములలో విద్య శ్రేష్ఠము. లాభములలో ఆరోగ్యము శ్రేష్ఠము. సుఖములలో సంతృప్తి శ్రేష్ఠము.
16. లోకమున పరమ ధర్మమేది? సర్వదా ఫలించెడి ధర్మమేది? దేనిని నిగ్రహించిన దుఃఖము కలుగదు? తరగని స్నేహము ఎవరిది?
పరమధర్మము అహింస. వేదము సర్వదా ఫలించు ధర్మము. మనసును నిగ్రహించిన దుఃఖము కలుగదు. పండితుల స్నేహమునకు తరుగులేదు.
17. నరుడు దేనిని వదిలిన ప్రియుడగును? దేనిని వదిలిన దుఃఖించకుండును? దేనిని వదిలిన సుఖవంతుడు అగును?
అహంకారమును వదిలిన ప్రియుడగును. క్రోధమును వదిలిన దుఃఖింపకుండును. కామమును వదిలిన సుఖవంతుడు అగును.
18. ధనమును బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వవలెను? నటకులకు ఎందుకు ఇవ్వవలెను? భృత్యులకు ఎందుకు ఇవ్వవలెను? రాజులకు ఎందుకు ఇవ్వవలెను?
ధర్మమునకు బ్రాహ్మణులకు, కీర్తి కొఱకు నటకులకు, పోషించుటకు భృత్యులకు, భయ నివారణమునకు రాజులకు ధనమును ఇవ్వవలెను.
19. దేనిచేత లోకము కప్పబడి ఉన్నది? దేనిచేత ప్రకాశింపకున్నది? దేనిచేత మానవుడు మిత్రులను విడుచుచున్నాడు? దేనిచేత మానవుడు స్వర్గమును పొందనేరడు?
అజ్ఞానముచేత లోకము కప్పబడి ఉన్నది. చీకటి చేత లోకము ప్రకాశింపకున్నది. లోభమున మానవుడు మిత్రులను విడుచుచున్నాడు. సంసారము వలన మానవుడు స్వర్గమును పొందకుండును.
20. మానవుడు జీవించియు మృతుడెట్లగును? రాజ్యము మృతము ఎట్లగును? శ్రాద్ధము మృతము ఎట్లగును? యజ్ఞము మృతము ఎట్లగును?
దరిద్రుడయినవాడు జీవించియు మృతుడు అగును. రాజులేని రాజ్యము మృతము. మంత్రము లేని శ్రాద్ధము మృతము. దక్షిణలేని యజ్ఞము మృతము.





